|


వట్టికోట ఆళ్వారుస్వామి ప్రత్యేకమైన రచయిత. లేదా అనేక ప్రత్యేకతలున్న విశిష్ట రచయిత. ఆళ్వారుస్వామి వంటి రచయిత మరొకరు లేకపోవటమే గొప్ప ప్రత్యేకత. ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు తలవొంచిన గడ్డిపోచగా కనిపిస్తూనే, ఉధృతి తగ్గగానే తలెత్తుకు నిలబడ్డ దేవదారువుగా కనిపిస్తారు ఆళ్వారుస్వామి. అవాంతరాలు వచ్చి వుండవచ్చు, కాని అదే ని బద్ధతతో చివరి నిమిషం దాకా తన కార్యక్రమాలను కొనసాగించారు. ఉదాహరణకు-1938లో దేశోద్ధారక గ్రంథమాల స్థాపించి కొన్ని పుస్తకాలు వేసిన తర్వాత వారు జైలుకు వెళ్ళినప్పుడు ఆ ప్రచురణలు ఆగిపోయాయి. మళ్ళీ 1951లో విడుదలైన తర్వాత కొనసాగించారు. జైల్లో ఉన్నప్పుడు ఆ కార్యక్రమాన్ని కొనసాగించిన వారు గాని, 1961లో వారు చనిపోయిన తర్వాత చేపట్టిన వారు గాని ఎవరూ లేరు. పట్టుదల వున్నవాళ్ళెవరైనా పుస్తకాలు ప్రచురించి వుండేవారేమో. కాని ఊరూరు తిరిగి అమ్మే మార్కెటింగ్ శక్తి ఆళ్వారుస్వామి సొంతం.
గ్రామీణ ప్రాంతపు సమస్యల వలయంలో చిక్కుకున్న రైతుకూలీల బతుకువెతల పట్ల అవగాహన, నగరప్రాంతపు జీవిత చక్రాల కింద పడి నలుగుతున్న కార్మికుల జీవిత సమస్యల అవగాహన- పరస్పర పూరకంగా ఉన్నవారు ఆళ్వారుస్వామి…. రచయితగా జీవితం ప్రారంభించినప్పుడు ఏ ఆశయాలతో బయలుదేరారో ఆ ఆశయాలు ఆచరణలో పదునెక్కాయి. మాటలో, రాతలో, ఆచరణలో పీడిత ప్రజల పక్షాన నిలబడ్డ రచయితగా ఆళ్వారుస్వామి స్థానం అందుకే ప్రత్యేకమైంది. గ్రామీణ ప్రాంతపు సమస్యల వలయంలో చిక్కుకున్న రైతుకూలీల బతుకువెతల పట్ల అవగాహన, నగరప్రాంతపు జీవిత చక్రాల కింద పడి నలుగుతున్న కార్మికుల జీవిత సమస్యల అవగాహన- పరస్పర పూరకంగా ఉన్నవారు ఆళ్వారుస్వామి. కర్షక కార్మికులు ఇద్దరూ శ్రామికులే అయినా వాళ్ళను నియంత్రించే శక్తులు భిన్నమైనవి. ఆళ్వారుస్వామి ప్రధానమైన సృజనాత్మక రచనలన్నీ గ్రామీణ ప్రాంతానికి చెందినవే. అయితే, ఒక కార్యకర్తగా కార్మికసంఘాల నాయకునిగా వారి కార్యక్షేత్రం హైదరాబాదు సికిందరాబాదు జంటనగరాలే. కడివెండిలో విసునూరు దేశ్‌ముఖ్ గూండాల చేతిలో 1946 జూలైలో దొడ్డికొమరయ్య హత్యజరిగిన తర్వాత, నిజనిర్ధారణ సంఘ సభ్యునిగా వెళ్ళినప్పుడు, బద్దం ఎల్లారెడ్డితో కలిసి గద్వాల ప్రాంతం పర్యటించి