థౌజండ్ వాలా బ్రహ్మానందం 30 యియర్స్ ఇన్ ఇండస్ట్రీ

థౌజండ్ వాలా బ్రహ్మానందం 30 యియర్స్ ఇన్ ఇండస్ట్రీ

 

 


థౌజండ్‌వాలా 30 ఇయర్స్‌ ఇండసీ్ట్ర

నేడు బ్రహ్మానందం పుట్టినరోజు
సినిమాల ద్వారా మీరు ప్రేక్షకుల్ని నవ్విస్తుంటారు? మరి, మిమ్మల్ని ఎక్కువగా ఎవరు నవ్విస్తుంటారు?
మా ఊళ్లో నాకు బాల్య స్నేహితులు ముగ్గురున్నారు. గంగారపు వెంకట్రావు, జింకా రామారావు, ఎం.పుల్లారెడ్డి అని. వీళ్లు ముగ్గురు హాస్యప్రియులు. మాటలతో, చేష్టలతో నవ్విస్తుంటారు. ఫోన్‌లలోనే సెటైర్లు వేస్తూ నాలో జోష్‌ నింపుతుంటారు. ఇక, నటుల్లో అయితే – రాజేంద్రప్రసాద్‌, కృష్ణభగవాన్‌, ఎంఎస్‌ నారాయణ, అలీ, వేణుమాధవ్‌, గుండు హనుమంతరావు వేసే జోకులకు నవ్వొస్తుంటుంది. వీళ్లలో ఏ ఒక్కరు షూటింగ్‌లో కలిసినా నవ్వులు పేలుతుంటాయి.
బ్రహ్మానందం వాడుకున్నోళ్లకు వాడుకున్నంత! ఆయనలో ఎన్ని వేరియేషన్లు ఉన్నాయో అన్నీ వాడుకునే ప్రయత్నం చేశారు తెలుగు సినీ దర్శకులు. వాటిలో పేలిన సినిమాలే ఎక్కువ! ఒక దశ వచ్చేసరికి – హీరో పక్కన బ్రహ్మానందం కాదు, బ్రహ్మానందం పక్కన హీరోలు అనే స్థాయికి వెళ్లాడీ కమెడియన్‌. ఈ రోజు ఆయన పుట్టినరోజు. నేటికి సరిగ్గా సినిమాల్లో కొచ్చి 30 ఏళ్లు అయ్యింది. 1000 సినిమాల మైలు రాయినీ దాటారాయన. ఈ సందర్భంగా.. ఇంతవరకు బ్రహ్మానందం గురించి తెలియని వేరియేషన్లను పట్టుకునే ప్రయత్నం చేసింది ‘నవ్య’. అప్పుడు థర్టీ ఇయర్స్‌ ఇండసీ్ట్రలో థౌజండ్‌వాలా పేల్చిన కబుర్లే ఇవి..
రోటీన్‌ అవ్వకూడదు. లేకపోతే అన్నేళ్లు సినీజీవితం ఉండదు? మీరు ఎలా మేనేజ్‌ చేస్తున్నారు?
అక్షరసత్యం ఏంటంటే – అలాంటి పాత్రల్ని సృష్టించడం బ్రహ్మానందం గొప్పదనం కాదు, రచయితల గొప్పదనం. అన్నిటికంటే ముఖ్యంగా – కెమెరా ముందుకు వస్తూనే.. నీకు ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయి? బయట ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? వంటివన్నీ మరిచిపోయి నటించగలగాలి. పాత్రలో లీనమవ్వాలి. వీటన్నిటికీ భగవంతుడి దయ ఉండాలి. సిన్సియర్లీ ఐ బిలీవ్‌ దట్‌. మనం చేయలేని చాలా విషయాలు మన చేత చేయిస్తాడు భగవంతుడు. సహజంగా సినిమాల్లో ఒక కమెడియన్‌ జీవితకాలం ఎంత ఉంటుంది? అయిదేళ్లు, మహా అయితే పదేళ్లు? 30 ఏళ్లు దాటి వెయ్యి సినిమాలకు పైగా చేశానంటే ఏమనుకోవాలి? మొదట్లో నేను కూడా అనుకునేవాణ్ణి. ‘నేను చాలా టాలెంటెడ్‌. లేకపోతే ఇన్ని అవకాశాలు రావు కదా’ని! కాని ఒక దశకు వచ్చిన తరువాత.. మనకు తెలిసేది ఏంటంటే ‘మనది కాదు ఇది. మనకు తెలియనిది ఏదో ఉంది. అదే మన చేత ఇవన్నీ చేయిస్తోంది’ అని అర్థం అవుతుంది. అది ఆధ్యాత్మికభావన అనండి మరొకటి అనండి. తెలుగు సినీ పరిశ్రమకు కూడా నేనిక్కడ ధన్యావాదాలు చెప్పుకోవడం ధర్మం. లీజర్‌ టైమ్‌ను ఎలా ఎంజాయ్‌ చేస్తుంటారు..?
