కన్నీరు ఎక్కువ , పోరు తక్కువ (వివిధ) – జి.వెంకటకృష్ణ
నవ్యాంధ్రసీమ ఏర్పాటైన యీ వర్తమాన నేపథ్యంలో ఎన్నో ఖాళీలతో ప్రయాణిస్తున్న రాయలసీమ, ఆధునిక రాయలసీమగా తనదైన ఎజెండాతో ముందుకెళ్లకుంటే, యీ ప్రాంత మేధావి వర్గం ఆ ఎజెండాను సాహిత్యంలోకి తీసుకోకపోతే, ఖాళీలు, ఖాళీలుగా నిలిచిపోయి, రాయలసీమ భవిష్యత్తులో పెనె సవాళ్లను ఎదుర్కోవాల్సి వుంటుందని కూడ అనిపిస్తుంది.
స్థూల దృష్టితో చూస్తే మొత్తం రాయలసీమ సాహిత్యం, ప్రకృతిశాపాలూ తాపాలూ, కరువూ కన్నీళ్లు గురించీ, అంతర్గత ఆధిపత్యాలూ/వేదనల గురించీ మాత్రమే చిత్రితమైవుంది. మన ఏడ్పులు మనం ఏడ్వడమే వైవిధ్యమైతే, ఆత్మగౌరవం లేకపోవడం వైరుధ్యం. మనల్ని మనం గౌరవించుకోకుంటే ఎవరు మనల్ని గౌరవిస్తారు? రాయలసీమ సాహిత్యంలో యీ కోణం లోపించింది. ఆత్మగౌరవానికి సంబంధించి కథల్ని వెతికితే 2013లో వచ్చిన ‘గాయాలు’, ‘జై తెలంగాణా’ కథలు మాత్రమే కన్పిస్తున్నాయి.
తెలుగు కథా సంవిధానంలో సాధారణీకరింపబడిన యితివృత్తాల చిత్రణ చాలా ప్రధానభాగం ఆక్రమించినప్పటికీ, ప్రాంతీయ కథ కూడ, తెలుగు భౌగోళిక ప్రాంతాలైన తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర జీవన చిత్రాల వైవిధ్యాన్ని చిత్రించడం ద్వారా తనదైన ముద్ర వేయగల్గింది. ప్రాంతాల యాసలు, పలుకుబడులు, ఆచార వ్యవహారాలు పరిచయం చేయడం ద్వారా ప్రాంతీయ సంస్కృతి ఆవిష్కరింపబడింది. ప్రాంతీయ జీవితాలు, సమస్యలు, సంక్లిష్టతలు పాఠకులకు అందించడం ద్వారా ప్రాంతీయ అస్తిత్వ చింతనకు ఆలంబనగా మారింది. ప్రాంతీయ జీవితంలో ఖాళీలను చూపి, వాటి భర్తీకి వుద్యమాల్ని పురిగొల్పింది.
ఇది నాణానికి ఒకవైపు చిత్రం -వైవిధ్యత. రెండోవైపు చిత్రం – వైరుధ్యం. ఒక ప్రాంత సాహిత్యం తన ప్రాంత విశిష్టతను చిత్రించే క్రమంలో అది సమగ్రంగా చిత్రింపబడుతుం దా? కనిపించే దృశ్యానికి కనిపించని కారణాల్ని ఎత్తిపడుతుందా? వైవిధ్యతలోని గాఢతను అంతే స్పష్టంగా పట్టుకుంటుందా? చాలాసందర్భాల్లో వీటికిఆశావహ సమాధానాలు లభిం చవు – అదే వైరుధ్యం. ఈ విషయాన్ని రాయలసీమ వైపు నుంచీ చూసే ప్రయత్నమిది.
