నా దారి తీరు -65
రామడుగు సూర్య నారాయణ శాస్త్రి గారు
శ్రీ రామ చంద్ర వైదిక మహా సభ రోజు రోజుకూ అభి వృద్ధి చెందుతూనే ఉంది .యదా శక్తి విరాళాలు అందుతూనే ఉన్నాయి .ఉత్సాహం గా జనం పాల్గొంటూనే ఉన్నారు. హరి కధలు ,పురాణాలు కళ్యాణాలు అన్నీ సక్రమం గా జరుగుతున్నాయి .కార్తీక మాసం లో అభిషేకాలు శివ రాత్రి అభిషేకాలు జరుగుతున్నాయి .నన్ను మా మామయ్యా దగ్గర కూర్చో బెట్టుకొని మహాన్యాసం తో ఏకాదశ రుద్రాభి షేకం చేసే వాడు నేనూ అదే మొదటి సారిగా ఆయన తో కూర్చుని అభిషేకం చేయటం అప్పటికి నాకు మహాన్యాసం నమక చమకాలేవీ తెలియవు .వంగాల సుబ్బయ్య గారి తో మా నాన్న గారు చని పోయిన తర్వాతాశివాలయం లో అభిషేకం చేయించుకొనే వారం ఇక్కడ సభలో కార్యక్రమాలు రంగ రంగ వైభవం గా అవుతున్నాయి .మామయ్యా కొంత కాలం పురాణాలు చెప్పాడు .తర్వాతా గుంటూరు నుండి శ్రీ రామడుగు రామ సూర్య నారాయణ శాస్త్రి గారు ఊళ్లోకి వచ్చి శివాలయం దగ్గర సీతం రాజు వారి సత్రం లో కాపురం ఉన్నారు .భార్య ఆరుగురు ఆడపిల్లలతో ఉంటున్నారు .ఆయన్ను మొదట బ్రాహ్మనార్తానికి పిలిచే వారు అధిశ్రవనానికి పిల్చి సంభావన లిచ్చేవారు .అందరికి పరిచయం అయిన తర్వాత ఆయన్ను బాగా అందరూ అర్ధం చేసుకొన్నారు ఆయన విద్వత్తు తెలిసింది .అప్పటి నుంచి ఇంకా ఎక్కువ గౌరవంగా జనం చూస్తున్నారు .
శాస్త్రి గారి చేత పురాణం చెప్పించటం ప్రారంభించారు .శ్రోతలు బాగా వింటున్నారు .హారతి పళ్ళెం లో డబ్బులు బానే వేస్తున్నారు .ఇంటికి కాయగూరలు పళ్ళు బియ్యం పంపి కుటుంబ పోషణకు సాయం చేస్తున్నారు ఇంటికి వస్తే మహా మర్యాదగా చూస్తున్నారు రెండు రోజుల కోసారి మామయ్యగారింటికి వచ్చేవారు అప్పుడు మా ఇంటికీ వచ్చి అమ్మను పలకరించేవారు .మా అమ్మ కూడా నిత్య శ్రోత .పురాణం తర్వాతా ఏదో ప్రసాదం కూడా అందరికి పంచేవారు అక్కడ ఒక హాండ్ పంపు ను కూడా త్రవ్వించి నీటి వసతి కల్పించారు .చిన్న వేదిక కూడా ఏర్పాటైంది .అందరు కూర్చోవటానికి చాపలు పరదాలు వచ్చాయి యధా శక్తి సహకరించేవారు సహకరిస్తూనే ఉన్నారు .శాస్త్రి గారు చాలా పొడవుగా పొడవుకు తగ్గ లావుగా నుదుట విభూతి రేఖలు పెద్ద కుంకుమ బొట్టు తెల్లటి పంచా లాల్చీ పై ఖండువా తో పిలక తో ఉండేవారు పురాణం చెప్పే టప్పుడు శాలువా కప్పుకొని చొక్కా లేకుండా ఉండేవారు .ఆయన పొడవైన వంకాయ లాగా ఉంటారో ఏమో కాని ఆయనకు అసలు పేరు పోయి ‘’వంకాయ శాస్త్రి ‘’గారు అని పిలిచేవారు .అది ఆయనకు తెలుసో లేదో తెలియదు .ఆయన పెద్ద కూతురు ఎక్కువగా ఆయనతో తిరిగేది .మామయ్యా పెద్ద కొడుకు పద్మ నాభం కు ఈ అమ్మాయి జోడీ అని శాస్త్రిగారు అమ్మాయిని పద్మనాభానికి ఇచ్చి పెళ్లి చేస్తారని పుకారు షికారు చేసింది .కాని మామయ్యకు ఇష్టం ఉన్నట్లు ఎక్కడా బయట పడలేదు ఆయన శాస్త్రి గారిని వేలా కోలం కూడా చేసేవాడు .పుకారు పుకారే అయింది కాని నిజం కాలేదు .
