
కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో పుట్టిన పురుషోత్తమరావుది సామాన్య రైతు కుటుంబమే. ఇంటర్‌తో ఆపేసి వ్యవసాయాన్ని ప్రారంభించిన ఆయన మొదట రంగారెడ్డి జిల్లాలో కొంత భూమిని లీజుకు తీసుకొని కూరగాయలు సాగు చేశారు.1995లో ఉద్యానశాఖ నుంచి జిల్లా ఉత్తమ రైతు అవార్డును అందుకున్నారు. అదే ఏడాది అధిక ఉష్ణోగ్రతను తట్టుకొనే బంగాళదుంప విత్తనాల కోసమని తొలిసారిగా సిమ్లాలోనున్న కేంద్రీయ బంగాళదుంప పరిశోధనా కేంద్రం (సీపిఆర్‌సీ)ను సందర్శించారు. అప్పుడే సిమ్లాకు చెందిన కొందరు రైతులతో పురుషోత్తమరావుకు పరిచయం ఏర్పడింది. ఆసక్తి కొద్దీ ఆపిల్ పంట గురించి ఆరా తీస్తే, తాము ఆపిల్ సాగు చేస్తున్నప్పటికీ అధిక ధర పొందలేకపోతున్నామని, తెగుళ్లు కూడ పంటను నాశనం చేస్తున్నాయని వాళ్లు చెప్పారు.
సేంద్రియానికి శ్రీకారం
2004 తర్వాత పురుషోత్తమరావు సేంద్రియ వ్యవసాయంపై దృష్టిసారించారు. తొలి ఏడాదిలోనే మెరుగైన ఫలితాలు సాధించారు. “అప్పుడు నా సిమ్లా నేస్తాలకు ఈ పద్ధతులు పరిచయం చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. ఎందుకంటే అప్పటికే వారి తోటలకు ‘వేరుకుళ్లు తెగులు’ సోకి ఇబ్బంది పడుతున్నారు. నేను పాటించిన విధానాలతో వారిక్కూడా మేలు జరుగుతుందనిపించింది. ఫోన్ చేస్తే వాళ్లు తప్పకుండా రమ్మని ఆహ్వానించారు. అలా అక్కడకు వెళ్లి ఆంధ్రాలో ఉద్యాన పంటల సాగుకు నేను ఉపయోగించిన సేంద్రియ ఎరువులను ఐదుగురు సిమ్లా రైతులకు అందజేసి వచ్చాను..” అని చెప్పారు పురుషోత్తమరావు. ఆయన ఇచ్చిన సేంద్రియ ఎరువులతో వేరుకుళ్లు తెగులును నాశనం చెయ్యగలిగారు ఆ రైతులు. దీంతో అక్కణ్నుంచి మళ్లీ పిలుపొచ్చింది రావుకు. ఈసారి ఏకంగా 100 మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు ముందుకు రావడంతో పురుషోత్తమరావు వారికి అవగాహన కల్పించడం ప్రారంభించారు. తొలినాళ్లలో దీన్ని వ్యాపారంగా మలుచుకోవాలని భావించినా, తర్వాత అక్కడే ఉండి తాను సైతం ఆపిల్ సాగు చెయ్యాలన్న నిర్ణయం తీసుకున్నారాయన.
