బ్రాహ్మణాల కదా కమా మీషు -9

బ్రాహ్మణాల కదా కమా మీషు -9

కౌశీతకీ బ్రాహ్మణం లో అగ్న్యాధానం కద

అగ్న్యాధానం అంటే హోమం చేయటానికి కావాల్సిన అగ్ని ని  ప్రతి స్టిం చటం .యజ్ఞం లో ఆహవనీయం ,గార్హపత్యం ,అన్వాహార్య పచనం అనే మూడు అగ్నులుంటాయి .ఒక్క రోజు తో పూర్తీ అయ్యే యాగాలనుంచి వెయ్యి సంవత్సరాలు చేయాల్సిన ‘’సత్రం ‘’వరకు ఈ అగ్నులు అవసరమే .ముందు అగ్నిని ప్రతిష్టించి మిగిలిన కార్య క్రమాలు మొదలు పెట్టాలి .

ఒకప్పుడు మానవుల్లాగా దేవతలు కూడా భూలోకం లోనే ఉండి  కర్మానుస్టానాలు చేసుకొంటూ స్వర్గం పొందటానికి సాధన చేస్తూండే వారు .ఈ అనుష్టానం వల్ల  దేవతలు పునర్జన్మ నుండి విమ్ముక్తులై పునరా వ్రుత్తి లేని స్వర్గాన్ని పొందారు .దీనితో మనుష్యుల కంటే వేరు గా ఉన్నారు .స్వర్గానికి పోతున్న దేవతలు అగ్నితో ‘’నువ్వు భూలోకం లో ఉండి మానవులకు ,మాకు అధ్యక్షుడు గా ఉండు .మానవులు శ్రౌత స్మార్త కర్మల ద్వారా సమర్పించిన వి నీ ద్వారా మేం స్వీకరిస్తాం .మా అనుగ్రహం చేత మానవులకు ఐహికాముష్మిక పురుషార్ధాలు పొందుతారు .మనుష్యులకు మాకు సంబంధం కలుపుతూ నువ్వు భూమి మీదే ఉండిపో .మానవులు యజ్న యాగాదులలో ఇచ్చే ద్రవ్యాలను నువ్వు స్వీకరించు .మా తరఫున వారి కోర్కెలు తీర్చు .’’అని చెప్పారు .దానికి అగ్ని ‘’నాకు తీవ్ర దాహం ఉన్న సంగతి మీకు తెలుసు .నన్ను సమీపించటానికే భస్మమై పోతామనే భయం తో  ఎవరూ సాహసం చేయలేరు కదా అందువల్ల మీరనుకోన్నట్లు ‘’పురోడాశం ‘’మొదలైనవి నాకు మానవులు ఇవ్వరు ‘’అన్నాడు .

దేవతలకు సంకట పరిస్తితి వచ్చి బాగా ఆలోచించారు .అగ్ని లో ఇతరులు సహింప రాని తీవ్ర దాహక శక్తి ,మంగళకరమైన మానవాభ్య్దయానికి ఉపయోగించే శోభనకర దాహక శక్తి అని రెండు రకాలు ఉన్నాయి .రెండో దానివలననే మనం వంటలు వగైరా చేసుకో గాలుగుతున్నాం .ఈ శోభన శక్తిని మాత్రం అగ్ని లో ఉంచి ,దేవతలు తీవ్ర శక్తిని వేరు చేసి దాన్ని నీటిలో ఉంచారు .దీనికే ‘’పవమానాగ్ని ‘’అని పేరు .కొంత వాయువులో ఉంచారు .ఇదే పావకాగ్ని .మిగిలిన శక్తి నంతటిని సూర్యుని లో ఉంచారు ఈ అగ్నికే శుచి అని పేరు .కనుక అగ్ని దేవుడిని పూజించాలంటే ఆహవనీయ , గార్హపత్య ,అన్వాహార్య రూపాలలో ఉండే శోభంకర అగ్నులనే కాకుండా పావక ,పవమాన ,శుచి పేర్లతో ఉన్న అగ్ని స్వరూపలనూ పూజించాల్సిందే .అందుచేత ఈ మూడు శరీరాలకు మూడు ఇష్టులు చేయాలి .పావకేష్టి పూర్ణ మాసేష్టికి వికృతి .శుచి ,పవమానేస్టూలకు దర్శేష్టి ప్రకృతి .ఇవన్నీ చేస్తేనే అగ్న్యాధానం పూర్తీ అయి నట్లు లెక్క .

కౌశీతకీ బ్రాహ్మణం విశిష్టత సోమయాగ నిరూపణం మీదే ఆధారపడి ఉంది. సోమయాగం పది రోజులు చేస్తారు వాగ్దీక్ష తో ఇది ప్రారంభ మవుతుంది .ఈ దీక్షతో ప్రాణ దీక్ష  లభిస్తుంది .ఈ రెండిటి వల్లా యజమానికి కోరిక నేర వేరుతుంది .కనుక మాటకున్న విలువ ,దాన్ని ప్రేరేపించే మనసుకున్న సంయమనం ,మనసుతో ప్రభావితమయ్యే ప్రాణ శక్తి ప్రయోజనం ఇందులో సూచించారు .ఇందులో సూచిన అభిజిత్ ,విశ్వజిత్ యాగాలు విశిష్టమైనవి .అభిజిత్ అంటే అగ్ని .విశ్వజిత్ అంటే ఇంద్రుడు .దేవతలు అభిజ్త్ యాగం తో ముల్లోకాలను జయించారు .మిగిలిన లోకాలన్ విశ్వ జిత్ చేసి జయించారు .ప్రజా  రక్షకుడైన డైన రాజుకు విశ్వ జిద్యాగం చాలా అవసరం అని తెలుస్తోంది .శత్రు శేషం లేకుండా చేస్తుంది.దీనితో సామాన్య ప్రజల సంక్షేమానికి హాని తల పెట్టె దుస్త శక్తులను మట్టు పెట్ట వచ్చు లోక క్షేమం కలుగు తుంది .

