అమెరికా తొలి మహిళా డాక్టర్ –ఎలిజబెత్ బ్లాక్ వెల్
Posted on January , 2014 by గబ్బిట దుర్గాప్రసాద్
1821 ఫిబ్రవరి మూడున ఎలిజబెత్ బ్లాక్ వెల్ ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ లో సామ్యుల్ బ్లాక్ వెల్స్ కి, హన్నాకు జన్మించింది .తండ్రి ఉదారుడూ రిఫైనరీ నడిపే వాడు ,మత సంస్థలతో మంచి సంబంధాలున్న వాడు . తండ్రికి పిల్లల విద్య మీద అమిత శ్రద్ధ ఉండేది .అందుకు కావలసిన వసతులు కల్పించి ప్రోత్స హించాడు .దురదృష్ట వశాత్తు ఆయిల్ రిఫైనరి ఒడిదుడుకుల తో నడిచి ఆర్ధికం గా కుంగి పోయాడు .అప్పుడు కుటుంబం తో సహా 1832 లో అమెరికాకు చేరాడు అక్కడ కాంగ్రెస్ రిఫైనరి స్థాపించాడు .సామ్యుల్ హాక్స్ కాంగ్రిగేషన్ లో చేరి మంచి పేరు తెచ్చుకొన్నాడు సంస్కరణలంటే ఆయనకు మహా ఇష్టం .అమెరికా లోని బానిస వ్యతిరేక ఉద్యమం లో చురుకు గా పాల్గొన్నాడు .కుమార్తె ఎలిజబెత్ పై ఆయన ప్రభావం పడి ,ఆమెకూడా బానిస వ్యతిరేక ఉద్యమాలలో పాల్గొన్నది . దురదృష్టవశాత్తు రిఫైనరి 1836లో తగల బడింది .ఆర్దిక ఇబ్బందులేర్పడ్డాయి నౌకర్లను తగ్గించేశాడు .ఇక అక్కడ ఉండలేక సిన్సినాటికి కుటుంబం మార్చాడు .అక్కడ నల్ల లేబర్ సమస్యల ను ఎదుర్కోవటానికి బీట్ రూట్ తో పంచదార తీసే పధ్ధతి పై ఆలోచించాడు .కాని కొద్ది రోజుల్లోనే తండ్రి భార్యనూ ,తొమ్మిది మంది సంతానాన్నీ ,తీర్చాల్సిన అప్పుల్నీ వదిలి,తీవ్ర జ్వరం తో చని పోయాడు .
కుటుంబ పోషణ భారం మీద పడటం తో ఎలిజ బెత్’’’’ సిన్సి నాటి ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ అకాడెమి ఫర్ యంగ్ లేడీస్ ‘’అనే స్కూల్ ను ప్రారంభించింది .అక్కడ అన్ని సబ్జెక్టు లను బోధించే ఏర్పాటు ,వసతి,ట్యూషన్లను కల్పించి వాటికి రుసుము తీసుకొనే ఏర్పాటు చేసింది . అదేమీ ఆదర్శం కోసం ఏర్పాటు చేసింది కాదు .ఆర్ధికం గా ఆసరా ఇస్తుందని మాత్రమే . ఈ స్కూల్ బాధ్యతా, నిర్వహణ వల్ల స్లేవరిపై ఆలోచించి పని చేసే సమయం దొరకలేదామెకు .దీనికి తోడు అక్కడి ప్రజల్లో బానిసల విముక్తి వ్యతిరేకత ఎక్కువవటమూ కారణమే . సోదరి ‘అన్నా’ ప్రభావం వల్లఈమె ఎపిస్కోపలనిజం లోకి మారింది రెండేళ్ళ లోనే ఆ చర్చ్ కార్య కలాపాలలో చురుగ్గా పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించింది .కాని చానెల్ అనే యునిటేరియన్ మినిస్టర్ ద్వారా ‘ భావాతీత ధ్యానం లోకి మారింది .దీనికి ఆగ్రహించిన చర్చ్అధికారుల వల్ల ఎకాడెమి మూతపడింది పిల్లలకు ట్యూషన్లు చెప్పి జీవితం కొనసాగించింది .
