|
రేడియో అన్నయ్య, అక్కయ్య గారి ‘ఆంధ్రబాలానంద సంఘం’ … అంటే తెలుగువారికి ఇట్స్ ఎ బ్రాండ్ నేమ్. అందరూ ఈ సంఘాన్ని ముద్దుగా బాలానందం అని పిల్చుకుంటారు. పిల్లల మనోవికాసానికి పెద్దపీట వేస్తూ, పిల్లలకి అందమైన బాల్యాన్నిచ్చే సంస్థగా గుర్తింపు పొందిన బాలానందం స్థాపించి 75 యేళ్ళు . ఈ సందర్భంగా ఆ జ్ఞాపకాలను ‘నవ్య’తో పంచుకున్నారు ఆ సంస్థ కార్యదర్శి జె.వి.కామేశ్వరి..
‘‘ఈ రోజుల్లో ఒక సంస్థ రెండు దశాబ్దాలు బతకటమంటే గొప్ప. అలాంటిది మా బాలానందానికి 75 యేళ్ళంటే మహదానందంగా ఉంది. బాలానందంతోనే నా జీవితం ముడిపడి ఉంది. నన్నందరూ ఇప్పటికీ రేడియో అక్కయ్యగారి పాప అనే అంటారు. ఒకరోజు అక్కినేని నాగేశ్వరరావు ఉదయాన్నే ఫోన్ చేసి ‘పాపా నీ పేరేమిటీ?’ అన్నారు. ఇన్నాళ్ళకు సందేహం ఎందుకొచ్చింది అని అడిగితే ‘నా భార్య అన్నపూర్ణ, నేను.. రేడియో అక్కయ్య, అన్నయ్యల గురించి మాట్లాడుతూ నిన్ను అక్కయ్యగారి పాప అనుకున్నాం. కానీ పేరు తెలీక ఇలా పెందలాడే కాల్ చేశాను’’ అన్నారు ఏఎన్నార్. ‘నా పేరు జె.వి.కామేశ్వరి’ అని చెప్పాను. అక్కయ్య, అన్నయ్య ఇద్దరూ పాప అని పిలుచుకోవటం వల్ల ఇలా అరవయ్యవ పడిలోనూ అందరిచేతా చంటిపిల్లలా ‘పాప’ అనిపించుకుంటున్నాన్నేను. అటు న్యాయపతి రాఘవరావు (రేడియో అన్నయ్య) గారికి మా అమ్మ సొంత మేనకోడలు, ఇటు న్యాయపతి కామేశ్వరి (రేడియో అక్కయ్య) గారికి మా నాన్న తమ్ముడు. నేను 1952 సంవత్సరంలో పుట్టాను. మా అమ్మ పేరు కమల, నాన్న సూర్యనారాయణ. అమ్మానాన్నల దగ్గర కాకుండా చిన్నప్పటి నుంచీ రేడియో అన్నయ్య, అక్కయ్యగారి దగ్గరే పెరిగాను. అక్కయ్యని అమ్మా అనేదాన్ని, అన్నయ్యగారిని మాత్రం మామా అనేదాన్ని. వాళ్లకి పిల్లలు లేకపోవటంతో నన్ను సొంత బిడ్డకంటే ఎక్కువగా చూసుకున్నారు.
రేడియోస్టార్‌లు..
అన్నయ్య, అక్కయ్యలది వాత్సల్యపూరితమైన అనుబంధం. అన్నయ్యకు సినిమాలంటే ప్రీతి. అక్కయ్య మనసున్న మనిషి. ఎనిమిది మంది బంధువుల పిల్లల్ని పెంచేది. మా ఇంట్లో ఎప్పుడూ పెళ్ళి వాతావరణముండేది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరూ బాలానందానికి చేరుకునేవారు. ఆహా.. ఆ రోజులు తల్చుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. బాలానందం ఏర్పాటు చేసే వేసవి శిక్షణా శిబిరాలు, పోటీల సమయంలో రేడియో అక్కయ్య, అన్నయ్యగార్లు వచ్చారనే వార్త విని వాళ్ళని చూడాలని తండోపతండాలుగా జనాలొచ్చేవారు. సినిమా స్టార్లకుండే ఫాలోయింగ్ వారి కుండేది.
