పడుగు పేకల మధ్య ‘’వీర్రాజు గారి’’ జీవితం -3
కదా లేఖన పోటీ లో పాల్గొని ‘’పోటీ ఉంటేనే ప్రతిభకి రాణింపు ‘’అని తెలుసుకొని ‘’ఒక నోటు పుస్తకం నిండా సాగి- అన్న ప్రాసన నాడే ఆవకాయ అయ్యింది ‘’అని అత్యుత్సాహాన్ని తెలియబరుస్తూ కలం పట్టించిన తన చేత కద రాయిన్చించి’’అని సంబర పడ్డారు .ఆ ‘’నవలా కద’’ పత్రికకు పంపిస్తే అడ్రస్ గల్లంతయ్యింది .ఆని నిరాశపడలేదు .’’ముడుచుకొన్న ఆలోచనల్లో చురుకుదనం పుష్పించి –అభిరుచుల్లో –కొత్తదనం అల్లు కుంటోంది ‘’అని ముచ్చటపడ్డారు .తెలుగు స్వతంత్రలో రెందోపెజీ లోపడే కవిత్వాలు చూసి కవిత్వపఠనం పై దృష్టి మళ్ళింది .బహుమతులు ప్రతిభకు కొలబద్దలూ అద్దాలు కాక కపొవచ్చు కాని ‘’ప్రోత్సాహానికి ప్రేరకాలు ‘’అని నమ్మారు .జిళ్ళా యువజనోత్సవ చిత్ర లేఖన పోటీలలో ‘’పొందిన ప్రధమ బహుమతి కేటలిస్ట్ అయి,కళా రంగం లో ముందుకు కదిలించింది ‘’.ఆ బహుమతి డాక్టర్ గరిక పాటి రాజా రావు గారి చేతులమీదుగాగ్రహించటం గౌరవం, చిరస్మరణీయం అయింది .
తాము ఉండే పేటలో కాంగ్రెస్ జండా ఎగరగా ఎన్నడూ చూడలేదట వీర్రాజుగారు .ఎక్కడ చూసినా ‘’యెర్ర జండేర్ర జండా ఎర్రెర్రని జెండా ఎర్రజండా ‘’అని నారాయణ మూర్తి పాటలాగా రెప రెప లాడేవి .’’పార్టీ మీద నిషేధం ఉక్కు పాదమై వాలినప్పుడు –ఇంటిమీది జెండా పీకేసుకోన్నారుకాని –పార్టీ మీద నమ్మకాన్ని వదులుకోలేదు ‘’అని పార్టీపై తన అభిమానాన్నితెలిపారు .కమ్యూనిస్ట్ మిత్రుడు కుందుం ప్రకాశ రావు ఆప్తమిత్రుడు .’’నా అక్షర గమనానికి ప్రత్యక్ష కారణం అతనే ‘’అని కృతజ్ఞత చెప్పుకొన్నారు .ఆవంత్స సోమ సుందర్ ఆధునిక సాహిత్య పరిచయం చేశాడు .’’రచన బాగోగులని తూకం వేసే తూనిక రాళ్ళూ యేవో అతని దగ్గరున్నాయి ‘’అని ఆయన ప్రతిభను కీర్తించారు .’’నన్ను రచయితగా శిల్పించిన వాడు అక్షరాలా అతనే ‘’అని అన్నారు.’’వయసు పెరుగుతున్న కొద్దీ –ఇంటి పరిస్తితులు అర్ధమై –మనసులో చిక్క పడి –బాల్యం మెల మెల్లగా పట్టు సడలించుకొని –‘’దూరం గా జరిగిపోయింది .
నూనుగు మీసాలు తేనే రంగులో మెరుస్తున్నప్పుడు –‘’అందం అప్పుడు కాంటాక్ట్ లెన్స్ అయి –నాకళ్ళల్లో అమరిందేమో ?’’అన్నారు యవ్వన ప్రాదుర్భవాన్ని కవిత్వం లో ఒలక బోస్తూ .వందేళ్ళ చరిత్రగల కాలేజి లో చేరి ‘’ఆనంద గర్వాలు –మనసును ఉయ్యాల లూపాయి ‘’.అంటారు .దీనికి కారణం ‘’ఓ చారిత్రిక వార సత్వపు స్రవంతిలో –నేనో బిందు వౌతున్నందుకు ‘’పొందిన గర్వం అది .సంస్కృతీ వారసత్వానికి ముచ్చట అది .పెదనాన్న ఇల్లు గుల్ల చేసుకొని ,నిండు దరిద్రం తో మంచాన పదడి చనిపోతే ,పెద్దమ్మ భారమూ తండ్రిమీద పడి నా తండ్రిబెదరలేదట .తల్లి ఒంటిమీద నగ నట్రా కాళ్ళోచ్చి కదిలిపోయాయి .పెదమామయ్య సాయమే దిక్కైంది.స్కాలర్ షిప్ అంది తల్లి చేతుల్లో డబ్బు పెడితే ‘’తన కలల సాకారానికి –వర్తమాన చిత్రం –ఆమె మనసులో –అస్పష్టంగా కదిలి ఉండాలి ‘’అని ఊహించారు .
