బ్రాహ్మణాల కదా కమా మీషు -10
తైత్తిరీయ బ్రాహ్మణ ఉపాఖ్యానకధలు
కృష్ణ యజుర్వేదానికి ఎనభై ఆరు శాఖలున్నాయి .అందులో నశించి పోయినవి కాక మిగిలి ఉన్న నాలుగు శాఖలలో ముఖ్యమైనది తైత్తిరీయ శాఖ .దానికి సంబంధించిన బ్రాహ్మణమే తైత్తిరీయ బ్రాహ్మణం .అంటే కృష్ణ యజుర్వేదానికి మిగిలి ఉన్నది ఒకే ఒక్క తైత్తిరీయ బ్రాహ్మణమే నన్న మాట .కృష్ణ యజుస్సంహితలో బ్రాహ్మణ భాగాలు కలిసి పోయే ఉంటాయి .. బ్రాహ్మణానికి సంహితకు పెద్దగా తేడా కని పించదు.వైశంపాయనుడి శిష్యుడు పైంగి యాస్కుడు .అతని శిష్యుడే తిత్తిరి మహర్షి .ఉఖ మహర్షి తిత్తిరి శిష్యుడు .ఆత్రేయుడు తిత్తిరి ప్రశిష్యుడు .తైత్తిరీయ శాఖా ప్రవర్తకులలో తిత్తిరి మహర్షి మణి లాంటివాడు .అతనే ఈ బ్రాహ్మణ కర్త కనుక ఆయన పేరనే చెలా మణి అయింది . ఈ బ్రాహ్మణం లో మొదటికాన్డను పార క్షుద్ర అని రెండవ దాన్ని అగ్ని హోత్రం అనీ అంటారు మూడవ దానిలో విభాగాలకు వాటి ప్రత్యెక పేర్లున్నాయి .
ఒకప్పుడు విదేహ రాజు జనకుడు సావిత్రాగ్ని జ్ఞానాని సంపాదిన్చాలనుకొని దేవతలను కలిశాడు .వాళ్ళు లోకం లో ఎవరు తమను సావిత్రాగ్ని స్వరూపం గా ఉపాసన చేస్తారో అలాంటి వారు సర్వ పాపాల నుండి ,అప మృత్యువు నుండి ముక్తులౌతారని ,పూర్నాయుస్సుపొంది ఎప్పటికీ అన్నాదులకు లోటు లేకుండా సర్వాన్న సామ్రుద్ధి కలవారై స్వర్గాన్ని పొందుతారు అని చెప్పారు .అశ్వత్థ మహర్షి శిష్యుడు అహీన మహర్షి సావిత్రాగ్ని స్వరూపాన్ని ధ్యానం చేసి సాక్షాత్కరింప జేసుకొన్నాడు .అందుకనే ఆయన దేహ అవసాన దశలో’’ బంగారు హంస’’ అయి స్వర్గం చేరి ఆదిత్యునితో తాదాత్మ్యం చెందాడు .
ఈ బ్రాహ్మణం లో నీతికధలు తో బాటు లౌకిక జ్ఞాన విషయాలూ చాలానే ఉన్నాయి .చంద్రుడు ఏ రోజు ఏ నక్షత్రం తో కలిసి ఉంటాడో ఆ రోజు ఆ నక్షత్రం ఉంటుందని లోక వ్యవహారం .కృత్తికా నక్షత్రం తో చంద్రుడు కలిసి ఉన్న రోజు కృత్తికా నక్షత్రం అని అర్ధం .రోజుకొక నక్షత్రం ఉంటుంది కనుక దీన్ని బట్టి తెలుసుకోవాలి .కృత్తిక ఒకప్పుడు మొదటి నక్షత్రం గా ఉండేది .ఆ నక్షత్రం లో ఆధానం చేస్తే బ్రహ్మ వర్చస్సు కలుగుతుందని శాస్త్రం .రోహిణి లో చేస్తే సిరి సంపదలు కలుగుతాయి .దేవతలు ఒకప్పుడు ధన గర్వం లో విర్ర వీగుతూ అశ్రద్ధగా అగ్న్యాధానం చేసి సిరి సంపదలు పోగొట్టుకొని దరిద్రులైనారు .తప్పు తెలుసుకొని పునర్వసు నక్షత్రం లో శ్రద్ధ గా చేసి మళ్ళీ ధనికులైనారు .పునః అంటే మళ్ళీ వసు అంటే సంపద పొందారు కనుక ఆ నక్షత్రానికి పునర్వసు అనే పేరొచ్చింది .అలాగే విషువత్ కు ఇందులో అర్ధం చెప్పబడింది .సంవత్సరాన్ని రెండు భాగాలు చేయాలి .మొదటి భాగం లో చివరి నాలుగు రోజులు ,రెండో భాగం లోని మొదటి నాలుగు రోజులు తీసుకొని మధ్యలో ఉన్న రోజును విషువత్ అంటారని ఈ తొమ్మిద రోజుల్లో యాగం చేస్తే అష్ట దిక్పాలకులు పాలించే ఎనిమిది స్వర్గాలు,అంత కంటే పై నుండే స్వర్గం పొందగలరు .