భూస్వాములకు వ్యతిరేకంగా సంచలనాత్మక నివేదికలిచ్చారు. వారి నివేదికల మూలంగానే ప్రపంచానికి వాస్తవాలు తెలిశాయి. నగర ప్రాంతంలో వారు నిర్వహించిన ఉద్యమాల్లో గుమస్తాల సంక్షేమం కోసం 1944లో ప్రారంభించిన ఉద్యమం, 1946లో రిక్షా కార్మికుల కోసం చేసిన ఉద్యమం ప్రధానమైనవి. గుమాస్తాల కోసం చేసిన ఉద్యమం ప్రత్యక్షంగా ఆయా యాజమాన్యాలతో ఘర్షణ. గుమాస్తాలు మిలిటెంట్‌గా ఉండరు. వాళ్ళ ఉద్యోగాలకు ఎసరు వస్తుందని భయపెట్టినా లొంగిపోతారు. అయినా, వాళ్ళనందరినీ ఆళ్వారుస్వామి సమైక్యంగా తమతో నడిపించగలిగారంటే, అది చిన్న విషయం కాదు. వారి పోరాటాల ఫలితంగా 1944 డిసెంబర్ 25 నుంచి గుమాస్తాలకు వారానికొక సెలవు అమలులోనికి వచ్చింది. వాళ్ళలో చైతన్యం పెంచటానికి ‘గుమాస్తా’ పత్రికను వారు నడిపించారు. రెండవ ప్రపంచయుద్ధం తర్వాత 1946లో మనుషులు లాగే రిక్షాలను రద్దుచేయాలని నిజాం ప్రభుత్వం ప్రకటించటంతో జంట నగరాల్లోని వేలాది రిక్షా కార్మికుల్లో అభద్రత ఏర్పడింది. అప్పుడు రిక్షాకార్మికుల సంఘాన్ని ముందుకు తీసుకుపోయింది ఆళ్వారుస్వామే. ఏరోజుకారోజు సంపాదించి బతికే రిక్షా కార్మికుల్లో అభద్రత వల్ల ఆవేశం ఎక్కువ. ఈ వర్గంలో ముస్లింలు ఎక్కువే. హిందూ ముస్లిం విభేదాలు సృష్టించిగాని, మరో ముస్లింనాయకుణ్ణి ప్రోత్సహించిగాని ప్రభుత్వం ఆళ్వారుస్వామి ప్రాముఖ్యం తగ్గించివుండవచ్చు. కాని అట్లా జరగలేదు. గుమాస్తాలసంఘం నేతగా ఆళ్వారుస్వామి సాధించిన విజయం రిక్షా కార్మికులకు వారిలో విశ్వాసం కలిగించి వుంటుంది. అట్లా మరోవిజయం సాధించారు ఆళ్వారుస్వామి. నిజాం రైల్వేలో రిట్రెంచి అయిన కార్మికులకోసం కూడా వారు ఉద్యమం నడిపారు. జీవి తం అట్టడుగు స్థాయిలో ప్రారంభమైనప్పుడు పునాదులు గట్టిగానే పడతాయి. చిన్నచిన్న ఉద్యోగాలు చేస్తున్నప్పుడే ఆళ్వారుస్వామిలో ఉదాత్తమైన లక్ష్యాలు చోటుచేసుకున్నాయి. ఇందుకు ప్రధాన కారణం గ్రంథపఠనం, చుట్టూరావున్న గ్రంథాలయోద్యమం. జైలును కూడా వారు స్కూల్‌గానే భావించారు. పుస్తకాల నుంచి ఎంత నేర్చుకున్నారో, జీవితం నుంచి, జీవితంలో ఎదురైన ఘట్టాల నుంచి అంతకంటే ఎక్కువగా నేర్చుకున్నారు. 