‘’తెగిన జ్ఞాపకాలలో ‘’ సంజీవ దేవ్ తో తెగని నారీ జన జ్ఞాపకాలు -2
ఏ కళా కారుని ,లేక ప్రముఖుని విజయాని కైనా ఒక అదృశ్య శక్తి ,లేక అదృశ్య మహిళ ,లేక దృశ్య మహిళ తోడ్పాటు కాని ప్రభావం కాని ఉంటుంది అని అందరూ చెప్పే మాటే .ఆమె తల్లి కావచ్చు ,భార్య కావచ్చు ,లేక ప్రియురాలో స్నేహితురాలో కావచ్చు గురువు, వొదినాఎవరైనా కావచ్చు .వారి ప్రభావ ,ప్రోద్బలాల వల్ల ఆయా రచయితలు ,కళా కారులు ఉన్నత సోపానాల నదిరోహించిన సంగతి మనకు తెలుసు .తాను రాసిన ‘’తెగిన జ్ఞాపకాలు ‘’లో శ్రీ సంజీవ దేవ్ పై నారీ ప్రాభావాన్ని చూపించటమే ఈ వ్యాసం ధ్యేయం
సంజీవ దేవ్ మాతృశ్రీ
చిన్నతనం లోనే సంజీవ దేవ్ మాత్రు మూర్తి వెంకాయమ్మ కృష్ణా జిల్లా కోనాయ పాలెం లో మరణించారు . జనం వచ్చి చూసి పోతున్నారు . ఆమె పుట్టింటి వారిని వోదారుస్తున్నారు .తల్లిని కోల్పోయిన ఆ పసి వాడిని ‘’నిజానికి మరణించిన అమ్మను చూసి కార్చిన కన్నీటి కంటే –జీవించి ఉన్న నన్ను చూసే ఎక్కువ కన్నీరు కార్చారు‘’అంటారు ఆ సన్ని వేశాన్ని గుర్తుకు చేసుకొంటూ సంజీవ దేవ్ ..మరణానంతర శాస్త్రం లో ‘’చని పోయిన వాళ్ళు కూడా బంధు మిత్రుల వియోగం వల్ల బాధ పాడుతారు ‘’అని ఉందన్న సంగతి మనకు తెలియ జేస్తాడు .దీనితోపాటు ఒక కొత్త సత్యాన్ని చెప్పాడు ‘’చచ్చిన వారిని చూసి కాక ,వారి ఆత్మీయులైన బ్రతికున్న వారి ని చూసి కన్నీరు కార్చటమే సబబేమో ?’’అని వేదాంత ధోరణి లో చెప్పాడు .చిన్నతనం లోనే అంత హృదయ తాపానికి గురి చేసి వెళ్ళింది ఆయన తల్లి .గుండె దిటవు చేసుకొని జీవిత యాత్ర సాగించాడు సంజీవ దేవ్ అమ్మ మరణం లోని లోటు ఇంకా తెలియని వయసు అది
చెల్లి
తనకో చెల్లెలిని ప్రసవించి ఇచ్చి ,వ్యాధితో సంజీవ దేవ్ తల్లి చనిపోయింది .చెల్లిని చూస్తె ,తల్లి జ్ఞాపకం వచ్చేది .చెల్లి దగ్గరే కాలక్షేపం చేసే వాడు .’’చెల్లి లో అమ్మ ను చూడ సాగాను ‘’అని చెప్పుకొన్నాడు .రెండో నెలలో చిన్నారి చెల్లి తన వైపు చూస్తె ‘’చెల్లి నాలో అమ్మను చూసేది కాబోలు ‘’అని ఊరడింపు పొందే వాడు .తన చెల్లి తన కంటే అందం గా ఉంది .అనే అందరు అనే మాటలో ఎక్కువ ఆనందం పొందే వాడు .’’తన గొప్పతనం అనే స్వార్ధాన్ని దాటి తన గొప్పదనాన్ని ఇతరులు చూసి ఆనందించేట్లు చేస్తుంది ప్రేమ ‘’అంటాడు .జబ్బు చేసి చెల్లి కూడా మరణించింది .తాను కూడా చెల్లి తో అమ్మ దగ్గరకు పోతే బాగుండును అనుకొనే వాడు .తల్లీ చెల్లీ పోవటం తో అంతా శూన్యం గా కన్పించేది అ చిన్నారి మనసుకు .అయితే’’ ఒకరు మరణించి నంత మాత్రాన అంతా అయిపోదు మిగిలిన వారుంటారు ‘’అన్న సత్యం గోచరించింది .’’అందరూ ఉండాలి అందరితో ఉండాలి’’ అనే విషయం అర్ధమైంది .దుఖం ఉపశమించింది కాలక్రమం లో ..మళ్ళీ మామూలు జీవితం లో పడసాగాడు సంజీవ దేవ్ .
