నీటి ‘స్మరణే’ ఆయన ధ్యేయం

ఇక్కడ కనిపిస్తున్న ఆయన పేరు సుభాష్ చంద్రారెడ్డి. హైదరాబాద్, దాని పరిసరాల్లో రోజు రోజుకీ అడుగంటిపోతున్న భూగర్భజలాలను పెంచడానికి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్‌ను కట్టే పనికి పూనుకున్నారు. ప్రభుత్వ నేచర్ క్యూర్ హాస్పిటల్, నిఫ్ట్ వంటి చోట్ల వీటిని నిర్మించి అక్కడి నీటి కొరతను గణనీయంగా తగ్గించారు. సిటీలో పలుచోట్ల తవ్వేసిన బోర్‌వెల్స్ నిరుపయోగంగా ఉండడం చూసి వాటిని ఎలాగైనా వినియోగంలోకి తెచ్చి భూగర్భజలాల మట్టాన్ని పెంచాలనే తపనతో ఈ పనికి పూనుకున్నారాయన. ప్రధానంగా హైదరాబాదు, దాని పరిసరాలలో ‘ఇన్వర్స్ బోర్‌వెల్ రెయిన్ హార్వెస్టింగ్’ పద్ధతి ద్వారా భూగర్భజలాలను పెంచడంలో ఆయన కృషి ఆదర్శనీయం. ఈ నేపథ్యంలో తన అనుభవాలను చెప్పుకొచ్చారు.
ఉన్న జలవనరులను అన్ని వైపుల నుంచి తోడేయడమే తప్పించి భూగర్భజలాల మట్టం పెరిగేలా మనం ఏమీ చేయడంలేదు. ఇంకొద్దికాలం ఇలానే కొనసాగితే పరిస్థితులు మరింత ఘోరంగా మారతాయి కూడా.
‘మాది హైదరాబాదే. నేను బి.ఎ ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. ఎలక్ట్రానిక్స్‌లో డిప్లొమా కోర్సు చేశాను. ప్రభుత్వోద్యోగిని. మట్టి అన్నా, నీరు అన్నా నాకున్న ఆసక్తే వాటి పరిరక్షణపై పనిచేయాలనే ఆలోచనను నాలో రేపింది. నీటిని, మట్టిని సరిగా సంరక్షించుకున్నప్పుడే ప్రకృతి సమతుల్యత సాధ్యమవుతుందని,అప్పుడే మనిషి ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందగలడని నేను నమ్ముతాను. కానీ దురదృష్టమేమిటంటే గ్రామీణ, పట్టణ ప్రాంతాలు రెండిట్లోనూ ఈ రెండు సహజవనరులూ అత్యధికంగా దుర్వినియోగానికి, దోపిడీకి గురవుతున్నాయి.
కాంక్రీట్ జంగల్‌గా మారుతున్న హైదరాబాద్ నగరంలో పరిస్థితి నానాటికీ దిగజారిపోతోంది. ఉన్న జలవనరులను అన్ని వైపుల నుంచి తోడేయడమే తప్పించి భూగర్భజలాల మట్టం పెరిగేలా మనం ఏమీ చేయడంలేదు. ఇంకొద్దికాలం ఇలానే కొనసాగితే పరిస్థితులు మరింత ఘోరంగా మారతాయి కూడా. అందుకే పూర్వంలా భూమిలో నీళ్లు పుష్కలంగా ఉన్నట్టు జలవనరులను సమృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. దీనికి ఇన్వర్స్ బోర్‌వెల్ రెయిన్ హార్వెస్టింగ్ దోహదంచేస్తుందని భావించాను. సిటీలో నిరుపయోగంగా పడి ఉన్న ఎన్నో బోర్‌వెల్స్‌ని సైతం దీని ద్వారా ఉపయోగించుకోగలిగితే భూగర్భ నీటి మట్టాన్నిపెంచగలగడమే కాదు నీటి లోటును సులభంగా అధిగమించవచ్చు అన్నది నా గాఢాభిప్రాయం.
ఇందుకోసం ‘స్మరణ్ ‘అనే స్వచ్ఛందసంస్థను ఏర్పాటుచేశాను. మేం చేపట్టిన పని ఎంతో బృహత్తరమైంది. ప్రభుత్వ సహాయసహకారాలు లేకుండా ఈ పని చేయడం అంత సులువేం కాదు. ముఖ్యంగా హైదరాబాదులో ఈ పనికి జిహెచ్ఎంసి, వాటర్‌వర్క్స్ వంటి విభాగాల తోడ్పాటు కావాలి. అప్పుడు సిటీలో భూగర్భ జలవనరులను వృద్ధిచేయడంలో వండర్స్ సృష్టించవచ్చు. ప్రస్తుతం మా స్వచ్ఛందసంస్థ ద్వారా నగరంలోని వివిధ అపార్ట్‌మెంట్లలో, పెద్ద పెద్ద కార్పొరేట్, విద్యాసంస్థల్లో, హాస్పిటల్స్‌లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్‌ను చేపట్టాము. ఇప్పటి దాకా సిటీలో దాదాపు 40 చోట్ల ఈ పని చేశాం.ఈ స్ట్రక్చర్లు వేసిన చోట మాత్రమే కాకుండా దాని పరిసరాల్లో కూడా భూగర్భజలాల స్థాయి పెరిగింది.