శాస్త్రి గారు గురజాడ లో కూడా పురాణం చెప్పే వారు అక్కడా బాగా క్లిక్ అయ్యారు సంపాదన పెరిగింది .కుటుంబ పోషణ కు ఇబ్బంది లేకుండా పోయింది సంతృప్తి ఆయనలో బాగా వ్యక్తం అయ్యేది .మా ఇంటికి కూడా భోజనానికి పిలిస్తే
వచ్చేవారు .శుభకార్యాలకు వచ్చి పండిత తాంబూలం స్వీకరించేవారు మాలో ఒకరుగా ఉన్నారు భార్య కూడా ఆడ వాళ్ళ తో కలుపు గోలు గా ఉండే వారు .ఆమెకూ గౌరవం బాగానే ఇచ్చేవారు . ఆ తర్వాతా ఆయన కుటుంబాన్ని హైదరా బాద్ కు మార్చారు .అప్పుడప్పుడు ఉయ్యూరు వచ్చి వెళ్ళే వారు .ఆ తర్వాత చాలా కాలం ఆయన గురించి తెలియదు కాని ఆయన హైదరాబాద్ దోమల్ గూడా లో శ్రీ రామ కృష్ణా మఠంలో ప్రవచనాలు చెబుతున్నట్లు ఉపనిషత్తులు ,వేదం భగవద్ గీత ల పై మంచి వ్యాఖ్యానాలు చేస్తున్నట్లు ఆంద్ర ప్రభ దిన పత్రిక లో చదివే వాడిని .మంచి గుర్తింపు వచ్చి నందుకు సంతోషం ఆ ఉండేది .అమ్మకు మామయ్యా కు ఈ విషయాలు చెబితే వాళ్ళో సంతోషించే వారు .
సభలో కలకలం
వైదిక మహా సభ లో పురాణం చెప్పటానికి కేరళ నుంచి ఒక మలయాళం తెలుగూ బాగా వచ్చిన ముసలి పండితుడు రెండో భార్య తో వచ్చి సీతం రాజు వారి సత్రం లోనే రామడుగు శాస్త్రి గారున్న చోట నే అద్దె కుండేవాడు .ఆయన పేరేమిటో గుర్తు లేదు .ఆయన మహా భారతం పురాణం చెప్పటం ప్రారంభించాడు .జనం విపరీతం గా వినటానికి వచ్చేవారు పాక అంతా నిండి పోయారు .ఆయన చెప్పే తీరు లో తెలుగు అంత స్పష్టం గా ఉండేది కాదు యాస ఉండేది .అయినా శ్రద్ధగ వినేవారు .మధ్యలో ఒకటి రెండు సార్లు వెళ్లాను వినతైకి .ఆయనకు కోలచల శ్రీరా మూర్తి మామయ్యా గోవింద రాజుల శ్రీరామ మూర్తి గారు ,సీతం రాజు సత్య నారాయణ గారు గొప్ప శ్రోతలు ఆయన ఏది చెప్పినా తలలు ఊపుతూ ‘’ఆహా ఓహో అను కుంటూ తనమ్యం గా వినేవారు .అయన ఏది చెప్పినా నాగస్వరం విన్న పాములై తలలూపటం నాకు మరీ చోద్యం గా ఉండేది .మరీ ఓవర్ గా ఆయన చెప్పుతూ ఉండటం వీళ్ళు ఆయనేది చెబుతున్నాడో తెలుసుకోకుండా ఈ చేస్టలేమితో అర్ధమయ్యేది కాదు .