కాలేజిలో పై ఖర్చులకు గాను ఊళ్ళో చిన్న పత్రికలకు కోరిన బొమ్మలేసి చిలక్కొట్టుడు డబ్బు సంపాదిస్తూ కుటుంబం పై భారం పడ కుండా చూసుకొన్నారు.దామెర్ల రామా రావు గారంటే ‘’అజంతా చిత్రాల రేఖల లాలిత్యానికి –దాని సమవర్ణ లేపన సౌందర్యానికి –పాశ్చాత్య దేశాల అంగ సౌష్టవాన్ని జోడించి –వంగ దేశపు వాష్ టెక్నిక్ ను మేళవించి –సరి కొత్త ఆంద్ర చిత్రకళా శైలిని సృష్టించిన ‘’మహానుభావుడు అని కీర్తి కిరీటం చిత్రకళా భాష లో చెప్పి, పెట్టారు .’’ఆంద్ర చిత్ర కళా పునరుజ్జీవన వైతాళికుడు ‘’అన్నారు .మూడు పదుల వయసులోనే నూరేళ్ళు నిండిన దురదృష్ట వంతుడు రామారావు . ఆయన స్మ్రుతి చిహ్నమే రాజమండ్రి లో వెలసిన ‘’కళా గౌతమి ‘.’రామారావు ఆప్తమిత్రుడు ,చిత్రకళలో మరో మేరువు అయిన వరదా వెంకట రత్నం గారి శిక్షణలో వీర్రాజు గారు చిత్రకళా రహస్యాలు తెలుసుకొన్నారు .స్కెచ్ పుస్తకాలను చిత్రాలతో నింపి వేళ్ళకు రేఖా సోయగాన్ని సమకూర్చుకొన్నారు .
చిత్రాల్లో జీవాన్ని ,చైతన్యాన్ని వేగాన్ని ని౦పు కొంటూ వెలుగు నీడల సహజ సౌందర్యాన్ని అడ్డుకొంటూ తనను తానూ చిత్రకారుడిగా ఆవిష్కరించుకొన్నారు వీర్రాజు గారు .తన ప్రయతనం కీర్తికోసం కాదని ఆర్దికావసారలకోసమే నని నిజాయితీ గా చెప్పారు .ఆస్థానకవి శ్రీపాద కృష్ణ మూర్తి శాస్త్రి గారి చేతులమీదుగా చిత్రకార సన్మానం అందుకొని పులకించారు .అప్పటికి వయసు పద్దెనిమిదే అన్నది కొసమెరుపు .
‘’బిడియానికి పై తొడుగు మౌనం .చొరవకు పై తొడుగు మాటకారి తనం ‘’అని చక్కని అర్ధం చెప్పారు .ఆ రెండూ తనకు లేవు .’’గుండేల్లోతుల్లోకి తొంగి చూస్తె కాని అర్ధం కాని వాడిని ‘’అని ఆవిష్కరించుకొన్నారు తన్ను తాను .కాలేజీ తెలుగు శాఖ ఆహ్వానంపై వచ్చిన బాల బంధు బి. వి .నరసింహా రావు గారు ‘’ఆడుతూ పాడుతూ –హావ భావాతో చేసిన ఉపన్యాసం ‘’ఆకట్టుకొని ప్రేరణ కల్గించి ,ఎప్పటికైనా ఆ కాలేజీ వేదికపై ఓసాహిత్యో పన్యాసాన్నివ్వాలని ‘కోరిక ‘’మనసు పొరల్ని తోలుచుకొని –బీజ దళం లోంచి –చిగురాకై విచ్చుకొంది’’అని బయాలజీ భాష లో బాగా చెప్పారు .’’చప్పట్ల అభినందన హారం –మెళ్ళో వేసుకోవాలని ‘’ఆశ పడ్డారు .కాని ఆ అవకాశమే రాలేదట .
శరత్ సాహిత్యం చదివి అదే మూసలో అవే పాత్రల్ని మూస పోసి అచ్చులు పోసుకొని నవల రాశారు .’’చిదికే వరకు సెగ్గడ్డ సలపరం పెట్టి నట్లు ఆలోచనలు అక్షరాలై కాగితం మీద రాలే వరకు –మనసుకు పట్టిన జ్వరం –నిమ్మళించి తేలిక పడనే లేదు ‘’ఆయనకు .ప్రజా మత వార పత్రిక దీన్ని సీరియల్ ప్రచురించి గుర్తింపు పొంది’’ రచయిత గా చెప్పుకొనే వీలిచ్చింది ‘’అది మరోకొత్త నవలకు ఊపు నిచ్చింది .అప్పటికి అయన ఇంటర్ రాసిన విద్యార్ధి మాత్రమే .
వరదా వెంకట రత్నం
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-2-15 –ఉయ్యూరు