రాయలసీమ గురించి మొదటి కథ రాయలసీమకు బయటి రచయిత నుంచీ రావడమే పెద్ద వైరుధ్యం. చింతాదీక్షితులు ‘సుగాలీ కుటుంబం’ (1921) కథలో కరువు పీడిత జీవితాన్ని చిత్రించడం, ఆ తర్వాత ఆయనే ‘చెంచురాణీ’, ‘దాసరి పాట’ లాంటి కథలు రాయడం ద్వారా రాయలసీమ యితివృత్తాలను కథలుగా మలచడం ప్రారంభమైంది. ఆ తర్వాత యిరవైయేండ్లకు జి.రామకృష్ణ ‘చిరంజీవి’, ‘గంజి కోసరం’, కె.సభా ‘కడగండ్లు’ కథలు రాయలసీమలోని కరువునూ, ఫ్యూడలిజాన్ని చిత్రించాయి. ఆధునిక తెలుగు తొలి కథ సంస్కరణను (దిద్దుబాటు, స్త్రీ విద్య) చిత్రిస్తే, ఆధునిక రాయలసీమ కథ ఎత్తుకోవడం ఎత్తుకోవడమే ప్రాంతీయ దుఃఖాన్ని ఆలపించింది. జి.రామకృష్ణ/సభా ల నుండి యిటీవలి దేవేంద్రాచారి/వేంపల్లి షరీఫ్‌ల దాకా మంచి కథలు రాసారనిపించుకున్న సీమ కథా రచయితలందరూ, సాధారణాంశాలపై కథలు రాస్తూనే, ప్రధానంగా ప్రాంతీయ జీవిత దుఃఖ దృశ్యాల్ని పట్టి పట్టి చూపిస్తున్నారు, రాయలసీమ వైవిధ్యత, కరువూ (నీళ్ళు లేనితనమూ, వానలు రానితనమూ) ఫ్యాక్షన్ ఆవేశకావేశాల (ఫ్యూడల్ అవశేషం)ను చిత్రించడంగా చరిత్రలో మిగిలింది.
ఆర్థిక కారణాల వల్లనే రాయలసీమలో ఆధునిక తెలుగు కథ ఆలస్యంగా వచ్చిందని కొందరంటారు గానీ, అదే నిజమైతే ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతమైనా, దిద్దుబాటు అక్కడే ప్రారంభమైంది. వెనుకబాటుతనాన్ని గుర్తించే పౌరసమాజం వుద్భవిస్తేనే అది సాహిత్యంలోకి వస్తుంది. అది తెలంగాణ లాగా విముక్తికి బాటలు వేస్తుంది. ఇది రాయలసీమలో పాడిన పాట పాడిన దగ్గరే పాడుకుంటోంది. ‘గంజికోసరం’ ప్రత్యక్షంగా కరువును చిత్రించిన కథ. చిరంజీవులు, కడగండ్లు ఫ్యూడలిజాన్ని చిత్రించిన కథలు. అయితే, 1960ల కాలానికి సింగమనేని, ఒక అడుగు ముందుకు వేసి, ‘జూదం’ -రైతుకు గిట్టుబాటు లభించకపోవడం, ‘ఊబి’ -బావుల సేద్యం పోయి బోర్ల సేద్యం రావడం, ‘అడుసు’ -రైతుదళారుల చేతుల్లో మోసపోవడం దాకా పరిణమించడం కనిపిస్తుంది. నీళ్లు, వానరాలే, సావునీళ్లు, వ్యసనం, ఒక్క వాన చాలు, ఇలాంటి కథలన్ని రాయలసీమ మీద ప్రకృతి పగబూనడం యితివృత్తంగా వచ్చినవే. సింగమనేని ‘అగాధం’ కథ వుద్యమిస్తున్న రైతును చిత్రించిన కథ. ఆ తర్వాత మన్ను తిన్న మనిషి ప్రయాణం ‘అగాధం’ మీదుగా ‘తెల్లదయ్యం’, ‘రంకె’ కథా మార్గంలో సాగాల్సింది. అయితే అలా జరగలేదు. ఇది రాయలసీమ కరువు కథా సంవిధానంలోని వైరుధ్యం. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ప్రతి సంవత్సరం అత్యధిక ప్రాంతం కరువు పీడిత ప్రాంతంగా ప్రకటించబడుతూవుంది. యిటీవలి కాలంలో యీ జిల్లాల మారుమూల ప్రాంతాల్లో లేటెస్ట్ మోడల్ కార్లు కూడ విపరీతంగా సంచరిస్తున్నాయి. ఎండమావుల్లో తిమింగలాలవేట (సభా) కథ కరువులో మత్స్యకారులకు వలలకోసం, చేపల చెరువుల కోసం ఆర్థిక సహాయం మంజూరీలో మంత్రిగారి అవినీతిని చెప్పిన కథ. ఇటీవలి కాలంలో కరువెవరికి కథలో మూడు వర్గాల- అగ్రవర్ణ, వెనుకబడిన, దళిత స్త్రీల జీవితాలు కరువులో ఎలా వున్నాయో చిత్రింపబడింది. ఇలాంటి కథలు యింకా ఎన్నో వచ్చి వుండాల్సింది. భౌతిక దృష్టికి కరువు గురించి అద్భుత వైరుధ్యాన్ని పట్టిచ్చే యిట్లాంటి కథలు రాయలసీమ నుంచీ ఎక్కువగా రాకపోవడం ఒక పెద్ద వైరుధ్యం.
