ఆమె ముఖ వైవిధ్యం అనంతం – ఫవాద్ త మ్‌కానత్

 

అక్షరాల్ని అందంగా రాయడంతో మొదలైన కళా దృష్టి ఆయన్నొక చిత్రకారుడిగా తీర్చిదిద్దింది. ఆ తర్వాత స్త్రీ ముఖ వైవిధ్యాల్ని చిత్రించే దిశగా ఆయన ప్రయాణం సాగిపోయింది. పుట్ట్టి పెరిగిన హైదరాబాద్ ఆయనకు మినీ వరల్డ్‌గా కనిపించి ఏళ్ల పర్యంతం ఆ నగర సంస్కృతిని ప్రతిఫలించే పెయింటింగ్స్‌నే వేసేలా చేసింది. దేశదేశాల్లో అపారమైన పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న ఆ చిత్రకారుడు ఫవాద్ త మ్‌కానత్ . తన మార్గాన తాను వెళ్లిపోకుండా ఎంతో మంది యువ చిత్రకారులకు మార్గదర్శకంగా నిలిచారాయన. నేడు హైదరాబాద్‌లో మొదలవుతున్న ‘తమ్‌కానత్’ ఆర్ట్ గ్యాలరీ కూడా యువచిత్రకారులకు స్ఫూర్తి నివ్వడం కోసమే. ఐదు దశాబ్దాల జీవన ప్రస్థానంలో ఫవాద్ తమ్‌కానత్‌కు ఎదురైన కొన్ని సంఘటనలే ఈ వారం ‘అనుభవం’

నాన్నగారు షాజ్ ‘తమ్‌కానత్’ కవి కావడం వల్ల బేగం అక్తర్, మెహదీ హసన్, గులామ్ అలీ వంటి ప్రసిద్ధ గాయనీ గాయకులంతా తరుచూ మా ఇంటికి వచ్చేవారు. అలాగే, జానెసార్ అక్తర్ తన కొడుకు జావేద్ అక్తర్‌తో కలిసి ఇంటికి వచ్చేవారు. నాన్న గారి పేరులోని ‘త మ్‌కానత్’ (ఆత్మగౌరవం) ఆయన కలం పేరు. దాన్నే నేను కొనసాగించాను. ఇప్పుడు ఆ కలం పేరునే నా గ్యాలరీకి పెట్టుకున్నాను. మా ఇంట్లో ఎప్పుడూ శాస్త్రీయ సంగీతమో, గజళ్లో వినిపిస్తూనే ఉండేవి. ఇంట్లో ఇంత కవిత్వం, సంగీత వాతావారణం ఉన్నా నా మనసు మాత్రం బాల్యంలోనే చిత్రకళ పట్ల ఆకర్షితమయ్యింది. పాఠం చెబుతూ టీచర్లు బోర్డు మీద ఏమైనా రాస్తే, ఆ అక్షరాలను మరింత అందంగా ఎలా రాయవచ్చో ఆలోచించే వాణ్నే తప్ప వాళ్లు చెప్పే పాఠంలోకి నా మనసు వెళ్లేది కాదు. ఎప్పుడైనా విషయాన్ని అర్థం చేసుకునేందుకు సిద్ధమైనా అప్పటికే ఆ అక్షరాలను టీచర్ తుడిచేసి ఉండేవారు. ఏమైనా పరీక్షల్లో నాకు తక్కువ మార్కులే వచ్చేవి. అయితే అతి కష్టం మీద ఫెయిల్ అవకుండా మాత్రం జాగ్రత్త పడేవాణ్ని.

