దటీజ్ బామ్మ

తెల్లజుట్టు, గాజు కళ్లు, ముడతలు పడిన చర్మం. ఆవిడను చూస్తూనే మన ఇళ్లలో బామ్మలు గుర్తుకొస్తారు. అయితే అందరు బామ్మలలాంటిది కాదు ఈ బామ్మ. తనకిప్పుడు 90 ఏళ్లు. బీపీ లేదు. షుగర్ లేదు. నిండు ఆరోగ్యంతో నిగనిగలాడుతోంది. ఈ మధ్యనే 90 మంది కుటుంబీకుల మధ్య బర్త్‌డే చేసుకున్న ఆ పెద్దావిడ పేరు శంకరమ్మ.
కుర్చీలో కూర్చున్న బామ్మ చుట్టూ కొడుకు, కూతుళ్లు, మనుమలు, మనుమరాళ్లు. తెగ అల్లరి చేస్తున్నారు. కంప్యూటర్ తీసుకొచ్చి ఫేస్‌బుక్‌లో పెట్టిన ఆమె ఫోటోను చూపిస్తున్నారు వాళ్లందరూ. విశేషం ఏంటంటే- ఆ రోజు బామ్మ తొంభైయవ పుట్టిన రోజు. తొంభైమంది రక్తసంబంధీకులు కలిశారు మరి!
“ఈ వేడుక మీకెలా అనిపించింది?” అని శంకరమ్మను అడిగితే “పానం లేచొచ్చినట్టయింది బిడ్డా! నా వాళ్లందరినీ ఒక దగ్గర సూడ్డం వారితో గడపడం సానా బాగుంది. ఏమైనా చెప్పు కలసి ఉంటేనే మంచిగుంటది. కానీ ఈ కాలంలో అలాంటి కుటుంబాలు ఎక్కడున్నాయి సెప్పు తల్లి… ఎవరికి వారు యమునాతీరెనన్నట్టున్నారాయె” అంది.
90 ఏళ్ల శంకరమ్మకు తన మనుమలు, మనుమరాళ్లు, మునిమనుమలు అందర్నీ బాగా గుర్తుపడుతుంది. రక్త సంబంధాలను తెంచుకుంటే అనుబంధాల తీయదనం గురించి పిల్లలకు ఎలా తెలుస్తుంది అని బామ్మ వాపోతుంటుందట. కుటుంబీకులు ఎవరు ఇంటికొచ్చినా ఆమె దీవెనలు తప్పనిసరిగా తీసుకుంటారు. “పెద్దావిడ ఆశీర్వాదం వల్ల మేము పొందే ఆనందం వేరు. మా కుటుంబానికి పెద్ద అండ ఉందన్న ధైర్యం కలుగుతుంది” అంటోంది పెద్ద కూతురు పద్మావతి. ఫోటో ఆల్బమ్‌లో ఉన్న తన భర్త ఫోటోను మనుమరాలు సాయికి చూపుతూ “మీ తాత” అని శంకరమ్మ బోసినవ్వులు చిందించింది. ఆ వయసులో కూడా చూపు మందగించలేదు. శుక్లాల శస్త్రచికిత్స కూడా చేయించుకోలేదట. శంకరమ్మను “మీ ఆయన పేరేంటి” అని అడిగితే చిన్న నవ్వు నవ్వి ఊరుకుంది కానీ జవాబు మాత్రం చెప్పలేదు. “ఆ ముసలాయన పేరును మా అమ్మ ఎప్పుడూ నోటితో చెప్పదు. అది సంప్రదాయం కాదంటుంది” అన్నారు శంకరమ్మ ఏకైక కొడుకు ఓంప్రకాష్ యాదవ్.
ఇల్లే లోకం
బామ్మకు మొత్తం ఏడుగురు పిల్లలు. వారిలో ఆరుగురు కూతుళ్లు, ఒక కొడుకు. శంకరమ్మ భర్త పేరు ఆకుల నర్సయ్య. ఒకప్పుడు ఆప్కోలో పనిచేసేవారు. ఇప్పుడు లేరు. ఆయన స్వాతంత్య్రసమరయోధుడు కూడా. శంకరమ్మ స్వస్థలం మెదక్ జిల్లా పెద్దశంకర్‌పేట్. పెళ్లయ్యాక హైదరాబాదు తాళ్లగడ్డలోని అత్తారింటికి వచ్చేసింది. శంకరమ్మ తల్లి ఎల్లమ్మ, తండ్రి పోతన్న. వీరిది వ్యవసాయకుటుంబం. బామ్మ ఎప్పుడు పుట్టింది ఎవరికీ తెలియదు. కానీ తమ వయసును బట్టి ఆమెకు 90 ఏళ్లు ఉండొచ్చని ఇంట్లో వాళ్లు లెక్కగట్టారు. నాలుగేళ్ల వయసులోనే శంకరమ్మకు పెళ్లయిపోయింది. తర్వాత హైదరాబాద్ వచ్చేసింది. “పెళ్లయిన కాడి నుంచి నా ఇల్లు, నా పిల్లలే నా లోకం. ఇంటిని అద్దంలా పెట్టుకోవడం, పిల్లల్ని మంచిగా చూసుకోవడం. ఇదే పని” అంటుందీ బామ్మ.
“వేరుపడక ముందుఅన్ని పనులను అందరం కలిసి చేసుకునేవాళ్లం. కలిసి భోంచేసేవాళ్లం. కలిసి సతోషాలను పంచుకునేవాళ్లం. అయితే కాలంతోపాటు మేము కూడా ఎవరి జీవితాలు వాళ్లవి అన్నట్లు వెళ్లదీస్తున్నాం. కాని సమయం దొరికినప్పుడు మాత్రం అందరం ఒక రోజున కలిసి.. ఆనందోత్సాహాలతో దావత్ చేసుకుంటున్నాం. పండగలు, పుట్టినరోజుల వంటి ఏ చిన్న అవకాశం వచ్చినా వదలం.
ఉగాది పండగ వస్తే ఆ రోజు మా ఇల్లు చూడాలి. సందడే సందడి. ఇంట్లో అయితే మనుమలు, మునిమనుమల అల్లరి ఇంతా అంతా కాదు. మా అమ్మకైతే ఆరోజు అందరినీ చూశాక కడుపునిండిపోతుంది. కళ్లు మెరిసిపోతుంటాయి. ఇప్పటికీ మేమందరం ఒకే చోట ఉండాలన్నది ఆమె కోరిక..” అంటూ చెప్పుకొచ్చింది కూతురు పద్మావతి.
శంకరమ్మ మునిమనమలు కొందరు ఇక్కడ చదువుతుంటే మరికొందరు విదేశాల్లో చదువుతున్నారు. ఎవరైనా పొరపాటున తన దీవెనలు తీసుకోవడం మరిచిపోయారో వారిని పిలిపించి మరీ దీవించి పంపుతుందట ఈ బామ్మ. ఇళ్లలో ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకున్నా ఆమెకు చెప్పే తీసుకుంటారు.
“ఇంత వయసు వచ్చినా ఇప్పటికీ తన పని తనే చేసుకుంటుంది. చేతిలో రుద్రాక్ష మాల ఉంటుంది. రోజులో ఎక్కువ టైమును దైవజపానికే కేటాయిస్తుంది బామ్మ” అని మనుమరాలు సాయి చెబుతుంటే కళ్లింత చేసుకుని చూస్తోంది శంకరమ్మ.
బామ్మమాట ఆరోగ్యబాట
. ఎంత కోపం తెప్పించే విషయానికైనా కించిత్తు విసుక్కోదు. ఆలోచిస్తుంది. సహనంతో వ్యవహరిస్తుంది.
. తెల్లవారుజామునే నిద్రలేచి, స్నానపానాదులు కానించేసి.. దేవుడికి దీపం పెడతారామె. క్రమం తప్పకుండా ఉపవాసాలు చేసేవారు.
. ఇంటిని, పరిసరాలను నిత్యం శుభ్రంగా ఉంచుకోవడంలో బామ్మ రాజీ పడదు. శుభ్రతలేకపోతే సహించదు.
. ఏడాదికి ఒక పుణ్యక్షేత్ర యాత్ర ఉండాల్సిందే! చక్కటి ప్రణాళికతో గుళ్లుగోపురాలు తిరిగొచ్చి, ఆ విశేషాలను కుటుంబసభ్యులతో పంచుకునేవారు.
. ఇంటినిండా మనుషులుండాలి. పండగలు, వేడుకలలో లీనమైపోతుంది. అందరి యోగక్షేమాలు కనుక్కుంటుంది.
. ఆశ్చర్యం ఏంటంటే తొంభైఏళ్ల ఈ బామ్మకు బీపీ కాని, షుగర్ కాని లేవు. బాధించే జబ్బులేవీ రాలేదు. చూపు మందగించలేదు. కళ్లకు ఎలాంటి శస్త్రచికిత్సలు చేయించుకోలేదు. దటీజ్ బామ్మ!
ం నాగసుందరి

