బ్రాహ్మణాల కదా కమా మీషు -2
బ్రాహ్మణాలు దేనికి చెందుతాయి ?
‘’బ్రాహ్మణం చ వేదః ‘’అని జైమిని సూత్రాలకు భాష్యం రాసిన శబర స్వామి అన్నాడు అంటే మంత్రాలే కాదు బ్రాహ్మణాలు కూడా వేదమే నన్న మాట .బృహదారణ్యక ఉపనిషత్తుకు భాష్యం రాస్తూ శ్రీ శంకర భగవత్పాదులు ‘’వేదాను వచనేన మంత్రం బ్రాహ్మణాధ్యయనే ‘’అన్నారు అనగా మంత్ర భాగాన్నీ ,బ్రాహ్మణ భాగాన్ని అధ్యయనం చేయటమే వేదాను వచనం అని చెప్పారు అంటే బ్రాహ్మణాలు వేదాలేనని అంగీకరించారు .తంత్ర వార్తికం లో కుమారిలుడు బ్రాహ్మణాలకు వేదం అనే పేరుందని ఒక ధర్మ శాస్త్రాన్ని పేర్కొన్నాడు .మనుస్మృతి వ్యాఖ్యానం లో మేధా తిది,మస్కరి మున్నగు వారు కూడా బ్రాహ్మనాలను వేదాలుగా గుర్తించారు .’’మంత్రం బ్రాహ్మనయోర్వేద నామ దేయం ‘’శ్రోత స్మార్తం లో మంత్రాలు బ్రాహ్మణాలు వేదాలే అని ఆపస్తంభుడు పేర్కొన్నాడు .సాయణుడు’’మంత్రం బ్రాహ్మణాత్మక శబ్ద రాశిర్వేదః ‘’అంటే మంత్రం భాగ ,బ్రాహ్మణ బాగ రూప మైన శబ్ద రాసి అంతా వేదమే నని చెప్పాడు .
బ్రాహ్మణాల వల్ల ఏం ప్రయోజనం ?
సంహితలలో ఉన్న మంత్రాలను అర్ధం చేసుకోవటానికి బ్రాహ్మణాలు ఉపయోగ పడుతాయి .యజ్ఞాన్ని ఎలా చేస్తే ఏమేమి ప్రయోజనాలు కలుగుతాయో నిర్వ చిస్తాయి .సంహితలలో నిక్షిప్తమైన నిగూఢ భావ రాశిని అర్ధం చేసుకోవటానికి నిఘంటువులు కావాలి .వాటిని ఆధారాం గా యాస్కుడు మొదలైన మహర్షులు ‘’నిరుక్తాలు ‘’రాశారు .ఒకప్పుడు ప్రతి వేదానికి విడి విడిగా నిఘంటువు , నిరుక్తం ఉండేవి .ఇప్పుడన్నీ నశించి పోయి యాస్కుడు రాసిన నిఘంటువు నిరుక్తం మాత్రమే లభిస్తున్నాయి .నిఘంటువులు సంహితలోని పదాలకు అర్ధ నిర్వచనం చేసేటప్పుడు బ్రాహ్మణాల పై ఆధార పడతాయి .బ్రాహ్మణాలలో ఆయా సందర్భాలలో ఇవ్వ బడిన అర్ధాలే నిఘంటువుల లో కూడా కన పడతాయి .దీన్ని బట్టి తేలేది ఏమిటి అంటే వేదం మంత్ర పదాలకు, నిఘంటు అర్ధాలకు మూలాలు బ్రాహ్మణాలే. .మంత్రం భాగాన్ని సరిగ్గా అర్ధం చేసుకోవటానికి బ్రాహ్మణాలే సరైనవి .
మంత్రం ద్రస్టలైన మహర్షులు బ్రాహ్మణాలలో సత్య స్వరూప మంత్రార్ధాలను తెలియ జేశారు .వీటిని ఆధారం గానే నిఘంటువులు ,ఇతర భాష్యాలు ఏర్పడ్డాయని భారతీయ పండితులు భావించారు .మానవులకు వైదిక కర్మలను ఆచరించటానికి బ్రాహ్మణాలు ప్రేరణ నిస్తాయి అని ఆపస్తంభుడు తన యజ్న పరి భాషలో వివ రించాడు .విధి ,అర్ధ వాదరూప మైన బ్రాహ్మణాలు వైదిక కర్మలను విధిస్తూ ,వాటిలో మానవుడు ప్రవర్తిం చేట్లు సందర్భాన్ని బట్టి స్తుతిని ,నిందను చేస్తూ ప్రేరణనిస్తాయి .బ్రాహ్మణాల ద్వారా ప్రేరణ పొందిన వాడు ,మంత్రార్ధాన్ని సరిగ్గా అర్ధం చేసుకుని ,యజ్న యాగాదులను చేస్తాడు .యాగాలు బాగా ఆచరించే కాలం లో బ్రాహ్మణాలే దారి చూపాయి .
బ్రాహ్మణాలను సరిగ్గా అధ్యయనం చేస్తే ప్రాచీన భారతీయ చరిత్రను ,సంస్కృతిని ,ఆచార వ్యవహారాలను ,జీవిత లక్ష్యాన్ని తెలుసుకో వచ్చు .బ్రాహ్మణాలలో సాంకేతికం గా ఉన్న ఉపాఖ్యానాలు ,తరువాత వాగ్మయం లో ఏ విధం గా నిరూపించ బడ్డాయో పోల్చుకొని తెలుసుకో వచ్చు .అంటే ప్రాచీన భారతీయులకు సంబంధిన అనేక అంశాలను బ్రాహ్మణాలను అధ్యయనం చేసి తెలుసుకో వచ్చు .ఒక్కమాటలో చెప్పా లంటే ప్రాచీన భారతీయ జీవన సంస్కృతులను ,ఆలోచనా ధోరణులను ,తత్వ చింతనకు బ్రాహ్మనాలే అద్దంపట్టాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-6-14-.ఉయ్యూరు

