కెసిఆర్ ఓ పిచ్చి తుగ్లక్..!
- 04/02/2015
మహబూబాబాద్, ఫిబ్రవరి 3: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వైఖరి పిచ్చి తుగ్లక్‌లా ఉందని.. త్వరలోనే ఆయన పిచ్చాసుపత్రికి వెళ్ల్లే రోజులు వస్తాయని అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఫ్ల్లోర్ లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా విమర్శించారు. వరంగల్ జిల్లా మానుకోటలో మంగళవారం ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేవలం మాటల గారడీతో.. తెలంగా ణ ఉద్యమ సెంటిమెంట్ బలంతో అధికారంలోకి వచ్చిన కెసిఆర్ ఇప్పటికీ పిట్టలదొర మాటలు విడవడంలేదన్నారు. హైదరాబాద్‌ను సింగపూర్ చేస్తా, వరంగల్‌ను లండన్ చేస్తా.. హుసేన్‌సాగర్‌ను సముద్రం చేస్తానంటూ ఇష్టమొచ్చినట్లు మాటలు చెప్పడమేతప్ప చేసిన పని ఒక్కటి కూడా లేదన్నారు. బలమైన కార్యకర్తలు, అంకితభావం ఉన్న నాయకులు ఉన్న తెలుగుదేశంతోనే తన పార్టీకి ప్రమాదం అనే ఆలోచనతోనే కెసిఆర్ టిడిపిని టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు. తెలుగుదేశం పార్టీ పైన విమర్శలు చేస్తున్న కెసిఆర్, మంత్రు లు కడియం శ్రీహరి, చందులాల్ వంటి నాయకులు రాజకీయంగా ఎక్కడ పుట్టారో మరిచిపోవద్దన్నారు. బజారుల్లో అడ్రస్ కూడా లేకుండా తిరుగుతున్న వ్యక్తులకు పచ్చ చొక్కాలు తొడిగి.. అధికారం ప్రసాదించి.. సమాజంలో నిలబెట్టిన తల్లిలాంటి పార్టీ తెలుగుదేశం అని మరిచిపోవద్దన్నారు.
కరెంట్ ఇవ్వడానికి
చంద్రబాబు సిద్ధమే…
కెసిఆర్ ముందుచూపు లేని ముఖ్యమంత్రి అని, ఒక్కమాటలో చెప్పాలంటే ఇంత చిల్లర ముఖ్యమంత్రిని తానెప్పుడు చూడలేదన్నారు. తెలంగాణ ప్రజలు విద్యుత్ కోతల మూలంగా ప్రాణాలు కోల్పోతుంటే అప్పుడు హడావిడిగా లేచిన కెసిఆర్ పరుగున ఛత్తీస్‌గఢ్ వెళ్లారని, కరెంట్ ఇవ్వడానికి కాలం పడుతుందని అక్కడ చెప్పడంతో తిరుగుముఖం పట్టారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా అడిగితే తెలంగాణకు విద్యుత్ ఇవ్వడానికి చంద్రబాబు సిద్దంగా ఉన్నారని, కానీ కెసిఆర్ అడగడం లేదన్నారు. మానుకోటను జిల్లా కేంద్రం చేయాల్పిందేనని, మాట ఇచ్చిన కెసిఆర్ మరిచిపోవాలని చూస్తే టిడిపి తరపున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.
నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి బాలుచౌహాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, పార్లమెంట్ పార్టీ ఇన్‌చార్జి మోహన్‌లాల్, మాజీ ఎమ్మెల్యేలు వేంనరేందర్‌రెడ్డి, సీతక్క, పార్టీ నాయకులు గండ్ర సత్యనారాయణ, ఈగ మల్లేశం, భూపతి మల్లయ్య, సునిత, సంజీవరెడ్డి, రాంచందర్‌రావు, ఎడ్ల రమేష్, తెళ్ళ శ్రీనివాస్, మార్నెని రఘు తదితరులు పాల్గొన్నారు.
చిత్రం… సమావేశంలో మాట్లాడుతున్న టిడిపి ఫ్ల్లోర్‌లీడర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు
చక్కని పద్యాల సాహిత్యపు ముచ్చట్లు
- – శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం
- 31/01/2015

‘పద్య కథాపరిమళము’- -డా.కపిలవాయి
లింగమూర్తి;
వాణీ ప్రచురణలు,
నాగర్‌కర్నూలు, పుటలు: 100; వెల: 70రూ./-;
ప్రతులకు: 1) కపిలవాయి సంధ్య అశోక్
ఇంటి నెం.17-110, వాణీసదనం, విద్యానగర్ కాలనీ, నాగర్‌కర్నూలు- 509 209
2) అన్ని విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు
విస్తృత అధ్యయన- రచనలలో తలపండిన డాక్టర్ కపిలవాయి లింగమూర్తిగారి ఇటీవలి రచన ‘పద్యకథా పరిమళము’. ఇది ఒక ‘చల్లని పిల్లతెమ్మెర.’
