ఆ మాటే జీవన స్ఫూర్తి

 

బతికున్నప్పుడు ఏం జరిగిందో చెప్పే ఇతివృత్తాలతో వచ్చే సినిమాలు కోకొల్లలు. అయితే, అందుకు భిన్నంగా మనిషి పోయాక ఏం జరుగుతుందో చెప్పే అంశంతో సినిమా తీసి విజయవంతం చేసిన విలక్షణ దర్శకుడు చంద్రసిద్దార్థ. ఆ ఇతివృత్తంతో వచ్చిన ‘ఆ నలుగురు’ ఆయనను నిజంగా ఆకాశంలో నిలబెట్టింది. కోటానుకోట్ల తెలుగు ప్రేక్షకుల్ని ఒకసారి జీవితపు ఆవలి తీరాన్ని చూసేలా చేసింది. ఆ తర్వాత ‘అందరి బంధువయ’ వంటి సినిమాలతో అందరివాడైన ఆయన ఇప్పుడు ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’తో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుడుతున్నాడు. సుమారు పాతికేళ్ల సినీ జీవన ప్రస్థానంలో చంద్ర సిద్దార్థకు ఎదురైన సంఘటనలే ఈ వారం ‘అనుభవం’

నేను పుట్టిందీ పెరిగిందీ హైదరాబాద్‌లోనే. నాన్నగారు ఐఏఎస్‌గా రిటైర్ అయ్యారు. మేము నలుగురం అన్నదమ్ములం. నాన్న గారికి నేను ఐఏఎస్ చదవాలని ఉండేది. నా మట్టుకు నేను ఎక్కడున్నా ఒక ప్రాధాన్యత గల స్థానంలో ఉండాలని మొదటి నుంచి అనుకునే వాణ్ని. స్కూల్లో అన్నింట్లోనూ టాపర్ నే. నేను చదివిన స్కూళ్లు, కాలేజ్‌లన్నీ రాష్ట్రంలోనే ప్రధమ శ్రేణికి సంబంధించినవి. అందులో ఇంటర్ చదువుకున్న వారికి మెడిసిన్‌లోనో, ఇంజనీరింగ్‌లోనో సీటు రావడం విశేషమే కాదు. ఆ కాలేజ్‌కు సంబంధించిన ప్రతి ఒక్కడూ ఇంజనీరూ, డాక్టర్ అవుతున్నప్పుడు నే నెందుకు వీళ్లల్లో ఒకడిగా ఉండాలి? అనిపించేది. అందుకే విభిన్నంగా ఉండేందుకు విస్తృత అవకాశం ఉన్న సృజనాత్మక రంగంలోకి వెళ్లడం మేలన్న భావన నాలో అంకురించింది. ఆ సృజన కూడా కోట్ల మందికి చేరేదై ఉండాలన్నది నా కోరిక. దానికి సినిమా రంగమే సరియైన దన్న భావన నాలో ఏర్పడింది. ఏమైతేనేం రామ్‌గోపాల్ వర్మను కలవడానికి నేను 1992లో చెన్నయ్ బయల్దేరి వెళ్లాను. కళారంగంలో అప్పటి దాకా నాకు లభించిన పలు సర్టిఫికెట్లన్నీ వెంట తీసుకుని వెళ్లాను. అయితే, సరిగ్గా నేను వెళ్లిన సమయానికి ఆయన హైదరాబాద్ వచ్చేశాడు. వెంటనే తిరిగి వెళ్లాలనిపించక ఆ రెండవ రోజే మా అన్నయ్య ఫ్రెండ్ ఉప్పలపాటి నారాయణరావును కలిశాను. అప్పుడాయన ‘జైత్రయాత్ర’ సినిమా తీసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆయన నన్ను వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్‌గా తీసుకున్నాడు. మద్రాసులోని తెలుగు సినీ పరిశ్రమ మొత్తంగా హైదరాబాద్‌కు మారుతున్న సమయమది. వారికి హైదరాబాద్ పూర్తిగా కొత్త. అందుకే హైదరాబాద్ వాసినైన నేను ప్రొడక్షన్‌లో వారికి బాగా ఉపయోగపడతానని తీసుకున్నారని నాకు కొద్ది రోజుల్లోనే అర్థమైపోయింది. పైగా వ్యక్తుల్ని కొన్ని విభాగాలుగా చూసే ఆ వ్యవస్థ నాకు ఏమాత్రం నచ్చక బయటికి వచ్చేశాను. ఏ పనిమీద మనం వెళ్లామన్నదే కాదు, అనుకున్న పనిలోనే ఉన్నామా? పక్కదారి పట్టామా అన్నది కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవలసిందే. లేదంటే ఒక దశలో మనకు మనమే దక్కకుండా పోతామని నాకనిపిస్తుంది.
