అమెరికా చేరిన మొదటి హిందూ మహిళా డాక్టర్ –ఆనందీ బాయ్ జోషి
కాదంబినీ గంగూలీతో బాటు మొదటి సారిగా వైద్య పట్టా పొందిన మొదటి తరం మహిళా డాక్టర్ ఆనందీ బాయ్ జోషి .అమెరికా చేరిన తొలి హిందూ మహిళా డాక్టర్ కూడా .1865 మార్చి 31న మహా రాష్ట్ర లోని పూనా లో జన్మించింది .ఆమెది సంపన్న సంప్రాదాయ బ్రాహ్మణ కుటుంబం .చిన్నతనం లో యమున అని ముద్దుగా పిలిచేవారు తొమ్మిదవ ఏట నే గోపాల రావు జోషి తో కుటుంబం లోని వారు ఆమెకు వివాహం జరిపించారు .వివాహం తర్వాత భర్త యమున పేరు ను ఆనంది గా మార్చాడు .కళ్యాన్ లో పోస్టల్ గుమాస్తాగా పని చేసి ఆలీబెగ్ కు మారి, కలకత్తాకు వెళ్ళాడు .అభ్యుదయ భావాలున్నవాడు అవటం తో భార్యను అన్నివిధాలా ప్రోత్సహించాడు .స్త్రీ కి విద్య అవసరం అని భావించేవాడు .ఆ కాలం లో అందరూ సంస్కృతాన్ని చదివితే గోపాల రావు ఇంగ్లీష్ ప్రాధాన్యతను గుర్తించి ,ఆనందికి ఉన్న అభిరుచిని తెలుసుకొని ఆమె ఆంగ్ల విద్యాభ్యాసానికి ఏంతో సహకరించాడు
![]()
.
పద్నాలుగవ ఏటనే ఒక మగ పిల్లవాడికి జన్మ నిచ్చింది ఆనంది .అవసరమైన మందులు లభ్యం కానందున పది రోజులకే ఆ పసి వాడు చని పోయాడు .ఈ సంఘటన తో ఆమె కు డాక్టర్ అవాలనే బల మైన కోరిక కలిగింది .ఆమె అభిలాష ను తెలియ జేస్తూ అమెరికా లోనిప్రసిద్ధ మిషనరీ రాయల్ వైల్డర్ కు జాబు రాశాడు . క్రిస్టియన్ మతం తీసుకొంటే తప్పక సహాయం చేస్తానని ఆయన జవాబు రాశాడు. ఇది దంపతులకు ఏమాత్రమూ ఇష్టం లేదు .వైల్డర్ తన పత్రిక లో వీరితో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలను ప్రచురించేవాడు .దీన్ని జెర్సీ లోని రోసేల్లాలో ఉండే థియోడికా కార్పెంటర్ చదివటం జరిగింది .భర్త జోషి భార్య ఆనందికి మెడిసిన్ చదవటానికి ఇస్తున్న ప్రోత్సాహం చదివి కార్పెంటర్ అబ్బురపడి ఆమె అమెరికా వస్తే వసతి వగైరా సౌకర్యాలను తాను ఏర్పాటు చేస్తానని జాబురాయటమూ జరిగిపోయాయి .అనేక జాబుల్లో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ఆనంది థియోడికా కు తెలియ జేసింది .
ఇది ఇలా ఉండగా జోషి దంపతులు కలకత్తా లో ఉండగా ఆనంది ఆరోగ్యం క్షీణించింది తరచుగా తలనొప్పి,అలసట బలహీనత జ్వరం తో బాధపడింది .ఇది తెలుసుకొన్న థియోడికా ఆమెకు తగిన మందులను అమెరికా నుండి పంపినా,ఈమె వాడినా ప్రయోజనమేమీ కనిపించలేదు ..ఇంతలో జోషీకి శేరామ్పూర్ బదిలీ అయింది .ఆమె ఒత్తిడికి లోనైంది .ఇక తప్పదని అనారోగ్యం గా ఉన్నా భార్యను అమెరికా లో మెడిసిన్ చదవటానికి పంపాలని నిర్ణయించాడు .ఉన్నత విద్య నేర్చి అందరికి ఆదర్శ ప్రాయం గా ఉండాలని హితవు చెప్పాడు .తార్ బారన్ అనే డాక్టర్ దంపతులు ఆనందిని పెన్సిల్వేనియావుమెన్స్ మెడికల్ కాలేజికి అప్లికేషన్ పంపమని సలహా నిచ్చారు .ఆనంది అమెరికా లో చదవటానికి వెళ్తోందని తెలుసుకొన్న హిందూ చాందస వాదులు ఆమె పై నిషేధం విధించారు .చాలా మంది ఆమెనే బలపరిస్తే కొద్ది మంది ఆమె క్రైస్తవ మతం తీసుకోవటం మంచిది అని అన్నారు .
