సంజీవదేవ్ గుంటూరు జిల్లా తుమ్మపూడిలో 3 జూలై 1914న జన్మించారు. వారి జీవితమే మహత్తరమైనది. చిన్నతనంలోనే హిమాలయాలలో కొంత కాలమున్నారు. అచటనే ప్రకృతి చిత్రాలను వేయడం జరిగింది. ప్రకృతి ఆస్వాదన వారికెంతో ఇష్టం. వారితో మాట్లాడుతుంటే కాలగమనమే మనకు తెలిసేది కాదు.
1963లో ‘ఆంధ్రజ్యోతి’లో ప్రతి ఆదివారం ‘తెగిన జ్ఞాపకాలు’ అని తమ జీవిత చరిత్రను రాసారు. తరువాత అది పుస్తకంగా వచ్చింది. 2011 మార్చిలో రాజా చంద్ర ఫౌండేషన్, తిరుపతి- దుర్గా ప్రసాద్ వారు ‘తుమ్మపూడి’ అనే పేరుతో సంజీవదేవ్ స్వీయ చరిత్రను 704 పేజీలతో మంచి ఆకర్షణతో పుస్తకంగా ప్రచురించారు.
సంజీవదేవ్ ‘రసరేఖ’ పుస్తకాన్ని రచించారు. తమ ఇంటికి ‘రసరేఖ’ అని పేరు పెట్టారు. వీరు చిన్నప్పుడు హిమాలయాలకు వెళ్లినప్పుడు ఎంతోమంది మేధావులతో, ప్రముఖులతో పరిచయాలు పొందారు. ఎన్నో పుస్తకాలు, తెలుగు, ఇంగ్లీషులలో రాసారు. వీరు చదివింది 8వ తరగతి. కాని 14 భాషలు రాసేవారు. చదివేవారు. వారి చేతిరాత అచ్చం అచ్చువలె వుండేది. ప్రతిదినం పలువురు అభిమానుల దగ్గర నుండి కట్టలుగా వుత్తరాలు వచ్చేవి. చిన్నా పెద్దా అని చూడకుండా అందరికి ఆప్యాయంగా జవాబులు రాసేవారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి వారింట తుమ్మపూడిలో కవిసమ్మేళనాలు జరిగేవి. పెద్దపెద్ద కవులు, రచయితలు వచ్చేవారు. గొట్టిపాటి బ్రహ్మయ్య, గొఱ్ఱెపాటి వెంకటసుబ్బయ్య, ఆచంట జానకిరామ్, నాగభైరవ కోటేశ్వరరావు మొదలైనవారు వచ్చేవారు. నేను తిరుమల నుండి వెళ్లేవాడిని.
‘విద్యార్థి’ అనే మాసపత్రిక 1963 అక్టోబర్ సంచికలో సంజీవదేవ్ ‘కీర్తి-తృష్ణ’ అనే వ్యాసాన్ని రాసారు. అందులో- ‘కాంతను, కనకాన్ని, పదవిని, సుఖాన్ని మొదలగునవన్నిటిని మానవుడు త్యజించగలడు గాని కీర్తిని మాత్రం త్యజించలేడు. ఐహిక సంబంధాలన్నిటిని త్యజించిన తాపసులు కూడ ప్రశంసలకు సంతోషించటం, నిందకు బాధపడటం జరుగుతూనే వుంది. కీర్తి మీద గనుక కాంక్షలేని యెడల ఈ జగత్తులో ఎన్నో ఘనకార్యాలు జరిగేవే కావు’ అని రాసారు.
నేనంటే మొదటినుంచి వాత్సల్యం చూపేవారు. ‘జీవితం ఒక గొప్ప సంగ్రామం. ఈ సంగ్రామంలో తలెత్తే వ్యతిరేక పరిస్థితులలో ప్రశాంతంగా, ధైర్యంగా పోరాడితే విజయం దానంతటదే లభించుతుంది. వ్యతిరేకతలు అనుకూలతలుగా మారుతాయి. చిన్న చిన్న ఇబ్బందులకు జంకక ధీరుని వలె జీవించాలి’ అని 9.4.1966న ఒక జాబు రాసారు.
‘వస్తున్న అసంఖ్యాక అభినందనలకు జవాబులు వ్రాయుటయే సరిపోతుంది ఇప్పటివరకు. వరికోతలు కోస్తున్నారు. పైన మబ్బులు పడుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా రైతులు ఈ వ్యతిరేక వాతావర ణంలో చాలా నష్టపోతున్నారు’ అని 16.11.82న రాశారు.
‘మానవ జాతి అంతా ప్రపంచంలో ఒకటే. అయినప్పటికీ ఎవరి ప్రత్యేక జీవితాలు వారివే. జీవితంలో వికసించటానికి రెండు విషయాలు ప్రధానమైనవి- ఒకటి మనోవికాసానికి సంబంధిం చిన ప్రతిభ, రెండవది భౌతికమైన కృషి. వీటినే Intelligence and industry అంటారు. ఈ రెండు శక్తులు కూడ నీలో శక్తివంతమై వున్నవి. అందుకే నీవు తగిన ఔన్నత్యాన్ని జీవితంలో పొందగలుగు తున్నావు’ అని 3.3.1999లో రాసారు. నేను 31.8.1999న ఉద్యోగము నుండి రిటైరవుతానని రాసిన జాబుకు జవాబు ఆ రకంగా రాసారు. కాని నేను రిటైరవక ముందుగానే 25.8.99న ఆయన మరణించారు. నాకు అలా ఆయన చాలా వుత్తరాలు రాసారు.
ఆయన వందవ జయంతి ఉత్సవాలు తుమ్మపూడిలో జూలై 3న ఘనంగా జరగనుండటం ఆనందదాయకం.
– ఎస్.డి.గిరిజా ప్రసాద్
(సంజీవదేవ్ వందవ జయంతి ఉత్సవాలు తుమ్మపూడిలో జూలై 3న జరుగనున్నాయి)

