
భారతరత్నతో సహా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే ప్రతిష్ఠాత్మక పురస్కారాలలో తెలుగువారికి ప్రాధాన్యం తగ్గిపోతోంది. తెలుగువారి తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించే నాయకులు కూడా కరువయ్యారు. ప్రభుత్వపరమైన ప్రతిభా పురస్కారాలలో తెలుగుతేజం వన్నె నానాటికీ తరిగిపోతోంది. ప్రభుత్వేతర సంస్థలు చిత్రవిచిత్ర పురస్కారాలతో, బిరుదుల పందేరంతో హోరెత్తిస్తున్నాయి. అందులో కొన్ని కేవలం సత్కారాల కోసమే వెలిసినట్టుగా, సన్మానాల కంపెనీలుగా మారి తెలుగువారి కీర్తికండూతినికి ఆదుకుంటున్నాయి. ఒక్కో ఏడాదిలో జరిగిన సన్మానాలన్నిటినీ లెక్క కడితే కోట్లాది రూపాయల విలువతో ఈ సన్మానాలు చలామణీ అయిపోతున్నాయనిపిస్తుంది. అయితే అసలు సిసలు ప్రతిభంతా పైరవీల పెత్తనం ముందు బోసిపోతోంది. తెలుగువారి దరిదాపులకు రాని భారతరత్నతో మొదలుపెట్టి మన పెద్దలకు, తేజో మూర్తులకు అందివచ్చినవన్నీ నిక్కచ్చిగా లెక్కించుకోవాల్సిన సంధికాలం దాపురించింది.
ఇటీవల మన ఉన్నత న్యాయస్థానం పద్మశ్రీల వ్యవహార శైలిపై చేసిన వ్యాఖ్యానాలతో సహా మొత్తంగా సమీక్షిస్తే అనేక విచిత్రమైన సంగతులు బయటికి వస్తాయి. మన దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్నను ఏడాదికి 3 మించకుండా ప్రదానం చేయవచ్చన్న నిబంధన ఉంది. గణతంత్ర దినోత్సం రోజున ప్రకటించే ఆనవాయితీతో 1954 నుంచి భారతరత్నను ప్రకటిస్తున్నారు. ప్రధానమంత్రి ప్రతిపాదించి నివేదిస్తే రాష్ట్రపతి ఆమోదంతో ప్రకటన జారీ అవటం ఆనవాయితీగా వస్తోంది. మన దేశ పౌరులకే ఇవ్వాలా, జీవించి ఉన్నప్పుడే ప్రకటించాలా అన్న దానిపై సందిగ్ధతతో, తటపటాయింపుతో ప్రభుత్వాలు వ్యవహరించటంపై కాస్తంత మాత్రమే చర్చ జరిగింది.
గాంధీజీ మరణానంతరం కొన్ని సందర్భాలలో చర్చ జరిగినప్పుడు అత్యున్నత కార్యాలయంలో కూడా దాటవేతలు, తర్జనభర్జనలు జరిగాయి. తొట్ట తొలి భారతరత్నలుగా 1954లో రాజాజీ, సివి రామన్, సర్వేపల్లి రాధాకృష్ణన్‌లను ఎంపికచేసి ప్రదానం చేశారు. 2013 దాకా మెత్తంగా ప్రదానంచేసిన పురస్కారాలు 43 కాగా రెండేళ్లుగా క్రీడారంగంలో వారికి ఇవ్వాలా వద్దా అంటూ నాన్చిన ప్రతిపాదన సచిన్ టెండూల్కర్‌తో ఖరారు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున రాజ్యసభలో సభ్యత్వం పొందిన సచిన్‌కు అందరికన్నా పిన్న వయసులో భారతరత్నను ప్రదానం చేయటం ఎలాంటి స్ఫూర్తి, సంకేతాలకు దారితీస్తుందోనన్న రగడ జరిగింది. అంతకుముందు హాకీ రంగంలో ఒలింపిక్‌తో పాటు అంతర్జాతీయంగా జేజేలు అందుకొన్న ధ్యాన్‌చంద్ 1979లో మరణించగా 2011లో ప్రదానం చేయాలన్న 82 మంది ఎంపిల వినతి ఎలాంటి నిర్ణయమూ లేకుండా కాగితాల కట్టలలో చేరిపోయింది.
