బుడ్డి (ద్ధి )మంతుడు సినిమా

“నేను డైలాగ్ రైటర్ అయినప్పటికీ మొదట మనసులో బొమ్మ గీసుకుని దానికెంత కావాలో అంతే డైలాగులు రాస్తాను” అని రమణ చెప్పుకున్నారు. బాపుతో జట్టు కట్టకముందే ఆయన పలు ఉత్తమ చిత్రాలకు కథ, సంభాషణలు సమకూర్చారు. ‘సాక్షి’ నుంచి ‘శ్రీరామరాజ్యం’ వరకు ఆయన బాపుతో ప్రయాణించారు. ఎన్నో కళాఖండాల రూపకల్పనలో బాపు సగమైతే, తను మరో సగమయ్యారు. రమణ స్క్రిప్టులో స్పష్టంగా కనిపించే అంశం ఎక్కడ మాట అవసరమో అక్కడే డైలాగ్ రావడం. ఆయన రచన చేసిన సినిమాల్లో హీరోల కంటే విలన్లే ఎక్కువగా మాట్లాడతారు. ఉదాహరణకు ‘ముత్యాల ముగ్గు’ తీసుకోండి. అందులో హీరో హీరోయిన్లు శ్రీధర్, సంగీత ఎక్కువగా మాట్లాడరు. విలన్ రావు గోపాలరావు తెగ మాట్లాడేస్తుంటాడు. ఆ పాత్రకు మాటే ఊపిరి. అయినప్పటికీ ఆ పాత్ర ‘ఆకాశంలో మర్డర్ జరిగినట్టు లేదూ’ అంటూ విజువల్‌తోనే పరిచయమవుతుంది. అప్పటివరకు రావు గోపాలరావు వేరు. ‘ముత్యాల ముగ్గు’ నుంచి రావు గోపాలరావు వేరు. ఆ సినిమా కంటే ముందు మరో సినిమాలో ఇదే తరహా విలన్ కేరక్టర్ మనకు కనిపిస్తుంది. ఆ సినిమా ‘బుద్ధిమంతుడు’ కాగా, ఆ విలన్ నాగభూషణం. ఆయన వేసిన పాత్రపేరు ప్రెసిడెంట్ శేషాద్రి. చేసేవి తప్పుడు పనులు కావడంతో, వాటిని కప్పిపుచ్చడానికి అబద్ధాలనూ, మోసాన్నీ ఆశ్రయిస్తూ తెగ వాగేస్తూ ఉంటాడు. ఆ పాత్రను నాగభూషణం అభినయించిన తీరు అనితర సాధ్యం.
గుడికీ, బడికీ మధ్య పోటీ
బాపు-రమణ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో ‘బుద్ధిమంతుడు’ది విశిష్ట స్థానం. ఈ చిత్రానికి రమణ కథ, మాటలు రచిస్తే, బాపు దర్శకత్వంతో పాటు స్క్రీన్‌ప్లే సమకూర్చారు. ఈ కథలో రమణ ఆస్తికతకూ, నాస్తికతకూ మధ్య, గుడీకీ, బడికీ మధ్య పోటీ పెట్టారు. ఆస్తికతకు, నాస్తికతకు ప్రతీకలుగా నిలిచిన ఇద్దరు అన్నదమ్ములు – మాధవయ్య, గోపి (నాగేశ్వరరావు ద్విపాత్రాభినయం) పాత్రలను సృష్టించారు. ఈ రెండింటిలో ఆయన ఏ పాత్రవైపు మొగ్గారనేది అనేది ఆసక్తికరం. ఆస్తికుడైన మాధవయ్యను అమాయకుడిగా మలిచిన రమణ నాస్తికుడైన గోపిని మొదట నీతి నిజాయితీలు కలిగిన వాడైనప్పటికీ జల్సారాయుడిగా మలిచారు. ‘భూమ్మీద సుఖపడితే తప్పులేదురా.. బులపాటం తీర్చుకుంటే తప్పులేదురా’ అంటూ సావాసగాళ్లతో ఖుషీఖుషీగా తిరిగే అతను అన్యాయాన్ని