1937 డిసెంబర్ 6, 7, 8 తేదీల్లో నిజామాబాద్‌లో జరిగిన ఆంధ్ర మహాసభలలో రాజ్యాంగ సంస్కరణల మీద, గష్తీ నిషాన్ 53 మీద జరిగిన చర్చోపచర్చల ప్రభావం మూలంగా స్వేచ్ఛాస్వాతంత్ర్యాల విలువలను ఆళ్వారుస్వామి గ్రహించగలిగారు. ఆ మరుసటి సంవత్సరం వారు దేశోద్ధారక గ్రంథమాల పక్షాన ప్రచురించిన రెండవ పుస్తకం సురవరం ప్రతాపరెడ్డి గారి ‘ప్రాథమిక స్వత్వములు’ కావటం యాదృచ్ఛికం కాదు. వారు ప్రచురించిన 33 పుస్తకాలలో 6 మాత్రమే కవిత్వానికి సంబంధించినవి. తక్కినవి వచన గ్రంథాలే. అప్పటికే కొమర్రాజు, సురవరం, ఆదిరాజు వీరభద్రరావు వచనానికి పెద్దపీట వేయటం సాహిత్య చరిత్రలో భాగమైంది. ఆ వైతాళికుల వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవటానికి వచన మాధ్యమాన్నే ఎన్నుకోవటం ఆళ్వారుస్వామి ఆధునిక సంస్కారానికి నిదర్శనం. ‘సాలార్జంగ్ మ్యూజియం’ వంటి కొన్ని కవితలను మినహాయిస్తే, వారు వచన సాహిత్యాన్నే సృష్టించటం గమనార్హం. కాళోజీ, దాశరథి వంటి అగ్రశ్రేణి రచయితలెవ్వరూ ఉండ నంత కాలం సుమారు ఆరేళ్ళు వారు జైల్లో వున్నారు. 1948 సెప్టెంబర్ పోలీస్‌యాక్షన్ తర్వాత చాలామంది విడుదల య్యారు. కాని ఆళ్వారుస్వామి విడుదల కాలేదు. ఇక్కడ నారాయణరావు పవార్ ప్రస్తావన అవసరం. 1947 డిసెంబర్ 4 నాడు నిజాం తన తల్లి సమాధిని దర్శించుకోవటానికి వెళ్తుంటే, ఆయన కారుమీద నారాయణరావు పవార్ బాంబు వేశాడు. నిజాం తప్పించుకున్నాడు. పవార్‌కు ఉరిశిక్ష పడింది. పోలీస్ యాక్షన్ కారణంగా అది యావజ్జీవ కారాగారవాసంగా మారింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వారు రామానంద తీర్థ నాయకత్వంలో ఒత్తిడి తేవటంతో 1949 ఆగస్టులో పవార్ విడుదలయ్యారు. బహుశా ఆయనకు స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ కూడా మంజూరయి వుంటుంది. రాజుమీద బాంబు వేసినవాడు విడుదలయ్యాడు కాని; కమ్యూనిస్టు కావటం వల్ల, గుమాస్తాల కోసం, కార్మికుల కోసం ఉద్యమాలు నడిపిన కారణంగా ఆళ్వారుస్వామి 1951 దాకా నిర్బంధంలోనే వున్నారు. ఆళ్వారుస్వామి రచనల్లో కనిపించే ఒక అంశం – సన్నివేశాలను, సంఘటనలను, పాత్రలను చరిత్రతో కలిపే ప్రయత్నం. ఆళ్వారుస్వామి స్వయంగా గ్రంథాలయోద్యమంతో ప్రభావితులై ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు. ‘ప్రజలమనిషి’ నాయకుడు కంఠీరవం గ్రంథాలయం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధించి, భూస్వామ్య వ్యవస్థతో పోరాటం చేస్తాడు. ఆంధ్ర మహాసభల్లో తమతమ గ్రామాల్లో దౌర్జన్యాలు చేసిన భూస్వాములను కీలక హోదాలలో చూసిన ఆళ్వారుస్వామి, తన నవలల్లో రావుభూపాలరావును, జగ్గయ్యదొరను, వెంకటరావును సృష్టించారు. 