
..ఎవరో అన్నారు. ఓపెన్ ఎండెడ్ స్టోరీస్ త్రిపురగారివని. ఒక అవంట్‌గార్డ్ ఫ్రెంచి సినిమా చూసినట్టు. ఒక ఫిల్టర్డ్ లైట్ లెన్స్‌లో లోకాన్ని దర్శించినట్టు. అర్ధమైందా. మళ్లీ చదువు. మళ్లీ అర్ధమైందా. మళ్లీ చదువుకుంటూ పో. కొత్తగా. మహాప్రస్థానమే కాదు. మళ్లీ మళ్లీ కొత్తగా అర్ధమవుతూ త్రిపుర కూడా. ఎప్పటికప్పుడు ప్రొటాగనిస్ట్ మారిపోతాడేమో గానీ ఆ నీడలు మాత్రం ‘ఆ’ పాత్రలో నిరంతరం ప్రసరిస్తాయి.. సర్. ఇటీజ్ యూ. వోన్లీ యూ!
దొర్లుకుంటు పొర్లుకుంటు పొలిమేరలు దాటుకుంటు. బట్ హీ కేరీడ్ ఎ లాట్ ఆఫ్ మాస్. ఫంగై. వానలో నాని నాని బీటలు వారిన గోడల్లో గీతలు గీసిన పచ్చని ఫంగై. అస్తవ్యస్తమై. ఆర్డల్లీనెస్‌ను విశృంఖలంగా ఎదిరించి. చెల్లాచెదురు దృశ్యంలో చక్కటి అమరికను గాంచి. పెయిన్‌లో నూ ఎక్స్‌టసీలోనూ కాన్‌ఫ్లిక్ట్‌లోనూ ఆవరణాలన్నిటినీ ఆయా వర్ణాలలో దర్శించి, ఎండకూ వానకూ చలికీ మానవ భావోద్వేగాలను పెయింట్ చేసి. యాంబియెన్స్‌నే కథనానికి ప్రాణం చేసి. యాంబియెన్స్‌కూ పాత్రలకూ సంభాషణ పెట్టి, సంయోజకాలు కలిపి! సోదరులారా ఇది పక్కన పెడితే తను సృష్టించుకున్న భాస్కరంలాగానే ఆయనకూ పెద్ద లగేజి లేదు. ఆయనా, షాన్‌బాగూ పాస్‌పోర్టూ తప్ప. అందుకే శేషియో మళ్లీ తారసపడినపుడు ‘తొక్కలో సామాను ఎవడెత్తుకెళ్తాడు పక్కన పడేసి రమ్మ’న్నాడు. శేషియో ఎటిమోలజీ ఏంటో తెలిసినా భాస్కరం నెవర్ లాస్ట్ ఇంటరెస్ట్ ఇన్ హిమ్. వై వై వై. ఏ మనుషులు ఎందుకు ఎలా ఎప్పుడు సరిగ్గా ఏ పాయింటాఫ్ టైమ్‌లో మారిపోతారు. సాపేక్షసూత్రాలను ఎవరికి ఎప్పుడు ఎక్కడ అనువర్తిస్తారు. మనుషులు వెనక్కి తిరిగిచూసుకోడం ఎప్పుడు ప్రారంభిస్తారు. లేదా ఎందుకు ప్రారంభిస్తారు. అందుకే ఆనాడు త్రిపుర.
—–
ఒకో దృశ్యం నుంచి ఒకో స్నాప్‌షాట్‌ను ఆల్బంలో అతికించుకుంటూ. మ్యూజిక్ వీడియోలు అప్పుడు లేవు. గ్రాఫిక్ మాజిక్‌లూ అప్పుడు లేవు. నిశ్చల చిత్రాలు అకస్మాత్తుగా చలనచిత్రాలుగా జీవం పోసుకుని కథచెప్పే వైచిత్రిని ఫైనల్‌కట్ ప్రోలో ఎడిట్ చేసి వండరైపోమని లోకంలోకి ఉసిగొల్పేవాడు లేడు. అందుకే ఆనాడు త్రిపుర!
