
గోపికలు పరై, అంటే కైంకర్యం ఇవ్వాల్సిందని పరమాత్మను కోరగానే ఆయన, “ఈ నోము మొదలు పెట్టినప్పటి నుంచి పరై, పరై అంటున్నారు. ఈ పరై అంటే అర్థమేమిటి? ఈ నోము అర్థం ఏంటి? ఈ నోమును ఇంతకు ముందు ఎవరైనా ఆచరించారా?” అని శ్రీకృష్ణ పరమాత్మ ఆ గోపికల్ని అడిగాడు.
మాలే మణివణ్ణా మార్గళి నీరాడువాన్
మేలైయార్ శెయ్యనగళ్ వే ర్డు వన కేట్టియేల్
ఇలత్తై యెల్లామ్ నడుంగ మురల్వన
పాలన్న వణ్ణత్తు ఉన్ పాంగిన్నియమే
పోల్వన శంగంగళ్ పోయ్‌ప్పాడు డైయనవే
శాలప్పెరుమ్ పరైయే పల్లాణ్దిశెప్పారే
కోల విళక్కే కొడియే వితానమే
ఆలి నిలైయాయ్ ఆరువేలేరెమ్బాయాయ్!!
శ్రీకృష్ణ పరమాత్మ ప్రశ్నలకు గోపికలు వివరంగా సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. “వ్యామోహం కలవాడా! నీల రత్మం వంటి శరీర ఛాయ కలవాడా!” అని సంబోధిస్తున్నారు ఆయనను గోపికలు. శ్రీకృష్ణ పరమాత్మను ఆశ్రయించి వచ్చినవారి వ్యామోహం కంటే, మన పట్ల ఆయనకు ఎన్నో రెట్లు వ్యామోహం ఉంటుందట. ఈ గోపికలంతా స్వామి దగ్గరకు రాగలిగారు. వచ్చి నిద్ర లేపగలిగారు. కానీ, స్వామికి వీరంటే వ్యామోహం. అందుకే ఆయన వీళ్లు వచ్చి నిద్ర లేపే వరకూ లేవలేదట! అందువల్లే వీళ్లు మాలే అనే మాటను ఉపయోగించారు.
“మార్గశిర మాసంలో స్నానం చేయడానికి వచ్చామయ్యా! నీ కైంకర్యం కోసం, నీ గుణానుభవం కోసం ఈ నోమును మా పెద్దలు చేశారు. నీ పాదపద్మాలను శరణు కోరిన భాగవతోత్తముల్ని లేపి, నీ వద్దకు వచ్చాం. కైంకర్యమనే పురుషార్థం కోసమే ఈ నోము చేస్తున్నాం” అని వీళ్లంతా ప్రార్థించారు. ఈ నోము చేయడానికి ఏయే ఉపకరణాలు కావాలో గోపికలు ఆయనకు వివరిస్తున్నారు. “మేమంతా కలిసి స్నానం చేయడానికి యమునా నది దగ్గరకు వెడుతున్నాం. మేమంతా బయలు దేరేముందు అందరికీ తెలియడానికి వీలుగా శంఖ ధ్వని ఉంటుంది. ఈ భూమండలమంతా వణికిపోయేటట్టు, కంపించేటట్టు శబ్దం చేసే శంఖం కావాల్సి ఉంటుంది. నీ పాంచజన్యం లాగా తెల్లగా పాలలాగా ఉండే శంఖం ఉంటే మంచిది. ఇంకా, చాలా విశాలంగా ఉండే మద్దెల కావాల్సి ఉంటుంది. మా గోష్టికి మంగళ శాసనం చేసేవారు కూడా కావాలి కాబట్టి, మంగళం పాడేవారిని ఇవ్వు స్వామీ! చీకటిలో యమునా నదికి వెడతాం కనుక మంచి దీపం కావాలి. ఇక ఫలానా వారి గోష్టికి వెడుతున్నామనే సంగతి అందరికీ తెలియాలి కాబట్టి ధ్వజం కావాలి. మా మీద మంచు పడకుండా వితానం (చాందిని) కావాలి” అని గోపికలు శ్రీకృష్ణ పరమాత్ముడికి నివేదించుకున్నారు.
“మీరు చాలా గొప్పవి అడుగుతున్నారే!” అని పరమాత్మ అన్నాడు. “చిన్ని బొజ్జలో పద్నాలుగు లోకాలనూ పెట్టుకుని, మర్రి ఆకు మీద పవళించిన నువ్వు ఘటనాఘటన సమర్థుడివి. నీకు అసాధ్యం ఉందా స్వామీ! మాపై దయతో ఈ వస్తువులన్నీ అనుగ్రహించు.” అని గోపికలు పరమాత్మను అనేక విధాలుగా ప్రార్థించారు. ఇక్కడ స్నానమంటే, భగవత్ అనుగ్రహంలో మునిగిపోవడం. శంఖమంటే ‘ఓం’ అనే ప్రణవం. ‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మహా మంత్రంలో చెప్పిన అర్థ పంచక జ్ఞానం. పరై అంటే కైంకర్యం. మంగళం పాడేవారంటే భాగవతోత్తములు. మంగళ దీపమంటే లక్ష్మీదేవి. ధ్వజమంటే సూచకం. ఇది ఫలానా వ్రతం చేసేవారు వస్తున్నారని తెలియజేస్తుంది (గరుత్మంతుడే ధ్వజం). చాందిని అంటే ఆదిశేషుడు.
– వివరణ, చిత్రంః డాక్టర్ చెలికాని మురళీకృష్ణారావు
94400 09535