1938లో స్టేట్‌కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొన్ని కార్యకర్తల బృందాలు సత్యాగ్రహం చేసి అరెస్టుకావటం చరిత్ర. ‘ప్రజలమనిషి’ నవల ముగింపులో వెంకటేశ్వరరావు నాయకత్వంలో బషీరు, కంఠీరవం, పరంధాములు సత్యాగ్రహం చేసి అరెస్టవుతారు. ఈ రకంగా తన నవలలో ఆళ్వారుస్వామి రాజకీయ వాస్తవికతను సాధించారు. 1952లో పుస్తకరూపంలో వచ్చిన ‘జైలులోపల’ కథలు ఆరూ ప్రస్తావించదగ్గవే. ఇక్కడ ఒక్క ‘పతితుని హృదయం’ కథ మాత్రమే ప్రస్తావించటం జరుగుతుంది. ఆ రోజు ఉదయం ఉరితీయబడ్డ 25 ఏళ్ళ యువకుడి కోసం సాటి ఖైదీలు తల్లడిల్లే ఘట్టంలో ఈ కథ మొదలవుతుంది. ఈ ఉరితో తీవ్రంగా ప్రభావితుడైన గండయ్య అనే మరోఖైదీ జైలు అధికారులకు ఎదురు తిరుగుతాడు. ‘ఒకమనిషిని చంపటమే తప్పంటున్న భానూను ఇంకొకడిని ఉరితీసి చంపమని ఎట్లా అంటుంది?’ అన్న పెద్దప్రశ్న, బహుశా జవాబులేని ప్రశ్నను లేవదీసి ఉరిశిక్షను ప్రశ్నిస్తాడు. ఉరికి గురయిన యువకుడి గతం గూర్చి గాని, శిక్షకు కారణమైన నేరం గూర్చిగాని ప్రస్తావన లేదు. ఉరికి వేలాడి ప్రాణాలు విడవడమే ఆ తర్వాతి కథను నడిపిస్తుంది. అతని ఊరూ పేరూ లేవు. అంటే ప్రాంతం, కులం, మతం లేకపోవటంతో అతడు అందరివాడయ్యాడు. అతని జీవిత కథ లేనందువల్ల ఈ కథానికలోనూ పెద్దగా కథ లేదు. ఈ ఉరి వాతపడ్డ మనిషే ప్రతి పదంలోనూ, వాక్యంలోనూ వెంటాడుతుంటాడు. అందుకు ఈ యువకుడే ఈ కథానాయకుడనిపిస్తుంది. వైరుధ్యాల కోణంలో రచనను నడిపించటం, మానవ భావోద్వేగాల పరంగా కథనం చేయటం ఆళ్వారుస్వామి రచనా శిల్పం. ‘ప్రజల మనిషి’నవల ప్రారంభంలోనే దొరకు, సామాన్య రైతు కోటయ్య కొడుకు కొమరయ్య మధ్య వైరుధ్యాన్ని సూచిస్తారు. ఆవుదూడలను దొరకు ఇవ్వటం ఏమాత్రం ఇష్టంలేని కొమరయ్య దుఃఖాన్ని ఎంతో సహజంగా చిత్రించటం మూలం గా దొర అసహజప్రవర్తన, దౌష్ట్యం పాఠకుని మనసులో ఇంకుతాయి. ‘గంగు’ నవల ప్రారంభంలో కూడా జగ్గయ్య దొర అంతమ్మ అన్న వివాహిత పట్ల కామవాంఛను