మనసుకు పరిధులు లేవు అని ,మనస్సు ప్రజాపతి అని ,ఆ ప్రజాపతి యజ్న మయుడని ,మనః పూర్వకం గా యజ్ఞం కోసమే యజ్ఞం చేయాలని తెలియ జేయ బడింది .ప్రజా  రక్షకు డైన రాజు మనస్సుజీవితం నిస్వార్ధం గా ఉండాలి అనే సూచన ఉంది .విజ్నుడి రాక తో యజ్ఞం ఆనందిస్తుందని చెప్ప బడింది .ఏదైనా ప్రమాద వశాత్తు తప్పులు చేస్తే సరి దిద్దుకోవాలని సూచించింది ..అందరూ చేరలేని ఎత్తులకు ఎగిరే గరుత్మంతుడే వాయువు అని ,వాయువు అంటే ప్రాణమని చివర సుపర్ణ పర్వం లో వివరింప బడింది .వాల ఖిల్యులు అంటే భౌతిక శరీరం నుండి విడి పోని  ప్రాణాలు అని ,వైశాల్యం లో వాలం అంటే కేశం అంటే వెంట్రుక వంటి ప్రాణాలు ,శరీరాన్ని వదల లేవుకనుక వాటికి వాలఖిల్యులు అనే పేరొచ్చింది .రెండిటితో సంబంధం లేని దాన్ని ఖిల అంటారు . సూక్ష్మ సంబంధం ఉన్దికనుక వాలఖిల్యులన్నారని భావం .చివరలో కర్మ బద్ధుడైన జీవుని ప్రస్థానాన్ని కూడా సవివరం గా కౌశీతకి బ్రాహ్మణం వివరించింది .

అగ్ని  బ్రహ్మణ   శక్తి .సోమం క్షాత్ర శక్తి .అన్ని కోర్కెలను తీర్చే వాక్కు మనస్సు లే హోమ ద్రవ్యాలు .బలి సమర్పించటం అంటే పురోడాశం సమర్పించటమే  పశుబలి .పశువును కాక పశువుకు ప్రతీక అయిన పురోడాశం ను సమర్పించాలి .యజ్ఞం చేసే యజమానికి ఇహ పరాల్లోను అంతరిక్షం లోను మేలు జరుగుతుంది .సంతానంకావాలని యజ్ఞం చేసేవారు ‘’శుద్ధ ప్రణవం ‘’ను ,పరువు ప్రతిస్టలకై చేసే వాళ్ళు ‘’మకార లేకుండా ఉన్న ప్రణవాన్ని ‘’ఉచ్చరించాలి ఈ యజ్ఞం సు సంపన్నం అయితే స్వర్గ రూపం ,తగ్గితే అన్నాది రూపం ,హెచ్చితే సంతాన రూపం అవుతుందని వివరించింది కౌశీతికం .సోమమే సవనీయం చేయాల్సిన పశువు .యజ్నమే ప్రజాపతి స్వరూపం అని ముందే తెలుసుకొన్నాం .ప్రాజాపత్య యజ్ఞం సర్వా భీస్టాలను తీరుస్తుంది .సూక్షం గా విచారిస్తే యజ్న కర్త శరీరమే పురోడాశం .ఆయన ఉచ్చ్వాస నిస్శ్వాసాలే సోమ పాన పాత్రలు .యజ్ఞకర్త ఇహలోకం లో సంపూర్ణ జీవితం గడిపి స్వర్గం లో అమరుడౌతాడు .

షోడశి లో ఈ విశ్వం షోడశ కళాత్మక రూపం గా చెప్ప బడింది షోడశి ఇంద్రుడే .ఇంద్రుడు హరి యే.యజ్ఞం పురుష స్వరూపమే .పురుషుని శిరస్సు ‘’హవిర్వాహకం ‘’.ముఖమే ఆహవ నీయం .ఉదరం సదస్సు .ఆహారమే దేవతలకు చేసే స్తోత్రాలు .బాహువులు మార్జాలీయాగ్ని ద్రీయాలు .లోపలి దివ్య శక్తులు సదస్సులోని దేవతా పీఠాలు .మనస్సు బ్రహ్మ. .ప్రాణమే ఉద్గాత .అపానం ప్రస్తోత .వ్యానం ప్రతి హర్త.వాక్కు హోత .నేత్రమే అధ్వర్యుడు .సంతతే సదస్యులు .ఆత్మ యజమాని .అవయవాలు హోత్రాశంసులు .ఇవన్నీ గమనిస్తే మానవ జీవితం  యజ్న మయం అనే అంతరార్ధం తెలుస్తుంది .

పూరీ జగన్నాధ రధ యాత్ర శుభా కాంక్షలు –

సశేషం

మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -29-6-14-ఉయ్యూరు

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.