నేను ఐదో తరగతికి వచ్చేనాటికి నాన్నగారు చిత్రకళ పట్ల నాకున్న ఆసక్తిని గుర్తించారు. దాన్ని ప్రోత్సహించేందుకు ఆయన ప్రసిద్ధ చిత్రకారుల పెయింటింగ్ బుక్స్ తెచ్చి ఇచ్చేవారు. పెయింటింగ్ నేర్చుకుంటే నేర్చుకో గానీ, దానికి తోడు ఏదో ఒక మౌలిక విద్యను అభ్యసించడం తప్పనిసరి అనేవారు. ఆ మాట మీద అయిష్టంగానే నేను బి. కామ్‌లో చేరాను. అప్పట్లో కామర్స్ చదవడం చికాకుగానే అనిపించేది. రెండు పరస్పర విరుద్ధమైన సబ్జెక్ట్‌లలో తల దూర్చినట్లుండేది. అయితే, పెయింటింగ్స్ తాలూకు వర్తకానికి సంబంధించిన పలు సత్యాల్ని నాకు ఆ సబ్జెక్టే నేర్పింది. క ళాత్మకమైన సామర్థ్యం ఉండి కూడా వాటి అమ్మకాలకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల ఎంతో మంది కళాకారులు కష్టాల పాలయ్యారు. ఎంతో సృజనాత్మక శక్తి ఉండి కూడా ఆర్థిక అవసరాల రీత్యా వేరే రంగాల్లోకి జారిపోయారు. నా మట్టుకు నాకు నాన్నగారు ఆ చదువు వైపు మళ్లించడం నచ్చకపోయినా, అది నాకు ఎంత మేలు చేసిందో కదా అని తర్వాత అనిపించింది. పరస్పర విరుద్ధంగా అనిపించే కొన్ని అంశాల మధ్య పైకి కనిపించని ఒక అంతస్సంబంధం కూడా ఉందన్న సత్యం దీనివల్లే తెలిసింది.

ఆకర్షణతో మొదలైనా…
నా జీవితానికి ఒక మూలస్థంభంగా ఉంటారనుకున్న మా నాన్న తన 50వ ఏట హఠాన్మరణానికి గురయ్యారు. అప్పటికి నాకు 24 ఏళ్లు ఉంటాయేమో. ఆయన మరణం నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది. మేము ఆరుగురం అన్నదమ్ములం. నేను రెండవ వాణ్ని. బాధ్యతలు పెద్దవే. అందుకే డిగ్రీ కాగానే ఒక బాలికల కళాశాలలో పెయింటింగ్ టీచర్‌గా చేరాను. నిజానికి ఆ ఉద్యోగం ఓ నాలుగు మాసాలు చేసి మానేద్దామనుకున్నాను. కానీ, కదలకుండా అక్కడే నాలుగే ళ్లు పనిచేశాను. ఒక్కో అమ్మాయి ముఖంలోని వైవిధ్యాన్ని నిశితంగా గమనిస్తూ ఉండడమే అందుకు కారణం. నన్ను కదిలించిన ప్రతి రూపం ఆ తర్వాత నా చేతిలో ఒక పెయింటింగ్‌గా మారిపోయేది. నేనేదో కేవలం ఆ కాలేజ్ అమ్మాయిల్ని గమనించడానికే పరిమితమయ్యానని కాదు. వాళ్లను గమనించడం అన్నది లోకమంతా విస్తరించి ఉన్న స్త్రీముఖ వైవిధ్యాన్ని గ మనించడానికి నాంది పలికింది. ముందు నగరపు అమ్మాయిలు, ఆ తర్వాత పల్లె అమ్మాయిలు, స్కూలు మానేసిన అమ్మాయిలు, కాలేజ్ మానేసిన అమ్మాయిలకే పరిమితమైన నా పెయింటింగ్స్ క్రమంగా ఆ ఎల్లలు దాటాయి. 1996లో తొలిసారిగా నా పెయింటింగ్స్‌ను గ్యాలరీలో ప్రదర్శనకు పెట్టినప్పుడు వీక్షకుల అపారమైన స్పందన చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పటిదాకా అప్పుడో ఇప్పుడో పురుషుల పెయింటింగ్స్ కూడా వేసే నేను ఆ తర్వాత పూర్తిగా కొన్నేళ్ల పాటు కేవలం స్త్రీల పెయింటింగ్స్ వేస్తూ ఉండిపోయాను. మొదట్లో ‘స్త్రీ ఆకర్షణ’ అంటూ గొణుక్కున్న వాళ్లంతా నా దృష్టి అంత కన్నా విస్తృతమైన విషయంలోకి వెళ్లిందని గ్రహించారు. నా దృష్టిలో స్త్రీత్వం అన్నది ఎంత చిత్రించినా తరగని ఒక అనంతమైన ఇతివృత్తం.

