నా దారి తీరు -69
అమ్మ మరణం
బి.పి.తో అమ్మ బాధ పడుతూనే ఉంది .కుమారస్వామి డాక్టర్ వద్ద మందులు తీసుకొంటూనే ఉంది ఆయనా అవసరం వస్తే ఇంటికి వచ్చి చూసి వెడుతున్నాడు .ఆవిడ భారం అంతా ఆయన మీదే పెట్టాను .ఆయనా చాలా జాగ్రత్త గా చూస్తున్నాడు .మంచి మందులే ఇస్తున్నాడు .కాని యెంత కాలం చూసినా తగ్గటం లేదు .అమ్మ కు ఆయాసం కూడా ఉంది చలికాలం లో బాగా ఎక్కువగా ఉండి ఇబ్బంది పెడుతుంది .చ్యవన ప్రాస వాడుతుంది .ఆవిడకు ఆహార పదార్ధాలలో కారం ఉప్పూ ఎక్కువ గా ఉండాలి .అయితే ఇప్పుడు వీటిని బాగా తగ్గించి అమ్మ కోసం ప్రభావతి విడిగా మడి గా వంట చేసి ఆవిడకు ఏవి ఇష్టమో వాటిని చేసి పెడుతోంది ఆవిడా కోడల్ని బాగా అర్ధం చేసుకొని ప్రవరిస్తోంది .ఇంకా వేరెవరైనా డాక్టర్ కు చూపిస్తానంటే అమ్మ ససేమిరా అనేది .కనుక ఇక వేరే ఆలోచన చేస్యలేదు .’’చావైనా బతుకైనా కుమారా స్వామిచేతుల్లోనే ‘’అని అమ్మ అనేది .అందుకే ఇతర ప్రయత్నాల జోలికి వెళ్ళలేదు ఆయనా మీదే భారం వేశాను .
అప్పుడు డబ్బు చేతుల్లో ఆడటం కష్టం గా ఉండేది. అమ్మ మందులు వ్యవసాయ ఖర్చులు పిల్లల చదువులు అన్నీ సర్దు కోవాలి .జీతం వస్తే వారం కూడా ఉండేది కాదు .ఖర్చు అయి పోయేది. .రోజూ సాయంత్రం బజారు నుంచి అమ్మకు ఇష్టమైన బత్తాయిలు చక్రకెళీలు కమలాలు మొదలైనవి రెండు చేతుల తో సంచీ నిండా తెచ్చి ఇంట్లో ఉన్చేవాడిని .అది చూస్తున్న పార్ధి మేస్టారి తల్లి ఏంతో ముచ్చట పడేదని, నేను అమ్మను బాగా చూసుకొంటున్నానని అందరితో చెప్పేదిట. ఒక సారి ప్రభావతి తో ఈ మాట అంటే నాకు ఎప్పుడో చెపింది.నా విధి అని నేను చేస్తున్నాను డబ్బు కు కట కట అయినా నేనెప్పుడూ బయట పడలేదు .ఏదో ఒక విధం గా సర్దు బాటు చేసుకొనే వాడిని ఒక్కొక్కప్పుడు చేతి వాడకానికి డబ్బు అవసరం అయితే పువ్వాడ సత్యం భార్య సుశీలనో, బెల్లం కొండ లక్ష్మీ నారాయణ గారి నొ బుల్లి మామ్మ నొ అడిగి చేబదులు తీసుకొని జీతం రాగానే తీర్చే వాడిని వాళ్ళూ ఏమీ అనుకోకుండా అడగ్గానే ఇచ్చేవారు అప్పుడు నా పరిస్తితి ఎవరు డబ్బు ఇస్తారా ఎవర్ని అడగాలా గా ఉండేది .