గంగ ప్రక్షాళన… ఓ భగీరథ ప్రయత్నం!

గంగ ప్రక్షాళన… ఓ భగీరథ ప్రయత్నం!

  • -బి.వి.ప్రసాద్

‘గంగానది చరిత్రే భారతదేశ నాగరికత, సంస్కృతి చరిత్ర’ -అని ఆనాడే తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. గంగానదిలో మునిగితే చాలు పాపాలన్నీ పోతాయనేది భక్తుల నమ్మకం. అంత నమ్మకం ఉన్నా నేడు గంగానదికి వచ్చేవారంతా అందులో గంగమ్మను చూసి ఉలిక్కి పడుతున్నారు. విదేశీయులు అయితే చెప్పనక్కర్లేదు సిగ్గు, జాలి పడుతుండగా భారతీయులు సైతం గంగానదిని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. పాపాలు పోవడం దేవుడెరుగు, ఆ అపరిశుభ్రత వల్ల ఎలాంటి వ్యాధులు, రోగాలు ప్రబలుతాయోనని భయపడుతున్నారు. హిమాలయాల్లోని గంగోత్రి నుండి బంగ్లాదేశ్ లోని సుందర్‌బన్ డెల్టా వరకూ 2,500 కిలోమీటర్లు దూరంపైగా ప్రవహించే గంగానది ప్రతి రోజు అనేక రకాలుగా కోట్లాది మందికి ఉపయోగపడుతోంది. భారతదేశ ప్రక్షాళన- గంగానది ప్రక్షాళనతో వారణాసి నుండి మొదలవుతుందని ప్రధాని నరేంద్రమోదీ చెప్పడంతో ప్రపంచం అంతా తాజాగా మరో మారు గంగానది ప్రక్షాళన గురించి మాట్లాడుకుంటోంది. ‘భరత్‌ను ప్రక్షాళన చేద్దాం దానికి వారణాసి నుండి నాంది పలుకుదాం’ ఈ వ్యక్తి వ్యర్థపదార్థాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడని ప్రజలు అంతా ఆలోచిస్తారు, కాని అదే భారత్‌ను మారుస్తుంది అని పరమ పావన గంగానదికి హారతి ఇచ్చిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రం చేసుకోవడం భారతదేశ మాతకు సేవ చేసిన దానితో సమానం , చిన్న చిన్న ప్రయత్నాలే లక్ష్యాలను సాధిస్తాయి అని కూడా నరేంద్రమోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. నిజానికి ఈ ప్రయత్నం ఈనాటిది కాదు. కాలుష్యం కోరల్లో చిక్కున్న గంగానదిని 2020 నాటికి ప్రక్షాళన చేస్తామని ఆనాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్‌సింగ్ కూడా చెప్పారు. యుపిఎ ప్రభుత్వం దానికి కట్టుబడి ఉందని, మరో తొమ్మిదేళ్ల నాటికి శుద్ధి చేయని నీరు గానీ, పారిశ్రామిక కాలుష్యాలు కానీ గంగానదిలో చేరే అవకాశాలు ఉండవని గంగశుద్ధి కార్యక్రమం ద్వారా 2020 నాటికి ప్రక్షాళన చేయని నగర పాలక సంస్థ నీరు గంగానదిలో చేరే అవకాశం ఉండదని కూడా మన్మోహన్‌సింగ్ 2010లో చెప్పారు. ఆ మాటలు చెప్పి అపుడే నాలుగేళ్లు గడిచిపోయింది. తర్వాత ఎన్‌డిఎ అధికారంలోకి వచ్చింది. వస్తూ వస్తూనే గంగానది శుద్ధిపై గంభీరమైన హామీలను ఈ ప్రభుత్వం కూడా ఇచ్చింది. ప్రపంచ నాగరికతలు అన్నీ నదీ తీరాల్లో పురుడుపోసుకున్నవే. జీవజాలం, మనిషి ఉనికి- విస్తృతి- అభివృద్ధి అన్నీ నీటిమీద ఆధారపడినవే. ఎడారిలో గొంతు తడారిపోతున్నా జీవికి కావల్సింది నీటి చుక్కే తప్ప సంపదలు కావు. నీటిని నీలి బంగారమని ఊరికే అనలేదు, వాస్తవ బంగారం కంటే ఇది చాలా అమూల్యమైనది కనుకనే అలా అంటారు. ప్రాణావసరమైన ఈ నీరు నేడు విషతుల్యమై ప్రాణాంతకంగా మారింది. భారతదేశం నదుల దేశం అంటే అతిశయోక్తి కాదేమో, నదులు మన దేశ ఆర్ధిక సాంస్కృతిక స్రవంతిలో భాగమైపోయాయి. నదులు అన్నీ మానవుని మనుగడకు మూలాధారాలే. నాగరికతకు పుట్టినిళ్లు నదులు. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే అన్ని ప్రధాన నగరాల నాగరికతకు కారణం అవి నదుల తీరాన వెలసినవి కావడమే, సింథునాగరికత సింథు నది తీరాన వెలసింది. మానవ అవసరాలకు, రవాణాకు, విద్యుత్ ఉత్పత్తికి, చేపల పెంపకానికి, ఇలా అనేక విధాలా ఉపయోగంలో ఉన్నవే. సాధారణంగా నదులన్నీ భూభాగంపై ప్రవహిస్తుంటాయి. భారతదేశంలో ప్రవహించే నదులు ప్రధానంగా హిమాలయాల్లో పుట్టినవి, దక్కను నదులు. వర్షపు నీటివల్ల లేదా ఎత్తయిన పర్వతాల్లో మంచు కరిగి చిన్న చిన్న పాయలుగా ప్రవహిస్తూ అవి ఒకదానికొకటి ఏకమై పెద్ద ప్రవాహంగా మారడమే నదిగా పరిగణిస్తాం. సాధారణంగా నదులు పర్వత ప్రాంతాల్లో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహించి చివరికి సముద్రాల్లో అంతవౌతాయి. కొన్ని నదులు భూమిలోనే ఇంకిపోతాయి. పశ్చిమ అమెరికాలోని ఎడారుల్లోనూ, సౌదీ అరేబియా ఎడారుల్లో ఇలా భూమిలో ఇంకిపోయే నదులు ఎన్నో ఉన్నాయి. ఇవి వర్షం పడేటపుడు మాత్రమే పొంగి పొర్లుతాయి. వర్షం ఆగిపోగానే మిగిలిన నీరు నేలలోకి ఇంకిపోయి ఎండిపోతాయి. మన వైపు ఉండే దొంగ ఏర్లు ఇలాంటివే. ఇలా ఇంకిపోని నదులనే మనం జీవనదులు అంటాం. నేలలోకి ఇంకిపోగా మిగిలిన నీరే జీవనదుల్లో ప్రవహించేది , ఎంత నీరు ఇంకుతుందీ అనేది నదీ గర్భం అడుగున ఉన్న రాతి పొరల లక్షణాల మీద ఆధారపడి ఉంటుంది. అడుగున సున్నపురాయి ఉంటే ఎక్కువ నీరు ఇంకే అవకాశం ఉంటుంది. కాని నల్లసున్నపు రాయి అంటే గ్రానైట్ ఉంటే అంతగా నీరు ఇంకదు. హిమాలయాల్లో పుట్టిన నదులు ఎండాకాలంలో సైతం నీటితో ప్రవహిస్తూ ఉంటాయి. అందులో ముఖ్యమైనవి సింధూనది, గంగానది, బ్రహ్మపుత్ర నది. సింధునది హిమాలయాల్లో కైలాస పర్వతసానువుల్లో పుట్టి ప్రవహిస్తోంది. మార్గాంతరంలో జీలం, చీనాబ్, రావి, బీయాస్, సట్లెజ్ అనే ఐదు ఉపనదులను తనలో కలుపుకుని పాకిస్థాన్‌లోని అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. ఈ నదికి ఉన్న ఉపనదుల వల్ల పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతోంది. ఇక బ్రహ్మపుత్రనది చూసుకుంటే ఇది హిమాలయాల్లోని మానస సరోవరంలో పుట్టి టిబెట్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లో బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది అత్యంత పొడవైన నది, భారత్‌లో ఇది 885 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. ఇక గంగానదికి వస్తే భారతదేశంలో ఇది అత్యంత ప్రధానమైనది, పవిత్రమైనది కూడా . ఉత్తరాంచల్ రాష్ట్రం పరిధిలోని హిమాలయాల్లోని గంగోత్రి అనే హిమనీనదంలో భాగీరధి నది ఉద్భవిస్తుంది. ప్రవాహ మార్గంలో దేవ ప్రయాగ వద్ద