ఆ ఇద్దరి ప్రేమకథ..
నిద్రకుముందు అక్కయ్యగారు నాతో బోలెడన్ని కబుర్లు చెప్పేవారు. వారిరువురి నేపథ్యం, ప్రేమ, పెళ్ళి విశేషాలను ఒక రోజున గుర్తు చేసుకుంటూ ‘‘మీ అన్నయ్యది బరంపురం. నాది విజయనగరం. బి.ఎ.లో ఇద్దరం క్లాస్‌మేట్స్. నేను గుర్రపుబండిలో కాలేజీకి వెళుతుంటే ‘మగరాయుడిలా ఆ చదువులేమిటీ?’ అంటూ చుట్టుపక్కల వాళ్లు ఎత్తిపొడిచేవాళ్లు. క్లాస్‌రూంలో అబ్బాయిలకి దూరంగా కూర్చొనేవాళ్లం. ఓ రోజు ఓ కుర్రోడు ‘అలా ఆడపిల్లల్ని దూరంగా ఎందుకు కూర్చోబెట్టారు? అనడిగాడు. వెంటనే ‘వాళ్ళు అంటరాని వాళ్లేమో!’ అనే డైలాగ్ వినిపించింది. ఎవరా అని విసురుగా ఆ అబ్బాయి వేపు చూశాను. అతనే న్యాయపతి రాఘవరావు. ఆ తర్వాత పరిచయం, ఆయన మనస్తత్వం నచ్చటంతో ఇష్టపడ్డాను. ఆయనా నన్ను అమితంగా ఇష్టపడ్డారు. ఇద్దరం ప్రేమించుకున్నాం. ఇంట్లో వాళ్ళని అడిగి పెళ్ళి చేసుకున్నాం..’’ అంది అక్కయ్య. అదీ వారి ప్రేమ కథ!
ముఖ్యమంత్రే రమ్మన్నారు..
అక్కయ్యగారు బి.ఎ.లో ఇంగ్లీష్ స్షెషల్ చేశారు. ఆ తర్వాత బి.ఎడ్ చేశారు. అన్నయ్య ఎం.ఎ. మధ్యలోనే ఆగిపోయింది. ‘స్వరాజ్యం జన్మహక్కు’ అంటూ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళారట. పిల్లలకీ ఆశలుంటాయి, కలలుంటాయి. ఆ చిన్నారి మనసులకి ఆహ్లాదం కావాలి. అందుకు ఓ వేదిక అవసరం. అలాంటి వేదిక కోసమే అక్కయ్య, అన్నయ్యలు ఏకనిర్ణయంతో 1940లో ‘బాలానందం’ సంస్థను చెన్నైలో స్థాపించారు. ఆ ఏడాదే రేడియోలో అక్కయ్య, అన్నయ్యగారిద్దరూ శని, ఆదివారాల్లో బాలవినోదం, బాలానందం కార్యక్రమాలను చేసేవారు. అక్కయ్య అదనంగా మహిళా కార్యక్రమాలు చేసేది. దర్శకులు కె.ఎస్. ప్రకాశరావు గారు 1949లో బాలానందం ఉపాధ్యక్షులుగా పనిచేశారు. ఇక్కడున్న పిల్లలనే నటీనటులుగా పెట్టి.. ‘బాలానందం’ పేరుతో మూడు చిన్నచిత్రాలు రూపొందించారాయన. స్వాతంత్య్రం వచ్చాక ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి అన్నయ్య, అక్కయ్య గారిని హైదరాబాద్ రమ్మని అడిగారు. సీఎం కోరిక మేరకు అక్కడి బాలానందాన్ని ఇంకొకరికి అప్పజెప్పి, 1956 జూన్‌లో హైదరాబాద్‌కి వచ్చి అదే సంవత్సరం అక్టోబరు 23 వ తేదీన నారాయణగూడలో ‘ఆంధ్రబాలానంద సంఘం’ స్థాపించి ప్రారంభించారు.