చానెల్ గారి ప్రభావం తో సంస్కరణలు ,విద్యా వ్యాసంగం పెరిగింది .ఎన్నో సమావేశాల్లో పాల్గొని ,కథలు రాయటం కూడా మొదలు పెట్టింది .స్త్రీ విద్య ,హక్కులు మహిళా సాధికారత పై దృష్టి నిలిపింది .అన్నా అండతో టీచర్ ఉద్యోగాన్నిపొంది ఏడాదికి నాలుగు వందల డాలర్ల జీతానికి పని చేసింది .కాని స్కూల్ లో విద్యార్ధులకు తగిన సౌకర్యాలు లేవు హెడ్ మాస్టర్ చెప్పే సాధారణ జీవితం అంటే ఇది కాదని తెలుసుకొని మానేసింది . మళ్ళీ సిన్సినాటి చేరి,వాస్తవ దృక్పథాన్ని అలవరచుకొంది.అప్పుడే ఆమె కు మొదటి సారిగా మెడిసిన్ చదవాలనే కోరిక కలిగింది .దీనికి కారణం అక్కడ స్నేహితురాలొకరు ‘యుటినరి కేన్సర్ తో చని పోవటం ఆమెను కలచి వేసింది .ఒక లేడీ డాక్టర్ ఉండి ఉంటే తనస్నేహితురాలు చని పోయేదికాదుకదా అని పించింది .అంతే ఇక ఆమె దృష్టి అంతా మెడిసిన్ చదువు పైనే నిలిపింది .ఆ రోజుల్లో ‘’అబార్షనిస్ట్’’లను’’ ఫిమేల్ ఫిజీషియన్స్ ‘’అనేవారు ..ఆనాడున్న ఆనవాయితీల ప్రకారం మెడిసిన్ చేయటం అంత తేలిక కాదు కాని ఆమె దృఢ నిశ్చయం ఆమెను ముందుకు నడిపించి మెడిసిన్ చదివించి డిగ్రీ సాధించేట్లు చేసింది .
కాని దీనికి మూడు వేల డాలర్లు అవసరమైనాయి. అంత డబ్బు ఆమె దగ్గర లేదు .మళ్ళీ అన్నా సహాయం తో ఒక మ్యూజిక్ టీచర్ గా నార్త్ కరోలినా లోని నాష్ వెల్ స్కూల్ లో చేరింది .అక్కడ మాజీ ఫిజిషియన్ అయిన క్లేర్జిమన్ డిక్సన్ తో పరిచయమేర్పడింది ఆయన తన మెడిసిన్ పుస్తకాలను లైబ్రరీ ని వాడుకోవచ్చని పర్మిషన్ ఇచ్చాడు . దాన్ని సద్వినియోగం చేసుకొంటూ బానిస వ్యతిరేకోద్యమానికి సహకరించింది కాని ఆమె పని చేసే స్కూల్ మూత పడింది . అప్పుడు డిక్సన్ గారి సోదరుడు,చార్లేస్టన్ లో ఫిజిషియన్ అయిన హెన్రి డిక్సన్ సహాయం తో ఒక బోర్డింగ్ స్కూల్ లో టీచర్ గా చేరింది . ఫిలడెల్ఫియా చేరి జోనాథన్ అలెన్ అనే ఆయన దగ్గర ప్రైవేటుగా అనాటమీ చదివి ఫిలడెల్ఫియా లో మెడిసిన్ లో చేరటానికి దారి ఏర్పరచుకొంది .అందరూ ఆమెఆశలపై నీళ్ళు చల్లిన వారే. ప్రోత్సహించిన వారే లేక పోయారు .కొందరు ఫిజిషియన్లు ఆమెను పారిస్ వెళ్ళమని సలహా ఇచ్చారు
ఇంతలో న్యూయార్క్ లోని అప్ స్టెయిర్ మెడికల్ యూని వర్సిటి లో చేరమని ఆహ్వానం వచ్చింది . అక్కడ మగ స్టూడెంట్లు ఒప్పుకుంటేనే స్త్రీ విద్యార్ధి చేరగలదు .కాని విద్యార్ధులందరూ ఏకగ్రీవం గా ఆమెకు మద్దతిచ్చి చేర్చుకోటానికి అనుమతించారు .కాలేజీ లో చేరింది కాని అంతా కొత్త .పుస్తకాలెక్కడ దొరుకుతాయో తెలీదు ఎవరి నైనా అడగాలంటే సిగ్గు .చేరిన కొద్ది రోజుల్లోనే ఆమె ప్రభావం మగ విద్యార్ధులపై పడి అల్లరి తగ్గింది. అప్పటి వరకు మెడికల్ క్లాస్ లో వారు గందర గోళమే సృష్టించే వారు .ఈమె రాకతో అందరూ నిశ్శబ్దం గా పాఠాలు విన్నారు .అనాటమీ ప్రొఫెసర్ వెబ్ స్టార్ పునరుత్పత్తి పాఠం చెప్ప బోతూ ఇలాంటివి సున్నిత మనస్కులైన ఆడపిల్లలు వినటం భావ్యం కాదని క్లాసులకు రావద్దన్నాడు కాని ఆమె క్లాసులకు వెళ్ళింది .అప్పటి వరకు చాలా అసహ్యంగా చెప్పే విషయాలను ఆమె ఉండటం తో హుందాగా బోధించటం ప్రారంభమైంది .దీనిని లెక్చరర్లు స్టూడెంట్లు అందరూ అభినందించారు .మొదట్లో జెనీవా ప్రజలు ఈమెను వింతగా చూసినా తర్వాత సర్దుకు పోయారు .ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండేది. క్లినికల్ అనుభవం కావాలని అనుకొని దరఖాస్తు చేస్తే ‘’బ్లాకీ ఆం హౌస్ ‘’అవకాశమిచ్చింది .రోగాలను గుర్తించటం తగిన చికిత్స చేయటం ద్వారా అభిమానం పొందింది .సిఫిలిస్ వ్యాధి దానికి కారణమైన .టైఫస్ పై ప్రత్యేక విషయంగా ఆమె జెనీవా మెడికల్ కాలేజి నుండి మెడికల్ డిగ్రీ పొంది తన లక్ష్యాన్ని సాధించింది .’సాంఘిక నైతిక స్థిరత్వం- ఆరోగ్యం’ పై థీసిస్ రాసి మెడికల్
