లేడీ డిటెక్టివ్..యమ యాక్టివ్

ఈ ఫోటోలో యాచకురాలి వేషంలో రోడ్డుమీద కూర్చొని ఉన్న ఆవిడ్ని గుర్తుపట్టారా. బాగా చూడండి… ఆమె బాలీవుడ్ నటి విద్యాబాలన్. ‘బాబీ జాసూస్’ అనే హిందీ సినిమాలో ఆమెది డిటెక్టివ్ పాత్ర. అయితే నిజజీవితంలో కూడా లేడీడిటెక్టివ్‌లు ఇలానే చేయాల్సి ఉంటుందా? వాళ్ల పని ఎలా ఉంటుంది? వంటి ప్రశ్నలకు జవాబు కావాలంటే వాస్తవ జీవితంలో పాతికేళ్లుగా లేడీ డిటెక్టివ్‌గా పనిచేస్తున్న రజనీ పండిట్ గురించి చదవాలి. ఆ వివరాలే ఇవి…
“నేను ముంబయిలో పుట్టి పెరిగాను. మా నాన్న పోలీసు శాఖలో సిఐడి ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసేవారు. నాన్న మహాత్మాగాంధీ హత్యోదంతం కేసు విషయంలో పనిచేశారు కూడా. నా చిన్నప్పుడు ఎంతోమంది తమ కుటుంబ సమస్యల విషయంలో నాన్న వద్దకు వచ్చేవారు. అయితే వాటి ని ఆయన చేపట్టే వాళ్లు కాదు. అది చూసిన నేను ‘వాళ్లకెందుకు నువ్వు సాయం చేయవు నాన్నా?’ అని ప్రశ్నించాను. దానికాయన ‘నువ్వెందుకు ఈ సమస్యల గురించి పట్టించుకుంటున్నావు’ అన్నారు. ఆ తరువాత కాలేజిలో చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయి… పొగతాగడం, మద్యపానం చేయడం వంటి దురలవాట్లు ఉన్న అబ్బాయిలతో కలిసి రోజూ బయటికి వెళ్తుండేది. ఆ విషయాన్ని ఆ అమ్మాయి తల్లిదండ్రులకి చెప్పాలనుకున్నాను. కాలేజి క్లర్క్ వద్దకు వెళ్లి నేనా అమ్మాయి స్నేహితురాలినని, తనకి బహుమతి ఇచ్చేందుకు ఆమె ఇంటి చిరునామా కావాలని అడిగాను. అలా చిరునామా తీసుకుని ఆమె తల్లిదండ్రులతో విషయం చెప్పాను. తరువాత ఒక ట్యాక్సీ మాట్లాడి ఆ అమ్మాయి వాళ్ల నాన్నని ఎక్కించుకుని ఆమె ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి కూతురు ఏం చేస్తుందో చూపించాను. అప్పుడాయన నన్ను ‘నువ్వు డిటెక్టివ్ పనిచేస్తున్నావా’ అని అడిగారు. అప్పుడు నా బుర్రలో దాని గురించిన ఆలోచన మొదలైంది.ఆ ట్యాక్సీకి నా పాకెట్ మనీనే ఇచ్చాను.
‘సాయం’తో డిటెక్టివ్
గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక మూడునెలలు టెంపరరీగా ఉద్యోగం చేశాను. అలాచేసే రోజుల్లో మా ఆఫీసులో ఒకావిడ ఏడుస్తూ కనిపించింది. విషయం ఏంటని అడిగితే “నాకు ముగ్గురు కొడుకులు. వాళ్లలో ఒకడికి పెళ్లి చేశాను. ఇంట్లో నగలు కనిపించడంలేదు. కొత్త కోడలు తీసిందేమోనని అనుమానం” అని చెప్పింది. కాని ఆ విషయాన్ని బయటికి చెప్పలేకపోయింది. కొత్తగా ఇంట్లో అడుగుపెట్టిన అమ్మాయి మీద నింద వేయడం సరికాదనుకుందామె. నేనామెకు సాయం చేస్తానని చెప్పినప్పట్నించీ వాళ్ల ఇంటిని గమనించడం మొదలుపెట్టాను. ఒకరోజు ఆమె కొడుకు చేతిలో ఏదో పట్టుకుని బయటకు వెళ్లడం గమనించి అతడ్ని అనుసరించాను. అతడు నగలు అమ్ముతుంటే పట్టుకున్నాను. నగలకి సంబంధించిన ఫోటోలు ఆమెకి చూపించి కొడుకుని అడగమని చెప్పాను. అడగ్గానే నంగి నంగి మాటలేవో చెప్పాడు. కాని ఆ తరువాత నిజాన్ని ఒప్పుకున్నాడు. సమస్య పరిష్కారం అయ్యింది. అప్పుడే నేను పూర్తిస్థాయి డిటెక్టివ్ కావాలని నిర్ణయించుకున్నాను. దానికి సంబంధించి మరాఠీ దినపత్రికలో ప్రకటన ఇవ్వాలనుకున్నాను. కాని వాళ్లు ప్రకటన ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. కాని కొన్నాళ్ల తర్వాత ఆ పత్రికా సంపాదకుడి స్నేహితుడికి నా సాయం అవసరం పడింది. ఆ సంఘటన తరువాత నన్ను ఇంటర్వ్యూ చేసి ఆ పత్రికలోనే ప్రచురించారు. అదే నా మొదటి ఇంటర్వ్యూ. అప్పట్నించీ నాకు ఎటువంటి ప్రచారం అక్కర్లేకుండానే మంచిప్రచారం లభించింది.