చిన్న జీతంతోనే పెద్ద కార్యం..
హైదరాబాద్‌కి వచ్చాక బాలనందంని గాడిలో పెట్టడానికి మూడు నెలలు పట్టింది. నారాయణగూడలోని అక్కయ్య గారి పేరుమీదున్న స్థలం బాలానందానికి కేటాయించింది. భార్యాభర్తలిద్దరూ బాలానందంలో ఉంటూనే అద్దె కట్టారంటే వాళ్లదెంత గొప్ప మనసు. మీ ఇంటికే అద్దె ఎందుకు అంటే ‘బాలానందం’ కోసం మా తరఫున కొంచెం సేవ అనేవారు. అన్నయ్యగారు హిందూ రిపోర్టర్‌గా వర్క్ చేస్తూ, అక్కయ్యగారు ఇంటర్నేషనల్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూనే హైదరాబాద్ రేడియో స్టేషన్‌లో ప్రోగ్రామ్స్ చేసేవారు. కేవలం వారిరువురికి కలిపి వచ్చే 130 రూపాయల జీతంతోనే బాలానందాన్ని బతికించుకున్నారు. తెలుగులో తొలి బాలల మ్యాగజైన్ అన్నయ్య, అక్కయ్య గారే ప్రారంభించారు. అదే ‘బాల’. అందులో ‘చందమామ’ ప్రకటన వచ్చింది. ఆ తర్వాత ఆ పత్రిక ఉన్నతస్థాయికి వెళ్లింది. ఆ తరువాత ఆర్థిక ఇబ్బందుల వల్ల మూతపడింది.
అదే లక్ష్యం..
తెలుగువారు తెలుగు మాట్లాడాలి, తెలుగు సంస్కృతీ-సంప్రదాయాలు తెలియాలన్న బాలానందం ఉద్దేశ్యాన్ని అలాగే కొనసాగిస్తున్నాం. వేమన పద్యాలు, రామదాసు, అన్నమాచార్య కీర్తనలు, లలితసంగీతం, కర్నాటక సంగీతం, కూచిపూడి, భరతనాట్యం మొదలైన వాటిని సాధారణ ఫీజుతో నేర్పిస్తాం. పిల్లలు రోజూ సాయంత్రం నాలుగున్నరకి వస్తారు. లలితసంగీతకారులు ఎమ్.చిత్తరంజన్ బాలానందం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. ట్రస్ట్ కిందే ఏటా కార్యక్రమాలు నిర్వహిస్తాం. ఇంతకు ముందులాగే ప్రతీ ఏడాది నవంబర్ రెండో వారానికి ముందు పిల్లల కోసం పోటీలు పెడుతున్నాం. ఈ పోటీల్లో రెండువేల మంది పిల్లలు పాల్గొంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. ఒక సంస్థను సేవాదృక్ఫథంతో నడపడం కష్టం. నిధులు కావాలి. అయితే మాకు అలాంటి ఇబ్బందులున్నా అధిగమిస్తున్నాము. రేడియో అన్నయ్య, అక్కయ్యల మీదున్న అభిమానంతో.. తలా ఒక చెయ్యి వేస్తున్నారు. అదే చాలు. ఇక సంస్థ అంటారా? ప్రతి తరానికి బాల్యం ఉంటుంది. కనక బాలానందమూ చిరకాలం వర్ధిల్లుతుంది..’’
‘‘మా ఇంట్లో ఎప్పుడూ పెళ్ళి వాతావరణముండేది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలందరూ బాలానందానికి చేరుకునేవారు. ఆహా.. ఆ రోజులు తల్చుకుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. బాలానందం ఏర్పాటు చేసే వేసవి శిక్షణా శిబిరాలు, పోటీల సమయంలో రేడియో అక్కయ్య, అన్నయ్యగార్లు వచ్చారనే వార్త విని వాళ్ళని చూడాలని తండోపతండాలుగా జనాలొచ్చేవారు. సినిమా స్టార్లకుండే ఫాలోయింగ్ వారి కుండేది..’’
– నవ్య డెస్క్
|

