నా గాడ్ ఫాదర్

మెడిసిన్ చదివి డాక్టర్ కావలసిన ఒక కవి జీవితం టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌తో మొదలై సినీప్రయాణం చేసి ‘జగమంత కుటుంబాన్ని’ సంపాదించుకుంది. పాటల రచయితగా మొదటి చిత్రం ‘సిరివెన్నెల’నే తన ఇంటిపేరుగా మార్చుకుని మూడు వేలకు పైగా పాటలతో దిగ్విజయ యాత్ర కొనసాగిస్తున్నారు చెంబోలు సీతారామశాస్త్రి. తండ్రి స్థిరపడిన రంగంలోనే సంగీత దర్శకుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఆయన కుమారుడు యోగీశ్వరశర్మ. తన తండ్రి గురించి ఆయన చెబుతున్న విశేషాలే ఈ వారం ‘నాన్న-నేను’.
పాటల రచయితగా నాన్న మొదటి సినిమా ‘సిరివెన్నెల’ 1986లో విడుదలైంది. అంతకు రెండేళ్ల ముందే కె.విశ్వనాథ్‌గారు ఒక చిత్రంలో నాన్న రాసిన గంగావతరణం గీతాన్ని తీసుకున్నారు. అది ఆయనకు నచ్చడంతో నాన్నను చెన్నైకి పిలిపించుకుని ‘సిరివెన్నెల’ చిత్రంలో అన్ని పాటలను రాసే అవకాశాన్ని కల్పించారు. ఆ చిత్రం నాన్నకు ఎంత పేరు తెచ్చిందంటే అదే ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. చిత్ర రంగంలోకి రావడానికి నాన్న కష్టపడనప్పటికీ నిలదొక్కుకోవడానికి మాత్రం శ్రమించాల్సి వచ్చింది. మొదటి చిత్రంలో పాటలు సూపర్‌హిట్టయినప్పటికీ నాన్నకు వెంట వెంటనే అవకాశాలు రాలేదు.
ఆ రోజుల్లో నాన్నకు చాలా కుటుంబ బాధ్యతలు ఉండేవి. తన తమ్ముళ్లు, చెల్లెళ్లతోసహా దాదాపు 15 మందిని పోషించాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. అలాంటి పరిస్థితిలో ఒక పక్క చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగాన్ని వదలలేక, చిత్ర రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధపడలేక సతమతమయ్యారు. అదీగాక నాన్నకు వరుసగా సంగీతపరమైన చిత్రాలకు పాటలు రాసే అవకాశాలే వస్తుండడంతో ఆయన మీద క్లాసికల్ రైటర్‌గా ముద్రపడిపోయింది.
నాన్నకు చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అశ్లీల సాహిత్యానికి, ద్వందార్థాలకు ఆయన పూర్తిగా దూరం. దీనివల్ల కూడా కమర్షియల్ చిత్రాలలో పెద్దగా అవకాశాలు వచ్చేవి కావు. సినీ జీవితానికి గుడ్‌బై చెప్పేసి కాకినాడకు వెళ్లిపోదామని కూడా ఒక దశలో సిద్ధపడ్డారు. శ్రుతిలయలు, స్వర్ణకమలం లాంటి చిత్రాలు అవార్డులు తెచ్చిపెడుతున్నా కమర్షియల్ సక్సెస్ మాత్రం రాలేదు. 1992 వరకు కూడా అదే పరిస్థితి.
1986, 87, 88 సంవత్సరాలకు ఉత్తమ గీత రచయితగా నంది అవార్డులలో హ్యాట్రిక్ సాధించినప్పటికీ కుటుంబాన్ని పోషించడం చాలా కష్టంగా ఉండేది నాన్నకు. అలాంటి పరిస్థితిలో వచ్చిన ఒక అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారాయన. సాహితీ విలువలను కాపాడుకుంటూనే కమర్షియల్ పాటలు కూడా రాయవచ్చని నిరూపించారు. ‘బొబ్బిలిరాజా’ చిత్రంలో ఆయన రాసిన ‘బలపం పట్టి భామ…’ పాటే ఇందుకు ఉదాహరణ. పెద్ద హిట్ ఆ పాట. అలా నాన్న విజయయాత్ర మొదలైంది.
