లవ కుశకు 50

ఎన్‌టీఆర్ మళ్లీ ఎక్కడో పుట్టే వుంటారు
సీతాదేవి.. పవిత్రతకు మారుపేరు. ఆదర్శగృహిణిగా, జగజ్జననిగా భక్తజనసందోహం చేత నీరాజనాలందుకుంటున్న ఆ మహాసాధ్విని చూసిన వారు ఈ విశ్వంలో ఎవ్వరూ లేరు. కానీ దక్షిణభారత ప్రజలు మాత్రం సీతాదేవి ఎలా వుంటుందనగానే ఠపీమని ‘లవకుశ’ సినిమాలో అంజలీదేవినే గుర్తు చేసుకుంటారు. అంతగా ఆ పాత్రలో లీనమై నటించారామె. మొత్తం ఆంధ్రావనిచేత అపరసీతాదేవిగా జేజేలందుకుంటున్న ఆమె.. ఆ పాత్రపోషణ తనకు మాత్రమే దక్కిన అదృష్టమని చెబుతున్నారు. లవకుశ సినిమా విడుదలై నేటికి యాభయ్యేళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆ సినిమా షూటింగ్‌లో అంజలీదేవి అనుభవాలు ఆంధ్రజ్యోతి పాఠకుల కోసం…
‘లవకుశ’ సినిమాకు తల్లీ,తండ్రీ అంతా దర్శకుడు సి.పుల్లయ్యగారే. ఈ సినిమా క్రెడిట్ ముందుగా ఆయనకే దక్కాలి. సినిమా విడుదలై యాభయ్యేళ్లయినా, ఇప్పటికీ తెలుగు ప్రజల నోళ్లలో నానుతున్నదంటే ఆయనే కారణం. నన్ను ‘గొల్లభామ’ సినిమా ద్వారా గ్లామర్ పాత్రలో పరిచయం చేసిన ఆయన.. ఆ తరువాత రేలంగి వెంకట్రామయ్య సరసన నన్ను పెట్టి ‘పక్కింటి అమ్మాయి’ పేరుతో కామెడీ చిత్రం రూపొందించారు.
సి.పుల్లయ్యగారితో నా మూడో సినిమా ‘లవకుశ’. అప్పటి వరకూ గ్లామర్ పాత్రలు పోషించిన నన్ను పవిత్రమైన సీత పాత్రకు తీసుకోవడం పట్ల ఇండస్ట్రీలో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. ఎంతోమంది ఆయన్ని వద్దంటూ వారించారు. రాజ్యం ఫిలింస్ నిర్వాహకురాలు లక్ష్మీరాజ్యం అయితే “డ్యాన్సులు చేసుకునే అమ్మాయిని ఇంత మంచి పాత్రకు ఎలా ఎంపిక చేశారు” అంటూ దర్శకుణ్ణి నిలదీశారట. అయినా ఆయన వెనక్కి తగ్గలేదు.

సీత పాత్ర చేసేటప్పుడు నేను ప్రత్యేకంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. అన్ని పాత్రల్లాగే ఆ పాత్రలో లీనమై నటించాను. ఎప్పటిలాగే ఉదయాన్నే భగవంతుడికి పూజలు చేసుకుని షూటింగ్‌కి వెళ్లేదాన్ని. వృత్తిని నేను పవిత్రంగా భావిస్తాను. ఆ పవిత్రతతో పని చేస్తే చాలు. ‘కీలుగుర్రం’ సినిమాలో రాక్షసి పాత్ర వేశాను. అందుకని రాక్షసంగా వుండలేంగా. నిజానికి ఆ పాత్ర నేను చేయనని చెప్పాను. కానీ నా భర్త పెనుపాత్రుని ఆదినారాయణరావు గారు నచ్చచెప్పి నన్ను ఒప్పించారు.
ఏ పాత్ర వేసినా, మనం మనసుపెట్టి నటించాలి, అంతే అన్నారు. సీత పాత్రను నేను ఎంతో ప్రేమతో, భక్తిభావంతో చేశాను. లవకుశ సినిమా షూటింగ్ ఏడేళ్లు జరిగింది. ఆశ్రమం సీన్లన్నీ పూర్తయ్యేసరికి నిర్మాత ఎ.శంకరరెడ్డి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాంతో నాలుగేళ్ల గ్యాప్ తరువాత ఆ సినిమా మళ్లీ మొదలైంది. ఆ నాలుగేళ్ల గ్యాప్‌లో పుల్లయ్యగారికి ఫోన్ చేసి సినిమా గురించి వాకబు చేస్తుండేదాన్ని.
పాపం వారు మాత్రం ఏం చేస్తారు? నష్టాల్లో వున్నారాయె! యాక్షన్‌కి రియాక్షన్ కూడా వుంటేనే మంచి ఔట్‌పుట్ వస్తుంది. ఆ సినిమాలో ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు. సీతా-రాముడు అనగానే నేను, ఎన్‌టీఆర్ గుర్తుకొస్తున్నామంటే ఆ పాత్రల విశిష్టత, పాత్రలు మలచిన తీరు, వాటికి మేం చేసిన న్యాయం..అన్నీ కలవడమే కారణం. అది తెలుగులో తొలి కలర్ సినిమా కాబట్టి యూనిట్ అంతా ఎంతో కష్టపడ్డాం.