సేరామ్పూర్ కాలేజి హాల్ లో ఆనంది అందరిని సమావేశ పరచి తను మెడిసిన్ చదివే ఉద్దేశ్యాన్ని దానికోసం అమెరికా వెళ్ళ బోతున్న విషయాన్ని తెలియ జేసింది .భారత దేశం లో హిందూ డాక్టర్లు లేరని, ఆ కొరత తీర్చటానికే తాను వెళ్ళదలచుకోన్నానని ఇండియాలోలో ఒక మహిళా వైద్య కలాశాల ను స్థాపించే ఆలోచన తనకు ఉందని విస్పష్టం గా చెప్పింది .తాను క్రైస్తవ మతాన్ని తీసుకోనని నిర్ద్వంద్వం గా ప్రకటించింది. ఆమె ఉపన్యాసం విన్న వారంతా ఎంతో మెచ్చి స్పందించి డబ్బులు విరాళాలుగా అక్కడికక్కడే ప్రకటించి అందించి ఆమె ఆశకు ఉద్దీపన కల్గించారు .ఆనాటి వైస్ రాయ్ ఆమె ఉన్నత విద్యాభ్యాసం కోసం రెండు వందల రూపాయలు విరాళం గా అందించాడు
కలకత్తా నుండి న్యు యార్క్ కు చాపరాన్ అనే నౌకలో ఆనంది ప్రయాణం చేసింది . తార్ బరాన్ కు పరిచయం ఉన్న ఇద్దరు మహిళలు ఆమెతో ప్రయాణం చేయటం ఊరటగా ఉంది .1883జూన్ లో థియోడికా కార్పెంటర్ ఆనందిని న్యూయార్క్ లో కలిసి స్వాగతించింది .వెంటనే పెన్సిల్వేనియా మహిళా వైద్య కళాశాలకు తనను మెడికల్ ప్రోగ్రాం కు అనుమతించ వలసిందని అప్లికేషన్ పంపగా అప్పటి కాలేజి డీన్ రాఖేల్ బ్రాడ్లీ ఆమెను అనుమతింఛి చేర్చుకోవటం తో ప్రపంచం లోనే మొదటి సారిగా మెడికల్ ప్రోగ్రాం లో పాల్గొన్నమహిళగా చరిత్ర సృష్టించింది ఆనందీ జోషీ .పందొమ్మిదవ ఏట వైద్య విద్య చదవటం ప్రారంభించిన ఆనంది అందరి మన్ననలను పొందింది .కాని అమెరికా లో అలవాటుకాని వాతావరణం ,అనుకూలం గాలేని ఆహారం వలన క్రమక్రమం గా ఆరోగ్యం క్షీణించి క్షయ వ్యాధికి గురైంది .అయినా ధైర్యం సడల నీయకుండా చదివి 1886 మార్చి నెల 11న మెడిసిన్ లో M .D.డిగ్రీ ని సాధించి ,అందరికి ఆదర్శం గా నిలిచింది భర్త ప్రోత్సాహాన్ని విశ్వాసాన్ని నిలబెట్టింది ‘’obstestrics in Aryan Hindus ‘’అంటే ‘’ఆర్య హిందూ సమాజం లో మంత్రసానితనం ‘’అనే ప్రత్యెక విషయం పైన థీసిస్ రాసి సమర్పించింది . ఆనంది వైద్య డిగ్రీ ప్రదానోత్సవ సభకు ఎలిజబెత్ రాణి ఆమెకు అభినందన సందేశం పంపటం మరపు కు రాని మహోన్నత విషయం ఆమెకూ, మనకూ మహిళ లందరికీ .
సాధించిన విజయం తో ఆనంది జోషి భారత దేశానికి 1886లో తిరిగి వస్తే వేలాది మంది అభిమానులు ఆమెకు వీరోచిత స్వాగతాన్ని పలికారు. కొల్హాపూర్ రాజ సంస్థానం ఆమెను ఆల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్ లో స్త్రీ వార్ద్ కు ఇంచార్జి గా నియమించి గౌరవించింది .కాని విధి వక్రించి ఆనందీ జోషి మరుసటి ఏడాదే ఇరవై రెండేళ్ళు నిండకుండానే 1887 ఫిబ్రవరి26 నమరణించింది .ఇంకా ఎంతో సేవ చేయాల్సిన ఆమె జీవితం అకస్మాత్తుగా ముగియటం అభిమానులు జీర్ణించుకోలేక పోయారు ఆమె మరణానికి భారత దేశం అంతా సంతాపం ప్రకటించింది ఆమె అస్తికలను అమెరికాలోని ఆమెను అన్ని విధాలా ఆదుకొన్న థియో డికా కార్పెంటర్ కు పంప గా ఆమె వాటిని ఏంతో భక్తితో, కన్నీటితో న్యూయార్క్ లో పోకీప్సీఅనే తన కుటుంబ శ్మశాన వాటిక లో భద్రపరచినది .ఏ జననాంతర సౌహృదయ మో ఇది ?
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-1-14-ఉయ్యూరు

