కథ చెబుతా… కథ చెబుతా…

అమ్మా…కథ చెప్పవూ అంటే చెప్పే అమ్మలు ఎంతమంది ఉన్నారు చెప్పండి? కానీ… ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న అమ్మ ఆ పని చేసి చూపుతోంది. ఆమె పేరు ఉమా చల్లా. తన పాప చారుమతికి కథలు చెపుదామని తెలుగు కథల పుస్తకాల కోసం ఆమె ఎన్నో చోట్ల వెతికారట. కానీ అవి దొరకలేదు. అప్పుడు పిల్లల కోసం తానే తెలుగులో మంచి కథల పుస్తకాలు తెస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఆమెకు వచ్చింది. అలా తన కథల పుస్తకాల ద్వారా రామాయణం నుంచి సౖౖెన్స్ దాకా ప్రతీ విషయాన్ని ఎంతో సరళమైన తెలుగులో పిల్లలకు కథలుగా చెప్తున్నారామె. మరిన్ని విశేషాలు ఆమె మాటల్లోనే…
నేను పిల్లలకు చెప్పే కథల్లో రెండు ముఖ్య అంశాలను దృష్టిలో పెట్టుకున్నాను. ఒకటి చెప్పే తీరు ఆకర్షణీయంగా ఉండాలి, రెండవది సందేశాత్మకంగా ఉండాలి. అదీ ముఖ్యంగా సామాజికంగా, పర్యావరణ పరంగా, అలాగే మనపట్ల మనం ఎలా బాధ్యతగా ఉండాలి వంటి విషయాలు పిల్లలకు కథల ద్వారా చెప్పడానికి ప్రయత్నించాను.
‘మాది హైదరాబాద్. ఇంటర్ వరకే నేను కాలేజికి వెళ్లి చదువుకున్నాను. ఎందుకో తెలియదు కానీ కాలేజీ నాలుగు గోడల మధ్య చెప్తున్న చదువు నాకు నచ్చలేదు. అందుకే ఇంటిపట్టునే ఉండి బిఎ డిగ్రీ డిస్టన్స్ ఎడ్యుకేషన్ చేశాను. ఎం.ఎ ఆంత్రపాలజీ, ఎం.ఎస్.సి బయోలజీ అమెరికాలో చదివాను. ఫ్రెంచి భాషలో డిప్లొమా తీసుకున్నాను.
మావారు కిరణంతో 2004లో (మా అత్తవారు ఆయనకు అచ్చమైన తెలుగు పేరు పెట్టాలని కిరణం అని పెట్టారు) నా పెళ్లయింది. 2011లో మా పాప చారుమతి నా జీవితంలో ప్రవేశించింది. పాప ప్రవేశం నా జీవితంలో ముఖ్యమైన మలుపని చెప్పాలి.
మా పాపే స్ఫూర్తి…
ఏడాది వయసులో ఉండగానే మా పాప చారుమతికి ఉషశ్రీ రామాయణ, మహాభారత, భాగవతకథలు చెప్పాను. వాటిల్లోని కొన్ని ఘట్టాలైతే తనకు బాగా గుర్తు. పాప ఇష్టాయిష్టాల కనుగుణంగా తనను పెంచాలని నా ఉద్దేశం. మా ఇల్లు కూడా పాపకు నచ్చినట్టు పెడతాను. ఒకచోట బుక్స్. మరో చోట కంప్యూటర్. ఇంకోచోట ఆడుకునే బొమ్మలు, పక్కనే జారుడు బల్ల, మరోవైపు ఆటబొమ్మలు, బిల్డింగ్ బ్లాకులు వీటితో పాటు మేక-పిల్లి, వామనగుంటలు లాంటి బోర్డ్ గేమ్స్ సెట్…అన్నీ హాల్‌లో పరిచి ఉంచుతాను. ఎప్పుడు ఏది ఆడాలనిపిస్తే అది ఆడుతుంది.
మా పాప చారులతకు కథలంటే చాలా ఇష్టం. అందుకే తెలుగు కథల పుస్తకాల కోసం ఎంతగానో వెతికాను. ఇంగ్లీషులో పెద్ద పెద్ద బొమ్మలతో మంచి కథల పుస్తకాలు చాలానే దొరుకుతున్నాయి గానీ తెలుగులో మటుకు ఈ లోటు బాగా కొట్టొచ్చినట్టు నాకు కనిపించింది. తెలుగులో మంచి కథల పుస్తకాలు దొరక్కపోవడంతో వాటిని తెచ్చే పని నేనే ఎందుకు చేయకూడదు అనే ఆలోచన నాకు వచ్చింది.