ఇప్పటికీ ఆ సినిమా చూస్తే మా కష్టమంతా గుర్తుకొస్తుంటుంది. ఉదయం వెళ్తే.. సాయంత్రం షూటింగ్ పూర్తయ్యే వరకూ ఆ పాత్రల్లోనే ఇమిడిపోయి వుండేవాళ్లం. సి.పుల్లయ్యగారి అబ్బాయి సీఎస్ రావ్ కూడా ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. లవకుశలకు ఆయనే ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చేవారు. ప్రతిరోజూ వారికి సీన్ల గురించి శిక్షణ వుండేది. లవుడు నాగరాజు, కుశుడు సుబ్రమణ్యం చిన్నవారైనా బాగా కష్టపడి పని చేసేవారు. చిత్తూరు వి.నాగయ్య అవార్డు కార్యక్రమానికి వారిని కూడా పిలవాలని అనుకుంటున్నాను. అప్పట్లో ఇప్పటిలా హడావుడిగా ఏదో షూటింగ్ ముగించేశాం అన్నట్లుగా వుండేది కాదు. ఎంతో క్రమశిక్షణతో, ఒక అంకితభావంతో పని చేసేవాళ్లం.
రాముడంటే నా దృష్టిలో ఎన్‌టీ రామారావుగారే. ఇక ఆ పాత్రలో మనం ఇంకెవ్వర్నీ చూడలేం. రాముడు, కృష్ణుడి పాత్రలకు న్యాయం చేసేవారు ఇప్పటికీ ఇంకెవ్వరూ రాలేదు. లవకుశ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర చిత్తూరు వి.నాగయ్యగారిది. ఆ పాత్రని ఆయన తప్ప మరెవ్వరూ చేయలేరేమో! ఆశ్రమంలో ఆయన చెప్పిన పద్యాలు, హావభావాలు ఇంకెవ్వరి చేతా పలికించలేరేమో! ఆ సినిమాలో అన్ని పాత్రలకి అందరూ తగినట్లు సరిపోయారు.
సినిమా విడుదలైన తరువాత థియేటర్లలో తెరకు పూజలు చేయడం, సీతారాములకు కల్యాణాలు జరిపించడం వంటివెన్నో జరిగేవి. నేను ఇటీవల పుట్టపర్తి వెళ్తే ప్రశాంతి నిలయంలో ఓ వ్యక్తి మంగళసూత్రం పట్టుకుని నా కోసం ఎదురు చూస్తున్నాడు. “ఏంటయ్యా” అనడిగితే.. లవకుశ చిత్రం విడుదలైనప్పుడు సీతాదేవి కోసం (నా కోసం) మంగళసూత్రం తయారుచేయించి పెట్టాడట. అప్పటి నుంచి నన్ను కలవడానికి కుదరకపోవడంతో పుట్టపర్తిలో కనిపించగానే ఇచ్చాడు.
ఆ పాత్రపై ఆయనకున్న పవిత్ర భావనను, ఆయన అభిమానాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? అతనికి ఏం సమాధానం చెప్పాలో నాకు నోట మాట రాలేదు. ఆ మంగళసూత్రాన్ని సీతమ్మవారి మెడలో వేయమని చెప్పాను. లవకుశ సినిమా విడుదలైన కొత్తలో సీత పాత్రకు వచ్చిన స్పందనను చూసి ఓ రోజు లక్ష్మీరాజ్యం నా వద్దకు వచ్చి, నన్ను కౌగిలించుకుని కన్నీరు పెట్టుకుంది. ఆ పాత్రకు నన్ను వద్దని చెప్పడం తప్పేనని చెప్పింది.
ఆ మాట సి.పుల్లయ్యగారితోనూ చెప్పింది. ఆ సినిమాకు సంగీతం ఘంటసాల గారు చక్కగా అందించారు. ఇప్పటికీ ఎక్కడ పూజలు జరిగినా, ఆ సినిమాలోని పాటల్ని వాడుతున్నారంటేనే ఆయన గొప్పతనం తెలుస్తుంది. శ్రీరాముడి పాత్రలో ఎన్‌టీఆర్ సెట్‌లోకి వస్తే అంతే! అంతా గప్‌చుప్. అందరూ ఎవరి పని వారు చూసుకునేవారు. అంతేనా, ఆ దివ్యమంగళమూర్తిని కళ్లారా చూసుకుంటూ ఉత్సాహంగా ఉరుకులు పెట్టేవారు. ఆయన రూపం గురించి ఎంత చెప్పినా తక్కువేనేమో! ఆయన మళ్లీ ఎక్కడో పుట్టే వుంటారు.