నీళ్లు లేకపోవడమంటే నాగరికత లేకపోవడం, భాషా సంస్కృతులూ ఆహారపు అలవాట్లూ చాలా తేడాగా వుండటం. సభా ‘పాతాళగంగ’లో నీళ్లు సాధనకు బేటప్ప పడే కష్టాల నుండి రైతుల వీపుల మీద పుట్టిన కరువు రాచపుండ్లను మాన్పేందుకు నీళ్లను తోలుకొచ్చే అపర భగీరథులను కలగనే విశ్వనాధరెడ్డి ‘పొడినిజం’ దాకా పొలాలకు నీళ్లు అందని తనాల్ని చిత్రించినంతగా మనిషిగొంతులోకి నీళ్లు దిగనితనాల్ని చిత్రించలేదనిపిస్తుంది. రాయలసీమలో కారం ఎందుకు ఎక్కువగా తింటారూ, కారానికీ కరువుకీ సంబంధమేమిటి? రాయలసీమ ఆహారపు అలవాట్లను చిత్రించిన కథల్ని వెతుక్కోవాల్సి వస్తోంది. ఇటీవలి ‘గాయాలు’ కథలో జొన్న రొట్టె చేయడాన్నీ, తినడాన్నీ ఒక ఆత్మగౌరవ విషయంగా చిత్రించడాన్ని చూస్తాము.
స్రీ రచయితలు అంతగా లేని రాయలసీమలో పురుష రచయితలే, స్త్రీల మీద కరువు చూపే ప్రభావాన్ని చిత్రించారు. నామిని కథల్లో కరువు అనే మాటే లేకుండా, కరువు చేసే విధ్వంసం కరుణ రస్రార్దంగా చిత్రితమైంది. చక్రవేణు ‘కసాయి కరువూ’, ‘కువైట్ సావిత్రమ్మా’, స్వామి ‘బతుకు వూబి’ కథల్లో జీవిత విధ్వంసం అన్ని రూపాల్లోనూ కన్పిస్తుంది. రాయలసీమ స్త్రీ రచయితలు, నిర్మలరాణి ‘గాజుకళ్ళు’ సుభాషిణి ‘కరువెవరికీ’ కథల్లో స్త్రీ వేదన ప్రతిభావంతంగా చిత్రితమైంది. తక్కువగా వచ్చినా రాయలసీమ కథల్లో స్త్రీ కోణం వైవిధ్యంగా కనబడుతుంది.