విదేశీయులకు కూడా…
పదవులలో ఉన్న వారు ప్రభుత్వ సత్కారాలు అందుకోవటం సబబు కాదని నిరాకరించిన అబ్దుల్ కలామ్ ఆజాద్ పేరును 1992లో దివంగతుడైన తరువాత భారతరత్నగా ప్రకటించారు. మన దేశంలో జన్మించకపోయినా, పౌరసత్వం లేకపోయినా సమస్త మానవాళికి ఆదర్శంగా ఉత్తేజకరమైన స్ఫూర్తి అందించే మహనీయులను గౌరవించటం మన ధర్మంగా భావిస్తూ 1997 దాకా జీవించి ఉన్న మదర్ థెరిస్సాకు, 1980లో సరిహద్దు గాంధీగా అందరి ఆదరణ పొందిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్‌కు, 1987లో జాతి వివక్షతపై, బడుగుల హక్కులపై మడమ తిప్పని పోరాటంతో ప్రపంచానికే దారి చూపిన నెల్సన్ మండేలాకు భారతరత్న లుగా మన దేశ ప్రభుత్వ అత్యున్నత పురస్కార ప్రదానం జరిగింది.
ఇప్పటిదాకా భారతరత్నలు ప్రకటితమైన వారిలో రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు 1992లో రాష్ట్రపతి ఆమోదం తరువాత సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యంతో వాదప్రతివాదాలతో సజీవమా మరణానంతరమో ఇదమిత్ధంగా తేల్చలేక ప్రకటన ఉపసంహరించుకున్నారు.
అంతకుముందు దివంగతులైన నేతలను సంస్మరించుకుంటూ భారతరత్నలుగా గౌరవించుకుందామని ప్రభుత్వం నిశ్చయించి పాటించింది. అలాంటి వారిలో 1966లో తాష్కెంట్ లో మరణించిన ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రికి అదే ఏడాది భారతరత్నగా నివాళి అర్పించారు. అదే తీరులో 1987లో మరణించిన ఎంజి. రామచంద్రన్‌కు 1988లో, 1991లో హత్యకు గురైన రాజీవ్ గాంధీకి అదే ఏడాదిలో, అరుణా అసఫ్ అలీ 1996లో దివంగతురాలు కాగా 1997లో ప్రకటించారు. 1984 దాకా జీవించి ఉన్న ఇందిరా గాంధీకి 3వ ప్రధానిగా 1971లో భారతరత్న ప్రదానం జరిగింది. నెహ్రూకు1955లో, గుల్జారీలాల్ నందాకు 1997లో, నిండు నూరేళ్లుగా 1995 దాకా జీవించి ఉన్న మొరార్జీ దేశాయ్‌కి, 1950లో మృతి చెందిన వల్లభాయ్ పటేల్‌కి 1991లో ఆ పురస్కార ప్రదానం జరిగింది.