పిల్లల కథలకు బొమ్మలు ప్రాణం…
పిల్లలకు కథలు రాయడం ఒక ఎత్తయితే ఆ కథలకు బొమ్మలు గీయడం మరో ఎత్తు. అవి పిల్లలను ఆకర్షించేలా రంగు రంగుల్లో పెద్దవిగా ఉండాలి. ఎక్కువ బొమ్మలుంటే పిల్లలు బాగా ఇష్టపడతారు. పిల్లల భాషా విషయానికి వస్తే లయ, ప్రాస ఉన్న వాక్యాలు వాళ్లు బాగా ఆస్వాదిస్తారు. మా పాపకు కథలు చెప్పేటప్పుడు ఎలా చెప్తే పిల్లలకు తొందరగా అర్థమవుతుంది, భాష ఎలా ఉండాలి అన్న అంశాలపై నేను బాగా పరిశోధన చేశాను. పిల్లలకు నచ్చేలాగ బొమ్మలు వేయడం నాకు పెద్ద సవాలుగా నిలిచింది. మా అన్నయ్య బొమ్మలు వేయగలరు. కథలకు బొమ్మలు ఆయన చేత వేయించాను కూడా. ఎందుకో అవి పిల్లలకు నేను చెప్పదలచుకున్న విషయాన్ని పూర్తిగా కమ్యూనికేట్ చేస్తున్నట్టు అనిపించలేదు. ఇలా కాదని బొమ్మలు కూడా నేనే వేయాలనుకున్నాను. రోజంతా నేను మా పాపతో గడుపుతానుకాబట్టి పిల్లల ఆలోచనా తీరు ఎలా ఉంటుందో ఒక తల్లిగా నాకు బాగా అర్థమయినట్టు మా అన్నయ్యకు సాధ్యం కాదనిపించింది. అందుకే బొమ్మలు వేసే పనిని కూడా నేనే తలకెత్తుకున్నాను. బొమ్మ సింపుల్‌గా ఉండాలి. అన్ని విషయాలూ చెప్పగలగాలి, కలర్‌ఫుల్‌గా ఉండాలి అనేది నా అభిప్రాయం. మొత్తానికి చిన్నారులకు నచ్చేలాగ కథలకు బొమ్మలు గీయడానికి నేను చాలానే శ్రమపడ్డాను.
నా మొదటి కథ ‘కాకమ్మ దాహం’. ఇంకా’ సీతాకోకచిలుక’, ‘తాబేలు-కుందేలు’, ‘నక్క-ద్రాక్షపళ్లు’ లాంటివి మొత్తం 10 పుస్తకాలు రాశాను. కథలు రాయడం, బొమ్మలేయడం దగ్గరి నుంచి పుస్తకాల డిజైనింగ్, ప్రచురణ అన్ని పనులూ నేనే చేశాను. ఈ పుస్తకాలు వేసేముందు నేను ఇపుడున్న ప్రచురణరంగ పోకడలను సైతం బాగా స్టడీ చేశాను. ఎందుకంటే పిల్లల పుస్తకాల డిజైనింగ్ వేరుగా ఉంటుంది. అవి పిల్లలను బాగా ఆకటుకునేలా ఉండాలి. ఇక్కడ డబ్బులెక్కలు చూడకూడదని నా అభిప్రాయం. ఈ కథల పుస్తకాల ప్రచురణ కోసం నేను మా వారు ఇన్స్‌రెన్స్ పాలసీలను వాడేశాం.
ఆదివారం కథాకాలక్షేపం…
రామాయణానికి సంబంధించి పిల్లల కథల పుస్తకాలు తేవాలనుకుంటున్నాను. రామాయణంలో బాలకాండ మీద కథలు పూర్తి చేశాను. ఇంకొన్ని రోజుల్లో ఈ కథల పుస్తకం బయటకు వస్తుంది. నా పుస్తకాల ద్వారా సైన్స్ గురించి అంటే గ్రహాల దగ్గరి నుంచి నక్షత్రాలు, విశ్వం అన్నింటినీ పిల్లలకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించాను. విలువలు బోధించే కథలు నా పుస్తకాల్లో చెప్పాను. అలాగే మన సంస్కృతి, పండుగల గురించి వివరించాను. తెలుగు అంకెలు, తెలుగు నెలల గురించి పిల్లలకు అర్థమయ్యేలా నా పుస్తకాల్లో చెప్పాను.