సహించలేడు. నిజాయితీని వదలడు. నాయిక పాత్ర రాధ (విజయనిర్మల)తో ప్రణయం కారణంగా జల్సాలకు స్వస్తి చెప్పి ‘బుద్ధిమంతుని’గా మారతాడు గోపి. ఆ తర్వాతే అతనికి కష్టాలు మొదలవుతాయి. అపార్థంతో రాధ దూరమవుతుంది. అన్న మాధవయ్య “వాళ్ల కులమేమిటి? మన కులమేమిటి? వర్ణ సంకరం చేస్తావా? మన గౌరవ మర్యాదలు మంట గలుపుతావా?” అని తమ్ముడి మీద కేకలేస్తాడు. అన్న కాళ్లమీద పడి క్షమాపణలు చెప్పమంటుంది తల్లి. “అమ్మా. నేను తప్పులు చేస్తూ విచ్చలవిడిగా తిరుగుతున్నంత కాలం నన్ను హెచ్చరించడానికి కూడా ఎవరికీ ధైర్యం లేకపోయింది. ఇప్పుడు తప్పులు దిద్దుకుని బుద్ధిమంతుడనై మంచి దారిన నడవబోతే అందరూ తలో రాయీ వేస్తున్నారు. నేనెవరికి క్షమాపణ చెప్పుకోవాలమ్మా. దేనికోసం క్షమాపణ చెప్పుకోవాలి. ఆనాడు తప్పులు చేసినందుకా? ఈనాడు బుద్ధిగా ఉన్నందుకా? చెప్పమ్మా” అంటాడు గోపి ఆవేదనగా.
నిజం రాణిస్తుంది
తన వద్దకు వచ్చిన రాధ, దేవుని నగలను తనే దొంగిలించాన్నట్లు మాట్లాడితే “నీటిబొట్టు ఇసుకలో పడితే ఇంకిపోతుంది. సముద్రంలో పడితే ఆనవాలు లేకుండా పోతుంది. అదే ముత్యపు చిప్పలో పడితే ముత్యమై ప్రకాశిస్తుంది. నిజం కూడా అంతే. సమయం, సందర్భాన్ని బట్టి రాణిస్తుంది” అని బాధపడతాడు గోపి. దేవుడు ఉన్నాడని నిరూపించడానికి మాధవయ్య “సరిగ్గా ఈ రాత్రి పన్నెండు గంటలకు గుడి గోపురం మీదున్న కలశం పైకి లేస్తుంది. నా స్వామి అసత్యం కాదు. మహిమ ముమ్మాటికీ జరుగుతుంది. ‘అలా జరగని పక్షంలో నా స్వామి పాదాలపై నా ప్రాణం విడుస్తాను’ అని భీకర ప్రతిజ్ఞ చేస్తాడు మాధవయ్య. అన్నయ్య చనిపోకూడదనీ, భక్తుల విశ్వాసం వమ్ము కాకూడదనీ, గుడి వెనుకనుంచి పైకెక్కి, గోపురం కలశాన్ని పైకి లేపి, దించుతాడు గోపి. దీనిని చూసిన మాధవయ్య దేవుణ్ణీ, తననూ, భక్తుల నమ్మకాన్నీ అవమానించావని తమ్ముణ్ణి తూలనాడతాడు. “అన్నయ్యా. నేను మనిషిని. చదువు సంస్కారం లేని సామాన్యుణ్ణి. దేవుడు ఉన్నాడో, లేదో అని విమర్శించే శక్తిలేని వాణ్ణి. నాకు తెలిసిన దేవుడు నా అన్నయ్యే. నా అన్నయ్యను దక్కించుకోవాలనుకున్నాను అంతే. ఇది మోసమే అయితే, అపచారమే అయితే, దైవ ధిక్కారమే అయితే నీ ఇష్టమొచ్చిన శిక్ష విధించు” అంటాడు. ఇలా గోపి పాత్రను ఆదర్శవంతంగా, అదే సమయంలో శక్తిమంతంగా మలచారు రమణ.
మానవసేవే మాధవసేవ