—–
సమయానికి నాలుగో డైమన్షన్ బరువు. ఎంత కష్టపడి ఈ గడియార పు ముళ్లని లేపేద్దామన్నా కదలని మెదలని మొద్దుసమయాల పొద్దు. ఒక సన్నివేశంలోని బరువు, లోతు, ఎత్తు, మత్తు మరియు చిత్తు చేసే గ్రేస్. ఇళ్లకీ కళ్లకీ సాయంత్రాలకూ చీకటికీ నవ్వుకూ ఏడుపుకూ లోతు ఉంటుం ది. డెప్త్. ఇవన్నీ కళ్లతో కాదు గుండెతో కొలుస్తారు. ప్రతి కదలికకీ ప్రతి దృశ్యానికీ ప్రతిగాలికీ ప్రతివెలుగుకీ డైమన్షన్ ఉంది. ఈ వాక్యాలన్నీ పేజీల్లోంచి వయా గుండె నాడులలో ఈది మెదడుకు చేరి కళ్లలోంచి బయటకు దూకినప్పుడు! ఓ మై, అది ఎవరో కాదు నువ్వే! నిన్ను నీ గుండెతో సహా ఓ చిన్న క్రేన్‌తో లేపి- టైమ్ అండ్ స్పేస్- కథాస్థలంలోకి డైరెక్టుగా నిన్నే ప్రవేశపెట్టి. మన చుట్టూ ఉన్న మనుషులలోని మనుషులతో క్లినికల్‌గా కోరిలేట్ చేసి. అందుకే ఆనాడు త్రిపుర!
—–
మనుషులంతా ఒక్కటే. అంటే ఆదర్శం. కానీ మనుషులు ఒక్కతీరుకాదు గురూ నాలుగు రకాలు. లైట్‌తీస్కో బాబూ లైట్‌తీస్కో. కొంతమంది లైటు తీసుకోలేరు. మానవులందరూ మర్త్యులు. చివరకు శేషియోలు కూడా. లైటు తీసుకోడం వెనుక కరడుకట్టి కొరిడీకాయలాగా మారిపోయిన గుండె మద్దతు ఉండాలి. ఆ మద్దతు లేని రోజు ఈ సమాజము శేషియోలను ఉత్పత్తి చేయలేదు. గురూ నీ ఏజేంటో గేజేంటో రేంజేంటో తెలియదు గానీ ఏ పంచకళ్యాణీ నిన్ను ఢమాల్‌మని కింద పడేసి గాలప్ చేసుకుంటూ పరిగెత్తుకు పోలేదా. ఆ పచ్చని కొండమీదకు ఎక్కి ఓ నిమిషం వెనక్కి చూసి వికటంగా సకిలించి మళ్లీ ముందుకు పోలేదా. విషపునవ్వుల కెరటాలు నీ కళ్లతీరాలను ఏనాడూ తాకలేదా. నువ్వు గమనించలేదా. వేరు చేయలేదా. ఎవరైనా నీ ముందు ఆకు పచ్చపాములా వళ్లు సాగదీసుకుని ఒక్కసారిగా లేచినట్లనిపించలేదా. ప్రమాదం ఎగరేసే ఒకటో నెంబరు హెచ్చరికలు: పిచ్చివాడా ఎప్పుడూ గమనించనేలేదా. సిన్నింగ్ ఫ్లెష్‌లో ఎంబెడ్ అయిన సెయింట్లీ నయనాలు నిన్నూ!
