|
పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో చాలామంది సంస్కృతం, గ్రీకు, లాటిన్ మొదలైన భాషల్ని నేటికీ చదువుతారు. వీటినే కాక ప్రపంచంలోని అన్నిదేశాల సంస్కృతుల్నీ అధ్యయనం చేసి మూల్యాంకనం చేస్తుంటే మనం ఇతరులు చెప్పిందే ప్రమాణంగా తీసుకుంటున్నాం. గ్రీకు, లాటిన్, హిబ్రూ మొదలైన భాషలు తెలిసి ఆ సంస్కృతుల్ని చదివిన ఒక భారతీయ పండితుణ్ణి కూడా మనం చూడలేం. ఒకప్పటి మన సంప్రదాయం చూస్తే మన ప్రాచీనులు తమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటప్పుడు ఎదుటివారి సిద్ధాంతాలన్నింటినీ బాగా తెలుసుకుని వాటిలోని దోషాల్ని చూపి తమ సిద్ధాంతాల్ని చెప్పేవారని తెలుస్తుంది. ఈ పరంపర, శ్రద్ధ మనలో లోపించడం మన పండిత వర్గానికి చాలా అవమానకరం.
ఇప్పుడు మన దేశంలో వేడివేడిగా జరుగుతున్న చర్చల్లో చరిత్ర పుస్తకాల్ని సరిచేయడం అనేది ఒకటి. చరిత్రను తిరిగి రాయటం ఎందుకు అని మనకు వెంటనే అర్థం కాదు. మనమిప్పుడు చదువుతున్న చరిత్ర అంతా మన పాలకులైన ఆంగ్లేయులు రాసిందే. మనకు రాజతరంగిణి, హర్షచరితము, ప్రతాపరుద్రీయం లాంటి పుస్తకాలు, ఇతర చారిత్రక ప్రబంధాలు చాలా ఉన్నా వాటిని ఆస్థానకవులు రాయడం వల్ల చరిత్ర కొంత తెలిసినా, దానిలో కల్పనలు, అతిశయోక్తుల పాలు ఎక్కువ. వాటిని చరిత్రగా భావించలేం. విదేశీ పర్యాటకులు, మొగల్ దర్బారులో చరిత్రకారులు రాసిన విషయాలు కొంతవరకు ఉపయోగపడతాయి.. చరిత్ర అంటే మనందరికీ చిన్న చూపే. అయినా చరిత్ర దాని పని అది చేసుకుపోతుంది. ‘A nation which does not know history is condemned to repeat it’’ అంటాడు అమెరికన్ తత్త్వవేత్త జార్జి శాంటయనా. అందువల్ల కనీసం విద్యావంతులైనా చరిత్రను చదవాల్సిన అవసరం ఉంది. ‘The most effective way to destroy people is to deny and obliterate their understanding of their own history’’ అని ప్రముఖ ఆంగ్ల రచయిత జార్జి ఆర్వెల్ చెప్పారు. చరిత్ర మనకు స్ఫూర్తినీ ఇవ్వగలదు, మనల్ని మనమే చరిత్రహీనులుగా నిందించుకునే స్థితికి తేగలదు. చరిత్రను కంట్రోల్ చేసినవారు ప్రజలను కంట్రోల్ చేయగలరు. చరిత్రను ఎలా రాయాలో, దాని ద్వారా ఎలా ప్రజలను అదుపులో ఉంచుకోవాలో, ఒక దేశ ప్రజల్ని ఎలా మేధోపరమైన బానిసలుగా చేయాలో బ్రిటీ్‌షవారికంటే ఎక్కువ ఎవరికీ తెలీదు. మొట్టమొదటగా మన చరిత్రను పాశ్చాత్యులే రాశారు. వారి పాలనకు అనుకూలంగా ఉండటానికి, వారి సంస్కృతిని గొప్పదిగా నిరూపించడానికి మన సంస్కృతిలో కొన్ని విషయాల్ని దాచడం, కొన్నింటిని వక్రీకరించి వివరించడం ద్వారా విద్యావంతుల్ని తమ భావజాలానికి అనుగుణంగా మార్చుకోగలిగారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పాశ్చాత్య భావజాలంలో ఉన్న రచయితలే చరిత్ర పుస్తకాలు