అలకానంద నది దీనితో కలుస్తుంది. అక్కడి నుండి దీనిని గంగానది అంటారు. కొంత దూరం ప్రవహించాక హరిద్వారం వద్ద మైదానమార్గంలోకి వస్తుంది. జన్మస్థలంలో దీని ఎత్తు 7756 మీటర్లు. భారతదేశ ఆర్ధికవ్యవస్థ చరిత్ర, సంస్కృతి గంగానదితో అవినాభావంగా ముడిపడి ఉన్నాయి. హిందూ మతంలో గంగానదికి ఉన్న ప్రాధాన్యత చాలాముఖ్యమైనది. గంగమ్మతల్లి, పావన గంగ, గంగా భవాని అని ఈ నదిని హిందువులు స్మరిస్తారు. గంగానది మొత్తం పొడవు 2510 కిలోమీటర్లు, గంగా నది దాని ఉపనది యమున కలిసి విశాలమైన మైదాన ప్రాంతంలో ప్రవహిస్తాయి. సారవంతమైన ఈ గంగా యమునా మైదానం ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌లలో విస్తరించి ఉంది. ఈ గంగానది తీరాన ఎన్నో పుణ్య క్షేత్రాలు వెలిశాయి. ఇది ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ద్వారా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దీనికి ఉన్న ఉపనదుల్లో ముఖ్యమైనవి యమున, కోసి, చంబల్, బెత్వా, సోన్, దామోదర్ ముఖ్యమైనవి. అలహాబాద్ తర్వాత ఎన్నో నదులతో కలిసి గంగానది మహా ప్రవాహంగా మారుతుంది. పశ్చిమ బెంగాల్ మాల్దా వద్ద మొదటిసారి చీలుతుంది. అక్కడినుండి హుగ్లీ నది ప్రారంభం అవుతుంది. విశాలమైన గంగా హుగ్లీ డెల్టా అక్కడితో మొదలవుతుంది. ప్రధానమైన గంగానదిని మాల్దా తర్వాత పద్మ నది అంటారు. పద్మ నది బంగ్లాదేశ్‌లో కలిసిన తర్వాత బ్రహ్మపుత్రా నది చీలిక అయిన జమునా నది పద్మతో కలుస్తుంది. ఆ తర్వాత మేఘనా నది కూడా దీంతో కలుస్తుంది. ఇంత పవిత్రమైన గంగానది నేడు కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. దేశవ్యాప్తంగా 445 నదుల నుండి సేకరించిన నీటినమూనాలను సాకల్యంగా విశే్లషించిన కేంద్ర కాలుష్య నియంత్రణా సంస్థ ఇటీవల ప్రకటించిన అంశాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా ఉన్నాయి. వాటి ప్రకారం సగానికి పైగా నదుల్లో నీరు మనిషి నేరుగా తాగడానికి పనికిరావు. చాలా చోట్ల నదుల జలాలు స్నానానికి సైతం పనికిరానంత మురికిగా ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లోని నివాస గృహాల నుండి దాదాపు 40వేల మిలియన్ లీటర్లు మురికి నీరు నదుల్లోకి చేరుతోంది. 2050 నాటికి అది లక్ష మిలియన్ లీటర్లు స్థాయికి చేరుకుంటుందని మరో అంచనా. అపుడిక నదుల్ని రక్షించడం ఎవరి తరం కాదు, ఆ గరళకంఠుడు భువికి దిగాల్సిందే. దేశంలో జనాభాతో పాటు వనరుల వినియోగం పెరిగిపోతోంది. నీటి లాంటి సహజ సంపదలపై వత్తిడి కూడా ఎక్కువవుతోంది. పెరుగుతున్న జనాభా జల అవసరాలను జీవనోపాధిని నదులే తీర్చాల్సి వస్తోంది. నివాస ప్రాంతాల నుండి వచ్చి చేరుతున్న మురికి నీరు నదుల్లో వచ్చి చేరుతోంది. మరో పక్క దేశంలో 70 శాతం నీరు కలుషితమైనదేనని అనేక సంస్థలు చెబుతున్నాయి. దేశంలో 86 శాతం మేర ప్రజలకు వచ్చే వ్యాధులకు కలుషిత నీరే కారణమని నివేదికలు చెబుతున్నాయి. సామాన్యుల