హైదరాబాదులో అయితే ప్రస్తుతం 1000 అడుగుల నుంచి 1500-2000 అడుగుల దాకా బోర్ తవ్వితే గానీ నీళ్లు పడని పరిస్థితి ఉంది. దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఇక్కడ చాలామందికి ఇన్వర్స్ బోర్‌వెల్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ గురించి అవగాహన లేదు. నిజానికి ఇళ్లు, ఇన్‌స్టిట్యూషన్స్, కార్పొరేట్‌సంస్థలు ఏవైనా సరే కట్టేటప్పుడే ఇన్‌వర్స్ బోర్‌వెల్ (ఐnఠ్ఛిటట్ఛ ఆౌట్ఛఠ్ఛీజూజూ) రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ కూడా నిర్మించుకోగలిగితే నీటి కొరత సమస్య ఎదురవదు. పర్యావరణం దెబ్బతినదు. ఖర్చు తక్కువ అవుతుంది. ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. హైదరాబాదులో 90 శాతం వర్షపు నీరు నేరుగా డ్రైనేజీల్లో కలిసిపోతోంది లేదా రోడ్డు మీదకొచ్చేసి నిలిచిపోయి వృథా అయిపోతున్నాయి.
మేం విజయవంతంగా చేసిన ప్రాజెక్టుల్లో మాదాపూర్‌లోని నిఫ్ట్్ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) ఒకటి. అక్కడ ఇన్వర్స్ బోర్‌వెల్ మెథడ్ ఆఫ్ రెయిన్ హార్వెస్టింగ్ పద్ధతిలో నాలుగు బోర్లు ఏర్పరిచాం. అక్కడ ఒకప్పుడు రోజుకు 15 ట్యాంకర్ల నీటిని కొనుగోలు చేసేవారు. ఇప్పుడు నీటి ట్యాంకర్ల అవసరమే లేని క్యాంపస్‌గా అది నిలిచింది. మరొకటి నేచర్ క్యూర్ హాస్పిటల్. అక్కడ నిత్యం జరిగే రకరకాల చికిత్సలకు బోలెడు నీరు అవసరం. వాళ్లు కూడా ఈ పద్ధతిని చేపట్టక ముందు నీటి ట్యాంకర్లను కొనుగోలు చేసేవారు. కానీ ఇప్పుడు నీటి ట్యాంకర్లతో పనిలేకుండా తమ చికిత్సలను వాళ్లు నిరాటంకంగా చేసుకోగలుగుతున్నారు. అలాగే సెయింట్ థెరిస్సా స్కూల్‌లో ఇన్వర్స్ బోర్‌వెల్ పద్ధతిలో రెండు బోర్‌వెల్స్ , 13 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ నిర్మించాం. ఈ పద్ధతి ద్వారా సిటీలో ఎండిపోయిన బోర్లన్నింటినీ ఎంతో ఉపయోగకరంగా చేసుకోవచ్చు. ఇవే కాకుండా గచ్చిబౌలి, నిజాంపేట, మణికొండ, మియాపూర్‌లలో కూడా మేం కొన్ని వర్క్సు చేశాం. ఈ పద్ధతి ద్వారా నూరు శాతం భూగర్భ జలాల పెరుగుదల సాధించవచ్చు. హైదరాబాద్‌లో ఉన్నది ప్రధానంగా రాతినేల. ఇలాంటి చోట సాధారణ రీఛార్జ్ పిట్స్ వల్ల ప్రయోజనం ఉండదు. అందుకే ఎక్కువగా ఇన్వర్స్ బోర్‌వెల్ రెయిన్ హార్వెస్టింగ్ పద్ధతిని అనుసరిస్తున్నాం. ఈ పద్ధతిలో పిట్ ఒక్కటే కాకుండా బోర్‌వెల్ కూడా ఉంటుంది. ఇక్కడది రాతి నేల కావడంతో ఈ పద్ధతి సరైంది. అంతేకాదు పిట్స్ ద్వారా అయితే పరిమిత ప్రయోజనం ఉంటుంది. కానీ ఇన్వర్స్ బోర్‌వెల్ రెయిన్ హార్వెస్టింగ్ విధానంలో బోర్‌వెల్ కూడా కలగలిసి ఉండడంతో ప్రయోజనాలు కూడా ఎక్కువే.
ఈ విధానం ద్వారా రూఫ్‌టాప్ ఏరియాలోని వర్షపు నీరుని రెయిన్ వాటర్ అవుట్‌లెట్స్ ద్వారా హార్వెస్టింగ్ పిట్‌లోకి వదలాలి. వర్షపు నీటిలో ఎలాంటి దుమ్ము ధూళి రాకుండా ఫిల్టర్ చేసే సిల్ట్ ట్రాప్స్ కూడా ఉంటాయి. అలా శుభ్రమైన వర్షపు నీరు బోర్ ద్వారా భూగర్భ జలాలలో ఇంకుతాయి. ఈ విధానం మొత్తం ప్రత్యేక సాంకేతిక పద్ధతుల్లో చేస్తారు. రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఉన్నచోటే కాకుండా చుట్టుపక్కల భూగర్భజల నీటిమట్టం కూడా దీనివల్ల పెరుగుతుంది. వర్షపు నీరు వృధా అవడమంటే మానవజీవనానికే ప్రమాదం. నీటిమట్టం నిలకడమీదే మన ఉనికి కూడా నిలబడి ఉంటుంది…’