మా దగ్గరకొచ్చే 80 శాతం కేసుల్లో అక్రమసంబంధాలకి సంబంధించినవే. వాటిలో 75 శాతం వివాహేతర సంబంధాలకు సంబంధించినవి. ఆశ్చర్యం గొలిపే విషయం ఏమిటంటే 80 శాతం కేసుల్లో వాళ్ల అనుమానాలే నిజం అవుతాయి. నా క్లయింట్లే నాకు మంచి స్నేహితులు. ధనిక వర్గాల నుంచి సాధారణ కుటుంబాల వరకు అన్ని వర్గాల వాళ్లు నా దగ్గరకు వస్తారు. ఈ జాబ్‌లో కావాల్సిందల్లా ధైర్యం, బుర్ర చురుకుగా పనిచేయడం, ఎదుటి వాళ్ల సమస్యల పట్ల సహానుభూతి కలిగి ఉండడం.
రోజుకి పద్నాలుగంటలు పనిచేస్తాను. సంవత్సరానికి ఎనిమిది నుంచి పది లక్షల రూపాయలు సంపాదిస్తాను. బాల్యంలోనే పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. కేసుని పరిష్కరిస్తే కలిగే ఆత్మతృప్తి ముందు మిగతావన్నీ నాకు దిగదుడుపే. పేరు కోసమో, గొప్ప కోసమో, డబ్బు కోసమో ఈ వృత్తిని చేపట్టలేదు. నా చుట్టూ ఉన్న నలుగురికీ నాకు చేతనైనంత సాయం చేయగలిగితే నాకంతే చాలు. ఈ పని చేస్తున్నాను కాబట్టి ప్రాణభయం లేదా అని మీరడగొచ్చు. ‘డర్ మేరీ డిక్షనరీ మే నహీ హై’. దేనికి భయపడాలి. మహా అంటే చావుకే కదా. చావనేది దగ్గరికొస్తే మనమేం చేయగలిగిందేమీ లేదు. అలాంటప్పుడు ఏదో అయిపోతుందని భయపడడం ఎందుకు?
కన్న కొడుకునే కిడ్నాప్ చేసి…
భర్త స్నేహితుడితో తనకున్న అక్రమసంబంధం గురించి ఏడేళ్ల కొడుక్కి తెలిసిపోయిందని ఒక తల్లి కొడుకునే కిడ్నాప్ చేయించింది. ఆమె భర్త విదేశాల్లో ఉంటాడు. రెండు నెలలు సెలవులు తీసుకుని ఇండియాకు వస్తున్నాడు. భర్త, కొడుకు కలిస్తే విషయం ఎక్కడ బయటపడుతుందోనని ఆమె కొడుకుని కిడ్నాప్ చేయించింది. భర్తకేమో పుట్టినరోజు పార్టీకి వెళ్లిన కొడుకు ఇంటికి తిరిగిరాలేదని. పోలీసు కేసు పెట్టానని చెప్పింది. కొడుకు వివరాలు కనుక్కోమంటూ ఆ జంట నా దగ్గరకు వచ్చారు. నిఘా మొదలుపెట్టిన నాకు ఒకరోజున ఆమె స్నేహితురాలు ఇంటినుంచి బయటకు ఆహారం తీసుకెళ్లడం గమనించాను. ఫాలో అయితే మొదట ఆమె తన సొంత ఇంటికి వెళ్లింది. అక్కడ్నిండి తన స్నేహితురాలి కొడుకును దాచిన లోనావాలాలోని ఇంటికి వెళ్లింది. అదే విషయం ఆమె భర్తకి చెప్పి మీ భార్యకి విషయం చెప్పకుండా తీసుకురండి. అలాగే ఆమె వద్ద మొబైల్ లేకుండా జాగ్రత్తపడండి అని చెప్పాను. లోనావాలా వెళ్లి ఆమె నిజస్వరూపాన్ని బయటపెట్టాం. చివరకు ఆమె నేరాన్ని ఒప్పుకుంది. కొడుకుని తీసుకుని శాశ్వతంగా విదేశానికి వెళ్లిపోయాడు ఆ భర్త.