ఒక్కో సారి అయిదు పది రూపాయలు కూడా చేతిలో ఆడేవికావు సుశీల లక్ష్మీ నారాయణ గారు అడగ్గానే ఇచ్చేవారు .యెంత ఇబ్బందిగా ఉండేదో చెప్పలేను మాటల్లో ..కొట్లో అప్పులు ఊర వాళ్ళ కొట్లో లేక పోతే కొల్లిపర వాళ్ళ కొట్లో మండా వీరభద్ర రావు కొట్లో ,వెంట్ర ప్రగడ వెంకటేశ్వర్లు కొట్లో అప్పులు పెరిగి పోతూ ఉండేవి జీతం లో కొంత పంటలు వచ్చిన తర్వాతా మిగిలినది తీర్చేవాడిని .వడ్డీ కి అప్పు ఎప్పుడూ తీసుకోలేదు
అమ్మ మందుల్ని మార్కెట్ దగ్గర రావి చెట్టు బజారు చివర ఉన్న అరుణా మెడికల్ స్టోర్స్ లో కొనే వాడిని .అక్కడ అప్పు పెట్టేవాడిని .ఒక పుస్తకం లో అన్నీ దాని యజమాని గణపతి రావు గారు రాసే వారు .నెల జీతం తీసుకోగానే ముందు ఇక్కడి అప్పు తీర్చే వాడిని ఆయన ఎప్పుడూ డబ్బు ఎప్పుడిస్తారు?అని అడగ లేదు .అంత మంచి వాడు .ఎప్పుడు ఎన్ని రూపాయల మందులు కావాలన్నా ఇచ్చేవారు బోణీ కాలేదనో టైం అయిన్దనో ఎన్నడూ అనలేదు .అమ్మ మందుల తో పాటు పిల్లల జబ్బులు వాటికి మందులు తడిసి మోపెడు అయ్యేవి .అయినా మౌనం గా నే తంటా లేవో నేను పాడేవాడిని .పద్మనాభం అప్పుడప్పుడు డబ్బు సర్దు తూందే వాడు .వాడి తమ్ముడు నన్ను అడిగి చేబదులు తీసుకొనే వాడు .గేదెలు పాలేళ్ళు ,పశువుల దాణా చిత్తూ తౌడుఖర్చులూ ఎక్కువే ఇవన్నీ చూడాల్సినవి పిల్లల బట్టలు ఫీజులు బట్టలఖర్చు చూదాల్సినవే .అన్నీ అలాగే సర్డుకొనే వాడిని ‘జీతాల సవరణ వలన జీతం పెరిగి కొంత ఇబ్బంది తీరింది .కోతలు ,కట్టి వేతలు ,కుప్ప నూర్పిళ్ళు కూడా నేనే చూశాను . ఇవన్నీ తప్పని ఖర్చులే .అమ్మ ఒక్కొక్క సారి ప్రభావతి తో అనేదట ‘’మా వాడు యెట్లా సంసారాన్ని లాగుతున్నాడే ?నాతో ఏమీ ఇబ్బందుల సంగతులు చెప్పడు .అన్నీ సవ్యం గా నే అమరుస్తున్నాడు ?’’అని .మనసులో అమ్మకు నేను ఎంతో ఇబ్బంది పడుతున్నానొ అని పించి ఉంటుంది .అందుకే ఇలా అన్నదేమో ?
