బ్రాహ్మణాల కదా కమా మీషు -5
ఉపాఖ్యానాలలో కధలు
వేదం యజ్న యాగాది కర్మల విషయం బోధించటం తో బాటు చిన్న పిల్లలకు పెద్దలు కధలు చెప్పి బుజ్జగించి లాలించినట్లు కొన్ని కధలను కూడా చెప్పింది .వీటిని ఉపాఖ్యానాలు లేక ఆఖ్యాయికలు అని అంటారు .ఈ కదల వెనుక నిగూఢ సందేశం ఉంటుంది .తాను చెప్పదలచిన కర్మ ప్రాధాన్యతను తెలియ జేయటానికి లేక దోషాన్ని వివరించటానికి అనేక ఉపాఖ్యానాలను వేదం చెప్పింది .ఈ ఉపాఖ్యానాలు బ్రాహ్మనాలలో ఎక్కువగా కనిపిస్తాయి .వాటి వివరాలే ఇప్పుడు మనం తెలుసుకో బోతున్నాం .
ఐతరేయ బ్రాహ్మణం
ఋగ్వేదానికి చెందినా ఐతరేయ బ్రాహ్మణం లో చాలా ఉపాఖ్యానాలున్నాయి .అందులో ముఖ్యమైనది ‘’శునస్షేఫోపాఖ్యానం ‘’.ఇక్ష్వాకు రాజు హరిశ్చంద్రుడు పుత్ర సంతానం లేక చాలా కాలం పరి తపించి తనకు పుత్రుడే కనక పుడితే వరుణ దేవుడికే సమర్పించి క్రతువు చేస్తానని మొక్కుకొన్నాడు .వరుణానుగ్రహం తో ‘’రోహితుడు ‘’అనే పుత్రుడు కలిగాడు .పుత్రజననం జరగ్గానే వరుణుడు ప్రత్యక్షమై వాగ్దానం ప్రకారం ఆ కొడుకును తనకు ఇచ్చేయమని అడిగాడు .బారసాల ముచ్చట తీరాక ఇస్తానని రాజు వాయిదా వేశాడు .పది రోజుల తర్వాత మళ్ళీ వచ్చి అడిగితే దంతాలోచ్చినతర్వాత అన్నాడు .ఇలా చాలా సార్లు వరుణుడు రావటం రాజు వాయిదా వేయటం జరిగింది .
రోహితుడికి యుక్త వయస్సు వచ్చి గురుకులం లో చేరి శస్త్రాస్త్ర విద్యలన్నీ నేర్చి ఇంటికి తిరిగి వచ్చాడు .తండ్రి కొడుకుకు తాను వరుణుడికి ఇచ్చిన మాటను జ్ఞాపకం చేశాడు .తాను బలి పశువు కావటానికి ఒప్పుకోక ఇల్లు వదిలి అరణ్యాలకు వెళ్లి పోయాడు .మొక్కు తీర్చ లేదనే కోపం తో వరుణుడు హరిశ్చంద్రునికి జలోదర వ్యాధి వచ్చేట్లు చేశాడు .వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యాధి తగ్గక మంచం పట్టాడు .కొడుకు రోహితుడికి విషయం తెలిసి తండ్రి దగ్గరకు వచ్చాడు .ఇంద్రుడు అడ్డ గించి వనవాసమే మంచిదని చెప్పి అరణ్యాలకు పంపించేశాడు .
ఇలా మూడు సార్లు జరిగింది .తండ్రి రోగాన్ని పోగొట్టటానికి వేరెవరైనా పురుషుడిని ఉంచి యాగం జరిపించాలని రోహితుడు తలచాడు .తిరిగి తిరిగి అజీ గర్తుడు అనే ఆయన దగ్గరకు వచ్చాడు రోహితుడు .అతనికిఉన్న ముగ్గురు కొడుకులలో ఒకరిని తనకిమ్మని వేడుకొన్నాడు .పెద్దకొడుకును ఇవ్వటానికి తండ్రి, చిన్న కొడుకునివ్వటానికి తల్లి ఒప్పుకోలేదు .ఇద్దరి అభిప్రాయాలను తెలుసుకొన్న రెండవ కొడుకు శున స్షేఫుడు తను ఎవరికీ చెందడు కనుక రోహితుని వెంట వెళ్ళాడు .అజీ గర్తునికి ప్రతి ఫలం ముట్ట జెప్పి రోహితుడు శునశ్శేఫుడి ని తీసుకొని వెళ్ళాడు .యాగానికి అప్పటికే అన్ని ఏర్పాట్లు జరిగి పోయాయి .నరుడైన పునస్షేఫుడిని యూప స్తంభానికి కట్టెయ్యటానికి ఎవరూ ముందుకు రాలేదు .చివరికి తండ్రి అజీ గర్తుడే కొడుకును యూపానికి కట్టేసి వంద ఆవులను తోలుకు పోయాడు .ఇంకో వంద గోవులను ఇస్తే కొడుకును చంపటానికి కూడా తండ్రి సిద్ధ పడ్డాడు .శునశ్శేఫుడు ఆర్తి తో వరుణుడిని ప్రార్ధిస్తే ప్రత్యక్షమై యూప స్తంభంనుంచి తప్పించి హరిశ్చంద్రుని వ్యాధిని పోగొట్టాడు .శునశ్శేఫుడు తండ్రి వెంట ఇంటికి వెళ్ళటానికి ఒప్పుకోలేదు .విశ్వామిత్ర మహర్షి దగ్గరకు చేరాడు .ఆ మహర్షి శునశ్శేఫుడిని కుమారుడి గా స్వీక రించాడు .ఈ ఉపాఖ్యానం లో వివిధ వ్యక్తుల మనస్తత్వాల ఆవిష్కరణ జరిగింది .దేవతా స్తుతి రూపాలైన అనేక రుక్కులు ఈ ఉపాఖ్యానం లో ప్రాధాన్యత పొందాయి .
