జానకీ జాని గారి ‘’అరుంధతి’’ -3 (చివరి భాగం )
‘’అర్ధ రూపాయి ‘’కధ లో మానవత్వం ఎప్పటి కైనా జయిస్తుందన్న ఆశకల్పిస్తుంది .ఆసురీ శక్తులపై మానవత్వం విజయం సాధించాలి అన్న ఆశకు ,సత్యానికి దివిటీ ఈ కద .సత్యమూర్తి పేరు అతన్ని ఎప్పుడూ ‘’రాంగ్ ట్రాక్ ‘’నుంచి మళ్ళిస్తూ ,మంచి మార్గం లో పడేస్తుంది .అందుకే తాత్కాలికం గా తప్పు చేసినా ,దరిద్రుడి దగ్గర ఓ అర్ధ రూపాయి దొంగిలించి భార్యకు బ్రెడ్ కొందామని వెళ్ళినా ,అంతరాత్మ అతన్ని ప్రశ్నిస్తూనే ఉంది .’’ఇది పద్ధతి కాదు ‘’అని హెచ్చరిస్తూనే ఉంది .మనస్సును బుద్ధి జయించి ,తన తప్పు తెలుసుకొన్నాడు .చక్కని సంఘర్షణ ను అద్భుతం గా శిల్పీకరించారండీ మీరు ..’’అర్ధ రూపాయి ‘’అనటం లో దానికి విలువ లేకపోయినా ,విలువను కల్పించి ,చిరంజీవి ని చేశారు .దరిద్రం ఎవరి నైనా నీచం గా ప్రవర్తిమ్పజేస్తుంది .కాని దాన్ని,దాని పరీక్షల్ని తట్టుకోవాలి .అప్పుడే అంతిమ విజయం .మానవత్వం మాయ మైతే ప్రపంచం లో మనిషి మనుగడ ప్రశ్నార్ధకమే అవుతుంది .
‘’ రూపాంతరం ‘’ కధలో ‘’సుహాసిని’’ అన్న పేరు బాగుందండీ .ఆమె ప్రపంచాన్ని చూసి నవ్వుకుంటుంది .ఆమె ను చూసి మనం నవ్వుకొంటాం .అవతలి వాడు వంచన చేస్తే ,నేనూ చేయలేనా అని భావించి ఆమె ప్రవర్తించింది .దెబ్బతిన్నా దెబ్బ తీయాలి అనేప్రతీకారేచ్చమనస్తత్వంఆమెది .అయితే అది ఎవరి ఆనందం కోసం ?ఎవరి తృప్తి కోసం ?ఆమె పొందే తృప్తి ఏ పాటిది ?ఎవర్ని మోసం చేస్తోని తన అంత రాత్మనే .పైగా దానికో సపోర్టింగ్ స్టేట్ మెంట్ ఇస్తుంది ‘’స్వార్ధ పరులైన పురుషులేన్దర్నో చడ గోడుతున్నానన్న సంతృప్తి నాకెంతో ఆనందాన్నిస్తోంది .’’.ఇప్పటిదాకా ఆమె ఓ గొంగళి పురుగు .ఆశల వలయం లో ,గూటిలో చిక్కు కొని ఉంది .అంతా వాడుకోన్నవారే .చీదరించుకొని వదిలేశారు .ఇప్పుడామె వన్నెల సీతా కోక చిలుక లా రూపాంతరం చెందింది .రెక్కలొచ్చి యెగిరి పోయింది .వన్నె చిన్నెలతో ఆకర్షిస్తోంది . .ఇది అశాశ్వతం అని తెలిసినా తానేదో గొప్ప పని చేస్తున్నానన్న భావం .స్త్రీ చెడిపోవటానికి పురుషుడు కారణం .ఈ చేడిపోటం ఇరు వైపులా ఉంది .ఏ ఒక్కరికో మాత్రమె కాదు .అన్నది ఆమె భావన .ఈ భావంతో మనం ఏకీభవించలేక పోవచ్చు .అందుకే ఆ సీతాకోక చిలుక మాటలకు రచయిత మనస్సు మీద గొంగళి పురుగులు పాకి నట్లు అయిందట ..మంచి కధనం తో నడిచిన కద
వైవిధ్య వంత మైన కధాంశాలను ఎన్నుకొని ఉదాత్తతను ఆదర్శం గా భావించి సమాజం కోసం దేశాన్ని ‘’స్లోగన్‘’పరంగా ,ఇవ్వకుండా ,విశ్లేషన పరం గా ఇచ్చి ,లోతైన భావాలను వ్యాపింపజేసిన మీ కధలు ఆణి ముత్యాలు .ఓ కవి ఓ పండితుడు ,బహుభాష వేత్త ,ముఖ్యం గా రామాయణ రహస్యాలను ఆకళించుకొన్న వివేక మూర్తి ,అయిన మీరు తాత్విక దృక్పధం తో రాసిన కధలు భారతీయతకు అద్దం పట్టాయి .ఇవన్నీ ఆంధ్ర దేశం లో ఎక్కడో అక్కడ జరిగే ఉంటాయి .అక్షర రూపం దాల్చి ‘’అక్షరం, అక్షయం ‘’అయాయి . .ఆంగ్లం లో సాటి లేని మీరు ఒక్క ఆంగ్ల పదం కూడా కధనం లోకి చొచ్చుకు రాకుండా తీసుకొన్న జాగ్రత్తకు తెలుగు జాతి యావత్తు గర్వ పడుతుంది .తీయని తెలుగు కధ చదివా మన్న ఆనందాన్ని ,సంతృప్తిని మీరు పా ఠకులకు మిగిల్చారు .మీ కృషి ప్రశంశ నీయం .
‘’ఇప్పుడే మేలుకొన్నాను ‘’అని మీరు ముందుమాటలో అన్నారు .’’మేలు కొన్న వాడి కలలు ‘’లో ఎప్పుడోనే మీరు మేలు కొన్నారు .అందులో ‘’రస గంగాధరం ‘’అయిన తిలక్ కు అన్కితమూ చేశారు .మా అందరికోసం ‘’వెన్నెల మెట్లు‘’కట్టారు .’’నేతాజీ’’ ని పరిచయం చేసి ,’’రామాయణ పావని ‘’ద్వారా రామాయణ పావనత్వాన్ని చాటారు .ఈ కదల ద్వారా ‘’అరుంధతి ‘’ని భూమి పైకీ దింపారు .మరిన్ని రచనలు మీ నుండి రావాలని కోరుకొంటాను .నన్ను మీ అత్మీయుని గా భావించి సహృదయత ను కనబరుస్తున్నందుకు సదా కృతజ్ఞుడిని .ఇదంతా ఏక బిగిని రాసిన లేఖ .దోషాలుంటే మన్నించే సహ్రుదత ఉన్న వారు కదా .అందర్నీ అడిగి నట్లు చెప్పండి –మీ దుర్గా ప్రసాద్ –28-11-2000 .
సమాప్తం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ –28-3-13 ఉయ్యూరు