—–
సలీం ఆలీ సంగతేమో గానీ, డెస్మండ్ మోరిస్ బోల్‌కే ఏక్ హై. సోషియాలజీ ఆఫ్ ఎ బార్ రాసిందతనే. నియాన్‌లైట్ల మధ్యగాలిలో- రంగుల్లో విస్తరించిన పొగల్లో- రంగులు మారే ముఖాలు. రంగురంగుల కవళికలు. రంగులు మార్చుకున్న మొసళ్లు. పులులు, నక్కలు, పసిరికపాములు. ఇవన్నీ కేరక్టర్ రీత్యా ఒకటే కేటగిరీ. మరియు లేళ్లు, కుందేళ్లు, తాబేళ్లు. మనుషులూ మనుషులలోని వివిధ జంతువులు. మరియు వాటియొక్క వివిధ వస్తువులతో చెక్కబడిన ముఖాలు. ఇన్‌క్లూడింగ్ గాజుముక్కలు. మోరిస్‌కు వేరే పనీమీ ఉండేదికాదు, ఇంట్రూజన్ తప్ప.
ఆ బార్‌లో ఏళ్లతరబడి కూచుని ముందును వదిలి మనుషుల్ని రుచి చూస్తూ. శాంప్లింగ్. త్రిపురగారు సోషల్ యాంత్రపాలజీ చదివారో లేదో గానీ, ఈ మోరిస్‌గారే మరో పుస్తకం రాశారు. మాన్‌వాచింగ్ దానిపేరు. రైల్వేస్టేషన్‌లో ఎయిర్‌పోర్టులో పోర్టులో వీధిమలుపులో ఇంటి ఎదురు అరుగులో వాకిళ్లలో మనుషులు లేని ఇళ్లలో ఇళ్లు చాలని మనుషుల్లో బార్లలో రెస్టారెంట్లలో ఎబోవ్ ఆల్ ఆ మూల కనిపిస్తున్న కిళ్లీ షాపులో: మనుషులను ఎక్స్‌రేలు తీసి. హ్యుమిలియేట్ అయిపోయి. రగిలిపోయి. కదిలిపోయి. కుమిలిపోయి. పొంగిపోయి. విస్తుపోయి. కేవలం మనుషులకే కాదు ఇళ్లకూ కవళికలుంటాయి. ఇంటి లోతూ, వసారా వెడల్పూ ఎత్తూ పొడవూ వాలూ వీలూ అన్నీ భావప్రసారం చేస్తాయి. ఆయనకూ ఈయనకు-మోరిస్:త్రిపుర- తేడా ప్యూర్ అకడమిక్స్ అండ్ ఫైన్ లిటరేచర్. అందుకే ఆనాడు త్రిపుర.
—–
పరిసరాలూ మనుషులూ వాటి మధ్య కనెక్టివిటీ. జెన్. కన్‌ఫ్యూషియస్. భౌతికపరిసరం లేకుండా భావప్రపంచం లేదు. ప్రకృతినేర్పే అమరికను అర్ధం చేసుకోకుండా దానితో బంధం నెలకొల్పుకోలేవు. దానితో బంధాన్ని నెరపకుండా బతకలేవు. దానితో బంధం పెనవేసుకోకుండా మానవుడివి కాలేవు. ఎన్విరాన్‌మెంట్ ఇన్‌క్లూడ్స్ హోమోసెపియన్ సెపియన్స్. చింతన. చితిలా రగిలే చింతన. ప్రయాణం పొడవునా. మొగల్‌సరాయ్‌కి రైలులో వెళ్తున్నపుడు కోచ్‌లోపలి లైట్ల విచిత్రమైన వెలుగులో చింతన. గంగఒడ్డున బురదబాటలో నడుచుకుంటూ వెళ్తున్నపుడు అసురసంధ్య ముసురు చినుకులలో చింతన. పాతబడ్డ బంగళా గోడలు తడిచి ఫంగైలతో నిండి చెమ్మగిల్లిన గోడలలో చింతన. గుండెలలో చింతన. ఊపిరితిత్తులలో చింతన. నాడులలో చింతన. టాప్ ఆఫ్ ఇట్/ఎబోవ్ ఆల్ చలికి వణుకుతున్న నక్షత్రాల వలె. చింతన. చింతనలో నిరీక్షణ. చింతనతో నిరీక్షణ. చింతగా నిరీక్షణ.
