పాఠాలన్నీ దృశ్యాలుగా

పాఠాలన్నీ దృశ్యాలుగా..

ప్రతి పాఠాన్ని విని గుర్తుపెట్టుకోవడం కష్టం. కాని పాఠం సారాంశాన్ని దృశ్యరూపంలో చూస్తూ వింటే.. గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. రంగురంగుల బొమ్మలు, కదిలే చిత్రాలకు చక్కటి స్వరం తోడైతే పిల్లలు ఇష్టంగా తిలకిస్తారు. తక్కువ సమయంలోనే ఎక్కువ జ్ఞానాన్ని ఆర్జిస్తారు అంటున్నారు కంప్రింట్స్ నిర్వాహకులు జి.సత్యనారాయణ. ఒకటో తరగతి నుంచి ఇంటర్‌మీడియట్ వరకు తెలుగు, ఇంగ్లీషు పాఠ్యపుస్తకాలను యానిమేషన్ రూపంలో తీర్చిదిద్ది.. సీడీలుగా రూపొందించారాయన. ఈ సీడీలను ఈ మధ్యనే ఐటీ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆవిష్కరించారు..

అది కరీంనగర్‌లోని ఒక ప్రభుత్వ పాఠశాల. తొమ్మిదో తరగతి విద్యార్థులకు ‘ద్రవ్యం’ అనే పాఠం చెబుతున్నాడు టీచరు. ద్రవ్య పరిణామక్రమాన్ని వివరిస్తూ ఆయా రాజుల కాలంలో ఎలాంటి నాణేలు చలామణిలో ఉండేవి? వాటిని ఏ పేర్లతో పిలిచేవారు? ఇవన్నీ బోధించారు. వారం రోజుల తర్వాత ఆ అంశం మీద పిల్లలను ప్రశ్నలు అడిగితే పదిశాతం మంది కూడా జవాబు చెప్పలేకపోయారు. కారణం? గుర్తుపెట్టుకోలేకపోవడం. ఇదే పాఠం సీడీలో ఉందంటూ – పక్క స్కూలు టీచరు ఇస్తే తీసుకొచ్చి, క్లాస్‌రూం టీవీలో ప్లే చేశాడు ఆ టీచరు. నాణేలు, రాజుల చిత్రాలతో సహా అందులో స్పష్టంగా చూపించారు. పాఠం వింటున్నట్లుగా కాకుండా సినిమా చూస్తున్నట్లు ఆసక్తిగా తిలకించారు విద్యార్థులు. చూసినవన్నీ జ్ఞాపకం పెట్టుకుని ప్రశ్నలు అడగ్గానే చకచకా జవాబులు చెప్పారు. “టీచరు చెప్పే పాఠాలను మళ్లీ మళ్లీ వినేందుకు వెసులుబాటు ఉండదు. అదే పాఠాన్ని యానిమేషన్ రూపంలో అయితే టీవీలోనో, కంప్యూటర్‌లోనో ఎన్నిసార్లయినా చూడొచ్చు. కఠినమైన పాఠాలను సైతం సులభంగా అర్థం చేసుకోవచ్చు. మా సంస్థ తయారుచేసిన యానిమేషన్ పాఠాలను విద్యార్థులందరూ ఆసక్తికరంగా చూస్తున్నారు. ఉపాధ్యాయుల మీద ఒత్తిడీ తగ్గింది” అంటున్నారు కంప్రింట్స్ సంస్థ నిపుణులు.

పాఠాలన్నీ సీడీల్లో..
కొన్నేళ్ల కిందటే రకరకాల పాఠాలు, పిల్లల పాటలు, గేయాలు సీడీల రూపంలో మార్కెట్‌లోకి వచ్చాయి.
ఈ సంస్థ కూడా 20 ఏళ్ల నుంచి విద్యారంగంలో మల్టీమీడియా సీడీలను ఉత్పత్తి చేస్తోంది. అయితే ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగు, ఇంగ్లీషు మీడియం పాఠ్యపుస్తకాలు పూర్తిస్థాయిలో సీడీలుగా రావడం ఇదే తొలిసారి అని చెప్పారు వాళ్లు. “యానిమేషన్, గేమింగ్, మల్టీమీడియా ట్రెండ్ ఎంత పెరిగిందంటే.. నిత్య జీవితంలో ఇవొక భాగమయ్యాయి. ఎంత క్లిష్టమైన విషయాన్నయినా ఈ మీడియా ద్వారా సరళంగా చెప్పొచ్చు. అందులోనూ ఇప్పుడు ప్రతి విద్యార్థికీ కంప్యూటర్ల వాడకం తప్పనిసరైపోయిందని వాళ్ల అభిప్రాయం.
“అందుకే పాఠ్యాంశాలను దృశ«్యరూపంలో మార్చడానికి మల్టీమీడియాను ఎంచుకున్నాం. కొన్ని పాఠాలు ఒకసారి వింటే అర్థం కావు. ఉదాహరణకు పదోతరగతిలో ‘రక్తప్రసరణ వ్యవస్థ’ పాఠాన్నే తీసుకుందాం. ఈ పాఠాన్ని చెప్పాలంటే బ్లాక్‌బోర్డు మీద గుండె బొమ్మను వేసి రక్తప్రసరణ వ్యవస్థను వివరించినా.. పూర్తిగా అర్థం కాదు. అదే విజువల్‌గా చూపిస్తే ఇంకా ఎఫెక్టివ్‌గా పిల్లల మెదళ్లకు చేరుతుంది. మా సీడీ ఆ పనిచేస్తుంది..” అన్నారు సంస్థ ప్రతినిధులు. ఇప్పటి వరకు గణితం, సామాన్య, సాంఘిక, భౌతిక, జీవ శాస్త్రాలను యానిమేషన్ సీడీలుగా చేసినట్లు చెప్పారాయన. ఇవన్నీ రాష్ట్ర పాఠ్యప్రణాళికను అనుసరించే తయారయ్యాయి.