జీవన ప్రమాణాలను పెంపొందించడం ప్రభుత్వ కర్తవ్యమని రాజ్యాంగంలోని 47వ అధికరణ ఉద్దేశిస్తోంది. రక్షిత నీటిని అందించకపోవడం ద్వారా ప్రభుత్వం తన విధిని కూడా విస్మరిస్తోంది. పెరుగుతున్న పేదరికం కూడా నదీతీర వ్యవస్థలపై ప్రభావం చూపుతోంది. మరో పక్క తీర ప్రాంతాల్లో ఉన్నవారు అన్ని అవసరాలకూ అసంకల్పితంగానే కాలుష్యానికి కారకులవుతున్నారు. పట్టణీకరణ దుష్ప్రభావం కూడా నదులను తీవ్రంగా దెబ్బతీస్తోంది. దేశంలో పట్టణాల్లో జనాభా 30 శాతం దాటింది. ఢిల్లీతోపాటు ఆగ్రా, కాన్పూర్, అలహాబాద్, వారణాసి, పాట్నా, కోల్‌కతా, లక్నో వంటి పట్టణాలు నదీతీరానే్న వెలిశాయి. అక్కడి ప్రజల వాడకం అంతా నదులను కలుషితం చేస్తున్నాయి. మురికివాడలు లేని నగరాలుగా తీర్చిదిద్దే ప్రక్రియ కొనసాగుతున్నా లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోతున్నాయి. నదీజలాల కాలుష్యానికి కారకులవుతున్న జనం చివరికి ఆ కలుషిత జలాలే తాగి వ్యాధిగ్రస్తులవుతున్నారు. దేశప్రగతికి వెన్నుదన్నుగా ఉంటున్న పారిశ్రామిక రంగం కూడా వ్యర్ధాలను నదుల్లోకి విసర్జిస్తోంది. ఎరువులు, చమురుశుద్ధి, కాగితం, చర్మశుద్ధి, లోహాలు, రసాయనాలు, ఔషధాలు రంగుల తయారీ పరిశ్రమలు నదీతీరాలను ధ్వంసం చేస్తున్నాయి. వ్యవసాయానికి అధికంగా ఉపయోగిస్తున్న ఎరువులు, పురుగుల మందులు, సేంద్రీయ పదార్ధాలు, పంట అనంతర వ్యర్ధాలు సైతం పెద్ద మొత్తంలో నదుల్లోకి చేరి జలాలను విషతుల్యం చేస్తున్నాయి. సాగులో ఉపయోగించే రసాయన పదార్ధాల దుష్ప్రభావాలను తొలగించేందుకు వ్యర్ధాలు నదుల్లో చేరి నీటిని విషతుల్యం చేస్తున్నాయి. ఇన్ని కారణాలతో కాలుష్యకారకంగా మారిన గంగానది ప్రక్షాళనకు గత మూడు దశాబ్దాల్లో 20వేల కోట్ల రూపాయలు వెచ్చించినా ఫలితం లేకపోయింది. ఇంత శాపగ్రస్తం కావడానికి కారణం ఎవరు? పవిత్ర గంగానది కలుషితానికి ప్రథమ ముద్దాయి మనిషే. ఈ మహాపరాధం స్వయంకృతమే. పారిశ్రామిక వ్యర్ధాలు, ఆవాసాల మురుగునీరు, అక్రమ కట్టడాలు, మతవిశ్వాసాల పేరిట ఆచరించే నిర్హేతుక చర్యలు అన్నీ కలగలిపి పవిత్ర నది కాస్తా అపవిత్రంగా మారిపోవడానికి కారణమైంది. గంగా యమున పేర్లు చెబితే చాలు మనసు పులకరించిపోతుంది. చల్లన గంగమ్మ ఒడిలో తడిసి స్వాంతన చెందినట్టు నమ్మి కొలిచే దేవతలు పాపాలను ప్రక్షాళన చేసి ఆశీర్వదిస్తే చాలు పునీతులైనట్టు గంగానదిలో మునిగే ప్రతి ఒక్కరికీ కలిగే భావన అది. గంగానది పరిసరాలు, ప్రకృతి రమణీయత, సుందరమైన ఆకుపచ్చని వనాలు, దట్టమైన వృక్షాలతో కూడిన పర్వతసానువులు మైమరపింప చేసేవి, జీవితకాలం అనుభవంలో ఉండిపోయేవి. కాని ఇపుడు ఆ దృశ్యాలే కనిపించడం లేదు. కనువిందు చేసే దృశ్యాలు కానీ, మైమరపింప చేసే అందాలు కాని లేకపోవడంతో సుమధుర భావనలే రావడం లేదు. పవిత్రకాసారం కాస్తా మురికి కూపంగా చూడాల్సి వస్తోంది. జలాల వద్దకు వెళ్తే చాలు చల్లని గాలికి బదులు కంపుకొట్టే దుర్వాసన ముక్కుపుటాలను అదరగొడుతోంది. 