రిక్షా అమ్మాయి బొమ్మ
నేను కళ్లు తెరిచిందీ నా దృష్టి విస్తృతమయ్యిందీ హైదరాబాద్‌లోనే. ప్రపంచ దే శాలు ఎన్ని తిరిగినా నా బలమైన అనుబంధమంతా హైదరాబాద్‌తోనే. వివిధ భాషీయులు, విభిన్నమైన సంస్కృతులు.. ఎవరో అన్నట్లు ఇప్పుడిది మినీ ఇండియా కూడా కాదు, నా దృష్టిలో ఇది మినీ వరల్డ్. అందుకే గత ఏడేళ్లుగా నేను హైదరాబాద్‌లోని వివిధ అంశాలను చిత్రిస్తూ వస్తున్నాను. ఇక్కడ కనిపించే ప్రతి దృశ్యం నన్ను ఏదో ఒక పెయింటింగ్ వేసేందుకు ప్రేరేపిస్తూ ఉంటుంది. భాషా సంస్కృతుల భిన్నత్వాలే కాదు. ఎన్నో దుర్భరమైన జీవితాలకు కూడా ఇది వేదికగా ఉంది. ఒకసారి రిక్షాలో చెత్తనింపుకుని వెళుతున్న 13 ఏళ్ల అమ్మాయిని చూశాను. చెత్తతో నిండుగా ఉన్న ఆ రిక్షాను తన శక్తినంతా కూడగ ట్టుకుని లాక్కుపోతోంది. ఎంతో అనివార్య పరిస్థితులు ఉంటే తప్ప ఆ వయసులో అంతటి భారాన్ని ఎవరూ ఈడ్చుకుపోలేరు. రోజుకు ఆ అమ్మాయి ఆదాయమెంత? ఏం తింటుంది? ఎక్కడ ఉంటుంది? ఆ అమ్మాయి నిస్సహాయ పరిస్థితులేమిటి? ఈ వివరాల కోసం ఒక రోజంతా ఆమెను వెన్నంటి 15 కిలోమీటర్ల దాకా నడుస్తూ ఆ అమ్మాయి కంటపడకుండా కొన్ని ఫోటోలు తీశాను. చెత్త కుండీలోకి దిగుతున్నప్పుడు ఏదో ఒక లోయలోకి దిగడం కోసం సర్వసన్నద్దమైనట్లు కనిపించేది. ఎంత దుర్గంధం వేసినా, ముఖం మీద ఎన్ని ఈగలు వాలినా ఆ అమ్మాయికి వాటి ధ్యాసే లేదు. ఆ పని ఆ అమ్మాయికి ఎక్కడా త లవంచుకోవాల్సిన విషయంగా అనిపించడం లేదు. తను చేస్తున్న పని మిగతా అందరూ చేసే ఉద్యోగాల్లాంటిదే అన్న భావనే ఉంది తనలో. ఆ అమ్మాయిని చూసినప్పుడు కఠోరమైన జీవన భారం ఎంత కష్టాన్నయినా సహించేలా చేస్తుందేమో అనిపించింది. ఆ తర్వాత ఆ అమ్మాయిని ఒక ఐదు అడుగుల పెద్ద పెయింటింగ్‌గా వేశాను. అది ఎంతో మంది మేధావి గణాన్ని నిశ్చేష్టంగా నిలబడేలా చేసింది. అందులో నా ప్రతిభ ఎంత ఉన్నా, ఆ అమ్మాయి జీవితంలోని అగాధాలే వాళ్లనలా కట్టివేశాయని నేననుకుంటాను.