పుస్తకాలు చదువుతుంటాను. టీవీ చూస్తాను. ఒకప్పుడు కొమ్మూరి, ముప్పాళ్ల రంగనాయకమ్మ నవలలు ఎక్కువగా చదివేవాణ్ణి. ఈమధ్య రజనీష్‌, రమణమహర్షి, రామకృష్ణ పరమహంస, జిడ్డుకృష్ణమూర్తి పుస్తకాలు చదువుతుంటాను. అన్ని చదివిన తరువాత తెలిసింది ఏంటంటే – పుస్తకంలో ఏమీ లేదు. ఉన్నదంతా మస్తకంలోనే అని.
వాళ్లు పేల్చే ఆ జోకులేవో మాక్కూడా చెప్పొచ్చు కదా?
ఉన్నఫలంగా జోక్‌ చేయడంలో కృష్ణభగవాన్‌ దిట్ట. మాట తడుముకోకుండా టకీమని అలా ఒక బిట్‌ విసురుతాడు. దాన్ని అర్థం చేసుకునేలోపే మనకు తెలియకుండానే నవ్వొస్తుంది. షూటింగ్‌లో ఒక రోజు కృష్ణభగవాన్‌ చాలా డల్‌గా కనిపిస్తే ‘‘ఏంటీ చాలా డల్‌గా ఉన్నావ్‌?’’ అడిగాను. ‘‘రాత్రి డబ్బు పోయిందండీ’’ అన్నాడు. ‘‘ఎందులో పోయింది’’ అన్నాను. ‘‘ఎందులో పోయినా పోయినట్లే కదండీ’’ అన్నాడు మళ్లీ. ‘‘అన్ని చోట్ల వెతికారా’’ అన్నాను. ‘‘మా భార్యను కూడా అడిగాను. షర్టు జేబు కూడా చూసుకున్నాను. కనబడలేదు’’ అంటూ చెప్పడం ఆపాడు. ‘‘మరి, ప్యాంటు జేబులో చూసుకున్నారా?’’ అన్నాను నేను. ‘‘చూల్లేదండీ’’ అన్నాడు. ‘‘మరి అక్కడ కూడా చూసుకోకపోయారా?’’అని గుర్తు చేశాను. ‘‘అక్కడ కూడా లేకపోతే టెన్షన్‌ ఎక్కువై మరీ బాధపడాల్సి వస్తుందని.. చూసుకోలేదు సార్‌..’’ అన్నాడు. అలా అతని మాటలు స్పాంటేనియ్‌సగా లాఫ్టర్‌ను క్రియేట్‌ చేస్తుంటాయి.
ఎంఎస్‌ నారాయణ, వేణుమాధవ్‌లు కలిసినప్పుడు కూడా ఇలాంటి నవ్వులే పూస్తుంటాయట కదా?
