|
ఆకలేస్తే- ఇంట్లో అయినా, ఆఫీసులో
అయినా ఏదో ఒకటి లాగించేస్తాం. అదే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగా ములయితే ఏం చేస్తారు? భూమికి 400 కిలోమీటర్లపైన ఎటువంటి గురుత్వాకర్షణ శక్తి లేని వాతావరణంలో ఉండే వ్యోమగా ములు ఎలాంటి ఆహారం తింటారు?వాళ్లూ మనలాంటి ఆహారమే తింటారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇటీవలే అక్కడి వ్యోమగాముల కోసం రకరకాల ఆహార పదార్థాలను తీసుకొని ఒక వ్యోమనౌక వెళ్లింది కూడా.. ఇటీవల వర్జీనీయాలోని వాలప్స్ ఫ్లైట్ ఫెసిలిటీ నుంచి ఒక వ్యోమనౌక ఐఎ్‌సఎస్‌కు బయలుదేరి వెళ్లింది. దీనిలో 3000 పౌండ్ల బరువైన ఆహార పదార్థాలు, ఇతర సరుకులు ఉన్నాయి. ఇవన్నీ ఐఎ్‌సఎ్‌సలో ఉండే వ్యోమగాములకు ఉపయోగపడేవే. ఇప్పటిదాకా ఐఎ్‌సఎ్‌సలో 15 దేశాలకు చెందిన 200 మంది వ్యోమగాములు నివసించారు. వీరికి అవసరమైన ఆహారపదార్థాలను సరఫరా చేసే బాధ్యత హుస్టన్‌లోని జాన్సన్ స్పేస్ సెంటర్‌ది. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటుంది. ఆహార పదార్థాలంటే- ప్రతి రోజు మనం తినే వంటలు కావు. అవి ఆరునెలల పాటు తాజాగా ఉండాలి. వ్యోమగాములకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించాలి. ఐఎ్‌సఎ్‌సలో ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి వీలైనంత తక్కువ పరిమాణంలో ఉండాలి. ఐఎ్‌సఎస్‌లో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కాబట్టి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. పౌష్టికాహార నిపుణుల అంచనాల ప్రకారం ఒక వ్యోమగామికి ప్రతి రోజు మూడువేల కాలరీలు అవసరమవుతాయి. దీనికి తగ్గట్టుగా జాన్సన్ స్పేస్ సెంటర్‌లోని నిపుణులు ఆహారాన్ని తయారుచేస్తారు. ఒకప్పుడు వ్యోమగాములకు అవసరమైన ఆహారాన్ని పేస్ట్‌గా చేసి ట్యూబ్‌లలో పెట్టి పంపేవారు. అయితే వ్యోమగాములు ఆ ఆహారాన్ని తినటానికి ఎక్కువ ఇష్టపడేవారు కాదు. ఆహారం కేవలం శరీరానికి శక్తిని ఇవ్వటానికి మాత్రమే కాకుండా మంచి అనుభూతిని కూడా ఇవ్వటానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్న తర్వాత వ్యోమగాములకు ఎలాంటి ఆహారాన్ని అందివ్వాలనే విషయంలో అనేక పరిశోధనలు ప్రారంభమయ్యాయి. ఐఎ్‌సఎ్‌సలో రిఫ్రిజిరేటర్లు ఉండవు కాబట్టి- ఆహారాన్ని ఎక్కువ కాలం ఎలా నిల్వ ఉంచాలనే సమస్య ప్రధానంగా ఎదురయింది. అందువల్ల ఆహారంలో ఉన్న తేమను పూర్తిగా తొలగించి అంతరిక్షంలోకి చిన్న సంచులలో పంపితే ఈ సమస్య తీరుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒక వ్యోమగామికి ఎన్ని కేలరీలు అవసరమవుతాయో గమనించి దానికి తగినట్లు సంచులను తయారుచేయటం ప్రారంభించారు. శాస్త్రవేత్తలు రూపొందించిన మెనూలో మన దేశానికి చెందిన చేపల కూర ఉండటం విశేషం. వ్యోమగాములకు రకరకాల ఆహార పదార్థాలతో పాటుగా చాక్‌లెట్ పుడ్డింగ్, లెమన్ కర్డ్ కేక్, అప్రికాట్ కాబ్లర్ వంటి తీపి పదార్థాలను కూడా పంపుతారు. వ్యోమగాముల పుట్టిన రోజులకు కేక్‌లను కూడా ఈ మధ్య పంపుతున్నారు. ఇటీవల కాలంలో వ్యోమగాములకు పంపే ఆహారంలో సోడియం పరిమాణాన్ని చాలా వరకు తగ్గించారు. గురుత్వాకర్షణ శక్తి లేని ప్రాంతంలో ద్రవ పదార్థాలు కిందకు పడవు. గాలిలోనే తేలుతూ ఉంటాయి. అలాంటి ప్రదేశంలో కాఫీ లేదా వేడి వేడి సూప్‌ను ఎలా తాగాలి? సా్ట్రతో తాగితే నోరు కాలిపోతుంది కాబట్టి పోర్ట్‌ల్యాండ్ స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఒక ప్రత్యేకమైన కప్పును తయారుచేశారు. చిన్న పిల్లలు వేసుకొనే బూట్ల మాదిరిగా ఉండే ఈ కప్పులో కాఫీని గురుత్వాకర్షణ శక్తి లేని ప్రదేశంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగచ్చు. అయితే ఈ కప్పు కూడా అంత సులభంగా తయారవలేదు. దీనిని రూపొందించటానికి లక్ష డాలర్ల (దాదాపు 63 లక్షల రూపాయలు) ఖర్చు అయింది. ఒకో కప్పు ఖరీదు దాదాపు 500 డాలర్లు (దాదాపు 30 వేల రూపాయలు) దాకా ఉంటుంది. |