నేనెవరిని ?
సంస్కృతం లో ‘’కః ‘’శబ్దానికి ఎవడు అని బ్రహ్మ అని రెండు అర్ధాలున్నాయి .ఐతరేయ బ్రాహ్మణం లో ఉన్న ఒక ఉపాఖ్యానం లో దీనికి సంబంధించిన కద ఉంది .ఇంద్రుడు వృత్రాసురుడిని చంపి ,లోకాలన్నీ జయించి ,ప్రజా పతి వద్దకు వచ్చి’’ నేను అన్ని ప్రాణుల కంటే గొప్ప వాడిని ‘’అని గర్వం గా చెప్పాడు .అప్పుడు ప్రజాపతి ‘’నా గొప్పతనాన్ని నువ్వు లాగేసుకొంటే మరి నేను ఎవర్ని ?’’అని ప్రశ్నించాడు .దానికి ఇంద్రుడు ‘’ప్రజా పతీ !స్వాత్మ ను నువ్వు కః ‘’అని అన్నావు కనుక ఇక నుంచి నువ్వు ఆ శబ్దం తోనే పిలువ బడుతావు ‘’అన్నాడు .అప్పటి నుంచి కః అనే శబ్దానికి బ్రహ్మ అనే అర్ధం కూడా వచ్చి చేరింది .ప్రజా పతి గొప్ప తనాన్ని కూడా హరించటం చేత ఇంద్రుడు మహేన్ద్రుడయ్యాడు .దేవతలు ఇంద్రుని కోసం ‘’మాధ్యందిన సవనం ‘’’’నిష్కేవల్య శస్త్రం ‘’లను ప్రత్యేకం గా కేటాయించారు .కనుక ఉపాఖ్యానం లో మాధ్యందిన సవనానికి నిషేవల్య శాస్త్రానికి మహాత్మ్యాన్ని కలిగించే శక్తి ఉన్నట్లు సూచిస్తోంది .
కౌశీతకీ బ్రాహ్మణం లో ఉపాఖ్యానాలు
ఇందులో ప్రజా పతి తపస్సు అనే ఉపాఖ్యానం ఉంది. సృష్టి చేయాలని ప్రజాపతి తపస్సు చేశాడు .ఆ తపస్సులో నుంచి అగ్ని వాయువు ,ఆదిత్యుడు చంద్రుడు ,ఉషస్సు జన్మించారు .మొదటి నలుగురు తపస్సు చేశారు ఉషస్సు ద్వారా వెయ్యి కళ్ళు ,వేయి పాదాలు గల మహా పురుషుడు ఉద్భ వించాడు .ఈ ఉపాఖ్యానం సృష్టి ప్రారంభం లో ఉన్న తత్వాలను గురించి తెలియ జేస్తుంది .
అగ్నికి ఆజ్యం కధ –రాక్షసులతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు కంటికి కనిపించకుండా పరారయ్యే అగ్ని ఋతువులలో ప్రవేశించి దాక్కున్నాడు .దేవతలు అసురులను జయించి అగ్ని కోసం వెతుకు తున్నారు .యమ ,వరుణులు అగ్నిని పట్టుకొన్నారు .అగ్ని కోరికను మన్నించి అతనికి వరం గా ‘’ప్రయాజాను యాజలు ‘’,ఆజ్యం ‘’(నెయ్యి )ఇచ్చి మళ్ళీ తీసుకొచ్చారు .అందుకే లోకం లో ‘’అగ్నికి ఆజ్యం ‘’సామెత పుట్టింది .అగ్ని ప్రయాజాను యాజ లతో బాటు నెయ్యినీ కోరుకోన్నాడని దీన్ని బట్టి తెలుస్తోంది .ఈ ఉపాఖ్యానం లో వృత్రాసుర వధ ,సూర్యోత్పత్తికూడా ఉన్నాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -25-6-14-ఉయ్యూరు
.