“పాఠ్య పుస్తకాన్ని సీడీగా తయారుచేయడం కత్తిమీదసాము. ఒక్కో పాఠం పది పేజీలు కూడా ఉంటుంది. అదంతా కుదించి దృశ్యరూపంలో పెట్టాలి. పైగా ఏదీ మిస్ అవ్వకూడదు. జీవశాస్త్రం, సామాన్యశాస్త్రం వంటి వాటిని చిత్రాల రూపంలో తెరకెక్కించవచ్చు. కాని గణిత, భౌతిక శాస్త్రాల విషయానికొచ్చేసరికి కష్టమవుతుంది. గణితంలో పూర్ణసంఖ్యలు, భిన్నాలు, దశాంశాలు, రేఖలు, కోణాలు తదితర పాఠాల్ని యానిమేషన్‌లో చెప్పినా పిల్లలకు బోర్ కొడుతుంది. అందుకని వారి ఆసక్తి సన్నగిల్లకుండా వర్ణరంజితంగా తీర్చిదిద్దాము” అన్నారు సంస్థలో పనిచేస్తున్న నిపుణులు. “ప్రతి పాఠం చివర ప్రశ్నలు, జవాబులు, క్విజ్‌లు, పజిల్స్ వంటివి ఇవ్వడం వల్ల విద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని సొంతంగా పరీక్షించుకునే అవకాశం దొరికింది. ఈ పాఠాలన్నీ ఎవరికి ఎంత మాత్రం అర్థం అవుతున్నాయో అంచనా వేయవచ్చు” అని ఉపాధ్యాయులు కూడా సంతృప్తిని వ్యక్తం చేశారు.

టీవీలు, కంప్యూటర్లే టీచర్లు..
పాఠ్యపుస్తకాల్ని సీడీలుగా రూపొందించేందుకు ఏడువిభాగాల్లో పని జరిగింది. ఒక సబ్జెక్టు మొత్తాన్ని సీడీల్లో వినాలంటే ఆరుగంటలు పడుతుంది. “మొదట పాఠ్యపుస్తకంలోని పాఠాల్ని ఉపాధ్యాయులతో సంక్షిప్తంగా రాయించాము. వాటిని కంటెంట్ రైటర్స్ యానిమేషన్ చిత్రీకరణకు కావాల్సినట్లుగా మార్చుకున్నారు. యానిమేటర్లు, మీడియా ఎడిటర్లు వంటి వారంతా పనిచేశాకే పాఠ్యాంశం సీడీగా బయటికి వస్తుంది. దీన్ని మళ్లీ అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు చూపించి.. చిన్న చిన్న సవరణలు చేశాక విద్యార్థులకు అందిస్తున్నాం” అని వివరించారు సత్యనారాయణ. ఇప్పటి వరకు రూపొందించిన అన్ని పాఠాల నిడివి కలిపితే 150 గంటలు. ఇంతవరకు లక్షకు పైగా సీడీలను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు కొనుగోలు చేశాయని, ఒక్కో సబ్జెక్టు సీడీ ధర రూ.200 అని చెప్పారాయన. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రం ముప్పయి శాతం తక్కువ ధరకు అందిస్తున్నారు.
– మల్లెంపూటి ఆదినారాయణ

బాలకృష్ణుడికి మంగళ శాసనం

సింహాసనం మీద కూర్చోవాల్సిందిగా గోపికలు శ్రీకృష్ణ పరమాత్మను కోరగానే, ఆయన తన శయ్య నుంచి దిగి, శయన మందిరం నుంచి బయటికి వచ్చి, నేరుగా సింహాసనం వద్దకు వెళ్లి కూర్చున్నాడు. పరమాత్మకు ఈ పాశురం ద్వారా గోపికలు మంగళ శాసనం చేస్తున్నారు.