రాయడం వల్ల నిజంగా మన చరిత్రలో ఏం జరిగిందో మనకు తెలిసే అవకాశం లేకపోయింది. ఒక జాతి గొప్పదనాన్ని తెలుసుకోవడానికి ఆ జాతి, లేదా సంస్కృతి ప్రపంచానికి ఎలాంటి విజ్ఞానాన్ని అందించింది అన్నది ఒక కొలబద్ద. ఒక సంస్కృతిలో రూపొందిన అనేక తాత్త్విక సిద్ధాంతాలు, ధర్మాధర్మాలకు సంబంధించిన విషయాలు, ఆ సంస్కృతిలో ఉన్న సాహిత్యం – వీటన్నింటినీ కలిపి సమగ్రంగా మూల్యాంకనం చేస్తే అది ఆ సంస్కృతి యొక్క సారాంశంగా ఉంటుంది. దీన్ని ఇటీవల కాలంలో ఒక జాతి యొక్క మెటా నెరేటివ్ లేదా గ్రాండ్ నెరేటివ్ అంటున్నారు. మన దురదృష్టవశాత్తు మన జాతి మెటా నెరేటివ్. అంతా మరెవరో రాసి మనకందించారే కాని మనం స్వంతంగా తయారుచేయలేదు. ఎందుకు అలా జరిగింది? యూరోపియన్ సామ్రాజ్యవాదులు 15వ శతాబ్దంలో మొదలుగా ప్రపంచంలోని అన్ని దేశాల్ని లొంగదీసుకుంటూ వెళ్లడంతో పాటు ఆయా దేశాల సంస్కృతుల్ని కూడా అధ్యయనం చేస్తూ వెళ్లారు. ప్రపంచంలో అన్ని దేశాల నెరెటివ్ కూడా పాశ్చాత్యుల దృష్టికోణం నుంచే తయారుచేయబడింది. సామ్రాజ్యవాదంతో పాటు వారి మతాన్ని కూడా స్థాపించడం అనే ఉద్దేశ్యం ఉండడం వల్ల తాము అడుగుపెట్టిన దేశాల్లోని సంస్కృతుల్ని పూర్తిగా అధ్యయనం చేసి వాటిని అవహేళన చేసి ఆయాదేశ ప్రజలకు తమ తమ సంస్కృతిపైనే ఏహ్యభావం వచ్చేట్లు రచనలు చేశారు. ఇలా చేయడంలో వారు మిగతా దేశాల్లో విజయం సాధించినా మన దేశ సంస్కృతిని పూర్తిగా తృణీకరించలేకపోయారు. మనల్ని చాలాకాలం ఏలినవారు బ్రిటీష్ వారు. వారి ప్రభుత్వ ఉద్దేశాలు ఉలా ఉన్నా ఆ దేశ విద్వాంసులు మాత్రం సత్యాన్ని కప్పిపుచ్చలేకపోయారు. కొందరు గొప్పగా ప్రశంసించారు కూడా. అయినా మరికొందరు రంగు కళ్ళద్దాల ద్వారా మనకు మన సంస్కృతిని చూపించారు. దాదాపు 130 సంవత్సరాల క్రితం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మన దేశ సంస్కృతిని గురించి మ్యాక్స్ ముల్లర్ ఆనాటి ఐ.సి.ఎస్ ఆఫీసర్లను ఉద్దేశించి కొన్ని ప్రసంగాలు చేశాడు. ఆ ప్రసంగాలు- ‘India what it can Teach Us ’’ అనే పుస్తక రూపంలో వచ్చాయి. ఈ పుస్తకం మనదేశం యొక్క తొలి మెటా నెరేటివ్ లాంటిది. వేదాలకాలం నుంచి చర్చిస్తూ అనేక విషయాల్లో భారతదేశం ఎంత పురోగమించింది.. అన్నది ఒక వైపు చెబుతూనే మరో వైపు దేశప్రజల్ని జాతుల పేరిట విడగొట్టడానికి ఎన్ని బీజాలు నాటాల్నో అన్నీ నాటాడు. వందలాది పాశ్చాత్య పండితులు సంస్కృతంలోని మూల గ్రంథాలను చదివి వాటిపై ఇంగ్లీషులో పుస్తకాలు రాశారు. ఇలాంటి పుస్తకాలు వచ్చే వరకూ జనసామాన్యానికి మన పుస్తకాల్లో ఏముందో తెలియకపోవడం, మన పండితులకు ఆధునిక దృక్పథం లేకపోవడం వల్ల పాశ్చాత్యుల ప్రచారాన్ని అడ్డుకోలేకపోవడం దురదృష్టం. ప్రతి సంస్కృతిలోనూ సమాజాన్ని సంఘటిత పరిచే అంశాలూ, సమాజాన్ని