సంస్కరణల సాహసి బాల్య సాహసాలు – వి.ఎల్. నరసింహారావు
వరంగల్లులో విద్యార్థి దశలోనే భావ కవితా సాంప్రదాయానికి చెందే శైలి ప్రభావం అయనపై అధికంగా కనిపిస్తూండేది. ప్రేమ అనీ, ప్రణయం అనీ పి.వి. ఆ రోజుల్లో ఎవరో ఒక ఊహా సుందరిని తలపోసి చక్కని రొమాంటిక్ వేదనతో ఖండ కావ్యాలు రాశారు. అయితే వాటిని ఎవరో చిన్ననాటి మిత్రులు కొట్టేయడం వల్ల ప్రస్తుతం లభ్యం కావని ఆయన సహచరులు, పెద్దలు వెల్లడించారు.
తెలుగు వెలుగు పి.వి. నరసింహారావుకు వరంగల్లు నగరంతో అవినాభావ ఆత్మీయ సంబంధముండేది. సంస్కృతి, సంప్రదాయం, దేశీయ ప్రాచీన వారసత్వం గురించిన సదభిప్రాయం కల్గిన వ్యక్తి పి.వి. ఆ రోజుల్లో వరంగల్ నగరంలో ఏటేటా కూచిపూడి, భాగవతుల ప్రదర్శనలు సాగుతుండేవి. భామాకలాపం, గొల్లకలాపం, ఉషాపరిణయం, దాదిని వేషం, ప్రహ్లాద, భాగవతులు, పగటి వేషాలు, శారద వేషం లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అప్పుడప్పుడూ నిర్వహించేవారు. వీటితో పాటు దీపావళి పండుగ రోజుల్లో హారతులు, భోగం మేళాలు, గానసభలు కూడా జరిగేవి. పెండ్లిండు,్ల పేరంటాల సందర్భాలలోనూ పాట కచేరీలు, సానిమేళ ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు. ఇలాంటి కార్యక్రమాలంటే పి.వి.కి అమిత సరదా, అభిరుచి ఉండేవి. పి.వి.కి కరీంనగర్ స్వంత జిల్లా కాగా వరంగల్ జిల్లా పెంపుడు జిల్లా. పల్లెటూర్లలో ముఖ్యంగా వంగరలో జరిగే చిందు భాగవతుల కార్యక్రమాన్ని కూడా బాల్య ప్రాయంలో పి.వి. తెల్లవార్లు కూర్చొని తనివి తీరా చూసి ఆనందించేవారట. ఒకసారి సురభివారి లంకాదహనం చూసి అందులోని ఆంజనేయ పాత్రను అనుకరిస్తూ దూడతలుగు తోకగా పట్టుకొని ఇంటి చుట్టూ గంతులు వేసిన సందర్భాలున్నాయి. పి.వి.లో మొదటి నుంచి అంటే బాల్యం నుంచి భావావేశం, రసాస్వాదన చెందే స్వభావ ప్రేరణ ఉండేది. కళాత్మకంగా తాదాత్మ్యానుభవం పొందే చిత్త స్ఫూర్తి ఉండేది. పి.వి.కి వరంగల్లులో హైస్కూల్‌లో చదువుకునే రోజుల్లో తిరుగుడు వినోదం కూడా ఎక్కువగానే ఉండేది. హనుమకొండలోను, లష్కర్‌బజారులో ఈ వినోదం సాగిపోతుండేది. ఎవరో కొందరు సహచరులను వెంటేసుకోవడం, రోడ్ల వెంబడి తిరగడం సాయంకాలం కాలక్షేపం. ‘అప్ఫూ హోటల్’ పరిసరాల్లో మిత్రుల రాకకై గస్తీ తిరగడం, అర్ధణా ప్లేటు ఆలూ బజ్జీ, మూడు పైసల ‘టీ’, పైసా పాన్ బీడా సేవానంతరం ఇరుగు పొరుగువారి ముంగిళ్ళు గాలించే వ్యాహ్యాళీ మరో రకం తిరుగుడు కార్యక్రమం.