ఆగినా సాగిపోవడమే…
1993లో నేనే నిర్మాతగా ‘ నిఘా’ అనే సినిమా మొదలెట్టాను. అంతా గమనిస్తూ వచ్చిన నాన్నగారు ఒకరోజు ” సినిమా తీసే తెలివి తేటలు నీకు లేవు. చదువుకుని ఏదో ప్రభుత్వ ఉద్యోగం చేసుకోవడం తప్ప బతకడానికి నీకు మరో మార్గం లేదు. ఒకవేళ నీవు ఆ రంగంలోనే ఉండాలనుకుంటే మాత్రం నానుంచి ఏ రకమైన సాయాన్ని ఆశించవద్దు” అన్నారు. అయితే అంత కరాఖండి గా చె ప్పిన ఆయనే ఒక దశలో తాను ఎంతో క ష్టపడి కట్టుకున్న ఇల్లు తనఖా పెట్టి బ్యాంకు రుణం గానీ, ఫైనాన్స్‌గానీ తెచ్చుకొమ్మని చెప్పారు. ఇది నేను ఎంత మాత్రం ఊహించనిది. అయితే ‘ నిఘా’ షూటింగ్ దశలోనే ఆగిపోయింది. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యం గల ‘నిరంతరం’ తీశాను. సినిమా పూర్తయ్యింది. కొన్ని అవార్డులు కూడా వచ్చాయి కానీ, ఆ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు. ఆ త ర్వాత ‘ ఔనంటూ… కాదంటూ’ అన్న పేరుతో మరో సినిమా మొదలెట్టాను. అదీ ఆగిపోయింది. ఒక రకంగా ఇవన్నీ కాలేజ్‌నుంచి బయటికొచ్చాక ఎదుర్కొన్న వరుస పరాభవాలు. చదువుల్లో తిరుగే లేదనుకున్న వాణ్ని ఇక్కడ పలుమార్లు ఇలా చతికిలపడ్డాను. అయినా మనం తీయాల్సిన సినిమాలు ఇవి కావులే అనుకుని ‘ఇన్‌స్క్రూటబుల్ అమెరికన్స్’ అనే నవల అధారంగా ఏకంగా ఒక ఇంగ్లీషు సినిమా తీశాను. విడుదల కూడా చేశాను. కానీ, నా మనసంతా తెలుగు సినిమా మీదే ఉంది. అందుకే మళ్లీ తెలుగు సినిమాయే తీయాలనే నిర్ణయానికి వచ్చాను. మూలాలు వదిలేస్తే ఎప్పటికైనా ముప్పేనని నా మనసు మూలల్లో ఒక సత్యం ఎప్పుడూ ఘోషిస్తూ ఉంటుంది.
నేను పోతే ఏడుస్తావా?