రాయలసీమలో ఫ్యాక్షన్, గ్రామాల్లో ఆవేశకావేషాలతో ఉద్రిక్త పరిస్థితిగా (కూలిన బురుజు) మొదలై, ఆ ఉద్రిక్తతలో నలిగిపోయేది చిన్నా బన్నా కులాలేనని (ఎలిగే పెద్దోల్లు-నలిగే చిన్నోల్లు) గ్రామాల్లో వుపాధి లేని కూలీలు ఆ ఫ్యాక్షన్‌లోకి అనివార్యంగా నడిచిపోతున్నారనీ (నడక), ఫ్యాక్షనిస్టుల అధికార సోపానాలకు నిచ్చెనలుగా (నిచ్చెన) వుపయోగపడుతూ, కుటుంబాలలోని స్త్రీలను పిల్లలనూ అభద్రతకు (కన్నీటి కత్తి) గురిచేస్తున్నారనీ, ఇది ఫ్యాక్షనిస్టుల కుటుంబాలలోని, స్త్రీలకైనా తప్పడం లేదనీ(చుక్క పొడిచింది, ఒక వేకువలోకి) కథలు చిత్రించాయి. ప్రభుత్వాలు ఫ్యాక్షన్‌ను రూపుమాపడానికి ఫ్యాక్షనిస్టులకు బదులు, వాళ్ల చేతుల్లోని ఆయుధాల్లాంటి అనుచరులను ఎన్‌కౌంటర్ల (పడగనీడ) రూపంలో నిర్మూలిస్తే, ఫ్యాక్షనిస్టులు, రాజకీయ నాయకులుగా మారి రాజధాని నగరాల్లో, దందాలూ/పంచాయితీలూ/భూ ఆక్రమణలూ కొనసాగించేందుకు రూపం మార్చుకోవడం, గ్రామాల్లోని కూలీలు కరువు వల్లనో, ఫ్యాక్షన్‌కు దూరంగా వుందామనో, గిట్టుబాటైన కూలీ దొరకుతుందనో, నగరాలకు వలస వస్తే, రూపం మారిన ఫ్యాక్షనిస్టుల చేతుల్లోకి మళ్లీ చేరి ‘లుంగీలోల్లు’గా ముద్ర వేసుకోవడం చూసాం. ఫ్యాక్షన్ ఎన్‌కౌంటర్ల దాకా కథగా మారిన చరిత్ర చివరి అంకంలో ‘లుంగీలోల్లు’గా ముద్ర పడడాన్ని మాత్రం ‘కథ’గా మార్చలేకపోయింది.
రాయలసీమ కథ వ్యవసాయాన్ని పట్టించుకుంది. వ్యవసాయం చుట్టు వున్న జీవితాన్నీ ఘర్షణనీ పట్టించుకుంది. అయితే ఆ పట్టించుకోవడం కూడ ఫిర్యాదు స్థాయి మించి ఎదగలేదనే, కారణాల విశ్లేషణ చేయలేదనే విమర్శకులు వున్నారు. అందులో నిజం కొంత వుండచ్చు. కరువూ ఫ్యాక్షన్ విరూపాల విశ్లేషణ విశ్వనాధరెడ్డి నుండి సన్నపురెడ్డి దాకా కథకులు కొంతైనా చేసి వుండొచ్చు. అయితే అదే పండని నేల కింద, తవ్వుకునే వాళ్ల, పంటలు పండిస్తున్న ముడిఖనిజాల మైనింగ్ గురించి కథలు అసలు రాలేదంటే, అందరూ అంగీకరించాల్సిందే. రాయలసీమ అంతటా గ్రానైట్, బాక్సైట్, బైరటీస్ ఐరన్, లైమ్‌స్టోన్ లాంటి విలువైన ముడిఖనిజాల అక్రమ/సక్రమ మైనింగ్ చాలా సంవత్సరాలుగా జరుగుతోంది. మైనింగ్‌లో జీవితమేమిటి ఘర్షణ ఏమిటి? అనేది యే మాత్రమూ చిత్రింపబడలేదు. లక్షల కోట్ల ముడిఖనిజం సీమ దాటిపోతుంటే ఒక్క కథా రాకపోవడం పౌరసమాజపు విస్మృతిని సూచిస్తుంది. కరువు నేలలో సంపద పోగుపడుతోంటే ఆ విరోధాబాసను పట్టుకోలేకపోవడం గొప్ప వైరుధ్యం.
అలాగే పర్యావరణ స్పృహ గురించిన కథలు కూడా అంతగా కన్పించవు. ‘కొమ్మిపూలు’ ‘సావునీళ్ళు’ కథల్లో పర్యావరణమ్మీద స్పృహ రేఖామాత్రంగా కన్పించినా, కరువుతో అంతస్సంబంధమున్న, చెట్లు లేమిని, అటవీ విధ్వంసాన్నీ చిత్రించడం, రాయలసీమ కథలో కన్పించదు. ఇటీవలి కాలంలో ఎర్రచందనం అక్రమ స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోతుంటే…. యీ కథల ఆవశ్యకత స్పష్టంగా కన్పిస్తుంది.