విరామానికి సిద్ధం
రాజ్యాంగంతో పాటు నిమ్నజాతుల జీవన ప్రమాణాలు హక్కుల కోసం ముందునిలిచి పోరాడుతూ 1956లో మరణించిన బాబా సాహెబ్ అంబేద్కర్‌ను 1990లో భారతరత్నగా గుర్తించారు. 1977-80ల మధ్య కాలంలో దేశ అత్యున్నత పురస్కారం ఎవరినీ వరించలేదు. 2008లో హిందూస్థానీ సంగీత విద్వాంసుడు భీమసేన్ జోషీకి ప్రకటించిన తరువాత కేంద్ర ప్రభుత్వం మిన్నకుండి పోయింది. క్రిందటి ఏడాది సి.ఎన్.ఆర్. రావు, సచిన్‌లతో భారతరత్నలకు 5 ఏళ్ళ విరామం ఏర్పడింది. కళా రంగంలో ఉద్దండులైన వారిలో అందరికన్నా ముందుగా ఎం.ఎస్.సుబ్బలక్ష్మికి 1998లో, సితార్ విద్వాంసుడు రవిశంకర్‌కి 1999లో, పాటలరాణి లతామంగేష్కర్‌కు, షెహనాయ్‌తో దేవుడికి మేలుకొలుపు స్వరాల మాలలు అందించిన బిస్మిల్లా ఖాన్‌లను ప్రభుత్వం భారతరత్నలుగా 2001లో సత్కరించింది.
గణతంత్ర దినోత్సవం సమయంలో మన ప్రజాస్వామిక లక్షణం ప్రతిఫలించేలా పద్మ పురస్కారాలను ప్రభుత ్వం ప్రవేశపెట్టింది. ప్రతిష్టాత్మకమైన ఆ పురస్కారాలకు, బిరుదులకు తేడా తెలియనంతగా మోజు పెరిగి అందుకుగాను అడ్డదారులు తొక్కుతున్న పద్ధతులు పలు సందర్భాలలో విమర్శలకు నెలవు అవుతున్నాయి. ప్రతి ఏటా అక్టోబరు నెలలో అన్ని రాష్ట్రాల నుంచి పద్మ పురస్కారాల ప్రతిపాదనలు పరిశీలించి ఏడాదికి 120 కి మించకుండా ప్రదానం చేయాలన్న అత్యున్నత న్యాయస్థానం సూచనలు చురకల దరిమిలా కూడా విమర్శలు వివాదాలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. అత్యున్నతమైన భారతరత్న తరువాత ప్రతిభావంతులైన వారిని గుర్తించి రాష్ట్రపతి ప్రశంసించే పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీలను ఎంపిక చేయటంలో ప్రమాణాలు విధివిధానాలు ఎప్పటికప్పుడు సవరింపులు సర్దుబాట్లతోనే చెల్లుబాటు అవుతునే ఉన్నాయి. రాష్ట్రపతి నిర్దేశించి పాటించే విధివిధానాల ప్రకారం పురస్కారాలు, బిరుదుల క్రమం ఖరారు అయినా చాలామందికి అవగాహన లేకుండా పోయింది.
అత్యున్నతమైన భారతరత్న తరువాత పరమవీరచక్ర, అశోకచక్ర, పద్మవిభూషణ్, పద్మభూషణ్, మహావీరచక్ర, కీర్తిచక్ర, పద్మశ్రీ, సర్వోత్తమ యుద్ధసేవ, యుద్ధ సమయాలు లేని శాంతి సమయంలో విశిష్ట సేవా పతకాలు, గాంధీ శాంతి బహుమతి, ఇందిరాగాంధీ శాంతి బహుమతి వంటివాటితో పాటుగా క్రీడలకు సంబంధించి రాజీవ్ ఖేల్‌రత్న, అర్జున, ద్రోణ, ధ్యాన్‌చంద్ పురస్కారాలు, సినిమా అవార్డులు ఉన్నాయి. జాతీయస్థాయిలో బాలలకు బాలశ్రీ వంటివి ఉన్నాయి. కాగా, వీటన్నిటిలో తెలుగువారికి అందుతున్నవి తెలిసినవి చాలా తక్కువ. ప్రభుత్వపరంగా కూడా సమాచారం సవిరంగా తెలియచెప్పగల వ్యవస్థ లేకపోవటంతో తెలుగుతనం తెలుగుతేజం తెరమాటున మగ్గిపోతున్నాయి.
– జి.ఎల్.ఎన్. మూర్తి