నా స్వభావం, నా మనస్తత్వం ఎలా అనిపించేవో ఏమో గానీ, మా అమ్మమ్మ ఒకరోజు నాతో ” ఏరా! నేను చనిపోతే నువ్వసలు ఏడుస్తావా?” అంది-ఆమె ఉద్దేశంలో నేను ఆనందిస్తానని. కొద్ది క్షణాల దాకా ఆ మాటల్ని జీర్ణించుకోలేకపోయినా మెల్లమెల్లగా నాలో ఒక అంతర్మథనం మొదలయ్యింది. మనిషికి ఈ ఆలోచనెందుకు? బతికున్నంత కాలం బతుకు గురించి ఆలోచించావు బాగానే ఉంది. బతుకు ఆగిపోయాక కూడానా! తానే ఈ లోకాన్ని వదిలేసి వెళ్లిపోయిన తర్వాత ఇక ఎవరు ఏడిస్తే ఏముంది? ఎవరు నాట్యం చేస్తే ఏముంది? వాటి వల్ల చనిపోయిన వారికి ఒరిగేదే మీ ఉండదు కదా! అనే ఆలోచనలు నాలో ముప్పిరిగొన్నాయి అవి క్రమక్రమంగా విస్తృతమవుతూ వచ్చాయి. తన పరోక్షంలో ఇతరులు ఎవరేమనుకుంటారో అనేది , తాను చనిపోయాక ఏమనుకుంటారో అనేది ఈ రెండూ తెలుసుకోవాలన్నది బహుశా మానవ హృదయానికి పెద్ద కోరికేమో అనిపించింది. ఈ ఆలోచనలే ‘ ఆ నలుగురు’ సినిమా చేయడానికి మూలం. ఆ రోజు అమ్మమ్మ ఆ మాట అనకపోతే ఆ సినిమాయే లేదు. నిశితంగా గమనించాలే గానీ, ఒక చిన్న మాటలో ఒక నిండు జీవితానికి సరిపడే స్ఫూర్తి లభిస్తుందని నా కనిపిస్తుంది.
కొన్ని ఘట్టాలు అంతే….
అప్పటిదాకా నేను తీసిన సినిమాల పట్ల ఏ మాత్రం ఆసక్తి చూపని మా నాన్న ‘ఆ నలుగురు’ సినిమా తీయబోతున్నానని తెలిసి చెన్నయ్ నుంచి నాకో ఉత్తరం రాశారు. ‘ఆ పేరులోనే ఒక విజయం కనిపిస్తోంది. కెరీర్ పరంగా నువ్వు ఈ సినిమాతో సక్సెస్ అవుతావు. అవ్వాలి కూడా’ అంటూ ఆ ఉత్తరంలో తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆ ఉత్తరం నాకు ఎంతో స్పూర్తినీ, ఆనందాన్నీ ఇచ్చింది. సినిమా పూర్తయ్యింది. విడుదల తేదీని కూడా ప్రకటించాం. అప్పటికి ఎడిటింగ్ వర్క్ కొంత మిగిలింది. ఒకరోజు ఆఫీసులో ఉన్న సమయంలో ఇంటికి రమ్మంటూ కబురొచ్చింది. తీరా వెళితే నాన్నగారు గుండెపోటుతో మరణించిన వార్త నా చెవిన వేశారు. నేను తీసే సినిమా పట్ల మొదటిసారిగా ఎంతో ఆసక్తి కనబరిచిన ఆయన ఆ సినిమా చూడకుండానే వెళ్లిపోయారు. నాకు ఎప్పటికీ తీరని బాధ అది. మరుసటి రోజు ఉదయానికి గానీ నాన్న గారి శవం మద్రాసు నుంచి హైదరాబాద్‌కు చేరుకోదు. నేనింక అక్కడ ఉండలేక ఎడిటింగ్ రూమ్‌కు వచ్చాను. ఆ ఎడిటింగ్ కూడా ఆ సినిమాలోని చావు, శవయాత్రకు సంబంధించినవే. ఆ విషాదకర పరిస్థితుల్లోనూ సినిమా విడుదల చేశాను. కానీ, సినిమా హాళ్లల్లో 20 శాతం మంది కూడా లేరు. మొదటి వారం కాగానే సగానికి పైగా డబ్బాలు తిరిగి వచ్చాయి. ఎవరో కొద్దిమంది సినిమా మీది నమ్మకంతో మరో వారం రోజులు కొనసాగిద్దాం అనుకున్నారు. మాకు తెలిసిన వాళ్లల్లో ఒకరు నాన్న గారి అస్థికల్ని ఎక్కడైనా కలిపారా? అని అడిగారు. లేదని చెప్పాం. ఆయన వెంటనే ఆ పని