నమ్ముకున్న నేలమీద కరువు నృత్యం చేస్తుంటే, అదే నేలమీద సిమెంట్ ఫ్యాక్టరీలు పుట్టుకొస్తుంటే, నేలను నమ్ముకున్న మనుషులే ఆ ఫ్యాక్టరీల్లోకి కూలీలుగా పోవడాన్ని, సిమెంట్ ఫ్యాక్టరీలవల్ల నేలతో తెగుతున్న వ్యవసాయ బంధాల గురించి, కడప కథా, బాగా నడుస్తున్న పేపర్ మిల్లు ఒక వ్యక్తి అత్యాశ వల్లా, కుట్ర వల్లా మూతబడే కాలానికి అందులోని కార్మికుడు కిరాయి హంతకుడిగా పరిణమించడాన్ని గురించి (పడగనీడ) కర్నూలు కథా, పట్టణీకరణ చెందుతున్న చిన్నగరంలోని చిన్న జీవితాల గురించి (రెండేళ్ల పద్నాలుగు) తిరుపతి కథా, యివీ రాయలసీమలో వేళ్లూనుకుంటున్న ఫాక్టరీల గురించీ, కార్మికుల స్థితిగతుల గురించీ, పట్టణీకరణ గురించీ, రేఖామాత్రంగానైన చిత్రించిన కథలు. వీటినిదాటి రాయలసీమ వర్తమానం రోడ్ల విస్తరణగా, రియల్ ఎస్టేట్ విస్తరణగా, పెరుగుతున్న అపార్ట్‌మెంట్ కల్చర్‌గా, అక్రమ మైనింగ్ స్మగ్లింగ్‌గా యింకా యిలాంటి ఎన్నో కొత్త విషయాల మీదుగా దూసుకుపోతున్నది. యీ విషయాల మీద రచయితలు దృష్టి పెట్టాల్సివుంది.
స్థూల దృష్టితో చూస్తే మొత్తం రాయలసీమ సాహిత్యం, ప్రకృతిశాపాలూ తాపాలూ, కరువూ కన్నీళ్లు గురించీ, అంతర్గత ఆధిపత్యాలూ/వేదనల గురించీ మాత్రమే చిత్రితమైవుంది. మన ఏడ్పులు మనం ఏడ్వడమే వైవిధ్యమైతే, ఆత్మగౌరవం లేకపోవడం వైరుధ్యం. మనల్ని మనం గౌరవించుకోకుంటే ఎవరు మనల్ని గౌరవిస్తారు? రాయలసీమ సాహిత్యంలో యీ కోణం లోపించింది. ఆత్మగౌరవానికి సంబంధించి కథల్ని వెతికితే 2013లో వచ్చిన ‘గాయాలు’, ‘జై తెలంగాణా’ కథలు మాత్రమే కన్పిస్తున్నాయి.
నవ్యాంధ్రసీమ ఏర్పాటైన యీ వర్తమాన నేపథ్యంలో ఎన్నో ఖాళీలతో ప్రయాణిస్తున్న రాయలసీమ, ఆధునిక రాయలసీమగా తనదైన ఎజెండాతో ముందుకెళ్లకుంటే, యీ ప్రాంత మేధావి వర్గం ఆ ఎజెండాను సాహిత్యంలోకి తీసుకోకపోతే, ఖాళీలు, ఖాళీలుగా నిలిచిపోయి, రాయలసీమ భవిష్యత్తులో పెను సవాళ్లను ఎదుర్కోవాల్సి వుంటుందని కూడ అనిపిస్తుంది.
-జి.వెంకటకృష్ణ
(మే 31-జూన్ 1లలో కర్నూలు కథాసమయం నిర్వహించిన కథకుల సమావేశంలో చేసిన ప్రసంగానికి వ్యాసరూపం)

