
‘తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి’ ‘పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్…’ ‘బుద్ధికి అసాధ్యం ఉందేమోగానీ, డబ్బుకి అసాధ్యం లేదు’ ‘డామిట్ కథ అడ్డం తిరిగింది..’ వీటిలో ఒక వాక్యమైనా తెలియని తెలుగువాళ్లుండరేమో! అంతలా జనంలోకి వచ్చేశాయి ‘కన్యాశుల్యం’ డైలాగులు. గురజాడ 150 ఏళ్ల జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, ఆయన రాసిన ఈ ప్రసిద్ధ నాటకాన్ని వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 2న) పూర్తిగా 8 గంటలసేపు రవీంద్రభారతిలో ప్రదర్శించనున్నారు.
తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన నాటకాల్లో ‘కన్యాశుల్కం’ ముందువరసలో ఉంటుంది. కాలక్రమంలో ఎన్నో మార్పులకు లోనైన ఈ నాటకాన్ని పూర్తి నిడివితో ప్రదర్శించడమనేది అటు రంగస్థల అభిమానుల్లోను ఇటు సాహిత్య ప్రేమికుల్లోనూ ఒక కొత్త ఉత్సాహ తరంగమై వ్యాపిస్తోంది. గడచిన రెండేళ్లుగా తెలుగు నేలపై ఇది కొత్త ఆలోచనలకు తెర తీస్తోంది.
మూడు యాభైలు బతుకుతుంది
‘వందేళ్ల కన్యాశుల్కం రోజులు వచ్చేశాయి’ అని కవి పండితుడు ఆరుద్ర గుర్తు చేసినప్పుడు పుట్టిన ఉత్తేజంతో పూర్తినిడివి నాటకం చకచక తయారయింది లోగడ. దాన్ని 1992లో మొట్టమొదటిసారిగా విజయనగరంలో ప్రదర్శించారు. అప్పుడు పెద్ద ఉత్సవంలాగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలనుంచి గురజాడ అభిమానులు, ప్రముఖులు తరలివెళ్లారు. కాలం గడిచింది. కిందటేడు గురజాడ 150వ జయంతి సందర్భంగా మళ్లీ ఎనిమిది గంటల ప్రదర్శన సిద్ధమైంది. 2012 సెప్టెంబర్ 21న విశాఖపట్నంలోని కళాభారతిలో మళ్లీ పూర్తి నిడివి నాటకాన్ని ప్రదర్శించారు. హాలులో కుర్చీలన్నీ నిండిపోయి, వాటి మధ్య నడిచే దారిలో నేలన కూర్చుని మరీ చూశారు ప్రేక్షకులు. అంతేకాదు, హాలు బయట నిలుచున్నవారికి విడిగా కుర్చీలు వేయించి, వారికోసం క్లోజ్‌డ్ సర్క్యూట్ టివిలను కూడా ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ప్రవేశించటానికి స్థలం లేక ఆ చుట్టుపట్ల వీధుల్లో నిలబడిన ప్రేక్షకులు మైక్‌ల ద్వారా నాటకాన్ని ఆలకించి ఆస్వాదించారు. తెలుగు నాటకాన్ని పట్టివదలని తెగులు వంటి మైకులు, సౌండ్ సిస్టం తిప్పలు పెట్టినా కన్యాశుల్కంలోని రంజు ముందు అవన్నీ తెట్టులా తేలిపోయాయి. మంచి నాటకమైతే నిడివి పెద్ద లెక్క కాదన్న సత్యాన్ని కన్యాశుల్కం మరోసారి నిరూపించింది. విశాఖ ప్రేక్షక స్పందన చూసిన విజయవాడవాసులు తమ నగరంలో మలి ప్రదర్శనకు సన్నాహాలు చేశారు. తర్వాతి ప్రదర్శన వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో జేజేలు అందుకొంది. ఆ తర్వాత కిందటేడు సెప్టెంబర్ 21న విజయనగరం కళాభారతిలో జరిగిన నాటకానికి కూడా ప్రేక్షకులు సముద్ర తరంగాల్లా పోటెత్తారు. ‘మా ఊరి రచయిత, మా చుట్టుపక్కల ప్రాంతాల్లోని మనుషులు, వారి సహజమైన వేషభాషలు..’ అంటూ ప్రేమతో పరవశించిపోయారు. ఇప్పుడు రవీంద్రభారతిలో జరగబోయేది ఆరో పూర్తి నిడివి ప్రదర్శన.