ఎంఎస్‌ మాట్లాడుతుంటే మ్యాజిక్‌ డాల్‌ మిమిక్రీ చేస్తున్నట్లే అనిపించేది. అతను విద్యాధికుడు కాబట్టి.. ఆ జోకుల్లో హాస్యంతో పాటు ఆలోచింపజేసే బిట్టు మిళితమై ఉండేది. అది ‘డబ్బు భలే జబ్బు’లో షూటింగ్‌ సమయం. ఇద్దరం పక్కపక్కనే కూర్చున్నాం. అప్పుడు ఎంఎస్‌ ‘‘సార్‌, చాలా ధైర్యం చేసి చెప్పాల్సొస్తోంది. మీరు ఏమీ అనుకోరు కదా?’’ అన్నాడు. ‘‘అనుకునేదేముంది? చెప్పవయ్యా?’’ అన్నాను నేను. అతనేదో పెద్ద మ్యాటరేదో చెబుతాడనుకుని తెగ ఫీలయ్యాను. ఆ వెంటనే ‘‘నా కాలు పొరపాటున మీ కాలికింద పడింది. తీసుకోవచ్చా సార్‌’’ అన్నాడు. ఆ మాట విన్న వెంటనే భళ్లున నవ్వొచ్చింది. ఇక, వేణుమాధవ్‌ చెప్పే జోకులు ఎలా ఉంటాయంటే.. అతని టేకాఫే ఏదో బద్దలైపోయేలా అనిపిస్తుంది. ‘భజంత్రీలు’ షూటింగ్‌ జరుగుతోందప్పుడు. వేణుమాధవ్‌ ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాడేమో సమయం మించిపోయింది. షూటింగ్‌కు రాలేదు. ఆ చిత్ర దర్శకుడు ఎం.ఎస్‌. నారాయణకు కోపమొచ్చి ‘‘ఫోన్‌ చేయండి. వాడికి ఇష్టమొచ్చినప్పుడు షూటింగ్‌కు రావడం అలవాటైపోయింది. అసలు ఈ రోజు వస్తాడో రాడో కనుక్కోండి’’ అని అరుస్తున్నాడు. అతని కోపం చూసి ‘‘ఉండండి నేనే వేణుకు ఫోన్‌ చేస్తాను’’ అని ఫోన్‌ కొట్టాను. ఫోన్‌ ఎత్తిన వేణు ‘‘మీకేమయ్యా మీరు ఇష్టమొచ్చినప్పుడు రమ్మంటారు. ఆ మాత్రం వెయిట్‌ చెయ్యలేరా..? నా ప్రియమైన దర్శకుడు ఎంఎస్‌ నారాయణ నాటుకోడి మాంసం కావాలని అడిగాడు. పొద్దున్నే కోడిని పట్టుకుందామనుకుంటే.. అది నాగార్జునసాగర్‌ జంక్షన్‌ వరకు పరుగో పరుగు. ఆడికెళ్లి దాన్ని పట్టుకుని కూర వండుకుని తెస్తుంటే లేటు కాదామరి?’’ అంటూ అరిచినంత పనిచేశాడు. అంటే వాడప్పుడు నాగార్జునసాగర్‌ జంక్షన్‌ వద్ద ఉన్నాడన్నమాట. ఆ మాట చెబితే ఎంఎ్‌సకు ఇంకెంత కోపం వస్తుందో తల్చుకుని నవ్వొచ్చింది నాకు.
వార్తల్లోని ప్రముఖుల ఫోటోలతో మీ ఫోటోలను మార్ఫింగ్‌ చేసి.. ఫేస్‌బుక్‌, వాట్స్‌పలలో పెడుతుంటారు. వాటిని చూసి నవ్వుకుంటుంటారా?
నాకు ఇంటర్‌నెట్‌ చూసే అలవాటు లేదు. నా ఫోను కూడా స్మార్ట్‌ఫోను కాదు. ఇదిగో మీరే చూడండి. పాత శ్యామ్‌సంగ్‌ ఫోను. మాట్లాడేందుకు, వినేందుకు తప్ప దేనికీ పనికిరాదు ఇది. నెట్‌లో నా మార్ఫింగ్‌ ఫోటోలను అప్పుడప్పుడు మా పిల్లలు నాకు చూపిస్తుంటారు. ఒబామా, గఢాఫీ, మోడీల ముఖాల్లో నా ముఖం పెట్టి చక్కగా గ్రాఫిక్స్‌ చేసిన ఆ ఫోటోలను చూస్తే నాకే నవ్వొస్తుంది. ఫేస్‌బుక్‌లో వాటికి లైక్స్‌ కూడా ఎక్కువేనట! మా వాళ్లు చెబితే తెలుస్తుంది.