అన్నం రెండు సార్లు ఎందుకు తినాలి?
ఒకప్పుడు దేవతలు ,పితరులు ,మనుష్యులు ,పశువులు ,అసురులు (వీరందరికీ ప్రజలనే పేరు )ఉపవాసం తో ఉండే సత్రాన్ని గురించి తపస్సు చేశారు .వారిలో దేవతలు నేతితో నిండిన చమన పాత్రను చూసి హోమం చేసి పది హీను రోజులకోసారి భోజనం చేసే రస పదార్ధాన్ని పొందారు .అందుకే అమావాస్య ,పొర్ణమి రోజుల్లో దేవతల ప్రీతికోసం దర్శ ,పూర్నమాస యాగాలు చేస్తారు .పితృదేవతలు నెలకోసారి భోజనాన్ని సంపాదించుకొన్నారు .అందుకే ప్రతి అమా వాస్య నాడు ‘’పిండ పితృ యజ్ఞం ‘’చేసి పితృ దేవతలను సంతృప్తి పరుస్తారు .మానవులు ఒకేరోజు రెండు భోజనాలను సంపాదించారు .పశువులు మూడు సార్లు తిని మిగిలిన సమయం లో నెమరేస్తాయి .రాక్షసులు సంవత్సరానికి ఒక సారే తిండి సంపాదించారు .అందుకే ఏడాదికి ఒక సారే తిండి తిని మిగిలిన రోజుల్లో దేవతల తో యుద్ధాలు చేసే వారు .
నక్షత్రాలే ప్రజా పతి శరీరం .హస్తా నక్షత్రం ప్రజా పతి హస్తం .చిత్తా నక్షత్రం శిరస్సు .స్వాతి హృదయం .విశాఖ తొడలు ,అనురాధ పాదాలు .ఇలా నక్షత్ర స్వరూపిగా ప్రజాపతిని ధ్యానిస్తారు .
గోవులే అగ్ని హోత్రాలు
పర్వతాలు మొదలైన అచేతనాలను సృష్టించి తర్వాత ప్రజాపతి అగ్ని వాయువు ,ఆదిత్యుడు అనే చేతనలను హోమం ద్వారా సృష్టించాడు .ఈ ముగ్గురూ తాము కూడా ప్రజా పతి లాగానే సృష్టి చేయాలను కొని అగ్ని ప్రాణం కోసం వాయువు శరీరం కోసం ,ఆదిత్యుడు కండ్ల కోసం హోమం చేశారు .దీనితో ఒక గోవు పుట్టింది .దాని పాలు పంచుకోవటం లో ముగ్గురికీ పేచీ వచ్చింది .పరిష్కారం కోసం ప్రజా పతి దగ్గరకు చేరారు .ప్రాణాలు లేని శరీరం, కండ్లు వ్యర్ధం కనుక ప్రాణాలకోసం హోమం చేసిన అగ్నిదే ఆవు అని తీర్పు చెప్పాడు .అప్పటి నుంచి ఆవుకు ‘’అగ్ని హోత్రం ‘అనే పేరొచ్చింది .ఆవును అగ్ని హోత్రం గా ఉపాసించే వారికి అప మృత్యు భయం ఉండదని ఈ బ్రాహ్మణం చెప్పింది .