ముందు జనంలోకి వె ళ్లాలి
నేను పెయింటింగ్స్ వేయడం ప్రారంభించిన తొలిరోజుల్లోనే నా దృష్టి ఎందుకో పెద్ద గ్యాలరీల వైపే వెళ్లేది. నేనొకసారి ఢిల్లీలోని బాగా పేరున్న దోభీమల్ ఆర్ట్ గ్యాలరీకి వెళ్లి నా పెయింటింగ్స్ చూపించాను. నా పెయింటింగ్స్‌ను పరిశీలించిన ఒక మహిళ ఒక్కో పెయింటింగ్‌ను 5 వందల చొప్పున తీసుకుంటామంది. ఆ గ్యాలరీలో నా పెయింటింగ్స్‌కు స్థానం లభించాలని తప్ప వాటికి ఎంత డబ్బు వస్తుందన్న లెక్కలు నా మనసులో లేవు. అందుకే ఆమె ప్రతిపాదనకు సరేనన్నాను. వాళ్లు నా 14 పెయింటింగ్స్‌కు 7 వేల రూపాయలు ఇచ్చారు. ఆ తరువాత కొన్ని సంవత్సరాలు గడిచాక నేను ఒక పెయింటింగ్స్ క్యాటలాగ్ చూస్తుంటే అందులో నేను వేసిన పెయింటింగ్ ఒకటి లక్షరూపాయలకు అమ్మకం అయినట్లు ఉంది. అలాగే నేను 5 వేలకు అమ్మిన ఒక పెయింటింగ్ ఆ తర్వాత 7 లక్షలకు అమ్ముడు పోయింది. అప్పటికి అది భారీ నష్టంగానే అనిపించినా పెద్ద గ్యాలరీలకు అమ్మాలనే నా నిర్ణయం సరియైనదేనని ఆ తర్వాత ఎన్నోసార్లు రుజువయ్యింది. నీ వర్క్‌కు తగిన డబ్బు రావడం అన్నది ఆ తర్వాత అదే జరుగుతుంది. అంతకన్నా ముందు నీ సృజన విస్తృతంగా జనం వద్దకు వెళ్లాలి. ఎక్కువ మంది చూడాలి. ముందే డబ్బుల లెక్కలు వేసుకుంటే ఎవరికీ తెలియకుండా జీవితమంతా బిక్కుబిక్కుమని ఒక మూలన పడాల్సి వస్తుంది. నా తరువాత తరం వాళ్లందరికీ ఇదే చెబుతుంటాను. తొలిరోజుల్లో కొంత రాజీ పడక తప్పకపోవ చ్చు. కానీ, ఆ రాజీయే మనల్ని ఒక సమున్నత స్థానంలో నిలబెట్టడానికి ఊతంగా మారుతుందనేది నాకు అర్థమైంది.

