అరుదైన సార్థక నామధేయుడు
– సామల రమేష్‌బాబు

నిబద్ధతకు, నిజాయితీకి ప్రతిరూపంగా జీవించిన వ్యక్తుల్ని అరుదుగా చూస్తాం. సోమవారం అర్థరాత్రి మరణించిన సి.ధర్మారావు అటువంటి మనిషి. పసిపిల్లల నుంచి వయోవృద్ధుల దాకా అందరూ ఆయనకు స్నేహితులే. ఆయన ప్రభుత్వోద్యోగిగా పనిచేసిన కాలంలో తనకెదురుగా కనిపించేట్లు పెట్టుకున్న చిన్న చెక్కపలకపై రాసి ఉండేది – “ఎదురుగా ఉన్న వ్యక్తిని చిరునవ్వుతో పకలరించలేనంత తీరుబడి లేకుండా ఉన్నామా?”- అని. ఉద్యోగ విరమణ చేస్తూ ఆ పలకను తన ఇంటికి తెచ్చుకొని వాకిలికి తగిలించుకొన్నారు. తన పేరుకు తగ్గట్లే ఆయన ధర్మారావే. తల్లిదండ్రులు పెట్టిన పేరుకు సరిగ్గా వ్యతిరేకంగా ప్రవర్తించేవారిని మనం ఎక్కువగా చూస్తాం. కానీ, ధర్మారావు సంగతి ప్రత్యేకం. అవినీతికి, అధర్మానికి ప్రతీ కలుగా ఉన్నత ప్రభుత్వోద్యోగులను పరిగణిస్తున్న వర్తమాన కాలంలో ధర్మారావు పూర్తిగా ధర్మప్రవర్తనతోనే జీవించారు. తన వద్దకు ఏ పనిమీద వచ్చిన వారినైనా, తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్న సందర్భంలోగానీ, ఇతర పనుల మీద గానీ, వారు చెప్పేది శ్రద్ధగా విని, చేతనైన సహాయం చేసి అన్నివిధాలుగా అండగా నిలవడం ఆయన సహజ లక్షణం. ఈ ధర్మప్రవర్తనే ఆయనకు ఎందరో మిత్రుల్ని, సన్నిహితుల్ని సమకూర్చింది.
సి. ధర్మారావు కృష్ణా జిల్లా పెద అవుటపల్లిలో 1934 మార్చి 30న జన్మించారు. గన్నవరం హైస్కూల్లో, ఏలూ రు కాలేజీలో, ఆంధ్ర, ఉస్మానియా యూనివర్సిటీల్లో చదువు సాగించిన ధర్మారావు తన పేరు చివర బి.ఏ, ఎల్.ఎల్.బి అని పెట్టుకోవడానికి ఇష్టపడరు. పలు రంగాల్లో స్వతంత్రంగా నిరంతర కృషితో ఎదిగిన ఆయన జ్ఞానాన్ని కొలిచే విద్యార్హత కాదది. గోరా శాస్త్రి శిష్యుడుగా తెలుగు స్వతంత్రలో రచన చేసిన నాటి నుంచి ఆయన వ్యాస రచనా రంగంలో చాలా ఎత్తుకే ఎదిగారు. తర్వాతి కాల ంలో దాదాపొక పుష్కరకాలం ‘నడుస్తున్న చరిత్ర’ మాస పత్రికలో నిర్వహించిన ‘రవ్వలూ పువ్వులూ’ కాలం గానీ, అనేక పత్రికల్లో అప్పుడప్పుడు రాసిన వ్యాసాలు ఆయన సునిశిత విషయ పరిజ్ఞానానికీ, రచనాశక్తికీ దీటుగా నిలబడేవే. వాటిలో కొన్నిటిని ‘రవ్వలూ పువ్వులూ’ అనే పేరుతోనూ ‘ప్రేమించుకొందాం రండి’ అనే పేరుతోనూ రెండు సంపుటులుగా ప్రకటించారు. నిజానికి ఆ రెండు సంపుటుల పేర్లూ అందులోని రచనలూ ఆయన పోకడనూ, ఆదర్శాలను, వ్యక్తిత్వాన్నీ కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి.
ఏదైనా మాట్లాడేముందు, రాసేముందు, చేసేముందు దాని గురించి లోతుగా ఆలోచించి ఒక స్పష్టతకు రానిదే ఆయన పెదవి కదిలేది కాదు, కలం ముందుకుసాగేది కాదు, అడుగుపడేదీ కాదు. ఎదుటి మనిషితో ఒక్కసారి స్నేహం కుదిరితే, కలిసి పనిచేయగల అదనుకుదిరితే అది చిరకాల బంధమే అయ్యేది. అదే తత్వం ఆయనను ఇస్మాయిల్‌కూ, ఎ.ఆర్.కృష్ణకూ సన్నిహితం చేసింది. గోరా శాస్త్రి, ఇస్మాయిల్, ఎ.ఆర్.కృష్ణల షష్టిపూర్తి సంచికల్నీ, చిరస్మరణీయంగా ఆయన రూపుదిద్దారు. చలం శత జయంతి ఉత్సవాల్ని ఏడాదిపాటు నిర్వహించి, ప్రత్యేక సంచికను అపురూపంగా తీర్చిదిద్ది, విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో చలం విగ్రహాన్ని ప్రతిష్టింప చేసింది ధర్మారావే. 1956లో కర్నూలులో ఆంధ్ర రాష్ట్ర సచివాలయంలో ఉద్యోగిగా చేరినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1992లో ఉద్యోగ విరమణ చేసినంతవరకు తెలుగు వారి సామాజిక రాజకీయ గతిని సన్నిహితంగా అధ్యయనం చేసిన ధర్మారావుకు ఆ రంగాల్లో హేమాహేమీలందరూ సన్నిహితమే అయినా ఎటువంటి ప్రయోజనాలను ఆశించకుండా జీవించారు.
తెలుగు భాషకు పట్టిన దుర్గతిని, పరిపాలనలో తెలుగు దిగజారుడును సహించలేక అందుకోసం 1984నుంచీ జీవితాంతం వరకూ నిరంతరం పాటుపడ్డారు. 1984-85లో కొత్తపల్లి వీరభద్రరావు, తర్వాత 86-88లలో నండూరి రామకృష్ణమాచార్యులు అధికార భాషా సంఘం అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారికి కార్యదర్శిగా – స్పెషల్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన హయాంలోనే పాలనా భాషగా తెలుగు ఉన్నత శిఖరాలకు చేరింది – నాటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు సంకల్ప బలంతో. ధర్మారావు ఎన్నడూ నిరాశ నిస్పృహలకు లోనుకాలేదు. కొన్నాళ్లుగా ఆరోగ్యం దెబ్బతిన్నా, ఆ పెదాలపై చిరునవ్వు చెదరలేదు. స్నేహితులకూ, సన్నిహితులకూ ఆయన మరణం భరించలేనిది, తెలుగు సమాజానికి తీరని లోటు. సి. ధర్మారావు భౌతిక కాయానికి నేడు (20.3.2013) ఉద యం 11 గంటలకు హైదరాబాద్‌లో అంత్యక్రియలు జరుగుతాయి.
– సామల రమేష్‌బాబు
తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు

