పీఠాధిపతికి ప్రతిస్పందన – బండి నారాయణస్వామి
ఇంత దేశంలో ఇంత వైవిధ్యం ఇంత సానుకూల వాతావరణంలో సాగిపోతుంటే; షిరిడీ సాయి దేవుడు కాడు. అతనికి గుళ్ళు కట్టొద్దు, పూజలు చేయొద్దు అనే పాటి కుసంస్కారానికి స్వరూపానందులు దిగడం ఒక పీఠాధిపతి కుల పిచ్చినీ, మతమౌఢ్యాన్నీ తెలియజేస్తుంది. షిరిడీ సాయి సాయినాథుని ఆరాధించడం వల్ల హిందువుల ఐక్యత ఏవిధంగా దెబ్బతింటుందో ఆయనే వివరిస్తే బాగుంటుంది.
ఇది భారతదేశం. హిందూ దేశం. మరీ ప్రాచీన కాలంలో జంబూ ద్వీపం. పాశ్చాత్యులకు ఇండియా. ఇది బహు మతాల, బహుతాత్విక ధోరణుల, బహుళ సంస్కృతుల నేల. ద్వారకా పీఠం శంకరాచార్య స్వరూపానందకు దేశం గురించి ఈ అవగాహన ఉన్నట్లు కనపడదు.
ఈ దేశంలో భక్తులున్నారు. యోగులున్నారు. జ్ఞానులున్నారు. ఫకీర్లున్నారు. సూఫీలున్నారు. ఎవరి సంప్రదాయం ప్రకారం వారికి గుళ్ళూ, గోపురాలూ, దర్గాలూ, ఆశ్రమాలూ, మెమోరియల్సూ ఉంటాయి. ప్రజలు తమకు ఎవరి మీద గురి కలిగితే వారిని ఆరాధిస్తారు. నామస్మరణలు చేస్తారు. కోహమ్ అనో, సోహమ్ అనో వారి బోధనలను అనుసరించి సాధనలు చేస్తారు. ప్రార్థనలు చేస్తారు. ఇంత దేశంలో ఇంత వైవిధ్యం ఇంత సానుకూల వాతావరణంలో సాగిపోతుంటే; షిరిడీ సాయి దేవుడు కాడు. అతనికి గుళ్ళు కట్టొద్దు, పూజలు చేయొద్దు అనే పాటి కుసంస్కారానికి స్వరూపానందులు దిగడం ఒక పీఠాధిపతి కుల పిచ్చినీ, మతమౌఢ్యాన్నీ తెలియజేస్తుంది.
షిరిడీ సాయి సాయినాథుని ఆరాధించడం వల్ల హిందువుల ఐక్యత ఏవిధంగా దెబ్బతింటుందో ఆయనే వివరిస్తే బాగుంటుంది. ముస్లింలు ఏడుకొండల వాడిని వేడుకోబోయినా, హిందువులు దర్గాలకు పోయి ప్రార్థనలు చేసినా పీఠాధిపతులూ, ముల్లాలూ ఆమోదించకపోవచ్చు. కానీ వివిధ మతాలలోని ఈ ఉదార భావాన్ని వ్యతిరేకించే హక్కు వారికి లేదు.
షిర్డీ నాథుని హిందువులు పూజించినంత ఎక్కువగా ముస్లింలు ఎందుకు పూజించడం లేదని స్వరూపానందులు అలగడం చూస్తుంటే, అది ఆయన అమాయకత్వమనుకోవాలో, అజ్ఞానమనుకోవాలో, లేక అసూయ ద్వేషమనుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఈ దేశంలో హిందువులు అత్యధిక సంఖ్యలో ఉండటమూ, వారికి విగ్రహారాధన ఒక సాధన మార్గంగా ఉండటమూ బాబాను హిందువులు ఎక్కువ సంఖ్యలో కొలవడానికి కలిసొచ్చిన అంశాలు. ముఖ్యంగా ఈ దేశంలో ముస్లింలకు ఉన్నంత మత కట్టడులు బ్రాహ్మణులకు లేవు. బ్రాహ్మణులకున్న మతకట్టడులు శూద్ర హిందువులకు అస్సలు లేవు. హిందూ మతం శాఖోపశాఖలకు చెందిన తన తాత్విక మార్గాల వైవిధ్యాల్నీ, ఉదార భావాల్నీ వదిలేసి ఇస్లాంలోని ముల్లాల కరుడుగట్టిన తనాన్ని ఆదర్శంగా తీసుకోవాలనీ, అనుసరించాలనీ స్వరూపానందులు ఎందుకు కోరుకుంటున్నారు? రెండు మతాల మధ్య పోలరైజేషన్ సృష్టిస్తే తప్ప స్వరూపానందులు వంటి పీఠాధిపతులకు అస్తిత్వం ఉండదా?
ఈ దేశంలో భక్తులూ, యోగులూ, జ్ఞానులూ, సిద్ధులూ, పరమ హంసలూ చరిత్రకెక్కిన వారే వందల్లో ఉన్నారు.
సనాతన ధర్మమంటే ఏమిటో స్వరూపానందులకు తెలుసా? ఆయన చెప్పిన 24 అవతారాల లిస్టుకు బయట ఎంతమంది జ్ఞానులూ మహాగురువులూ పూజలందుకుంటున్నారో ఆయనకు తెలియదా? భగవాన్ రమణ మహర్షీ, శంకరాచార్యుల వంటి వారి గుళ్ళూ, ఆశ్రమాలూ కట్టి పూజిస్తే లేని తప్పు షిర్డీ సాయినాథునికి గుళ్ళు కట్టి పూజిస్తే వచ్చిందా?
గురువు కావడానికి మాంసాహారం అడ్డు వస్తుందని చెప్పే స్వరూపానందులది కుల చాదస్తం కాక మతోద్ధరణ అవుతుందా? బుద్ధుడు మాంసాహారి కాదని ఆయన చెప్పగలడా?
అంత్యజుడు అని పిలవబడే వ్యక్తి ఇచ్చిన పంది మాంసం భిక్షను ఆయన స్వీకరించలేదా?
కల్కి మాంసాహారి కాబోడని ఆయన జోస్యం చెప్పగలడా?
నిన్నటికి నిన్న నిసర్గదత్తమ మహరాజ్ గురువు మాంసాహారిగా లేడా?
ఒక బెస్తవాని కొట్టంలో ఉట్టిలోని వట్టి చేప ముక్కను నోట్లో వేసుకుని అతని ఆతిథ్యం స్వీకరించలేదా జిల్లేళ్ళ మూడి అమ్మ!
క్షత్రియునిగా పుట్టిన రాముడు మాంసాహారి కాదా? క్షత్రియుడిగా పుట్టి శూద్రుడిగా పెరిగిన కృష్ణుడు శాకాహారేనా? శాకాహారం సాధకునికి ఆహార నియమమే తప్ప, ఆ నియమం గురువును నిర్ణయించే సూత్రం కాదని స్వరూపానందులు వంటి పండితునికి తెలియదు అనుకోవాలా?
రామ మందిర నిర్మాణానికీ, షిర్డీ సాయిగుళ్ళు కట్టడానికీ ఏమైనా సంబంధం ఉందా? స్వరూపానందులు మాట్లాడుతున్నది మతమా? ఆధ్యాత్మికమా? రాజకీయమా? నిశ్చయంగా మత రాజకీయమే!! స్వరూపానందుల మాటల ప్రభావం ఆరెస్సెస్, భజరంగదళ్ వంటి మతసంస్థల మీద పడితే; పరిస్థితులు ఎంత దారుణంగా విషమిస్తాయో రామ జన్మభూమి కంటే ఎక్కువగా ఊహకందని ప్రమాదం!
ద్వారకా పీఠం శంకరాచార్య స్వరూపానంద ప్రాతినిధ్యం వహిస్తున్నది ఈ దేశం మొత్తానికి కాదు. శూద్ర హిందువులకూ కాదు. చివరికి బ్రాహ్మణ సామాజిక వర్గానికీ కాదు. ఆ సామాజిక వర్గంలోని ఒక చిన్న శాఖకే అని గుర్తు పెట్టుకుని తన పరిమితులు తాను తెలుసుకోవడం మంచిది. వయసుకు తగిన హుందాతనంతో జీవించడం మంచిది. మతాన్ని మతంగా, మతాన్ని దాటిన ఆధ్యాత్మికతను ఆధ్యాత్మికంగా మన్నించడం మరీ మంచిది.
నేను రాముడిని పూజిస్తా
హర హర మహదేవ నామస్మరణ చేస్తా
గంగానది పవిత్రస్నానం చేస్తా
షిరిడీ సాయినాథునీ సేవిస్తా!
ఇంకా చెప్పాలంటే-
భగవంతుడు ఎక్కడ కన్పిస్తే అక్కడ
సాగిలబడి మొక్కుతా!
వద్దనడానికి మీరెవరు స్వరూపానందులూ??
-బండి నారాయణస్వామి


శ్రీఆదిశంకరులు ఈనాటి వారు కానందుకు సంతోషించాలి!
LikeLike
Syamalarao garuu….mee spandana ardham chesukoleka poya.
LikeLike