ఇందులో నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, పోతన మొదలైన కవుల కొన్ని ప్రసిద్ధ పద్య సందర్భాల ముచ్చట్లు, ప్రఖ్యాత సంస్కృత కవులైన భారవి, బిల్హణుల వృత్తాంతాలు, నాల్గణాల శ్లోకం అనే ఒక చమత్కార కథానిక – ఇలాంటివన్నీ కలిపి మొత్తం పదహారు అంశాలున్నాయి. దేనికవి చాలా పొందికగా సరళమైన భాషా వాక్యవిన్యాసంతో ఒప్పారింది.
‘‘తూర్ణమానీయతాం చూర్ణం పూర్ణ చంద్రనిభాననే! (ఓ పూర్ణచంద్ర వదనా! త్వరగా ఇంత సున్నం తీసుకురా)’’అనే సంస్కృత వాక్యంలో మూడు ‘ణ’లు ఉన్నాయి. కానీ ‘‘పర్ణాని స్వర్ణ వర్ణాని కర్ణాంతాయతలోచనే! (నిడుద కన్నుల దానా! బంగారు రంగు తమలపాకులు నాలుగు తెచ్చిపెట్టు’’ అనే వాక్యంలో నాలుగు ‘ణ’లు ఉన్నాయి. ‘ణ’ను తెలుగు పిల్లలు ‘అణా’అంటారు. రెండో సంస్కృత వాక్యంలో ఈ ‘అణా’లు నాలుగు ఉన్నాయి. కనుక ఆ వాక్యం అన్నదానికే ఎక్కువ విలువ, ప్రాధాన్యం దక్కాయి అనే చమత్కార భావ పూర్వక కథ బాగుంది.
భారవి, బిల్హణుల కథలను చాలా చక్కగా ఉత్కంఠ భరితంగాను, రసవత్తరంగాను రాశారు రచయిత. సాహిత్యం అంటే హితం కూర్చేది, మేలు చేసేది; సాహితీపరుడు ఒక ముని, ఒక యోగిలాంటివాడు అని తెలియజెప్పే వస్త్ధ్వునితో భారవి కథను చెప్పటంలోని కథన శిల్పం అనల్పం.
రమణులకు వన దశలో వక్షమ క్రింది నడుము సన్నబడిపోవటం అనే లలిత సుందర శారీరక పరిణామాన్ని పెద్దనాదుల వంటి ఆస్థాన విద్వాంసుల మధ్య తనలాంటి పేరులేని పెద్దయ్య నిలవలేడు (ఆశ్రయం దొరకదు)అనే బాధాకర అనుభవీయతకు ఉపమానంగా చెప్పటంలో సంకుసాల నృసింహకవి యొక్క ధ్వని ప్రధాన రీతిని, వ్యంగ్య వైభవ సహిత భావగాంభీర్య, సాదృశ్యాలను సుందరంగా ఆవిష్కరించారు లింగమూర్తిగారు. విషాదాన్ని కూడా శృంగారోపమానంతో చెప్పటం సంకుసాల కవి ప్రతిభకు దర్పణంగా చూపారు కపిలవాయి వారు.
నన్నయగారి భారతం మానవ నాయకం కనుక అది రాజాంకితం చేయనగును. కానీ భాగవత కథానాయకుడు నారాయణుడు కనుక దానిని మానవ మాత్రునికి అంకితం ఇవ్వలేను అంటూ పోతన తలపోసినట్లు ఆ మహాకవి అంతరంగాన్ని చాలా అర్థవంతంగా విశదీకరించారు.
‘‘రసికులైనవారు రమణులకు ఒకింత వంగియుండుట ధర్మవర్తనము- నారివైపుకు విల్లు వంగదా?’’ అంటూ ‘్ధర్మ’పదానికి, ‘నారి’ శబ్దానికీ ఉన్న ధనుస్సు, స్ర్తిఅనే అర్థాలతో అక్కడి శే్లషను వివరించటం మనోహరం.
‘పోతన రాసిన భాగవతంలోని గజేంద్రుడు పూర్వజన్మలో ఒక రాజు. కానీ, మనం ఈ జన్మలోనే గజేంద్రులం. గజం అంటే మదించి ఉండేది అని వ్యుత్పత్తి. కుల మదం, ధన మదం, విద్యామదం, రూప మదం, వన వదం- ఇలా అనేక మదాలతో ఉన్నాం’ అంటూ ప్రస్తుత సమాజం మీద ఒక చుఱక గూడా వేశారు.
చారిత్రక ప్రామాణికత, వాస్తవికతల తర్కాన్ని కొంచెంసేపు పక్కనబెట్టి, ఒక సాహిత్యపు పేరంటంలో కూర్చున్నాము అనే భావనతో చదివి ఆనందింపదగిన పుస్తకం ఇది.
సాహిత్య కథానికలు అల్లటానికి సాధనచేసే వాళ్ళకు ఈ పుస్తకం ఒక స్ఫూర్తిని, ఊపును, ఉత్సాహాన్ని, ఉత్ప్రేరణను ఇస్తుంది.