పూర్తి చేయండి. ఇవన్నీ నేను నమ్మను గానీ, అలా కలపడం నా ధర్మం కాబట్టి వెంటనే ఒకరిద్దరు మిత్రుల్ని వెంట తీసుకుని కృష్ణానదిలో అస్థికల్ని కలిపాను. విజయవాడకు వచ్చేసరికి మార్నింగ్ షో టైమ్ అయింది. ఆ సినిమా ఆడుతున్న ఒక థియేటర్‌కు వెళితే హౌజ్‌ఫుల్‌గా నడుస్తోంది. అక్కడి నుంచి గుంటూరు వచ్చేసరికి ఫస్ట్ షో మొదలయ్యింది. అక్కడా హౌజ్‌ఫుల్. దాన్ని అస్థికల్ని కలపడానికి ఆపాదించవలసిన అవసరం లేదు. ఆ వారం వ్యవధిలో సినిమా ప్రచారం జనాల్లోకి వెళ్లడం కారణం కావచ్చు లేక డిసెంబర్ 23 కావడం చేత కాలే జ్‌లకు సెలవులు మొదలవడం కారణం కావచ్చు. ఆ కారణమంటూ ఒకటి లేకపోతే మాత్రం అన్ని థియేటర్లలోనూ సినిమా ఎత్తేసే ప్రయత్నమే జరిగేది. అలా ఆ సినిమా కూడా అపజయాల జాబితాలో చేరిపోయేది. తొందరపాటు నిర్ణయాలకు పోకుండా కొన్ని సార్లు ఈ ఆచారాలు కట్టడి చేస్తాయేమో మరి! ఏమైనా నేను అక్కడి నుంచి వచ్చేసరికి అభినందన సభలు, ప్రశంసల జల్లులు. కానీ, ప్రతి అభినందన సభ నాకు ఆనందం కన్నా, ఈ సినిమాను నాన్న గారు చూడలేకపోయారే అన్న దుఃఖాన్నే కలుగుచేసింది. కాకపోతే, ఒకటిచ్చి మరొకటి లాక్కోవడం జీవిత నైజమేమోనని నాకనిపిస్తుంది.
హృదయానికి లెక్కలా?
ఒక రోజు రాత్రి రెండు గంటల వేళ శిల్పారామం సమీపంలో నా కారు పంక్చర్ అయ్యింది. బంజారాహిల్స్‌లోని మా ఇల్లు అక్కడికి 3 కిలో మీటర్ల దూరం మించి ఉండదు. ఈ లోగా ఒక టాక్సీ వచ్చి నా కారు పక్కనే ఆగింది. అందులోంచి దిగిన డ్రైవర్ ఆ పక్కనున్న పాన్ షాప్‌కు వెళ్లి సిగరెట్లు తెచ్చుకుని హడావిడిగా కారువద్దకు వచ్చాడు. మా ఇంటిదాకా వస్తావా అంటే 200 అడిగాడు. పక్కనే కదా 100 ఇస్తానన్నాను. కుదరదు అంటూ కారుదాకా వెళ్లి వెనక్కి తిరిగి చూశాడు. ఆ కారు మీదేనా? అన్నాడు. నాదే పంక్చర్ అయింది కాబట్టి నిన్ను అడిగాను అన్నాను. మరి ఆ విషయం చెప్పరేమిటి? రిపేర్ చేస్తే హాయిగా వెళ్లిపోతారుగా అంటూనే కార్లోంచి పంక్చర్ రిపేర్ చేసే పనిముట్లన్నీ వెలికి తీశాడు. చకాచకా రిపేర్ చేసి తాగడానికి తెచ్చుకున్న మంచినీటితోనే చేతులు కడుక్కుని వెళ్లిపోబోయాడు. ‘ఒక్క నిమిషం’ అన్నాను. వెనక్కి తిరిగి చూడగానే అతని జేబులో 5 వందల నోటు కుక్కాను. ఎంత ఇచ్చానో కూడా చూడకుండా అతడు కారు స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. అతడేమిటో నాకర్థం కాలేదు. బహుశా అతనికి నేనూ అర్థం కాకపోయి ఉండవచ్చు. 100 రూపాయలకు బేరమాడిన నేను 500 రూపాయలు ఇవ్వడం ఒక రకం వింత అయితే టాక్సీ విషయంలో అంత నిక్కచ్చిగా ఉన్నవాడు 100 రూపాయలకు పైనే పని చేసిపెట్టి కూడా ఏమీ అడక్కుండానే వెళ్లిపోబోయాడు. ఆలోచిస్తే మెదళ్లకు ఉండే లెక్కలు హృదయాలకు ఉండవేమో అనిపించింది.