కోర్సువిజయ వంతం గా పూర్తిచేసి,1848,జనవరి 23న మెడిసిన్ లో డిగ్రీ పొందిన అమెరికా మొదటి మహిళగా గుర్తింపు పొందింది .డీన్ చార్లెస్ లీన్అనే ఆయన బ్లాక్ వెల్ కు డిగ్రీ ప్రదానం చేస్తున్నప్పుడు వంగి గౌరవ పురస్సరం గా అందజేసి నట్లు పత్రికలన్నీ గొప్పగా ప్రచురించాయి .
యూరప్ వెళ్లి పై చదువులు చదవాలని ఎలిజబెత్ భావించింది ఇంగ్లాండ్ వెళ్లి ప్రయత్నం చేసి అవకాశాలు లేక పారిస్ చేరింది …స్త్రీ అవటం వల్ల ఎక్కడా అవకాశం లభించలేదు.పాల్ డూబోస్ అనే ఆయన ఆమె అనుభవాన్నీ అంకిత భావాన్ని గుర్తించి గొప్ప డాక్టర్ అవుతుందని చెప్పాడు .మిడ్ వైఫ్ గా పని చేయాల్సి వచ్చింది .ఒక సారి ఒక కంటి జబ్బు రోగికి చికిత్స చేస్తుంటే ఆ జబ్బు ఈమెకు అంటింది. దానితో ఎడమ కన్ను చూపు పోయింది .అందువల్ల సర్జన్ అవ్వాలనే కోరిక తీరలేదామెకు .నయం అయిన తర్వాత 1850లో లండన్ లో సెయింట్ బెత్ లోం హాస్పిటల్ లో ఎన్రోల్ అయింది .సెయింట్ పాగట్ బోధలు తరచూ వినేది .కాని ఆమెకు అమెరికా వెళ్లి ప్రజా సేవ చేయాలని పించి 1851 లో న్యూయార్క్ చేరి స్వయంగా ప్రాక్టీస్ మొదలు పెట్టింది .ప్రజా వ్యతిరేకత ఉన్నా న్యూ యార్క్ టైమ్స్ పేపర్ ఆమెకు సపోర్ట్ గా నిలిచింది. .ఉపన్యాసాలిస్తూ ‘’ది లాస్ ఆఫ్ లైఫ్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్స్ ‘’అనే పుస్తకం రాసి ప్రచురించింది .టాంపిక్న్స్ స్క్వేర్ లో చిన్న డిస్పెన్సరీ ప్రారంభించింది .డాక్టర్ మేరీ జాక్సా ,సోదరి ఎమిలీ సాయం తో 1857 లో దాన్ని విస్తరించి ‘’న్యూయార్క్ ఇంఫర్మరి ఫర్ ఇండిజేంట్ వుమెన్ అండ్ చైల్డ్ ‘’ నెలకొల్పింది .బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గా స్త్రీలనే తీసుకొంది .ఇన్ అండ్ అవుట్ పేషెంట్ లను అంగీకరించింది .ఒక్క ఏడాది లోనే ఏంతో అభి వృద్ధి చేసింది.చెల్లెలు ఎమిలీ కూడా డాక్టర్ డిగ్రీ పొందిన అమెరికా మూడవ మహిళా డాక్టర్ అయింది
అమెరికా సివిల్ వార్ లో బ్లాక్ వెల్ క్షత గాత్రులకు సేవ లందించింది .ఇది మగ డాక్టర్లకు ఇష్టం లేదు .డోరోతీ డిక్స్ సాయం తో నర్స్ ట్రైనింగ్ ప్రారంభించింది .సంస్థ ఆర్ధిక అభివృద్ధికోసం ఇంగ్లాండ్ కు చాలా సార్లు వెళ్లి వచ్చింది బ్రిటన్ లో ఈమె కు గుర్తింపు లభించి జెనరల్ మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ లో 1859 లో నమోదు అయింది. ఇలా నమోదైన తొలి మహిళా ఆమెయే .1868 లో మహిళా మెడికల్ కాలేజిని స్థాపించింది ఆ తర్వాత ఇలాంటిదే లండన్ లో మెడికల్ స్కూల్1869 లో ప్రారంభించింది ..దానికి అనుబంధం గా లేబరేటరి ని నెలకొల్పింది .ఈ కృషిలో నిమగ్నమై కూడా ఆమె సంస్కరణ భావాలను వదిలి పెట్టలేదు. ఆమె శిష్యురాలు మేరీ పుట్నం జాకోబి అందర్నీ ఎదిరించి వైద్య సేవలందిస్తోంది .స్త్రీలు సున్నితమైన మనస్కులు కనుక వైద్య సేవ లో వారు బాగా రాణిస్తారని బ్లాక్ వెల్ నమ్మింది .ఇంగ్లాండ్ లో వైద్యసేవలు చేస్తూనే 1871లో ‘’నేషనల్ హెల్త్ సొసైటీ’’ఏర్పాటు చేసింది యూరప్ అంతా తిరిగి స్త్రీ విద్యకు మహిళా వైద్యానికి మద్దతు సంపాదించింది .