సినీ నటులు, నటీమణులు అనుమానాలు…
నా క్లయింట్లలో సినీ నటులు, నటీమణులు కూడా ఉన్నారు. జీవిత భాగస్వాములు వాళ్లని మోసం చేస్తున్నారన్న అనుమానంతో వస్తుంటారు వాళ్లు. నటీమణులు బుర్ఖా ధరించి నన్ను ఫైవ్‌స్టార్ రెస్టారెంట్లలో కలిసి వాళ్ల సమస్యల గురించి చెప్తారు. ఇలాంటి అన్ని కేసుల్లో వాళ్లనుకున్నదే నిజమవుతుంటుంది. భాగస్వాములు వాళ్లని మోసం చేస్తున్నారనే విషయం నిజమేనని తెలిసినప్పటికీ వాళ్లు మాత్రం భర్తల నుంచి విడిపోయేందుకు ఇష్టపడరు. జీవితభాగస్వామి లేదా కుటుంబసభ్యులు డబ్బు దుర్వినియోగం చేస్తున్నారనే అనుమానం వచ్చినప్పుడు… వాళ్లు సంతకాలు చేసిన చెక్కుల్ని ఎలా వాడుతున్నారో తెలుసుకునేందుకు వస్తారు. జీవితభాగస్వామి తమని మోసం చేస్తున్నారని చాలామంది టీవీ నటులు వస్తుంటారు. నాకు తెలిసి ఎంతో మంది మోడల్స్ గృహహింసను సాధారణ విషయంగా పరిగణిస్తారే తప్ప దాని గురించి మాట్లాడేందుకు ఇష్టపడరు. అలా మాట్లాడితే వాళ్ల రెప్యుటేషన్ పోతుందని నోరు విప్పరు వాళ్లు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి సోదరుడి హత్య కేసు
మాజీ ముఖ్య మంత్రి సోదరుడు హత్య చే యబడ్డాడు. అందులో వాళ్ల అమ్మ పాత్ర ఉందనేది మంత్రి గారి సందేహం. ఆమె వద్ద ఇద్దరు మసాజ్ చేసే ఆడవాళ్లు ఉండేవారు. ఆ ఇద్దరి ద్వారా వాళ్లింట్లో పనిమనిషిగా చేరాను. అప్పట్లో ఇన్ని ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు లేవు. నా దగ్గర ఒక టేప్ రికార్డర్ ఉండేది. నేనోసారి ఆమె సంభాషణను టేపులో రికార్డు చేస్తుంటే ఆమెకి అనుమానం కలిగింది. వెంటనే రికార్డింగ్ ఆపేశాను. ఆ తరువాత ఒకరోజు ఆమె గదిలో ఒక మగ మనిషి హత్య గురించి మాట్లాడడం వినిపించింది. ఏ విషయంలోనో గాని ఆమెకి, అతడికి మధ్య గొడవ జరిగింది. అతను ఇక మీదట ఇక్కడికి రానని ఆమెతో చెప్పాడు. అన్నట్టుగానే రెండు నెలల పాటు ఆ ఇంటి దరిదాపులకి రాలేదు కూడా. రెండు నెలల తరువాత వచ్చిన అతడితో ‘మనని పోలీసులు గమనిస్తున్నారు. ఇక మీదట నువ్విక్కడికి రావొద్దు’ అని ఆమె చెప్పింది. ఎలాగైనా వాళ్లని పట్టుకోవాలన్న ఆలోచనలో ఉన్న నేను నా చేతిలో ఉన్న కత్తిని కాలు మీదకి జార్చుకున్నాను. రక్తం రావడం మొదలైంది. రక్తం కారుతున్న కాలితో ఆమె దగ్గరకు వె ళ్లాను. మేడ కిందకి వెళ్లి బ్యాండేజి వేసుకోమని చెప్పిందామె. కిందకి వెళ్లి వెంటనే నా క్లయింట్‌కు ఫోన్ చేసి చెప్పాను. ఆయన పోలీసులను వెంటపెట్టుకుని వచ్చి రెడ్‌హ్యాండెడ్‌గా వాళ్లని పట్టుకున్నారు. ఆమెను అరెస్టు చేశారు.