డాక్టర్ కాబోయి…
నేను పుట్టింది అనకాపల్లిలో. అయితే నాన్న వృత్తిరీత్యా చెన్నైలో ఉండడంతో పదవ తరగతి దాకా నా చదువు అక్కడే సాగింది. మేము ముగ్గురం సంతానం. మా అక్కయ్య లలితాదేవికి వివాహమైంది. తమ్ముడు రాజాభవానీ శంకర్ ఇంజనీరింగ్ చదివి సినిమాలలో నటిస్తున్నాడు. ‘కేక’ చిత్రంలో హీరోగా పరిచయమయ్యాడు. ప్రస్తుతం రెండు తమిళ చిత్రాల్లోను, తెలుగులో నాకు నచ్చని పదం ప్రేమ’లోను, రాంచరణ్ తేజ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ లోనూ నటిస్తున్నాడు. నాన్న సొంతూరు అనకాపల్లి. మా తాతయ్య సి.వి.యోగిగారు అనకాపల్లి కాలేజీలో లెక్చరర్‌గా పనిచేసేవారు. 13 భాషలను ఔపోసన పట్టిన మహా పండితుడు ఆయన.
మెడిసిన్ చదువుకుని డాక్టర్ కావలసిన నాన్న జీవితం ఊహించని మలుపులు తిరగడానికి తాతగారి మరణమే కారణం. నాన్న మెడిసిన్ మొదటి సంవత్సరం పూర్తిచేసిన సమయంలోనే తాతయ్య మరణించడంతో పెద్దకుమారుడిగా నాన్న కుటుంబ బాధ్యతలను స్వీకరించాల్సి వచ్చింది. దాంతో మెడిసిన్ మానేసి కాకినాడలో టెలిఫోన్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగంలో చేరారు. నాన్న మొదటి రచన ఆయన 11వ ఏట అచ్చయ్యింది.
‘భరణి’ అనే కలం పేరుతో చాలా కవితలు, కథలు రాశారు. పాతికేళ్లు దాటిన సినీ ప్రయాణంలో నాన్న ఏనాడూ రచయితగా రాజీపడలేదు. “పాట నాకు ఇష్టమై రాసుకుంటాను. నిర్మాత, దర్శకులకు నచ్చింది కాబట్టి తీసుకుంటున్నారు. వాళ్లకు నచ్చినట్లు రాయడమంటే నేను రాజీపడ్డానని కాదు. నాకు పూర్తిగా సంతృప్తి చెందినప్పుడే పాట బయటకు వస్తుంది” అని నాన్న అంటారు.
“సినిమా పాటలు అన్ని రకాల శ్రోతలు వినేవి. వాటిని విన్నవారు ప్రభావితం కావచ్చు, కాకపోవచ్చు. కాని..నా పాట సమాజంలో చెడు ప్రభావాన్ని మాత్రం చూపకూడదు. ఏ రకంగానూ ఎవరి ఆత్మస్థయిర్యాన్ని, మనో నిబ్బరాన్ని దెబ్బతియ్యకూడదు. నా పాట సమాజంలో ఆశావహ దృక్పథాన్ని పెంపొందించాలే తప్ప నిరాశావాదాన్ని తీసుకురాకూడదు” అన్నది నాన్న సిద్ధాంతం.
తపస్సులోంచి పుట్టే పాట!
నాన్న రాసుకునేటప్పుడు ఈ లోకంలో ఉండరు. అదొక తపస్సులా ఉంటుంది. రోజుల తరబడి అదే ధ్యాసలో ఉన్న సందర్భాలూ ఉన్నాయి. ఒక్కోసారి మమ్మల్ని కూడా గుర్తుపట్టేవారు కాదు. మేము అక్కడ భోజనం పెట్టి వచ్చేశాక ఏదో ధ్యాసలో తినేసి రాత పని పూర్తయ్యాక “నేను భోంచేశానా?” అని కూడా అడుగుతుంటారు. నాన్న కొత్త పాటకు మొదటి శ్రోతలం అమ్మా, నేనే. శివభక్తుడైన నాన్న శివునిపైన వెయ్యి పాటలు రాయాలని సంకల్పం పెట్టుకున్నారు. ఇప్పటికి 500 పాటలు రాశారు. అందులో కొన్ని ‘శివదర్పణం’ పేరిట పుస్తకంగా వచ్చాయి.
ఆడియో కూడా విడుదలైంది.అందులో కొన్ని పాటలు నాన్న కూడా పాడారు. ఈ ఏడాదిలోనే మరో రెండు ఆల్బమ్‌లు విడుదల చేయాలన్నది నాన్న ఆలోచన. మిగిలిన పాటలను కూడా సాధ్యమైనంత త్వరలో పూర్తిచేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటి దాకా నాన్న సినిమాల కోసం రాసిన పాటలు మూడు వేలకు పైగా ఉన్నాయి. తనకు సినీజన్మనిచ్చిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌గారంటే నాన్నకు ఎనలేని అభిమానం. ఆయనను ‘నాన్న’ అనే పిలుస్తారు. ప్రస్తుత తరంలో కృష్ణవంశీగారంటే నాన్నకు పుత్రవాత్సల్యం. ఒకవిధంగా ఆయన నాన్నకు దత్తపుత్రుడు.