ఒక రోజు నేను వెళ్లి వింటున్నాను .అయన ద్రుత రాస్త్రుడికి నూరుగురు కొడుకులని చెప్పివారి పేర్లను చెప్పటం ప్రారంభించారు ‘’ఒక నాలుగైదు పేర్లు చెప్పి సమయం అయి పోయినందున మర్నాడు చెబుతానని చాలించారు నేను ఇంటికి వచ్చి వాళ్ళ పేర్లేమిటో భారతం చదివి లిస్టు రాసుకోన్నాను .మర్నాడు కూడా సభకు వెళ్లాను ఆయన రెచ్చి పోయిన ఉత్సాహం గా కౌరవ సంతానం పేర్లు చెప్పటం ప్రారంభించాడు .అయిదారుపెర్ల తర్వాతా చీపురు విసన కర్ర ,పీత చేంతాడు పలుగు పార ,చాప మొదలైన పేర్లన్నీ చెప్పాడు .ఎవరికీ సందేహం కలగలేదు .నాకు మండి పోతోంది ..భరించలేక పోయాను వినటానికే చాలా సహయం గా ఉంది .తమాయిన్చుకోన్నాను .ఆయన పేర్లు అన్నీ చెప్పి ఆపేశాడు మా వాళ్ళంతా హర్షధ్వానాలతో చప్పట్లు చరిచారు .అప్పుడు నేను లేచి నిలబడి ‘’ఇక ఆపండి అయ్యా శాస్త్రులు గారూ !కౌరవుల పేర్లన్నీ గుక్క టిప్పు కోకుండా చెప్పి నందుకు చాలా సంతోషం మీ జ్ఞాపక ధారణా శక్తి అమోఘం .ఇంతకీ ఈపేర్లు ఏ భారతం లో ఉన్నాయో సెలవిస్తారా ?అని అడిగాను .సభలో కలవరం కలకలం ‘’ఈ కుర్ర సాన్నాసా అంతటి ముసలి పండితుడిని అడిగే వాడు ?’’అని అందరూ అనుకొన్నారు ణా మీద మంది పడ్డారు .’’నేకేం తెలుసు నని ఆయన్ని నిలదీశావు ?’’అన్నాడు కొలచిన మామయ్య .అప్పుడు నేను’’ అసలా పేర్లు ఉన్నాయో లేదో మీలో ఎవరికైనా తెలుసా’’ ?అని అడిగాను ఎవరూ తెలుసు నని చెప్పలేదు మా మామయ్యా కూడా అంతే .అప్పుడు నేను రాసుకొచ్చిన లిస్టు లోని పేర్లు వరుసగా చదివాను దిమ్మ తిరిగి పోయింది అందరికి శాస్త్రులు వారు నిలువు గుడ్లేశారు .అప్పుడు నేను మళ్ళీ ‘’అలుకు గుడ్డా చీపురు పుల్లా చెక్కా పీతా కత్తిపీట ‘’వగైరా పేర్లు ఆయన చెబుతుంటే అరె ఇవేం పేర్లు అని మీకేవరికి అని పించక పోవటం తో ఆయన విజ్రుమ్భించి ఇష్టమొచ్చిన అడ్డ దిద్దమైన అసహ్యమైన పేర్లన్నీ చెబితే మై మరచి చప్పట్లు కొట్టారు .చెప్పే వాడెం చెబుతున్నాడో ,అసలు విషయం చెబుతున్నాడా లేదా అనే ఆలోచన అక్కరలేదా ?తెలుసు కొని నేను చెబితే నేనేదో తప్పు చేసినట్లు మీరంతా నన్ను తిట్టారు ఇప్పుడు తెలిసిందా అసలు విషయం ఏమిటో ?’’అన్నాను మళ్ళీ నేనే శాస్త్రులు గారితో ‘’ఇలాంటి అవాచ్యం అప్రాచ్యం పేర్లు చెప్పి సభ ను తప్పు దోవ పట్టించినందుకు ఇప్పుడే సభా ముఖం గా క్షమాపణ చెప్పండి ‘’అన్నాను .దీనికీ మళ్ళీ ఇబ్బంది పడ్డారు అందరూ .అయన నోట మాటే లేదు ఇబ్బంది కరం గా ఉన్నాడు .చివరికి ఆయనే ‘’నోటి కొచ్చిన మాటలు చెబుతూంటే మీరు విపరీతం గా తలలూపుతూ భేష్ భేష్ అంటుంటే నేను మరీ రెచ్చి పోయి ఇష్టం వచ్చిన పేర్లన్నీ చెప్పాను ఇవి ఏ పుస్తకం లోను లేవు .నోటికి వచ్చినదంతా వాగేశాను .క్షమించండి .’’అన్నారు .అప్పుడు నన్ను అందరూ అభినందించారు ‘’భలే చెప్పావురా అబ్బాయ్ ‘’అన్నాడు కోలాచల మామయ్య .మా మామంయ్యా ఏంతో సంతోషిం చాడు .మర్నాడే శాస్త్రులు గారు బిచానా ఎత్తేసి వెళ్లి పోయారు .అప్పటి నుంచి నేను ఏ సభలో విన్నా అసలేం చెబుతారో ఏం చెప్పాలో అసలు విషయం ఏమిటో ముందే చూసుకొని వచ్చి వినటం అలవాటైంది .నేను సభలో ఉంటె చాలా జాగ్రత్త గా మాట్లాడటం అలవాటైంది వక్తలకు ..
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -.4-1-14-ఉయ్యూరు