నిశ్చింతగా చింతన. మరియు, ‘భూమ్యాకాశాల మధ్య గానుగెద్దుల్లా, పీనుగుల్లా రెపరెప కొట్టుకలాడి మట్టిలో పట్టపగలే ఊపిర్లు విడిచే తమ్ముళ్ల కోసం’ చింతన. ఇంతకీ ఎంత నిరీక్షించినా రాని భగవంతం ఎవరు. త్రుటిలో తప్పిపోయిన భగవంతం ఎవరు. భాస్కరాలూ శేషియోలూ ఉన్నిథన్‌లూ వీరాస్వాములూ కాని భగవంతం ఎవరు. ఆయన కొరకు ఎవరెవరు నిరీక్షిస్తున్నారు. ఆయనను ఎవరెవరిలో దర్శిస్తున్నారు. ‘రాజు’ ఏ అడవిగొంతు వినిపిస్తున్నాడు. కాజల్ గుండె ధమనుల్లో ఏ రక్తం ప్రవహించింది. కొన్ని వాక్యాలు చదువుతూ చదువుతూ నీ యబ్బా (నన్ను మన్నించండి) అనుకోలేదా. పుస్తకం విసిరేసి రీడింగ్‌టేబుల్‌ని ఒక్క గుద్దు ఫట్ మని పీకాను. వేగం. దృశ్యాలగమనంలో మాంటాజ్ ఛాయాప్రవాహం. గాలికంటే వేగమైనది మనసు. మనసు కంటే వేగంగా రాసేది ఎవరు. ఇంపల్స్. ఎంత వేగంగా రాస్తే ఈ స్రవంతి?
—–
అయామ్ ఓపెన్ ఫర్ దట్. కమాన్ టాక్ టూ మీ. కోల్గేట్‌తో శుభ్రంగా మింట్ వాసన ఘుమ్‌ఘుమాయించేలా బ్రష్ చేసుకుని మాట్లాడు. అయామ్ ఓపెన్. అందుకే ఆయన చాలా వాటికి ఫుల్‌స్టాప్ పెట్టలేదు. లైఫ్ ఆఫ్టర్ లివింగ్! కథ ముగిసిన తర్వాతే కథ ప్రారంభం. కొనసాగి కొనసాగి పాత్రలు మళ్లీ మళ్లీ పేరో తీరో మార్చుకుని. ఎవరో అన్నారు. ఓపెన్ ఎండెడ్ స్టోరీస్ త్రిపురగారివని. ఒక అవంట్‌గార్డ్ ఫ్రెంచి సినిమా చూసినట్టు. ఒక ఫిల్టర్డ్ లైట్ లెన్స్‌లో లోకాన్ని దర్శించినట్టు. అర్ధమైందా. మళ్లీ చదువు. మళ్లీ అర్ధమైందా. మళ్లీ చదువుకుంటూ పో. కొత్తగా. మహాప్రస్థానమే కాదు. మళ్లీ మళ్లీ కొత్తగా అర్ధమవుతూ త్రిపుర కూడా. ఎప్పటికప్పుడు ప్రొటాగనిస్ట్ మారిపోతాడేమో గానీ ఆ నీడలు మాత్రం ‘ఆ’ పాత్రలో నిరంతరం ప్రసరిస్తాయి. ఆయన రచనలనన్నీ కలిపికుట్టే ఆ ఛాయలు, చాయలు ఒక మనిషి జాడ, ఒకే మనిషి జాడ తెలుపుతునే ఉంటాయి. సర్. ఇటీజ్ యూ. వోన్లీ యూ! ఒకే పాత్రలో రకరకాల మనుషులు. ప్రతి ప్రొటాగనిస్ట్‌లో మీ డ్యూస్. కొంతమందిని మీరు ఎంతగానో క్షమిస్తారు. ఆ క్షమ అదే పాత్ర మరో సన్నివేశంలో సంపాదించుకున్న గౌరవంలో ప్రతిఫలిస్తారు. అపారమైన దయ. ఈవెన్ ఎ సూసైడ్ ఈజ్ గ్లోరియస్! పేరుకే కథకథకీ ఓ పేరు. నిజానికి చాప్టర్లు. ఒకే పాత్రలు కొంచెం ఆవరణం మార్చుకుని ప్రవహించే చాప్టర్లు. అయితే జుడాస్ లేదంటే సీజర్.