అన్రి వ్వులగ మళన్దాయ్ అడిపోత్తి
చ్చెన్రంగు తెన్నిల జ్లైశెత్తాయ్ తిరల్‌పోత్తి
పొన్రచ్చగడ ముదైత్తాయ్ పుగళ్‌పోత్తి
కన్రుకుణిలా ఎరిన్దాయ్ కళల్‌పోత్తి
కున్దుకుడైయా ఎడుత్తాయ్ గుణమ్ పోత్తి
వెన్రు పగైకెడుక్కుయే విన్‌కైయిల్ వేల్ పోత్తి
ఎన్రెన్రున్ శేవగమ్ యేత్తిప్పరై కొళ్వాన్
ఇన్రియామ్ వన్దోమ్ ఇరంగేలోరెమ్బావాయ్!!

ప్రేమానురాగ స్వరూపులైన గోపికలు శ్రీకృష్ణ పరమాత్మ శయన మందిరం నుంచి బయటికి రాగానే ఆయనను చూసి, ఆయన సుకుమారమైన పాదాలు ఎంత కందిపోయాయో, ఎంత కఠినాత్ములమో అని ప్రేమతో బాధపడ్డారట. ఇది జ్ఞానదశ. తరువాత వచ్చేదే ప్రేమ దశ. స్వామికి మంగళం కలగాలని ప్రార్థిస్తున్నారు గోపికలు. “ఆనాడు వామనావతారంలో త్రిలోక రాజ్యాన్ని బలి చక్రవర్తి నుంచి దానంగా గ్రహించి, నీ సుకుమారమైన పాదపద్మాలతో భూమిని కొలిచావే! అటువంటి నీ పాద పద్మాలకు మంగళం!” అని ప్రార్థించారు.
ఇక్కడ బలి అంటే అహంకారం. ఆ ఆహంకారాన్ని తొలగించేది సర్వేశ్వరుడి శ్రీచరణాలే. రామావతారంలో దక్షిణ దిక్కుగా ఉండే లంకకు నడచి వెళ్లి, తన భార్య సీతను అపహరించిన రావణాసురుడిని చంపి, లంకను ధ్వంసం చేసిన వీరుడికి మంగళశాసనం చేస్తున్నారు గోపికలు. ఇక్కడ లంక అంటే శరీరం. మనసే రావణుడు. రావణుడి పది తలలే ఇంద్రియాలు. బాలకృష్ణుడు పుట్టిన మూడో నెలలలో, కావలి బండిని ఆవేశించి వచ్చిన శత్రువు శకటాసురుడు. “వాడిని తన్ని, శకుటాసుర భంజనం చేసిన నీ పాదాలకు మంగళమయ్యా!” అంటున్నారు గోపికలు.

ఈ శరీరమే ఓ బండి. ఈ బండికి ఉన్న రెండు చక్రాలే కర్మలు.
వత్సాసురుడనే రాక్షసుడు దూడలో ప్రవేశించి శ్రీకృష్ణుడిని సంహరించడానికి వచ్చాడు. అయితే బాలకృష్ణుడు ఆ దూడ కాళ్లను పట్టుకుని, వెలగపండ్ల చెట్టును ఆవేశించి ఉన్న కపిత్థాసురుడనే మరో రాక్షసుడిపై దూడను విసిరేయడంతో ఆ ఇద్దరూ ఒకేసారి చనిపోయారు. “ఒక పాదాన్ని ముందుకు వేసి, మరో పాదాన్ని వెనక్కు వేసి, రాక్షసుడిని చంపిన నీ పాదాలకు మంగళమయా!” అని అంటున్నారు గోపికలు. “అనుకూలుడైన ఇంద్రుడు ప్రతికూలుడైపోయి, రాళ్ల వర్షం కురిపించినప్పుడు, గోవర్ధన పర్వతాన్ని గొడుగుగా ఎత్తి, ఏడు రాత్రిళ్లు గోవులను, గోపాలురను కాపాడిన స్వామీ! నీకు మంగళమయ్యా!” అంటున్నారు గోపికలు. “ఎప్పుడూ శత్రువులను సంహరించే నీ చేతిలోని వేలాయుధానికి మంగళమయ్యా” అని గోపికలు ప్రార్థిస్తున్నారు.
ఈ విధంగా నీ కల్యాణ గుణాలకు మంగళ శాసనం చేసుకుంటూ, కైంకర్యమనే పురుషార్థం కోసం నీ దగ్గరకు వచ్చామయ్యా! నీ కృపే మాకు శరణం” అని గోపికలు ప్రార్థిస్తున్నారు.
– వివరణ, చిత్రం: డాక్టర్ చెలికాని మురళీకృష్ణారావు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.