ఆస్తికులంతా మంచివాళ్లు కారు, నాస్తికులంతా చెడ్డవాళ్లు కారు అని రమణ ఈ కథతో నిరూపించే ప్రయత్నం చేశారనిపిస్తుంది. గుడికీ, బడికీ మధ్య పోటీ పెట్టినా ఊరికి రెండూ కావాలనిపిస్తారు. అందుకు తగ్గట్లే పరమభక్తితో, అమాయకత్వంతో మూఢునిలా వ్యవహరించిన మాధవయ్యలో పరివర్తన కలిగేట్లు ఆ పాత్రను మలిచారు. తన ముందు ప్రత్యక్షమైన కృష్ణునితో తన తమ్ముడు భ్రష్టుడైపోయాడనీ, వర్ణ సంకరానికి కూడా ఒడిగట్టాడనీ ఆవేదన చెందుతాడు మాధవయ్య. ‘మరైతే నువ్వు వర్ణ సంకరం చెయ్యడం లేదా?’ అని ప్రశ్నించిన కృష్ణుడు “నేను క్షత్రియుల ఇంటి పుట్టాననీ, గోపాలుర ఇంట
పెరిగాననీ నువ్వెరుగవా?” అనడుగుతాడు. మాధవయ్యకు జ్ఞానోదయం కలుగుతుంది. “సర్వాంతర్యామివి. నా అజ్ఞానాన్ని మన్నించు. అన్ని జీవుల్లోనూ, అన్ని జాతుల్లోనూ నీవేనని, అంతా ఒక్కటేననీ నాకు తెలియజెప్పావు. ఈ క్షణం నుంచీ సర్వ కులాలనూ, సర్వ మతాలనూ సమానంగా గౌరవిస్తాను” అంటాడు. తమ్ముడితో “మానవసేవే మాధవసేవ. మానవ కోటి సుఖ సంతోషాలే భగవంతునికి నిజమైన ఆనందం” అని చెబుతాడు. కథకు ప్రయోజనం ఉండాలని నమ్మే రచయిత కాబట్టే రమణ తన కథల్లో మంచికి పెద్దపీట వేసి, మంచి విషయాలను చెప్పే ప్రయత్నం చేస్తారు. సందర్భానికి తగ్గట్లుగా ఈ చిత్రంలో ఆయన రాసిన సంభాషణలు గొప్పగా రాణించాయి. నటీనటులు కూడా తమ పాత్ర పరిధుల మేరకు వాటిని పలికి, సంభాషణలు రక్తికట్టేలా చేశారు.
‘ఆమ్యామ్యా’ ఇందులోనిదే
ఈ సినిమాలో రామలింగం (అల్లు రామలింగయ్య) లంచం ఆశిస్తూ చెప్పే ‘ఆమ్యామ్యా’ అనే మాట నేటికీ లంచానికి పర్యాయపదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే ఆ పదం సృష్టికర్త తాను కాననీ, సినిమాలో ఆ మాట పలికిన అల్లు రామలింగయ్యదేననీ రమణ చెప్పారు. “ఆ మాట నా ఎక్కౌంటులో పడిపోయింది. నాకు పేరొచ్చేసింది” అని ఆయన రాసుకున్నారు. నేడు ఆయన మన మధ్య లేకపోయినా రమణీయమైన ఆయన మాటలు మన హృదయాల్లో ఎన్నటికీ నిలిచే ఉంటాయి. మాధవయ్య, గోపి పాత్రల్లో అక్కినేని నాగేశ్వరరావు, శేషాద్రిగా నాగభూషణం ప్రదర్శించిన అభినయం, రమణ సంభాషణలు, బాపు దర్శకత్వ ప్రతిభ, మిగతా సాంకేతిక నిపుణుల సామర్థ్యం కలిసి ‘బుద్ధిమంతుడు’ను వంద రోజుల సినిమాగా నిలబెట్టాయి. విడుదలై నెల తిరక్కుండానే 60 వేలు ఓవర్‌ఫ్లో వచ్చిందంటే 1969లో అది చాలా పెద్ద మొత్తమే.