సప్తపర్ణి అనురాధగారికి ఈ పుస్తకాలు చూపించినప్పుడు ఆవిడ చాలా బావున్నాయి, మా సెంటర్‌లో పెట్టండి అన్నారు. ఆ తర్వాత నా పుస్తకాలకి మంచి స్పందన వచ్చింది. తల్లిద్రండులు కూడా ఆసక్తిగా వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. మాతృభాషలో ఏది చెప్పినా దాని స్పందన చాలా బాగుంటుంది. అంతేకాదు మన భాషపై మనం పట్టు సంపాదించినపుడే మిగతా భాషల్ని కూడా తొందరగా నేర్చుకోగలుగుతాం. ఈమధ్యనే సేక్రడ్ స్పేస్‌లో ప్రతి ఆదివారం కథాకాలక్షేపం అని ఒకటి మొదలెట్టాను. నా పుస్తకాల్లో బొమ్మలు చూపిస్తూ కథలు పిల్లలకు చెపుతా. నేను పిల్లలకు చెప్పే కథల్లో రెండు ముఖ్య అంశాలను దృష్టిలో పెట్టుకున్నాను. ఒకటి చెప్పే తీరు ఆకర్షణీయంగా ఉండాలి, రెండవది సందేశాత్మకంగా ఉండాలి. అదీ ముఖ్యంగా సామాజికంగా, పర్యావరణపరంగా, అలాగే మనపట్ల మనం ఎలా బాధ్యతగా ఉండాలి వంటి విషయాలు పిల్లలకు కథల ద్వారా చెప్పడానికి ప్రయత్నించాను. పిల్లలకు కథలు చెప్పే తీరులో కూడా జాగ్రత్తలు తీసుకుంటాను. ఉదాహరణకు రామాయణం గురించి చెప్పేటప్పుడు మ్యాప్ తీసుకుని రామాయణంలోని ఫలానా ప్రాంతం ఎక్కడ ఉంది మ్యాప్‌లో చూపిస్తూ చెప్పడం, సన్నివేశాలను వివరించడం చే స్తాను. మన పాత ఆటలు పులిమేక, వామనగుంటలు, చదరంగం, వైకుంఠపాళి వంటివి కూడా వారికి నేర్పుతాను. బోర్డు గేమ్స్ వల్ల పిల్లలకు మేథమేటిక్స్ బాగా వస్తుంది.
సేక్రెడ్ స్పేస్‌లో ఒక్కొక్కవారం ఒక్కొక్కదానిగురించి పిల్లలకు చెబుతాను. ఆడుదామా అష్టాచమ్మా అని పాత ఆటల గురించి పిల్లలకు ఒక వారం నే ర్పిస్తాను. మరోవారం పద్యం పాడుకుందాం, ఇంకోవారం తెలుగుపాట నేర్చుకుందాం, తర్వాతి వారం దండకం నేర్చుకుందాం వంటివి పిల్లలకు చెపుతుంటాను. నిజానికి ఇవన్నీ ఇళ్లల్లో జరగాల్సిన పనులు. కానీ జరగడంలేదు. మా పాపతో నేను రోజూ ఇలానే గడుపుతాను. పిల్లల ఏకాగ్రత స్థాయిని బట్టి ఏ విషయాన్నైనా వారికి చెప్పే ప్రయత్నం చేయాలి. వారికి ప్రేమగా చెప్పాలి. పిల్లల వికాసానికి అనువైన వాతావరణం కల్పించడం ద్వారానే ఎన్నో విషయాలను వారికి సులువుగా చెప్పొచ్చు.
నాకు తెలుగు మీద ఇష్టం కలిగింది మా అమ్మమ్మ వల్లే. ఆమె ఇంట్లో పనిచేసుకుంటూ పాడే పాటలు, పద్యాలు, వంట అయిన తర్వాత తను చెప్పిన కథలు ఇవన్నీ నా మీద చాలా ప్రభావం చూపాయి. పిల్లలతో కూర్చున్నప్పుడు వారికి సందర్భానుసారం చెప్పగలగే సృజనాత్మకత మనకు కావాలి. అలాంటి వాతావరణం మనం సృష్టించాలి. అప్పుడు పిల్లలు కూడా సహజంగా వికసిస్తారు.’
ం నవ్య డెస్క్