30 ఏళ్లుగా ప్రభుత్వాలు ఎన్ని చెప్పినా, ఎన్ని చర్యలు చేపట్టినా గంగానది స్థితి యథాతథంగానే ఉంది. ఇపుడు గంగానది ప్రక్షాళనకు కంకణబద్ధమైనట్టు కేంద్రంలో కొలువుదీరిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రకటించింది. ఇంత వరకూ భారీ స్థాయిలో నిధులను కుమ్మరించినా ప్రక్షాళన కాలేదు సరికదా కాలుష్యస్థాయి మితిమీరిపోయింది. గంగానదిని శుద్ధి చేయడానికి గత మూడు దశాబ్దాల్లో గంగా యాక్షన్ ప్లాన్ -1 పేరిట గంగా యాక్షన్ ప్లాన్-2 పేరిట 20వేల కోట్లకు పైగా వెచ్చించారు. అయినా నీరు మారలేదు. మనుషుల తీరు అసలే మారలేదు. శుద్ధి చేయని పారిశ్రామిక వ్యర్థాలు, మున్సిపల్ మరుగునీరు ఈ కాలుష్యంలో ప్రధానభాగంగానే చెప్పవచ్చు. ఒక అధ్యయనం ప్రకారం హరిద్వార్ వద్ద గంగలో కొలిఫాం బ్యాక్టీరియా స్థాయి 5500 కు చేరింది. ఇది అనుమతించదగిన స్థాయి కంటే 500 రెట్లు ఎక్కువ. గంగ మొదలయ్యే గౌముఖి మొదలుకుని హరిద్వార్, రిషికేశ్ వరకూ చేరే మానవ వ్యర్ధాలు ఇందుకు కారణం. మరోపక్క మానవ నిర్మిత కట్టడాలు కూడా ప్రమాదాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో అధిక నీటి వినియోగం, డ్యాంల నిర్మాణం కారణంగా గంగ ఎండిపోతోంది. ఇసుక మేట ఫలితంగా ప్రవాహశీలత తగ్గిపోతోంది. ఇక మరోవైపు మతాచారాలు కూడా తమ వంతు కారణమవుతున్నాయి. గంగానది నీరు మనుషుల పాపాలను ప్రక్షాళన చేసి స్వర్గప్రాప్తికి సాయపడుతుందనే హిందూ విశ్వాసం కూడా ప్రస్తుత కాలుష్య స్థాయిని పెంచుతోంది. పలు సందర్భాల్లో నిర్వహించే కర్మకాండలు, విగ్రహనిమజ్జనాలు, మృతదేహాల జలార్పణం వంటివి కాలుష్యం పెరగడానికి కారణమవుతున్నాయి. ఫలితంగా విషపూరిత రసాయనాలు, లోహాలు, క్రిమిసంహారిణులు, రేడియోధార్మిక పదార్ధాలతో నిండిన కలుషిత నదీ జలాలు సమస్త జీవావరణ వ్యవస్థకూ తీరని హాని చేస్తున్నాయి. వ్యర్ధాలు చేరి నీటి నాణ్యతను దెబ్బతీయకుండా నిరోధించేందుకు కావల్సిన సాంకేతిక, వైజ్ఞానిక పరిజ్ఞానాలు రైతులకు అందుబాటులో లేకపోవడం అందుకు ప్రధానకారణం. భారీ ఎత్తున నిర్వహించే కుంభమేళా వంటి క్రతువులు కూడా కాలుష్యాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఈ ప్రమాదం బారి నుండి మానవాళితో పాటు జలచరాలు, జంతుజాతిని కాపాడే ఉద్ధేశ్యంతో భారత కాలుష్య నియంత్రణ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచబ్యాంకు, భారత ప్రమాణాల సంస్థ, భారతీయ వైద్య పరిశోధనా మండలి లాంటివి అనేక మార్గదర్శక ప్రణాళికలు రచించి, నియమ నిబంధనలు ఏర్పరచినా ఆచరణలో అవన్నీ విఫలమయ్యాయి. ప్రభుత్వ స్థాయిలో చొరవ కొరవడి ప్రజల్లో అవగాహన లోపించి నెత్తిమీద కత్తిలా కాలుష్యం వేలాడే దుస్థితి ఏర్పడింది. దామోదర్ నది, సాఫీ, గంగా నదుల్లో సీసం ఆర్సెనిక్ అవశేషాలు ప్రమాదకరస్థాయిని మించి ఉన్నట్టు తేలింది. ఈ కలుషిత నీరు తాగే ప్రజలకు టైఫాయిడ్, కలరా, అతిసార, అమీబియాసిస్ వంటి రుగ్మతలకు గురవుతున్నారు.