
ఆయన తెలుగు వాడు! తెలంగాణ బిడ్డ! ఆర్థిక నిపుణుడు! ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు! కష్టాల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కించిన వాడు! అపర చాణుక్యుడు! ఆయన… పాములపర్తి వెంకట నరసింహరావు. అటువంటి మహనీయుని జయంతి (జూన్ 28)ని రాష్ట్ర పండుగగా నిర్వహించడం ద్వారా ఆయనకు ఘన నివాళి అర్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రేపు పీవీ నరసింహరావు జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం…
పీవీ నరసింహరావు… అపర మేధావి. బహు భాషా కోవిదుడు. సాహితీవేత్త. ముఖ్యమంత్రిగా.. ప్రధాన మంత్రిగా పనిచేసి ప్రపంచ దేశాల్లోనే శభాష్ అని పించుకున్న ఘనత ఆయనది.. తాను నమ్మిన సిద్ధాంతం కోసం పదవులను కూడా లెక్క చేయని ముక్కుసూటి మనస్తత్వం ఆయనది.. అటువంటి మహోన్నత వ్యక్తికి నేడు చాలా సంవత్సరాల తరువాత ప్రభుత్వ గుర్తింపు లభించింది. తెలంగాణ ముద్దుబిడ్డ అయిన పీవీకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత సముచిత స్థానం లభించింది. ఎంతో మందికి రాజకీయ భవితవ్యం కల్పించిన పీవీని మొన్నటి వరకు ఇటు ప్రభుత్వాలు.. అటు పార్టీ మరచి పోయింది. గతంలో ప్రధానులుగా చేసిన వ్యక్తుల విగ్రహాలు మనకు చాలా చోట్ల కనిపిస్తాయి. కానీ పీవీ విగ్రహాలు కనిపించటం కూడా అరుదే.
వంగర నుంచి ఢిల్లీ దాకా..
పీవీ పుట్టింది వరంగల్ జిల్లా వంగరలో. చదివింది వరంగల్‌లో. నాగపూర్‌లో బీఎస్సీ ఎల్ఎల్‌బి చేసిన అనంతరం నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. ముందు రాష్ట్ర రాజకీయాల్లో, ఆ తర్వాత కేంద్ర రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషించటం మొదలుపెట్టారు. సాధరణంగా రాజకీయనేతలు సంపన్న వర్గాలను దూరం చేసుకోవటానికి ఇష్టపడరు. కానీ పీవీ మాత్రం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భూసంస్కరణలు తీసుకువచ్చారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన పీవీ ఈ చట్టంతో తనకున్న వెయ్యి ఎకరాల భూమిని పేదలకు పంచి ఆదర్శంగా నిలిచారు. పేదలకు ఉచిత విద్యను అందించేందుకు అశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యశాఖలో కీలక మార్పులు తీసుకువచ్చారు. తెలుగు అకాడమీని ప్రారంభించిన ఘనత కూడా పీవీదే. 1977లో హన్మకొండ పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికైన నాటి నుంచి కేంద్రంలో కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీకి అంతరంగిక సలహాదారునిగా వ్యవహరించారు. వీరిద్దరి మంత్రివర్గంలో విదేశాంగమంత్రి, మానవ వనరుల శాఖ మంత్రిగా, రక్షణ మంత్రిగా, హోంమంత్రిగా పని చేశారు. రాజీవ్‌గాంధీ మరణానంతరం 1995లో దేశప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాల పాటు కొనసాగించిన ఘనత పీవీకి దక్కింది. మరణానంతరం అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రం కానీ పీవీని సముచిత రీతిలో గుర్తుంచుకోలేదు. ఇప్పుడు ఆయన జయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.
సాహిత్యం, సంగీతమంటే ఎంతో ఇష్టం
సీనియర్ పాత్రికేయులు వీఎల్ నర్సింహారావు
వరంగల్‌లో హై స్కూల్‌లో చదువుకునే రోజుల్లో తిరుగుతూ వినోదంగా గడిపిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఆ రోజుల్లో హన్మకొండలో ‘అప్పూ’ హోటల్ పరిసరాల్లో మిత్రులతో తిరగడం, అర్ధణాకు ప్లేట్ బజ్జీ, మూడు పైసలకు టీ తాగిన రోజులు ఇప్పటికీ మదిలో మెదులుతున్నాయి. శుక్రవారం పాఠశాలకు సెలవులిస్తే సిద్ధేశ్వరునిగుడి, పద్మాక్షిగుట్ట, భద్రీ తలాబ్‌గట్టు, ఓరుగల్లు కోట లాంటి ప్రదేశాలను ఎన్నిసార్లు చుట్టివచ్చామో లెక్కలేదు.. గురజాడ, విశ్వనాథ, రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్, ప్రేమ్‌చంద్ లాంటి అనేక మంది ప్రముఖుల రచనలను చదవి వాటి గురించి చర్చించటం కూడా మధురమైన అనుభూతే!
అవన్నీ మధుర జ్ఞాపకాలే..
బాల్యమిత్రుడు చొల్లెటీ భద్రయ్య
కోతికొమ్మచ్చి..చిర్రగోనే.. చెరువు కట్టమీద ఆటలు.. బావుల్లో ఈతలు.. ఇలా ఒకటేమిటీ బాల్యంలో పీవీతో గడిపిన మధుర క్షణాలు మరచిపోలేనివి. నేను, పీవీ, నల్ల ఆగారెడ్డి, రఘునాయకుల వెంకన్న, గంట్యాల వెంకట్రాజం, చెప్యాల రాజిరెడ్డిలు ఇలా మేమందరం ఒక బ్యాచ్‌గా ఉండే వాళ్ళం.. నాకిప్పుడు 94 ఏళ్లు. బాల్య మిత్రులు అందరు చనిపోయారు..తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో గెంతులేయాలని ఉంది.. కానీ వయస్సు సహకరించటం లేదు..