మానవ సృష్టి
ప్రజాపతి సృష్టి చేయాలను కొని ముందు ప్రాణ వాయువు తో బలాదికులైన అసురుల్ని సృష్టింఛి ‘’పిత ‘’అని పించుకొన్నాడు .తర్వాత పితృదేవతలను సృష్టించి ,ఇంకా ఏమేమి సృష్టించాలా అని మనసులో ఆలోచించాడు .అప్పుడు మనుష్యులేర్పడ్డారు .మననం చేయటం వాళ్ళ ఎర్పడ్డారుకనుక మానవులని పించుకొన్నారు .మనుష్యులు లౌకిక వైదిక వ్యవ హారాలు చేసే సరికి అంతా కాంతి తో నిండి పోయింది .ఆ కాంతి ననుసరించి దేవతలను సృష్టించాడు .ఈ ఆలుగు రకాల సృష్టి’’ జలం’’ లాంటిది .నదీ జలం తటాక జలం వగైరా ఎలా భోగానికి ఉపయోగిస్తాయో సృష్టి కూడా భోగానికి ఉపయోగ పడుతుందని అంతరార్ధం .
బొల్లి ఎల్లా పోతుంది?
తెల్ల బొల్లి మచ్చలున్న శరీరాన్ని ‘’కిలాపం ‘’అంటారు .తల నెరిసి పోవడాన్ని ‘’పలితం’’అంటారు.;;నీలి ‘’అనే ఓషది ఈ రెండు వ్యాదుల్నీ పోగొట్టు తుంది .ఈ ఓషధిని అభిమంత్రిస్తూ చెప్పాల్సిన మంత్రాలు ఇందులో ఉన్నాయి .బొల్లి ఎన్ని రకాలో ,వాటిని పోగొట్టె శక్తి నీలికి ఎలా వచ్చిందో వివరాలున్నాయి .
పగలు రాత్రులకు పేర్లు
సావిత్ర చయనం లో కొన్ని వైదిక పరిభాషలున్నాయి .ప్రతీనెలలో మొదటి పదిహేను రోజులు శుక్ల పక్షం .తరువాతిది కృష్ణ పక్షం .శుక్లపాడ్యమి తో మొదలైన తిధుల పగటి వేళలను వరుసగా సంజ్ఞానం ,విజ్ఞానం ,ప్రజ్ఞానం ,జానాథ్ ,అభిజానాథ్ ,సంకల్పమానం ,ప్రకల్ప మానం ,ఉపకల్పమానం ,ఉప క్లప్తం,క్లప్తం,శ్రేయః ,వసీయ ,ఆయత్,సంభూతం ,భూతం అనే పేర్లతో పిలుస్తారు .శుక్ల పక్ష రాత్రులకు వరుసగా దర్శ ,దృష్టా ,దర్శత ,విశ్వ రూపా ,సుదర్శనా ,ఆప్యాయ మానా ,ప్యాయ మానా ,ప్యాయా ,సూనృతా ,ఇరా ,అపూర్యమానా ,పూరయన్తీ ,పూర్నా ,పౌర్న మాసీ అనే పేర్లున్నాయి .అలాగే కృష్ణ పక్ష పగళ్ళకు రాత్రులకు పేర్లు చెప్పా బడ్డాయి
తైత్తిరీయం మూడు కాండలలో అనేక పేర్లున్న యజ్న యాగాదుల నిర్వహణ విధానం వివరణ ఉంది మధ్యమధ్యలో సందర్భాన్ని బట్టి లోకానికి పనికి వచ్చే కబుర్లెన్నో చెప్పింది.వీటినన్నిటిని అర్ధం చేసుకొని సంస్కారం తో జీవితాన్ని మలచుకొని సమాజ భ్యుదయానికి పాటు పడమనే ఏ బ్రాహ్మనమైనా బోధించే విషయం .
తరువాత శత పద బ్రాహ్మణ విశేషాలు తెలుసుకొందాం .
సశేషం
మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -30-6-14-ఉయ్యూరు


అయ్యో
బ్రాహ్మణికాల ప్రచురణ కర్త మొబైల్ నంబరు ఇవ్వండి.
LikeLike