ఉద్యోగ విరమణ తర్వాత ఆమె జీవితాన్ని సాంఘిక నైతిక విలువలకు, స్వచ్చమైన సెక్స్ వ్యాప్తికీ అంకితమిచ్చినది .మహిలా హక్కుల కోసం ,కుటుంబ నియంత్రణ కోసం కృషి చేసింది .రెండు యుటోపియన్ కమ్యూనిటీ లకువిరాళాలు సేకరించి నిలబెట్టింది . జబ్బులు నైతికత్వం లేకపోవటం వల్లనే వ్యాప్తి చెందుతాయికాని ,క్రిముల వల్ల కాదని దృఢం గా నమ్మింది .వేశ్యలకు లైసెన్స్ ఇవ్వటం, గర్భ నిరోధక మాత్రలకు వ్యతిరేకంగా పని చేసింది .తలిదండ్రులు పిల్లల విషయమై తీసుకోవాల్సిన నైతిక బాధ్యతలపై ఒక పుస్తకం రాసింది .
సంఘం లో ఆదర్శ మహిళ గా,సేవా భావం తో పని చేసే మహిళా డాక్టర్ గా ఆమె పేరు మారు మోగింది జీవితం చివరి రోజుల్లో కూడా ఆమె కార్యక్రమాల చురుకుదనం ఏ మాత్రమూ తగ్గలేదు .1895లో తన జీవిత చరిత్ర ‘’పయనీర్ వర్క్ ఇన్ ఓపెనింగ్ ది మెడికల్ ప్రొఫెషన్ ఫర్ వుమెన్ ‘’‘’పేర రాసుకోంది..ఎన్నో పర్యటనలలో కాలం గడిపింది 1906లో అమెరికా వెళ్లి మోటార్ కార్ నడిపి సంచలనం సృష్టించింది .1907 ఇంగ్లాండ్ వచ్చి మెట్ల మీది నుంచి జారి శారీరక ,మానసిక ఆరోగ్యం కోల్పోయింది 1910 మే31 90 వ ఏట శాశ్వతం గా రోగార్తులకు దూరమైంది . అశేష ప్రజా వాహిని ఆమె అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించి కృతజ్ఞత తెలుపుకొన్నారు ఎలిజ బెత్ బ్లాక్ వెల్ పేర అనేక బహుమతులంద జేస్తున్నారు ఎన్నో సంస్థలకు ఆమె పేరు పెట్టి గౌరవించారు .
అమెరికాలో మొదటి మహిళా డాక్టర్ గా ,ఇంగ్లాండ్ లో రిజిస్టర్ అయిన మొదటి మహిళా డాక్టర్ గా ,సాంఘిక, నైతిక సంస్కరణలను ఇటు అమెరికాలోను అటు యూరప్ లోను ప్రారంభించిన స్త్రీ గా ,అక్కడా, ఇక్కడా మహిళా మెడిసిన్ విద్యా వ్యాప్తికి ,స్త్రీ హక్కులకు ,బానిసత్వ విమోచానానికి అంకితమై కృషి చేసిన ఎలిజ బెత్ బ్లాక్ వెల్ జీవితం మహిళా లోకానికి . ఒక చారిత్రిక సత్యం అయింది.
– గబ్బిట దుర్గా ప్రసాద్
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~


Chalaa Baavundi
LikeLike
ధన్యవాదాలు సాగర్ గారు -దుర్గా ప్రసాద్
LikeLike