బలహీనపరిచే అంశాలు ఉంటాయి. మన బలహీనతల్ని మాత్రమే వివరిస్తూ వచ్చిన గ్రంథాలు మన సమాజాన్ని ప్రభావితం చేశాయి. గత రెండు శతాబ్దాలుగా విద్యాధికులందరూ ఇంగ్లీషు మాధ్యమంలోకి వెళ్ళడంతో అందరికీ పాశ్చాత్యులు రాసిన పుస్తకాలే ప్రామాణిక గ్రంథాలయ్యాయి. ఈ పుస్తకాల్లో సత్యం ఎంతవరకూ ఉంది అని తెలుసుకోవాలంటే సంస్కృతభాష తెలిసి ఉండాలి. ఈ శ్రద్ధ దురదృష్టవశాత్తూ మన మేధావులకు కలగడం లేదు. పాశ్చాత్య విశ్వవిద్యాలయాల్లో చాలామంది సంస్కృతం, గ్రీకు, లాటిన్ మొదలైన భాషల్ని నేటికీ చదువుతారు. వీటినే కాక ప్రపంచంలోని అన్నిదేశాల సంస్కృతుల్నీ అధ్యయనం చేసి మూల్యాంకనం చేస్తుంటే మనం ఇతరులు చెప్పిందే ప్రమాణంగా తీసుకుంటున్నాం. గ్రీకు, లాటిన్, హిబ్రూ మొదలైన భాషలు తెలిసి ఆ సంస్కృతుల్ని చదివిన ఒక భారతీయ పండితుణ్ణి కూడా మనం చూడలేం. ఒకప్పటి మన సంప్రదాయం చూస్తే మన ప్రాచీనులు తమ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటప్పుడు ఎదుటివారి సిద్ధాంతాలన్నింటినీ బాగా తెలుసుకుని వాటిలోని దోషాల్ని చూపి తమ సిద్ధాంతాల్ని చెప్పేవారని తెలుస్తుంది. ఈ పరంపర, శ్రద్ధ మనలో లోపించడం మన పండిత వర్గానికి చాలా అవమానకరం. మన దేశ చరిత్రను సవరించాలంటే దృక్పథంతో ప్రస్తుత చరిత్రకారులు ప్రయత్నం చేస్తున్నారు. మన చరిత్ర ఎలా ఉన్నా మనం ప్రపంచ చరిత్ర కూడా తెలుసుకోవాలి. ఇంటర్నెట్ మొదలైన మాధ్యమాల వల్ల ప్రపంచ చరిత్ర అంతా మన ముందున్నది. అందులో ప్రామాణికంగా, నిబద్ధతతో పాశ్చాత్యులు రాసిన పుస్తకాలు కూడా చాలా ఉన్నాయి. చాలా కాలం క్రితం నేను పోలీసు అకాడమీలో ఉన్నప్పుడు ’’A history of Torture Throughout the Ages ‘ అనే పుస్తకాన్ని చూశాను. వివిధ రకాల చిత్రహింసల్ని కనిపెట్టిన ఘనత అతి పవిత్రమైన మత సంస్థలకే ఉందనే విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే మనకు నీతులు చెప్పే దేశాలు ఎలా మారణకాండ చేశాయి, ఎలా కొన్ని సంస్కృతుల్ని నిర్మూలించాయి అని తెలుసుకోవడానికే ‘History of Genocide’, ‘History of Slavery’, మొదలైన పుస్తకాల్ని చదవాలి. మనకు సెక్యులరిజం గురించి చెప్పేవారి గురించి ‘History of Inquisition’ లాంటి పుస్తకాలలో చదవగలం. బ్రిటీష్ వారి క్రూర పాలనకు ఉదాహరణ కావాలంటే ‘Impeachment of Warren Hastings’ గూర్చి Edmund burke ఏమి చెప్పాడో చూడాలి. వీటి నేపథ్యంలో మన చరిత్రను అమెరికన్ తత్త్వవేత్త Will Durant రాసిన ‘Story of Civilization’ లో చూస్తే మనమెంతో గర్వంతో ఉండగలం. మన యొక్క తప్పుల్ని సవరించుకునే శక్తి మన సంస్కృతిలోనే ఉంది. డాక్టర్ కె. అరవిందరావు రిటైర్డు డీజీపీ ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను navya@andhrajyothy.com కు పంపండి
|