—–
నిరీక్షణ. నెవర్ ఎండ్స్. కనులు మూతపడేవరకూ. ఏ స్వర్గంకోసం. ఏ తాత్వికానందంకోసం. ఏ సమాధానం కోసం. ఏ వెలుగుకోసం. రావాల్సిన బస్సు వస్తుందో రాదో ఆ బస్సు కావాల్సిన దాన్ని మోసుకొస్తుందో లేదో. ముందయితే ఇక్కడి నుంచి ఈ సన్నివేశం నుంచి ఈ పాత్రల నుంచి ముందుకు సాగాలి. తరువాతేమిటో. లైఫ్! హేయ్ వాట్ డూ యూ హావ్ ఫర్ మీ ఇన్‌స్టోర్? వీరాస్వామికీ భాస్కరంకీ నారాయణకీ రాజూ కాజల్. యూనేమ్ హిమ్! ఎదురుచూపులు: వాట్‌నెక్స్ ్ట కోసం. వండరింగ్, వాండరింగ్! సబ్‌హ్యూమన్‌గా బతకలేక! ఉత్తరాంధ్రమో ఈశాన్యరాష్ట్రమో. కలవరపరిచింది. కళ్లు ఎర్రటి వెలుగులో మెరిశాయి. కళ్లు ఎర్రగా మండిపోయాయి. గుండె ఎర్రగా రగిలిపోయింది. త్రిపుర కలం తూర్పువెలుగునూ నింపుకుని. ఈ ప్రయాణమంతా సిరాలో కలిసి.
—–
అనార్కిజం ఈజ్ ఎ లైఫ్‌స్టయిల్. అలాగే ఉండిపోతే తుప్పుపట్టిపోతావ్. సీలలు ఊడిపోతాయ్. ‘మార్పులు వస్తుంటాయి. అన్నిట్నీ కదిలిస్తుంటాయి. ఏదీ ఒకలాగే ఉండదు. అంతాఫ్లో’. అవును. గతితర్కం- ప్రపంచం నిరంతరచలనశీలము. మార్క్సూ బుద్ధుడూ! త్రిపురను చదవాలంటే బాగా చదువుకోవాలి. త్రిపురను చూడాలంటే మనుషుల్ని చూడాలి. ఆయనలా మనుషుల్ని గుండెల్లోకి లాక్కోవాలి. మనుషులున్న రోడ్ల మీద తిరగాలి. కొంత జీవితం తర్వాత మళ్లీ త్రిపురను చదవాలి. ఆపై కొంత జీవించాక మళ్లీ చదవాలి. ఇది వాల్డ్‌క్లాస్. త్రిపురకు ప్రపంచసాహిత్యంతోనే పోలిక. ఆ కన్‌స్ట్రక్షన్, ఆ క్రాస్‌రిఫరెన్స్, ఆ ఎక్స్‌పెరిమెంట్. కానీ అవేవీ తీరిగ్గా కూర్చుని శిల్పాలు చెక్కినవి కావు. త్రిపుర సాహిత్యం మొత్తం ఓ హేపెనింగ్. అదంతా ‘యాజ్-ఇట్-హేపెన్స్’ అక్షరాల్లోకి ప్రవేశించి స్థిరపడింది.