శుక్రవారం స్కూల్ సెలవు సందర్భంగా మరీ తాపీగా బయలుదేరి సిద్ధేశ్వరుని గుడి, పద్మాక్షి గుట్ట, భద్రీ తాలబ్ గట్టు, భీమారం రోడ్డు, కాజీపేట స్టేషన్, ఓరుగల్లు కోట రాతి ప్రాకారం మొదలగు స్థానిక చరిత్ర పరిశోధన తిరుగుబడులు మరో తరహావి. గుట్టలు ఎక్కడం, గుండాల్లో ఈదడం, గుహల్లో దూరడం, బావుల్లో దూకి ఈత కొట్టడం లాంటి అఘాయిత్యపు తిరుగుళ్ళు ఉండేవి. మధ్య మధ్య భద్రకాళి చెరువు శికంలో సెనగచెట్ల వేట, ఊరిబయట బేనామి భూ ఖండాల్లో సీమ చింతకాయల దాడి, అప్పుడప్పుడు రేగుబండ్లు, సీతాఫలాలు, మామిడి పిందెల దొమ్మిలాంటి ఘాతుక తిరుగుళ్ళు కూడా జరుగుతుండేవి. ఈ తిరుగుడు అభ్యాసం కేవలం బాల్య చాపల్యం కావచ్చు. కానీ అది మానవ ప్రకృతి వైచిత్య్రంతోగల సాన్నిహిత్య ప్రకృతికి ప్రతీక. అనుతత్వ సూత్రం కూడా అతనికి ఆ రోజుల్లో అనుభవ పూర్వకం. అంటే కేవలం తిరగడంలో కూడా ‘జీవిత తత్వం’ ఉందన్నమాట. అందుకే ‘సైర్‌కర్ దున్యాకీ గాఫల్ జిందగాని ఫిర్‌కహా-జిందగీగరో కుచ్ రహేతో నౌజవానీ ఫిర్‌కహా’ అన్నాడో తిరుగు సరదా ఉర్దూ భాషా కవి.
వరంగల్లులో విద్యార్థి దశలోనే భావ కవితా సాంప్రదాయానికి చెందే శైలి ప్రభావం అయనపై అధికంగా కనిపిస్తూండేది. ప్రేమ అనీ, ప్రణయం అనీ పి.వి. ఆ రోజుల్లో ఎవరో ఒక ఊహా సుందరిని తలపోసి చక్కని రొమాంటిక్ వేదనతో ఖండ కావ్యాలు వ్రాయడం జరిగిందని, అయితే వాటిని ఎవరో చిన్ననాటి మిత్రులు కొట్టేయడం వల్ల ప్రస్తుతం లభ్యం కావని ఆయన సహచరులు, పెద్దలు వెల్లడించడం జరిగింది. గాంధీ, నెహ్రూ, సావర్కర్, తిలక్ గ్రంథాలను పి.వి. చదివారు. వీరేశలింగం, చిలకమర్తి, పానుగంటి, గురజాడ అప్పారావు, వేంకట పార్వతీశ్వర కవులు, విశ్వనాథ, బంకించంద్ర, రవీంద్రనాథ్ ఠాగోర్, శరత్‌బాబు, ప్రేమ్‌చంద్, ద్విజేంద్రలాల్‌రాయ్ మొదలైన జాతీయ మహా రచయితల సాహిత్యాన్ని వరంగల్లులో విద్యార్ధి దశలోనే పారాయణం చేశారు. గోరా, గోదాన్, చరిత్రహీన్, ఆనంద్‌మఠ్, నూర్జాహాన్ మొదలగు అనేక గ్రంథాలను అభిమానించేవారు. అంగ్లంలో ‘లే మిజరబుల్స్’ ‘జీన్‌వల్జ్యీ’ ‘టెస్’ ‘ఉదరింగ్ హైట్స్’, ‘కౌంట్ ఆఫ్ మాంట్ క్రిస్టో’ నవలలను చదవడమేగాక, వాటిలోని విశిష్టతలను సాహితీ మిత్రులతో తరచూ చర్చిస్తూ ఉండేవారు.