నీ మార్గాన్ని నువ్వే నమ్మకపోతే…
ఒకసారి పెయింటింగ్ గ్యాలరీ కోసం బనారస్ వెళ్లాను. దాదాపు ఏడు రోజుల పాటు అక్కడున్న నదీతీర ప్రాంతాలు చూస్తూ గడిపాను. మిగ తా వ్యక్తులతో పాటు అక్కడ సాధువులు కూడా పెద్ద సంఖ్యలో కనిపించే వారు. నాతో పాటు వచ్చిన అక్కడి స్థానీయులు ఒక రోజు నన్ను ఒక సాధువుకు పరిచయం చేశారు. ఆ సాధువు చేతిలో ఒక త్రిశూలం ఉంది తప్ప ఆయన ఒంటి మీద దుస్తులు లేవు. పూర్తిగా నగ్నంగా ఉన్నాడు. ఆయనో పెద్ద స్కాలర్ అంటూ నాకు వివరించారు. ఎందరెందరో భక్తులు ఆయన పాదాలకు నమస్కరించి పక్కకు జరుగుతున్నారు. నేను దూరంగా నిలుచుని అతన్ని గమనిస్తూ ఉండిపోయాను. నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే, ఆ సాధువు నిలువెల్లా దుస్తులు ధరించిన భావనతోనే ఉన్నాడు. ఆయన ముఖంలో ఎక్కడా తాను నగ్నంగా ఉన్నానన్న ఏ చిన్న సంకోచమూ లేదు. తన జీవన శైలి నూటికి నూరు పాళ్లూ సరైనదే నన్న భావనతోనే ఆయన ఉన్నాడు. ఆ సాధువు నాతో మాట్లాడిందేమీ లేదు. కానీ, మౌనంగానే అయినా నాకు ఎన్నో విషయాలు చెప్పాడ నిపించింది. నగ్నంగా ఉండడం అన్నది ఇక్కడ విషయం కాదు. తాను నమ్మిన సూత్రం మీద ఎంతటి విశ్వాసమో లేకపోతే, అలా జీవించడం సాధ్యం కాదనిపించింది. బొమ్మలు వేసుకుంటూ గడపడం ఏం జీవితం లేవయ్యా అనగానే రంగుల్ని కుంచెల్ని ఆవల పారేసి వాటి జాడ కూడా కనిపించనంత దూరానికి పారిపోయిన వాళ్లు నాకెంతో మంది తెలుసు, ఆ విషయం గురించి ఏమీ తెలియని వాళ్లు ఏమైనా మాట్లాడవచ్చు. కాని ఆ విషయం గురించి తెలిసిన నువ్వేమైపోయావన్నది కదా ప్రశ్న. అలాంటి ప్రశ్నల కోసం నాలో పుట్టిన సమాధానాలే నన్ను నిలబెట్టాయి. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు అవే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి.

ప్రతిభే ప్రమాణంగా..
ఆర్ట్ గ్యాలరీల్లో సాధారణంగా అమ్మకానికి యోగ్యంగా, ఎక్కువ ధర పలికేవిగా ఉన్న పెయింటింగ్స్‌నే ప్రదర్శిస్తూ ఉంటారు. అయితే అమ్మకాల విషయంలో గ్యాలరీ నిర్వాహకుల కొలమానాలే అన్నిసార్లు సరియైనవి కాకపోవచ్చు. పైగా చాలా సార్లు అప్పటికే బాగా పేరున్న చిత్రకారుడి పెయింటింగ్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. పేరు ప్రఖ్యాతులతో సంబంధం లేకుండా కేవలం పెయింటింగ్ గొప్పతనం వల్ల కూడా అమ్మకాలు ఉంటాయన్న విషయాన్ని వారు గుర్తించరు. అందుకే నవతరం చిత్రకారులకు కూడా స్థానం కల్పించేందుకు ఈ కొత్త గ్యాలరీని ఏర్పాటు చేశాను. ఇందులో లక్ష్మాగౌడ్, వైకుంఠం, కవితా దేవస్కర్ వంటి తొలితరం చిత్రకారుల పెయింటింగ్స్‌తో పాటు సచిన్ జల్తారే, రమేష్ గోర్జల, సాజిద్‌బిన్ అమర్, రాజేశ్వరరావు వంటి తరువాతి తరాల వారి పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అలాగే సరస్వతి, కంది నర్సింహులు, అక్బర్ మహమ్మద్ వంటి యువచిత్రకారుల పెయింటింగ్సూ ఉన్నాయి. పెద్దగా పేరు లేని మరెంతో మంది యువచిత్రకారుల పెయింటింగులకు కూడా ఇందులో సమాన స్థానం కల్పించాం. ప్రతిభకు ప్రధమ ప్రాధాన్యతనిచ్చే గ్యాలరీలు రావాలనే యువతరం ఆశలకూ, ఆకాంక్షలకూ ఇది ఒక ప్రతిరూపంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.