కుటుంబంలో ఒకడు
పురుషోత్తమరావు మొదట మండి జిల్లాలోని కుగ్రామం కర్సోగ్‌లో నివాసం ఏర్పరచుకున్నారు. హిందీ బాగా రావడంతో స్థానికులతో త్వరగా కలిసిపోయారు. ఓవైపు సేంద్రియ వ్యవసాయంపై వారికి అవగాహన కల్పిస్తూనే, మరోవైపు తాను వ్యక్తిగతంగా ఐదెకరాల భూమిని లీజుకు తీసుకొని ఆపిల్ సాగును ప్రారంభించారు. రెండేళ్లు గడిచేసరికి సిమ్లా పరిసర ప్రాంతాల్లో 300 మంది రైతులు సేంద్రియ బాట పట్టారు. అప్పటికల్లా ఆయన వారందరికీ కుటుంబంలో ఒకరన్నంత ఆదరణ సంపాదించుకున్నారు. ‘అక్కడి కుగ్రామాల్లో రైతులకు సంప్రదాయంగా ఆపిల్ సాగుచెయ్యడమే తెలుసుగాని, అధిక దిగుబడి పొందడం, పండించిన పంటకు అధిక ధర పొందడం వంటివి తెలియవు. ఆపిల్స్‌ను గ్రేడ్ ప్రకారం ఎంపిక చేసి దూర ప్రాంతాలకు ఎగుమతి చెయ్యడంతో వాళ్లంతా అధిక లాభాలను పొందారు. దాంతో నా మీద వారికి నమ్మకం కలిగింది’ అని చెప్పారు పురుషోత్తమరావు. ప్రస్తుతం ఆయన పదెకరాల్లో సాగు చేస్తుండగా, మరో 500 మంది రైతులు 126 హెక్టార్లలో ఆయన సలహాలతో సేంద్రియ సాగు చేస్తున్నారు. “మన రాష్ట్రంలో విశాఖ ఏజెన్సీ లంబసింగి ప్రాంత ప్రజలు సహజంగానే సేంద్రియ పంటలు పండిస్తున్నారు. దీనికి సీసీఎంబీ శాస్త్రవేత్తల కృషి తోడయితే ఇక్కడ కూడా ఆపిల్ విరగపండుతుంది. వారి ప్రయోగాల్లో నేను కూడా భాగమై ఈ ఏడాది నుంచి ఇక్కడ సాగుకు కృషి చేస్తాను. సిమ్లా ఆపిల్‌లా ఆంధ్రా ఆపిల్ మార్కెట్‌లోకి రావాలని కోరుకుంటున్నాను” అంటున్నారు పురుషోత్తమరావు.
ఆంధ్రా ఆపిల్ వచ్చేస్తోంది
సిమ్లా ఆపిల్, కాశ్మీర్ ఆపిల్.. ఇలా ఎన్నో పేరున్న రకాలు మార్కెట్లో ఉన్నప్పుడు ‘ఆంధ్రా ఆపిల్’ మాత్రం ఎందుకుండకూడదు? ఈ ఆలోచనే వచ్చింది సీసీఎంబీ శాస్త్రవేత్తలకు. కాశ్మీర్, సిమ్లా మాదిరిగానే, మన రాష్ట్రంలోని లంబసింగి అత్యంత చల్లగా ఉండే ప్రాంతం. అక్కడి వాతావరణం, పర్వత ప్రాంతం ఆపిల్ పండ్ల సాగుకు అత్యంత అనువైన అంశాలు. వీటిని పరిశీలించిన సీసీఎంబీ ప్రయోగాత్మకంగా కొంత ప్రదేశంలో ఈ పండ్ల తోటలను పెంచుతోంది. ఈ ప్రయోగం విజయవంతమయితే మన లంబసింగి కూడా సిమ్లాలా ఆపిల్ తోటల నిలయంగా మారిపోతుంది.
ఇటలీ మొక్కలు ఇక్కడ
సిమ్లాలో సాధారణంగా ఆపిల్ పూత మార్చిలో ప్రారంభమవుతుంది. ఆగస్టు రెండో వారం నుంచి దిగుబడి మొదలవుతుంది. అంటు కట్టిన మొక్కలు నాటితే ఎనిమిదేళ్లకు కాపు మొదలై 45 ఏళ్ల వరకు పంట కాస్తాయి. ఒక మొక్క నుంచి ఏడాదికి 15 కిలోల దిగుబడి వస్తుంది. అదే రూట్‌స్టాక్ మొక్కలు నాటితే రెండేళ్లకే కాపుకొస్తాయి. 20 ఏళ్ల వరకు పంట వస్తుంది. ఒక మొక్క నుంచి 15 – 20 కిలోల నాణ్యమైన దిగుబడి వస్తుంది. ఇవన్నీ తెలుసుకున్న పురుషోత్తమరావు సిమ్లా రైతులు రూట్‌స్టాక్ మొక్కలను సాగు చేసేలా ప్రోత్సహించారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని నోని విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కూడ దాన్నే సిఫార్సు చేసి సహకారమందించారు. రూట్‌స్టాక్ మొక్కల సాగుతో ఇటలీ రైతులు హెక్టారుకు 40 నుంచి 45 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. దాన్ని పరిశీలించేందుకు కొంతమంది రైతులను వ్యక్తిగత ఖర్చులతో ఆ దేశానికి తీసుకెళ్లారు పురుషోత్తమరావు. అక్కడి రైతులు అవలంబిస్తున్న ఆధునిక పద్ధతులపై అవగాహన పెంపొందించుకున్నారు. అక్కడి నుంచి ఆ మొక్కలను దిగుబడి చేసుకున్న సిమ్లా రైతులు ప్రస్తుతం హెక్టారుకు 42 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు.
వసుపరి జాన్ దయానంద్, చింతపల్లి