మరో వైపు పి.వి.కి శాస్త్రీయ సంగీతంలో కూడా అంతో ఇంతో అభిరుచి, అభినివేశం ఉండేది. పద్యాలు, పాటలు, శ్రావ్యంగా పాడేవారు. త్యాగరాజ కృతులను, జావళీలను వాటిలోని రాగ, తాళ విన్యాసాలను అభిమానించేవారు. కర్ణాటక సంగీత విద్యాంసుడు బిడారం కృష్టప్ప రికార్డ్, హిందూస్థానీ సంగీత విద్యాంసుడు నారాయణ్‌రావు వ్యాస్ పాటలు, మీరాబాయి భజనలే గాక గజల్లు వింటుండేవారు. ముఖ్యంగా ఓంకార్‌నాథ్ ఠాకూర్, అబ్దుల్ కరీంఖాన్ ఖయాల్, టుమ్రీ గ్రామ ఫోన్ రికార్డులు, శాస్త్రీయ సంగీత రికార్డులు తనివితీరా విని ఆనందించేవారు. అంతేగాక అయా పాటలను అనుకరిస్తూ చాటుమాటుగా అంతో ఇంతో కసరత్తు కూడా చేసేవారు.
శాస్త్రీయ సంగీత శ్రుత పాండిత్యం అబ్బడం కష్టమన్నది త్వరలోనే తెలుసుకున్నారు. అయినా అనేక రాగాలను గుర్తు పట్టడం, తాళ విన్యాసాన్ని, గతి భేదాలను గుర్తించడం అలవర్చుకున్నారు. ద్వారం వెంకటస్వామి నాయుడు వయోలిన్, పన్నాలాల్ ఘోష్ వేణువు, హీరాబాయి బడోడేకర్, రోషనారా బేగం, కేసరీబాయి, రవూఫ్‌ల గాత్రం, ఆహ్మద్ జాన్ తింక్వా తబలా అంటే మోజు పడేవారు. అయితే తాను మాత్రం సినిమా పాటలు, భజనలు, స్టేజీ కీర్తనలు మున్నగు బాణీల్లో చక్కగా పాడేవారు.
ఆ రోజుల్లో కూడా వరంగల్ పట్టణానికి రాజకీయ ప్రాధాన్యం విశేషంగానే ఉండేది. పౌర హక్కులనే వాటికి గుర్తింపు లేని పరిస్థితులు గనుక దేవుడి పేర వరంగల్ యువకులు, విద్యార్థులు, ప్రతి సంవత్సరం గణేష్ ఉత్సవాలు జరుపుకొని తద్వారా హిందూ సమీకరణ శక్తికి పూనుకునేవారు. ఆ రోజుల్లో హనుమకొండ స్కూల్ విద్యార్ధి యువకులు ‘భజన మండలి’ అనే పేరుతో ఒక సంస్థను నెలకొల్పుకొని అందులో చాటుమాటుగా రాజకీయ చర్చలు సాగిస్తుండేవారు. భజన మండలి స్థాపకుల్లో ఒకడిగా పి.వి. జాతీయవాద పక్షాన్ని బలపరిచేవారు. గణేశ్ ఉత్సవాలు, ఆర్యసమాజ కార్యక్రమాలు, గ్రంథాలయ సభలు మొదలగు ఉద్యమాలలో ఆసక్తిగా పాల్గొనేవారు. పి.వి. ఏది రాసిన అందులో తన నిర్దిష్ట శైలిని పొదగడానికి ప్రయత్నం చేసేవారు. పి.వి. వరంగల్లు హైస్కూల్‌లో విద్యార్ధిగా ఉన్న రోజుల్లో ఆయన జ్ఞాపకశక్తికి అంతా ఆశ్చర్యపడేవారు. ఒకసారి ‘కృష్ణకుమారి’ అనే నాటకం వేసారు. అందులో పి.వి.ది కృష్ణకుమారి వేషం. ఆయన తన పాత్ర పోర్షనేగాక నాటకంలోని అన్ని వేషాల సంభాషణలను పుల్‌స్టాప్, కామాలతో సహా బట్టీ పట్టారు. ఇక రిహార్సల్స్‌లో ప్రాంప్టర్ ఆయనే. ఏ వేషం వేసేవాడు రాకున్నా అతనికి బదులు ఆ వేషం నిర్వహించి రిహార్సల్ కుంటుపడకుండా నడిపించేవారు. అతినిలోని జ్ఞాపకశక్తి అలాంటిది. పనిలో శ్రద్ధ పరిశ్రమ అనేది కూడా ప్రత్యేకతే. కృష్ణకుమారి నాటకంలో పి.వి. అభినయాన్ని ప్రశంసించకుండా ఉండనివారు లేరు. పరీక్షల్లో అతని ఆన్సర్ పేపర్లు టీచర్లు ఇతర విద్యార్థులకు చదవి వినిపించి విశ్లేషించేవారు.