మలేరియా,నిద్రలేమి పుణ్యం కూడా ఈ కలుషిత జలాలదే. భారతీయ సంస్కృతికి జీవధారగా, వ్యవసాయరంగానికి ఆలంబనగా, ఆర్ధికవ్యవస్థలకు వెన్నుదన్నుగా చెప్పుకునే ఈ జీవనదులు మాత్రం ప్రాణాలనే హరిస్తున్నాయి. వారణాసి అయినా, హరిద్వార్ అయినా అదే పరిస్థితి కాన్పూరులో కూడా పారిశ్రామిక వ్యర్ధాలు గంగానదిని కలుషితం చేస్తున్నాయి. కోల్‌కటా చుట్టూ హుగ్లీ నదిపై ఉన్న 150 బడా పారిశ్రామిక వాడలు ఈ జలాలను పూర్తిగా కలుషితం చేస్తున్నాయి. గంగాజలాల్లో 90 శాతం సాగునీటి అవసరాలకు వాడుతున్నారు. దీంతో గంగానది ప్రవాహ వేగం కూడా తగ్గిపోయింది. కార్యాచరణ ప్రణాళికలు అంటూ వేల కోట్ల రూపాయిలు గంగపాలు అవుతోంది. 2012 జాతీయ జలవిధాన ముసాయిదాలో నదులకు బేసిన్లకు సంబంధించి అనేక అంశాలను ప్రస్తావించినా తగిన చట్టపరమైన సంస్థాగతమైన యంత్రాంగాలు లేకపోతే ప్రయోజనం శూన్యం. కాలుష్యం కారణంగా జాతి జీవనాడులే కుంగిపోతున్న ఈ తరుణంలో ప్రభుత్వం సత్వరం గట్టి చర్యలు చేపట్టాల్సి ఉంది. మానవతప్పిదాలు కొనసాగిస్తూ మరో పక్క ప్రభుత్వం ఏమీ చేయలేదనే వాదనలకు దిగడం సబబు కాదు, గంగాప్రక్షాళనకు, గత వైభవ పునరుద్ధరణకు గత ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకున్నాయి.గంగా నది శుద్ధి కార్యక్రమం 1985 జూన్‌లోనే మొదలైంది. తొలి దశ 2000 సంవత్సరం వరకూ జరిగింది. తొలి అంచనాలు 256.26 కోట్లు కాగా తర్వాత సవరించిన వ్యయం 462.04 కోట్లు. దీనివల్ల యుపిలో 6, బీహార్‌లో 4, పశ్చిమబెంగాల్‌లో 15 పట్టణాలకు కూడా ప్రయోజనం చేకూరింది. ఇక రెండో దశలో బీహార్, జార్ఖాండ్, బెంగాల్, యుపి, ఉత్తరాఖండ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు మేలు జరిగేలా 705 కోట్ల రూపాయలతో గంగానది శుద్ధి కార్యక్రమం మొదలు పెట్టారు. ఇందుకోసం ప్రభుత్వం నేషనల్ గంగా రివర్ బేసిన్ అథారిటీని, నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా ను ప్రారంభించింది. 1986లో భారత ప్రభుత్వం గంగా యమున ప్లాన్ చేపట్టి భారీ స్థాయిలో ఖర్చు చేసినా అది అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. 2010లో నవంబర్ 1న గోముఖ్ -ఉత్తర కాశీల మధ్య 135 కిలోమీటర్లు ప్రాంతాన్ని పర్యావరణ రక్షిత స్థలంగా ప్రకటించారు. నదిపై ప్రతిపాదించిన మూడు ప్రాజెక్టులను విరమించుకున్నారు. 2010 జూన్ 28న ప్రపంచ బ్యాంకుతో వందకోట్ల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. 1986 నాటి గంగానది ప్రక్షాళన ప్లాన్‌లో భాగంగా 2009లో చేపట్టిన ప్రాజెక్టులో ఈ లోను ఒక భాగం. 2019 నాటికి మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు జరపుకునే వేళ దేశాన్ని ప్రక్షాళన చేసుకునే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. *

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.