1982 ఫిబ్రవరి 21 నాడు ఉదయం ప్రైవేట్ల పని చూసి భోజనం చేసి సైకిల్ మీద కుమారస్వామి గారి హాస్పటల్ కు వెళ్లి అమ్మ ను చూషాను అప్పటికి రెండు రోజుల క్రితమే ఒంట్లో బాగా లేదంటే అక్కడ చేర్చాము ప్రభావతి ఇంటి దగ్గర అన్నం వండి తీసుకొని వెళ్లి తిని పించి వచ్చేది.మా ఒదిన కమలమ్మ గారు అక్కడ అమ్మకు తోడుగా ఉండేది .నేను ఆ రోజు వెళ్లి నప్పుడు అమ్మ కొంచెం నీరసం గా ఉన్నా బాగానే మాట్లాడింది .’’నాకేం ఫరవాలేదు .నువ్వు స్కూల్ కు వెళ్ళు ‘’అంది .డాక్టర్ గారు కూడా ‘’కంగారేమీ లేదు .మీరు వెళ్ళండి ‘’అని భరోసా ఇచ్చారు స్కూల్ కు వెళ్లి పోయాను .మొదటి పీరియడ్ అయి పోయింది రెండో ది ప్రారంభం కాగానే డాక్టర్ గారి నర్సు స్కూల్ కు వచ్చి డాక్టర్ గారు నన్ను అర్జంట్ గా రమ్మన్నారని చెప్పింది హెడ్ మాస్టారి పర్మిషన్ తీసుకొని వెంటనే వెళ్లాను అప్పటికే పరిస్థితి విషమించింది దగ్గర కూర్చున్నాను ‘’కంగారు పడకు .ఇల్లూ పిల్లలు జాగ్రత్త ‘’అని చెప్పి కళ్ళు మూసుకోంది సునాయాస మరణం .మామయ్యా కూడా అప్పటికి అక్కడే ఉన్నాడు .అప్పుడు ఏ రకమైన వాహన సౌకర్యాలు లేవు అమ్మను రిక్షాలో పడుకో బెట్టు కొని ఇంటికి తీసుకొని వచ్చి మా సావిట్లో పడుకోబెట్టాం .ణా దుఖానికి అంటూ లేకుండా పోయింది నెల రోజులు ఏడుస్తూనే ఉన్నాను కర్మ చేస్తున్నా ఏడుపు ఆగేది కాదు అందరూ తమాయిన్చుకోమని చెప్పినా ఆగేది కాదు .తట్టుకోలేక పోయాను . అందరికి తెలిగ్రాములిచ్చాం .మర్నాడు ఉదయమే అంత్య క్రియలకు ఏర్పాటు చేశాం మామయ్యా ఇవన్నీ దగ్గరుండి చూశాడు ఆయనకు సాయం కోలాచల శ్రీ రామ మూర్తి మామయ్యా .
మోహన్ మా అక్కయ్యలిద్దరూ కూడా వచ్చారు .కార్యక్రమాలు ఏ లోపం లేకుండా నిత్య కర్మ చేశాం నేనూ మోహన్ .గోదానం తో సహా ఏదీ వదలలేదు .నా మిత్రుడు ఆదినారాయణ తో గరుడ పురాణం రోజూ చెప్పించాం .అమ్మకు ఏ లోపం లేకుండాచేశాననే అనుకొంటున్నాను .ఇది నాకు సంతృప్తి .అమ్మ ను ఇంటికి తీసుకొచ్చే సరికి ఆవుల దొడ్లో నూర్చాల్సిన మినప కాయ ,ఇల్లంతా సామాను ,గేదెలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి పాలేరు కిష్టి గాడు . ప్రైవేట్ పిల్లలు శివ మొదలైన వాళ్ళు ఎంతో సాయం చేసి అన్నీ సర్ది ఇబ్బంది లేకుండా చేశారు వాళ్ళ సాయం మరువ లేనిది చిలుకూరి కూడా వచ్చి నిలబడ్డాడు ఆదినారాయణ, నరసింహం ఇచ్చిన చేయూత మరువలేనిది .పన్నెండో రోజున స్కూల్ స్టాఫ్ అందరికి భోజనాలు ఇంటి దగ్గర ఏర్పాటు చేశాను అందరూ వచ్చారు హెడ్ మాస్టారు వెంకటేశ్వర రావు గారు ఏంటో ఓదార్చారు .భరోసాగా మాట్లాడారు వారివడ్డా నా దుఖం ఆగ లేదు అమ్మ లేక పోతే అంతా శూన్యం అని పించింది .ఆ లోటు ఎవరూ తీర్చలేనిది .ఇప్పటిదాకా తండ్రిలేని వాడిని .ఇప్పుడు తల్లి లేని వాడినైనాను .తలిదంద్రులిద్దర్నీ కోల్పోయిన అభాగ్యుదిననై పించింది .
సశేషం
మీ గబ్బిట దుర్గా ప్రసాద్ – 10-1-14- ఉయ్యూరు