—–
ఇప్పుడూ ఇలాగే ఉంది. యాంబియెన్స్ మారిందంతే. ట్విలైట్‌జోన్‌లో ఇది యల్ఇడి జెనెరేషన్. లైట్ ఎమిటింగ్ డయోడ్స్! నియాన్ ఈజ్ వోల్డ్. వేర్ ఈగిల్స్ డేర్. గన్స్ ఆఫ్ నవరోన్. వార్ సినిమాలలో టింట్ ఉక్కురంగు. మిలటరీ రంగు. తుప్పు. స్టిఫ్‌నెస్ ఇన్ ఎక్స్‌ప్రెషన్. రెండే రెండు: గ్రెగరీపెక్‌లోని దారుఢ్యం లేదా ఇన్‌గ్రిడ్ బెర్గ్‌మన్ లాలిత్యం. కథాకాలంలో కథాస్థలంలో ఎండనో చలినో వాననో దేనిని ఇమేజిన్ చేసుకున్నా స్ట్రాంగ్ కాఫీలా. వాటికి టెక్స్‌చర్ కూడా ఉంటుంది. వాన మెత్తగా ఉన్నట్టు. చలి లోహంలా ఉన్నట్టు. చీకటికాళ్లను చుట్టుకున్నట్టు. మనసు ఎర్రగా చేసుకున్నట్టు. విస్కస్ వైటాలిటీ!
—–
త్రిపుర అంటే ఎవరు. ఎప్పుడో యూనివర్సిటీ రోజుల్లో ఓ సోషల్‌వర్క్ చదివే అమ్మాయి చేసిన పరిచయం. కేశవరెడ్డి సిటీ బ్యూటిఫుల్‌తో కలిపి. థాంక్యూ మాధవీ. నీ వైల్డ్ ఐస్ వెనుక జాన్‌కీట్స్‌ను వెతికేందుకు వస్తే నువ్వు త్రిపురను చేతిలో పెట్టావు. త్రిపురగారితో నాకెప్పుడూ వ్యక్తిగత పరిచయం లేదు. ఆయన్ను ఒక్కసారి కూడా చూడలేదు. కానీ, కాంపస్ లైఫ్‌లో పరిచయమైన రచనలు అప్పటికి నాకు కమ్యూనికేట్ అయినంతలో నన్ను సీరియస్‌గా ఎఫెక్ట్ చేశాయి. నాకిప్పుడు అదే స్ఫురించింది. మళ్లీ మళ్లీ విజిట్ చేయడం త్రిపురను రీడిస్కవర్ చేయడం నాకు, సాహిత్యమూ శైలీ పక్కన పెడితే, ఆయనలోని ఉదాత్తభావాలను కూడా ప్రెజెంట్ చేసింది. ఇప్పుడెందుకో ఆయన నాకూ బాగా తెలుసన్న ఫీలింగ్ ఉంది. ఒకే ఒక ప్రశ్న నన్ను హ్యుమిలియేట్ చేస్తున్నది-‘అది ఆయన వేసుకున్న ప్రశ్నో వేసిన ప్రశ్నో- మనిషిలాగ సూపర్‌మేన్‌లాగా సబ్‌హ్యూమన్‌గానూ జీవిస్తూ’- జవాబు చెప్పగలవా…జవాబుదారీతనం లేకుండా ఈ ప్రపంచంలో అక్రమంగా బతికేస్తున్న వాళ్లంటే అసహ్యం పుడుతోంది.
—–
ఆయామ్ సో అన్‌లక్కీ. నా మొదటికవితా సంకలనానికి త్రిపుర ముందుమాట రాయలేదు. రెండో సంకలనం సిద్ధం చేసుకునే సమయానికి ఆయన లేరు. మో లేరు. నా కవితలు త్రిపురకు పంపించాలని ఆయన చేత నాలుగు ముక్కలు రాయించాలనీ మోహన్‌ప్రసాద్‌గారు నా మీద ప్రేమతో ఇన్‌సిస్ట్ చేశారు. ఇప్పుడు భమిడిపాటి జగన్నాధరావుగారు త్రిపుర గురించి నేను తప్పకరాయాలని నా మీద ప్రేమతో ఇన్‌సిస్ట్ చేశారు. లేకుంటే ఇంతటి సాహసం నేనెందుకు చేస్తాను.
-అరుణ్‌సాగర్