ఏమో..! గుర్రం ఎగరావచ్చు
ఆశావహదృక్పథం ఉంటే ఎంతటి అవరోధాన్నయినా అధిగమించవచ్చుననే ఇతివృత్తంతో తీసిందే ‘ఏమో..! గుర్రం ఎగరా వచ్చు’. ఇంతకు ముందు నేను తీసిన సినిమాల్లోని దృశ్యాలన్నీ నేను చెప్పాలనుకున్న ప్రధాన అంశం వైపు నడిపించేవిగానే ఉండేవి. ఇందులోనూ అలా కొన్ని దృశ్యాలు ఉన్నా, ఆ ప్రధాన అంశంతో సంబం«ధం లేకుండా కూడా కొన్ని దృశ్యాలు ఉంటాయి. మనం వెళుతున్న దారిలో మనకు కావలసినవి మాత్రమే ఎదురవవని చెప్పదలుచుకున్నా! ఈ కథా గమనం నిజజీవితానికి బాగా దగ్గరగా ఉంటుందనేది వాస్తవం. పూర్తి ఆశావహ దృక్పథంతో ఉండే కథానాయకుడి మనస్తత్వం వల్ల అసాధ్యమనుకున్నవన్నీ సాధ్యమవుతూ ఉంటాయి. నిరాశావాది ముందు కోటి దీపాలు వెలిగించినా అవి కటికచీకట్లో కలిసిపోతాయి. ఆశావాది ముందు వెలిగించిన ఒక్క దీపమే కోటి కాంతులు విరజిమ్ముతుంది. ఈ సత్యమే ఆ సినిమాకు ప్రాణం. నా ప్రాణం కూడా ఆ సత్యమే.

“ప్రతి అభినందన సభ నాకు ఆనందం కన్నా, ఈ సినిమాను నాన్న గారు చూడలేకపోయారే అన్న దుఃఖాన్నే కలుగుచేసింది. కాకపోతే, ఒకటిచ్చి మరొకటి లాక్కోవడం జీవిత నైజమేమోనని నాకనిపిస్తుంది”

“ఆ రోజు అమ్మమ్మ ఆ మాట అనకపోతే ఆ సినిమాయే లేదు. నిశితంగా గమనించాలే గానీ, ఒక చిన్న మాటలో ఒక నిండు జీవితానికి సరిపడే స్ఫూర్తి లభిస్తుందని నా కనిపిస్తుంది”

“ఏ పనిమీద మనం వెళ్లామన్నదే కాదు, అనుకున్న పనిలోనే ఉన్నామా? పక్కదారి పట్టామా అన్నది కూడా ఎప్పటికప్పుడు పరిశీలించుకోవలసిందే. లేదంటే ఒక దశలో మనకు మనమే దక్కకుండా పోతామని నాకనిపిస్తుంది”
-బమ్మెర

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సేకరణలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.