సినిమాల్లో బ్రహ్మానందం అందరికీ తెలుసు. మరి, ఇంట్లో బ్రహ్మానందం ఎలా ఉంటారు?
ఇంట్లో ప్రత్యేకంగా జోకులు వేసుకునే సందర్భాలు తక్కువ. అదృష్టవశాత్తూ ఇంట్లో వాళ్లందరికీ సెన్సాఫ్‌ హ్యూమర్‌ ఎక్కువే! సరదాగా మాట్లాడుకునే మాటలను వాళ్లందరు పాజిటివ్‌గానే తీసుకుంటారు. నవ్వుతుంటారు. డైనింగ్‌ టేబుల్‌ దగ్గర నేనేమో షూటింగ్‌ ముచ్చట్లు చెబుతుంటాను. బయట జరిగే విశేషాల్ని వాళ్లు చెబుతుంటారు. నా నటన మీద పాజిటివ్‌ కామెంట్లే చేస్తుంటారు కాని.. నెగిటివ్‌ కామెంట్స్‌ చేయరు. దేన్నయినా సానుకూల దృక్ఫథంతో చూసే వాతావరణమే ఇంట్లో ఉంటుంది. కొన్ని సినిమాల్లో నేను ఓవర్‌ యాక్షన్‌ చేస్తే – అది నేను చేశానా..? సినిమా వాళ్లు చేయించారా అన్న సంగతి వాళ్లకు బాగా తెలుసు. సినిమాల్లో నవ్వులు పండించడం అనేది కేవలం కమెడియన్‌ ఒక్కడి మీదే ఆధారపడి ఉండదు.
అక్కినేని నాగేశ్వరరావు మొదలు మొన్నటి ఎంఎస్‌ నారాయణ వరకు ఎంతోమంది పాతతరం నటులు వరుసగా చనిపోతున్నారు. వీళ్లందరితో సాన్నిహిత్యమున్న మీకు ఏమనిపిస్తోంది? జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఏదో ఒక రోజు మరణం దగ్గర ఆగిపోవాల్సిందేనన్న కఠోర సత్యాన్ని మీరెట్లా జీర్ణించుకుంటారు?
అందరూ చెప్పినట్లు చెప్పాలంటే ‘‘వాళ్లందరు పోవడం చాలా బాధగా ఉంది. నిజంగా ఏమిటో ఈ చలనచిత్ర పరిశ్రమకు ఏదో పట్టింది. భవిష్యత్తు ఏమైపోతుందో ఏమో’’ అంటూ దీర్ఘం తీసి చెప్పాల్సొస్తుంది. ఎవరికైనా మరణం అనేది చాలా సహజమైనది. పోవడం ఉండటం అనేది మన చేతుల్లో లేనిది. అయితే ఈవాళ మనందరి మధ్య మెలిగిన మనిషి రేపు శాశ్వతంగా కనిపించకపోవడం నిజంగా బాధాకరమే! అయితే మనుషులకు మరణం అనేది శాపం అనుకుంటారు. నేను మాత్రం వరం అనే అంటాను. ఎందుకంటే ఏదో ఒక టైమ్‌లో అందర్నీ వదిలిపెట్టి వెళ్లిపోకపోతే ఈ లోకం ఏమవుతుందో ఒకసారి ఊహించండి? ఎప్పుడో ఒకసారి జీవితం బోర్‌కొట్టి వెళ్లిపోవడానికి ఛాన్స్‌ లేకపోతే?! గాడ్‌ హ్యాజ్‌ గివెన్‌ దట్‌ ఛాన్స్‌! ప్రపంచంలో విచిత్రమైన విషయం – మానవుడు అన్నిట్లో ముందుండాలని కోరుకుంటాడు ఒక్క మరణానికి తప్ప! మరణానికి మాత్రం తరువాత వస్తాను. తరువాత వస్తాను అంటుంటాడు. జీవించింది చాలు మరణానికి నేనిక సిద్ధం అని ఏ ఒక్కరు అనరు. ఇదేమీ ఫిలాసపీ కాదు. జీవనసత్యం. ఈ రెండు మూడు నెలల్లో అక్కినేని, శ్రీహరి, ధర్మవరపు, ఏవీఎస్‌, ఆహుతిప్రసాద్‌, ఎంఎస్‌ వంటి వారు మనకు దూరమవ్వడం.. పరిశ్రమకు నిజంగానే తీరని లోటు. దాన్నెవరూ కాదనలేము.