అభిమానమే అసలు పెట్టుబడి
కన్యాశుల్కం ఎనిమిది గంటల ప్రదర్శన అంటే మామూలు విషయం కాదు. దాన్ని సుసాధ్యం చేసినది విజయనగరం జిల్లా రాజాంలో ‘వెలుగు’ సంస్థను నిర్వహిస్తున్న రామినాయుడు. తొలిసారి 1992లో ఆయన చేసిన ప్రయత్నం, కళాకారుడు సంపత్‌కుమార్ నిర్వహణలో విజయనగరంలో జరిగింది. అప్పుడు ఆచార్య సి.నారాయణరెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు వంటి వారంతా దాన్ని తిలకించారు. ఆ జ్ఞాపకాలతోనే సంపూర్ణ ప్రదర్శనకు మరోసారి పూనుకున్నారు రామినాయుడు. ఈసారి ఆయనకు విశాఖలోని విప్లవ రచయిత చలసాని ప్రసాద్ చొరవ తోడైంది. వారి ఉత్సాహాన్ని చూసి విజయనగరం నవయుగ ఆర్ట్స్ సంస్థ ముందుకొచ్చింది. గురజాడ పట్ల అభిమానం తప్ప ఆర్థికంగా బలం, ఇతర హంగులూ ఏమీ లేవు వారికి. అయినా ఎనభై మంది కళాకారులను ఒక వేదిక మీదికి తీసుకొచ్చి ఎనిమిది గంటల ప్రదర్శన ఇస్తున్నారు. వారి శ్రమ వృథాపోలేదు. ‘ఎనిమిది గంటలు నాటకం వేస్తే ఎవడు చూస్తాడు లెద్దూ…’ అన్న విమర్శను ధాటిగా తిప్పికొట్టింది కన్యాశుల్కం. నాటకం ఏ ఊళ్లో జరిగినా, వేదిక ఏదైనా… ‘ఇసుక వేస్తే రాలనంత మంది’ అన్న జాతీయానికి అర్థం చెప్పేట్టుగా వచ్చారు ప్రేక్షకులు. ఎన్నో ఏళ్లుగా చదివిందీ, విన్నదీ, కన్నదీ అయినా సరే, అదే మొదటిసారి చూడటమన్నట్టు అడుగడుగునా కేరింతలు కొట్టారు. ప్రదర్శన జరిగిన చోట ఒక రకమైన ఆనందానుభూతి తరంగంలాగా వ్యాపిస్తూ ఉంటుంది. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వ భాషాసాంస్కృతిక శాఖవారు మధురవాణి, గిరీశం తదితరులను ఆహ్వానించి రవీంద్రభారతిలో ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు.
స్పందనకు బహుమతులు
“వ్యంగ్య – హాస్య ఇతిహాసంగా పరిశోధకుల ప్రశంసలందుకున్న నాటకం కన్యాశుల్కం. ఫిబ్రవరి రెండున జరుపుతున్న ప్రదర్శనకు ముఖ్యమంత్రితో పాటు ప్రముఖులందరినీ ఆహ్వానించాం. ఈ నాటకాన్ని ఆధునికులు ఎలా ఆస్వాదించాలో, అర్థం చేసుకోవాలో చెపుతూ ఇప్పటికే చాలా వ్యాసాలు రాశారు. వారంతా ‘గురజాడ పురస్కారాలు’ అందుకున్నవారే. వాటిని ఒక సంకలనంగా మా శాఖ ప్రచురిస్తోంది. నాటకం చూడటానికి వచ్చిన ప్రేక్షకులకు ఆ పుస్తకం అందజేస్తాం. అలాగే స్పందన పత్రాలు కూడా అందజేస్తున్నాం. మంచి అవగాహన, విమర్శన దృష్టితో స్పందన రాసిన వారికి సాంస్కృతిక శాఖ తరఫున బహుమతులు, ప్రోత్సాహకాలు అందిస్తాం. అంతేకాదు, 8 గంటల సేపు నాటకం చూడటానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పిస్తున్నాం. అందులో భాగంగా మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం” అని వివరాలు వెల్లడించారు రాష్ట్ర భాషాసాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ రాళ్లబండి కవితాప్రసాద్.
– జిఎల్ఎన్. మూర్తి