ప్రదర్శించటం, స్ర్తీ సహజమైన అభద్రతకు లోనవుతూనే తన వైముఖ్యాన్ని, అస హ్యాన్ని ప్రదర్శించటాన్ని తగినంత కాన్వాసుమీద రచయిత చూపించారు. నవల మొదట్లోనే పడ్డ వర్గవైరుధ్య బీజం క్రమపరిణామం చెందుతుంది. ఒకే కుటుంబంలోని అన్నదమ్ములైన కంఠీరవం, వెంకటాచార్యుల మధ్య, మతపరంగా దొరకు, దొర పెద్ద గుమాస్తా హైదరాలీకి మధ్య ఉన్న వైరుధ్యాలను కూడా రచయిత కథావసరాలకు అనుగుణంగా సమర్థంగా వాడుకున్నారు. ఒక్కోసారి భిన్నంగా కూడా ఇది వుండవచ్చు. ‘అవకాశమిస్తే’ కథలో భార్యాభర్తల సరససంభాషణ రూపంలో ‘స్వేచ్ఛ’ ను ప్రకటించిన రచయిత అదే కథలోని అంతరకథలో యువ పఠాన్ ‘నిర్బంధాన్ని’ జైలులోపటి జైలుగా కథనం చేశారు. ‘పతి తుని హృదయం’ కథలో జైలుశిక్ష అనుభవిస్తున్న ఖైదీ గండ య్య సంస్కరణోన్ముఖంగా ఆలోచిస్తుంటే, జైలుఅధికారులు అతన్ని మరింతగా నేరకూపంలోకి తోసేయటానికి ప్రయత్నిస్తారు. 1956, 57 నాటికి దేశంలోనూ, రాష్ట్రంలోనూ పెనుమార్పులు సంభవించాయి. ఆచరణలో నిజాయితీని ప్రదర్శించాల్సిన కాంగ్రెస్, కమ్యూనిస్టు నాయకులు ప్రజావ్యతిరేకులుగా మారుతున్నారు. విద్యావంతుల్లో రాజకీయ వ్యవస్థ పట్ల సందేహాలు ఏర్పడుతున్నాయి. సైద్ధాంతిక ఖాళీ ఏర్పడుతున్న వాతావరణంలో ఒక ద్వైధీ భావం కూడా ఏర్పడుతున్నది. కొంత కమ్యూనిస్టుగా, కొంత గాంధీయిస్టుగా సగటు మేధావి రూపొందుతున్నాడు. ‘రామప్ప రభస’లోని వ్యాసాల్లో రామప్ప ప్రదర్శించే ఆదర్శవాదంలో గాంధీతత్వం, తిరుగుబాటు ధోరణిలో కమ్యూనిజం కనిపిస్తాయి. ఆళ్వారుస్వామి నిజాయితీ చెక్కుచెదరలేదు. రచయితగా జీవితం ప్రారంభించినప్పుడు ఏ ఆశయాలతో బయలుదేరారో ఆ ఆశయాలు ఆచరణలో పదునెక్కాయి. తన ప్రతిబింబాలను సమాజంలో దర్శించాలన్న కల సాకారం కాలేదు. అది వారి వైఫల్యంకాదు. వ్యవస్థవైఫల్యమే. ‘రామప్ప రభస’ ఆళ్వారుస్వామి ఆత్మకథలోని 16 అధ్యాయాలే కాదు, ఒక ఆదర్శ పౌరసమాజం కోసం కలలుకన్న స్వాప్నికుడి అక్షర సంపుటి కూడా. ఆళ్వారుస్వామి కంటే గొప్పరచయితలు తెలుగులో చాలా మందే ఉండవచ్చు కానీ, ఆయనతో సమానులు మాత్రం ఎవరూ లేరు. మాటలో, రాతలో, ఆచరణలో పీడిత ప్రజల పక్షాన నిలబడ్డ రచయితగా ఆళ్వారుస్వామి స్థానం అందుకే ప్రత్యేకమైంది. అమ్మంగి వేణుగోపాల్ 9441054637 (నేడు వట్టికోట ఆళ్వారుస్వామి 54వ వర్ధంతి) |