 

 

తాక సన్నివేశాలు అద్భుతం – తనికెళ్ల భరణి

Published at: 28-06-2014 00:17 AM

రమణగారు రచన చేసిన చిత్రాల్లో నాకు బాగా నచ్చిన చిత్రం ‘బుద్ధిమంతుడు’. ఆస్తికునిగా అన్ననూ, నాస్తికునిగా తమ్ముణ్ణీ మలచి, ఆ రెండు పాత్రల మధ్య సంఘర్షణను గొప్పగా చిత్రించారు రమణ. క్లైమాక్స్ సన్నివేశాలైతే అద్భుతం. అన్న ప్రాణాలు నిలబెట్టడానికీ, జనంలో అన్న మాటను నిలబెట్టడానికీ తమ్ముడు గుడి గోపురం మీద కలశాన్ని పైకి లేపడం, ఆ తర్వాత అన్నదమ్ముల మధ్య జరిగే సంభాషణ అపూర్వం. అలాగే అన్నయ్య పాత్రకు కృష్ణుడు కనిపించే సన్నివేశాలు, భక్తునికీ, భగవంతునికీ మధ్య జరిగే సంభాషణలు గొప్పగా ఉంటాయి. భక్తుని నమ్మకానికీ, అతని అమాయకత్వానికీ మాధవయ్య పాత్ర నిదర్శనంగా నిలుస్తుంది. శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదనే విషయం ఈ సినిమా ద్వారా రమణగారు బాగా చెప్పారు. ఇవాళ లంచానికి మారుపేరుగా మారిన ‘ఆమ్యామ్యా’ అనే పదం ఈ సినిమాలోనిదే. రమణగారి సంభాషణలు ఎంత సహజంగా, ఎంత పదునుగా, ఎంత హాస్య స్ఫోరకంగా ఉంటాయో నిరూపించే సినిమా ‘బుద్ధిమంతుడు’. ఆయన రచన చేసిన ఓ సినిమాలో నేను నటించాను. అది ‘మిస్టర్ పెళ్లాం’. అయితే చాలా మందికి తెలీని సంగతి, దానికంటే ముందు వారి సినిమా ‘పెళ్లి పుస్తకం’లోనూ ఓ సన్నివేశం చేశాను. నేను ‘సీతారామయ్యగారి మనవరాలు’ షూటింగ్‌లో ఉన్నప్పుడు ఈ సినిమాలో ఓ సన్నివేశం ఉంది.. చేయాలంటూ కబురొచ్చింది. పెళ్లికి సంబంధించిన సన్నివేశం అది. రాజేంద్రప్రసాద్, దివ్యవాణి, నా మీద ఆ షాట్. నాది పురోహితుని పాత్ర. మూడు నిమిషాల సీన్. నా పాత్ర సంభాషణలు, పెళ్లి మంత్రాలు నావే. దాదాపు 400 అడుగుల సీను. గంటలో పూర్తి చేశాం. అది చేసినందుకు మేనేజర్ నాకు రూ. 10 వేలు పారితోషికంగా ఇచ్చారు. నా పాత్రకు అది పెద్ద మొత్తమే. నేను వద్దని చెప్పినా, మేనేజర్ వినలేదు. అక్కణ్ణించి వస్తుంటే రమణగారు ఎదురై మరో రూ. 10 వేలుకు చెక్కు రాశారు. నేను ఆశ్చర్యపోయి, పది వేలు తీసుకున్న సంగతి చెప్పాను. నా స్క్రిప్టుని నేను రాసుకున్నా కాబట్టి, దానికి ఇస్తున్నాననీ, తీసుకొమ్మనీ ఆయన చెక్కు చేతిలో పెట్టారు. చిత్రమేమంటే నేను చేసిన ఆ సన్నివేశం సినిమాలో లేదు. అదీ కొసమెరుపు.

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.