నా సినీ జీవితానికి ‘శ్రీకారం’
నేను డిగ్రీ కంప్యూటర్స్ చేశాను. విశాఖపట్నంలో రెండేళ్లు చదువుకున్నప్పుడు అక్కడ వంకాయల నరసింహంగారి దగ్గర మృదంగం నేర్చుకున్నాను. 1998 వరకు నాకు మృదంగం తప్ప మరో వాయిద్యం గురించి తెలియదు. చదువుతోపాటు మృదంగం నేర్చుకుంటూ ప్రదర్శనలు కూడా ఇచ్చేవాడిని. ఆ తర్వాత జోసఫ్ థామస్‌గారి మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్‌లో పియానో నేర్చుకున్నాను. లండన్ యూనివర్సిటీ నిర్వహించే పరీక్షలో నేను 7 గ్రేడ్స్ పాసయ్యాను. లండన్‌కు వెళ్లి ఆడియో ఇంజనీరింగ్ కూడా పూర్తిచేశాను.
లండన్ నుంచి రాగానే ‘కుదిరితే కప్పు కాఫీ’ చిత్రానికి సంగీత దర్శకత్వం చేసే అవకాశం రావడంతో నా సినీ సంగీత ప్రయాణం మొదలైంది. ఆ చిత్రంలోని అన్ని పాటలు నాన్నే రాశారు. ‘శ్రీకారం చుడుతున్నట్టు’ పాటతో నాన్న నా సినీ జీవితానికి శ్రీకారం చుడితే అమెరికా వెళ్లే హడావుడిలో ఉన్నప్పటికీ నాన్న మీద అభిమానంతో ఆ పాటను పాడి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు “నీ సంగీత ప్రయాణానికి ఇది శ్రీకారం కావాలి” అని ఆశీర్వదించడం నా అదృష్టం. ప్రస్తుతం రెండు చిత్రాలకు సంగీత దర్శకత్వం చేస్తున్నాను.
నా తొలి దర్శకుడు రమణ సాల్వ గారి దర్శకత్వంలోనే ‘యామినీ చంద్రశేఖర్’ అనే చిత్రం చేశాను. ఈ చిత్రానికి తారకరత్న హీరో. త్వరలోనే ఆడియో రిలీజ్ అవుతోంది. ఇందులో పాటలను నాన్నే రాశారు. ‘నువ్విలా’ చిత్రం ఫేమ్ అజయ్ హీరోగా నటిస్తున్న ‘ఎంతందంగా ఉన్నావే’ చిత్రం ఆడియో వచ్చే నెలలో రిలీజ్ అవుతుంది. ఇందులో ఐదు పాటల్లో మూడు నాన్న రాశారు.
నాన్న దగ్గరే సమాధానం
జగమంత కుటుంబం నాన్నది. కేవలం తన కుటుంబానికే కాదు అందరికీ ప్రేమను పంచివ్వగల విశాల హృదయం నాన్నది. ఆయనకు స్వపర భేదాలు లేవు. ఇంటికి ఎవరు వచ్చినా వారిని బంధు వరుసలతో పిలవడం మాకు నాన్న నేర్పించిన అలవాటు. నాన్న కోసం వచ్చే విజిటర్స్ కూడా ఎక్కువ. తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న ఆశతో వచ్చేవారూ ఉంటారు.
“నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని”(గాయం) లాంటి ధిక్కార కవిత్వానికి ప్రభావితులై నాన్నతో మాట్లాడేందుకు చాలామంది వస్తారు. ఆత్మహత్య తప్ప తమకు వేరే గత్యంతరం లేదనుకున్న వాళ్లు సైతం నాన్నతో మాట్లాడి మనసు మార్చుకున్న సంఘటనలు ఉన్నాయి. నాన్న దగ్గరకు వచ్చే వారిలో యువతే ఎక్కువ. ప్రశ్నించే వయసు కాబట్టి వాటికి సమాధానాలు లభిస్తాయన్న ఆశ వాళ్లది. నాన్న పాటలే కాదు మాటలు కూడా గుండె లోతుల్లోంచి దూసుకువస్తాయి.
ఇలా ఎందరికో ఆప్తుడైన నాన్నే నాకు ఫాదర్. గాడ్‌ఫాదర్. నా ఫ్రెండ్, గైడ్, ఫిలాసఫర్ అంతా మా నాన్నే. “ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి…ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి”(పట్టుదల చిత్రం) అన్న నాన్న పాట ఎందరికో స్ఫూర్తి. ఆ పాట చరణంలో వినిపించే “ఆశ నీకు అస్త్రమౌను, శ్వాస నీకు శాస్త్రమౌను ఆశయమ్ము సారథౌనురా” అనే పదాలు నాకు నిరంతరం స్ఫూర్తినిస్తుంటాయి.
సుధాకర్ తొయ్యేటి