పి.వి. తెలుగులోనే గాక ఇంగ్లీష్ భాషలో కూడా చెప్పుకోదగిన గద్య పద్య రచనలు చేసేవారు. ఈ విషయంలో ఆయన మొదటి గురువు గార్లపాటి రాఘవరెడ్డి. తరుచూ ఆయన ఆశ్రమానికి వెళ్ళి కాలక్షేపం చేయడం ఆనవాయితీగా ఉండేది. రాఘవరెడ్డికి ఆంగ్లభాషా సాహిత్యాలతో పరిచయం లేదు. పి.వి. ఆయనకు వర్డ్స్‌వర్త్, షెల్లీ, కీట్స్, బైరన్, షేక్‌స్పియర్ నాటకాలు, థాకరే, చార్లెస్ డికెన్స్, ధామస్ హార్డీ నవలలు మొదలగువాటి విశిష్టతపై శృత పాండిత్యం కలిగించారు. ఆదే విధంగా రాఘవరెడ్డి మనుచరిత్ర, నైషధం వంటి మహా ప్రబంధాలు, కాళీదాసు, భవభూతి కావ్యాల శైలీ విన్యాసంపై పి.వి.లో అసక్తిని ఇనుమడింప చేశారు. ప్రాచీనత, ఆధునికత అనేవి రెండూ పెనవేసుకొని ఉభయుల్లోనూ సమంగా పెంపొందిన భావసరళి వారి స్నేహంలోని ప్రత్యేకత అని చెప్పవచ్చు.
ఆ రోజుల్లో అప్పుడప్పుడు నాటక ప్రదర్శనలు కూడా జరుగుతుండేవి. డివి సుబ్బారావు ‘హరిశ్చంద్ర’, స్థానం నరసింహారావు సారంగధర, జహ్వారీబాయి రోషనార, తెనాలి కంపెనీ కృష్ణ లీలలు, మైలవరం కంపెనీవారి సావిత్రి లాంటి ప్రదర్శనలు పి.వి. తప్పక చేసేవారు. ఆ రోజుల్లో సోహరాబ్ మోడీ వరంగల్‌లో కొన్ని నెలల పాటు తన హిందీ నాటకాలు ఘనంగా ప్రదర్శించేవారు. తర్వాత కొంత కాలానికి మినర్వా మూవీ టౌన్ స్థాపించి ‘యహుదీకీ లడ్కే’తో పాటు హిందీ చిత్ర నిర్మాణం ప్రారంభించారు. ఆయన నిర్మించిన ‘జైలర్’, ‘సికిందర్’, ‘పుకార్’ చిత్రాలు ఆ రోజుల్లో విడుదలైౖ ఘన విజయం సాధించాయి. పి.వి. అప్పుడప్పుడు హాస్టల్ ఎగవేసి సినిమాలు, నాటకాలు మధ్య మధ్య సర్కస్‌లను చూడడం ఆనవాయితీగా మారింది. శాంతారాం ‘ఆద్మీ’ చూడడానికి ఎవరికీ తెలియకుండా హనుమకొండ నుంచి హైదరాబాద్‌కు వచ్చి సినిమా చూసి రావడం లాంటి సాహసచర్యలతో కూడింది ఆయన విద్యార్ధికాలం నాటి అనుభవాలు.
-వి.ఎల్. నరసింహారావు