తరతరానికి వేషభాషలు, జీవనశైలి, ఆలోచనలు, అభిరుచులు మారడం సహజం. ఆ మార్పుకు తగ్గట్టు ఆయా పాత్రల్లో మీరు సులభంగా ఒదిగిపోతారు. ఒక సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హావభావాలను కూడా అచ్చుగుద్దినట్లు పండించగలరు. ఎలా సాధ్యం అవుతోంది?
నిత్య జీవనగమనంలో మార్పును పసిగట్టే మనస్తత్వం నటుడికి చాలా అవసరం. అది ఏ శిక్షణ సంస్థలోనో శిక్షణను ఇచ్చే అంశం కాదు. కొత్త కొత్త సమూహాలను పరిశీలించడానికని చెప్పి ప్రత్యేకించి సమయం కేటాయించను. బయటికి వెళుతున్నప్పుడే మనుషుల్ని, వారి మనస్తత్వాల్ని, భావోద్వేగాల్ని పరిశీలిస్తుంటాను అంతే! నాకు తాగుడు అలవాటు లేదు. కాని తాగుడు యాక్టింగ్‌ చేస్తాను. దీనికి ఓ ఆ ఇంగ్లీషు పుస్తకాలు చదివాను.. ఈ పుస్తకాలు చదివాను. బార్‌లకు, పబ్బులకు వెళ్లి తెగ పరిశీలించాను అని చెప్పడం హాస్యాస్పదం. ఎవరో ఒక నటుడు అన్నాడట ‘‘భారతంలో శకుని పాత్రను చేయడానికి నేను చాలా పుస్తకాలు చదివాను’’ అని. ఆ మాటలు విన్న పక్క వ్యక్తి ‘‘అన్ని పుస్తకాలు చదవడం ఎందుకు? భారతం ఒక్కటే చదివితే సరిపోతుంది కదా’’ అన్నాడట.
మీరు ఇప్పటికే రకరకాల పాత్రలను చేశారు. మీరింకా వేయాల్సిన డ్రీమ్‌రోల్స్‌ ఏవైనా ఉన్నాయా?
చాలానే ఉన్నాయి. అందులో ఒకటి – రోడ్ల మీద తిరిగే పిచ్చోని పాత్ర ఒకటి. ఆ సంగతి అలా ఉంచితే – అసలు డ్రీమ్‌రోల్స్‌ అనే ముందు నేనెన్ని పాత్రలను చేశానని చెప్పుకోవాలి..? నేను చేసింది చాలా చాలా తక్కువనే చెప్పుకోవాలి. నేను చేసింది ఆఫా్ట్రల్‌ థౌజండ్‌ ఫిల్మ్స్‌. అందులోను రిపిటీషన్‌ ఉన్న పాత్రల్ని తీసేస్తే మిగిలేవి కొన్నే! మన దేశంలో నూటా ఇరవై కోట్లకు పైగానే జనాభా ఉంది. ఒక మనిషి ఉన్నట్లు మరొక మనిషి ఉండడు. నా దృష్టిలో ప్రతి మనిషీ ఒక క్యారెక్టరే. ఈ లెక్కన నేను ఇంకా చేయాల్సిన క్యారెక్టర్లు ఎన్ని ఉన్నాయో మీరే లెక్క వేసుకోండి. అందుకని నేను చేసింది కొంతే! అభిమానాలు, పొగడ్తలను చూసి మంచుదుప్పటి కప్పుకోలేను. బ్రహ్మానందం లేకపోతే సినిమానే లేదు అనే టాక్‌ను కూడా నేను ఒప్పుకోను. సర్క్‌సలో ఫోకస్‌ లైటు లాంటిది నటుడి జీవితం. సర్క్‌సకు వచ్చిన వీక్షకుల మీదికి అలా ఆ లైటును తిప్పుతుంటారు. ఒకరి మీద కాసేపు, మరొకరి మీద మరికొంతసేపు పడుతుంది. నా మీద పదినిమిషాలు పడింది. అంతే!