పెత్తల్లి –అమ్మమ్మ
సంజీవ దేవ్ పెద తల్లి (సుబ్బయ్య గారి భార్య ),అమ్మమ్మల వద్దే చిన్నతనం గడిచింది .వారికి మాత్రం సంజీవ దేవ్ ను చూడగానే అతని తల్లి జ్ఞాపకం వచ్చి విపరీతం గా కన్నీరు కార్చే వారు .అయితే తెలిసిన వాళ్ళు కనుక కుర్రాడు బాధ పడతారని గుడ్ల నీరు కుక్కుకొని నవ్వు మొహాలు పెట్టె వారు .ఈ విధం గా తాను అందరి జాలిని పొందాను అంటాడు .ఇది తన జీవితం లో ఒక పాఠాన్ని నేర్పిందన్నాడు ‘’అందరిని ప్రేమించటం దయా సానుభూతి ,జాలి చూపటం నేర్చుకొన్నాను’’అన్నాడు అమ్మమ్మ కూడా జీవితం నుంచి నిష్క్ర మించింది ఆమె మరణానికి విచారించటం మానుకొనే స్తాయి పొందాడు .’’జీవించే వారంతా మరణిస్తారు ‘’ అన్న సత్యం అవగతం చేసుకొన్నాడు .
హెడ్ మాస్టారి భార్య
కొత్త హెడ్ మాస్టారు కొండూరు సుబ్బారావు బాగానే చదువు చెప్పే వాడు .ఆయనకు భార్యకు క్షణం పడేది కాదు .చేతిలో ఏది ఉంటె దానితో ఆమె ను కొట్టే వాడు .ఇది సంజీవ దేవ్ పై ప్రభావం చూపింది అందుకే పెళ్లి ఆలస్యం గా చేసుకోన్నాడని పిస్తుంది .
కమలక్కయ్య
సంజీవ దేవ్ పెత్తల్లి కూతురే కమలాంబ .సంగీతం నేర్చుకోనేది .పంతులు గారు ఇంటికి వచ్చి హార్మోనియం నేర్పేవాడు .అప్పుడు సంజేవ దేవ్ జబ్బు పడి మంచం లో ఉన్నాడు .ఆమె నేర్చిన పాఠాలన్నీ ఈయనకు వచ్చేశాయి వినికిడి వల్ల .ఈ అక్కయ్య మూలం గా సంజీవ దేవ్ కు సంగీతం పై మమకారం కలిగింది
గర్ల్ ఫ్రెండ్స్
సంజీవ దేవ్ చదువు కొంతకాలం బాలికా పాఠ శాలలో జరిగింది .అమ్మాయిలూ చాలా మంది స్నేహితులయ్యారు .’’ఆడ పిల్లల తో స్నేహం పెంపుడు జంతువులతో స్నేహం లాంటిది ‘’అని భాష్యం చెప్పాడు .ఆడపిల్లలు ఈ మగపిల్లాడి మాటలు ఆసక్తిగా వినే వారు చెప్పి నట్లు చేసే వారు .కాని మగ పిల్లలు ఈయన మాట వినని గడుగ్గాయలు .ఆడ పిల్ల లందరూ చిన్న వాళ్లైనా ‘’నా కంటే తాము పెద్ద వాళ్ళు గా ,వాళ్ళ కంటే నేను చిన్న వాడిని అన్నట్లు చూసే వారు ‘’అని చెప్పుకొన్నాడు ఇది భవిష్యత్తు లో చాలా మందిని కలిపి స్నేహఝరి ని పారించింది .
సశేషం –మీ –గబ్బిట దుర్గా ప్రసాద్-30-8-13- ఉయ్యూరు