సినిమా వాళ్లకు సెంటిమెంట్లు, స్వర్గధామాలు ఎక్కువ. మీకు ఇష్టమైన డెస్టినేషన్స్‌ ఏమైనా ఉన్నాయా?
నాకు అలాంటివేవీ లేవు. నా ఆలోచనల తీరు ఎలా ఉంటుందంటే – మా నాన్న నిరుపేద. మా బతుకులంతా దిగువ మధ్యతరగతివి. పండగలు మా ఊళ్లోకి వస్తాయి కాని మా ఇంటికి రావు. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వాణ్ణి కనక.. నాకే ఆశలు లేవు. ఇప్పుడు ఆర్థికంగా అన్నీ సమకూరి ఉండవచ్చు కాని.. ఒక జీవనశైలికి అలవాటు పడిపోయిన తరువాత.. మళ్లీ ఖరీదైన ఆలోచనలు రావు. నాకు పేదరికం తెలుసు, ఆకలి తెలుసు, బతుకు భయం తెలుసు. ఈ పరిధి దాటి లగ్జరీ వైపు వెళ్లలేను. విలాసవంతమైన జీవితంలో ఉన్న మజాను తెలుసుకోవడానికి ఒక బేస్‌మెంట్‌ అంటూ ఉండాలి. అది నాకు లేదు. మొన్నామధ్య ఒక డాక్టర్‌ వద్దకు వెళితే ‘‘చిన్నప్పటి నుంచి మీకుగాని, మీ నాన్నగారికిగాని స్వీట్లు తినే అలవాటుందా?’’ అని అడిగారు. ‘‘స్వీట్లు కాదు కదా. మంచి భోజనం అడిగితేనే చితక్కొట్టేవాళ్లు. చిన్నప్పుడు అవేవీ తెలియవు నాకు’ అన్నాను. అటువంటి కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వాణ్ణి కనక ఇలాగే ఉండిపోయాను. అయితే ఆర్టిస్ట్‌ కావడం వల్ల ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలు తిరిగే అవకాశం ఆయాచితంగా వచ్చింది నాకు. అది నా అదృష్టం.
పూజ ఎక్కువగా చేస్తుంటారట?
నేను ఎంతో మంది దేవుళ్లను నమ్మను. ఒకే ఒక్క దేవున్ని కొలుస్తాను. ఆ దేవునికి రూపం లేదు. ఇదివరకు మన పెద్దలు చెప్పినట్లు ‘దేవుడంటే ఒకరే – అతను నిర్వికారుడు, నిరంజనుడు’ ఈ మధ్య చాలామంది బుధవారం ఒక దేవుడని, శుక్రవారం ఇంకో దేవుడని.. గురువారం అది తినను. మంగళవారం ఇది తాగనని.. భక్తిని చాటుకుంటుంటారు. వాళ్లను చూస్తే నవ్వొస్తుంది. పాపం! ఆఖరికి దేవుణ్ణి కూడా కిచెన్‌ వరకు తీసుకొచ్చారు.
ఇంకా ఎంత కాలం నటిస్తారు? ప్రేక్షకులకు బోర్‌ కొట్టలేదు కాని.. మీకు మీరు ఎప్పుడైనా బోర్‌ కొట్టారా?
బ్రహ్మానందం కావాలి అనే డిమాండ్‌ ఉన్నంత వరకు నటిస్తుంటాను. ఇక నాకు నటన మీద ఎప్పుడూ బోర్‌ కొట్టదు. అదే నాకు జీవితాన్ని ఇచ్చింది. ఆనందాన్ని.. బ్రహ్మానందాన్ని ఇచ్చింది.
ఇంటర్వ్యూ : నవ్య డెస్క్‌
సహకారం : చిత్రజ్యోతి
Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.