మహాత్ముని బాటలో నడచిన బీబీ అమతుస్సాలాం
అమతుస్సలాం అన్ని కష్టాలను, నష్టాలను, అనారోగ్యాన్ని తన దృఢసంకల్పంతో అధిగమించి మహాత్ముని ప్రశంసలకు పాత్రురాలయ్యారు. మహాత్ముని ప్రియ పుత్రికగా ఖ్యాతి పొందారు. 1922లో గాంధీజీ సబర్మతి ఆశ్రమం మూసివేశారు. ఆ సమయంలో గాంధీజీ అనుమతితో ఆశ్రమంలోని ఇతర మహిళలతో ఆమె కూడాజైలు కెళ్లారు. స్వరాజ్యసాధనతో పాటు హిందూ -ముస్లింల ఐక్యత, హరిజనుల సంక్షేమం తన జీవితలక్ష్యమని ప్రకటించారు ఆమె.మహాత్ముని బాటన జాతీయోద్యమంలో నడిచిన బీబీ అమతుస్సలాం హిందూ-ముస్లిం ఐక్యతా చిహ్నమయ్యారు. మత కలహాలు నివారించేందుకు ఆమె నిరంతరం పాటు పడ్డారు. వాయువ్య సరిహద్దులు, సిందు నౌఖాళి ప్రాంతాలలో మత కలహాలు విజృంభించినప్పుడు సామరస్యం ప్రభోదించేందుకు తన ప్రత్యేక దూతగా గాంధీజీ ఆమెను పంపారు.
స్వాతంత్య్రోద్యమ చరిత్రలో భాగంగా పరాయి పాలకుల బానిసత్వం నుండి గాంధేయ మార్గాన మాత్రమే స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు సాధ్యమని భావించి మహాత్ముని సాన్నిత్యంలో జీవిత చరమాంకం వరకు గడిపిన మహత్తర చారిత్రక అవకాశం అతికొద్దిమందికి మాత్రమే దక్కింది. అటువంటి అద్భుత అవకావాన్ని సొంతం చేసుకున్న అదృష్టవంతులలో ప్రముఖ స్థానమాక్ర మించారు ‘బీబీ అమత్సులాం’
భారత జాతీయోద్యమం పట్ల అపారగౌరవాభిమానాలను ఆచరణలో వ్యక్తం చేసిన పాటియాలా రాజపుఠాణా పరివారంలో 1907లో బీబీ అమతుల్సలాం జన్మించారు. తల్లిపేరు అమతుర్రెహమాన్, తండ్రి కల్నల్ అబ్దుల్ హమీద్ పాటియాలా సంస్థానంలో ఆర్థిక మంత్రి. ఆయన 1920 ప్రాంతంలో కన్నుమూసారు. ఆరుగురు అన్నదమ్ములకు ఏకైక చెల్లెలుగా అమతుస్సలాం గారా బంగా పెరిగారు.
చిన్ననాటి నుంచి స్వేచ్ఛా స్వభావాన్ని వ్యక్తం చేసేవారు. సమకాలీన సమాజాన్ని అధ్యయనం చేసి పురాతన రీతి రివాజులను, అహేతుక అచార, సంప్రదాయాలను వ్యతిరేకించారు. సామాజిక, రాజకీయ సమస్యలపట్ల మంచి అవగాహన కలిగి ఉన్నా శారీరకంగా చాలా బలహీనం కావటంతో ఆమెకు ఆరోగ్యం అంతగా సహకరించేది కాదు.
ఆమె 13 సంవత్సరాల వయసులోనే ఖురాన్ మజీద్‌ను అనువాదంతో సహా చదివారు. కొన్ని ధార్మిక గ్రంథాలను కూడా అధ్యయనం చేశారు. వారి కుటుంబంలో పర్దాను కఠినంగా అమలు చేసేవారు. స్వంత అన్నదమ్ముల ఎదుట కూడా సంచరించటానికి అనుమతి లభించేది కాదు. ఆకారణంగా స్కూలుకు వెళ్లే ప్రశ్నే తలెత్తలేదు. ఆమె తండ్రి అలీఘర్‌లోని బాలికల స్కూలుకు పంపాలనుకున్నారు. జాతి అభివృద్ధి కోసం సామాజిక ఆక్షలను ఉల్లంఘించగల సాహసం ఆయనకుంది. దురదృష్టవశాత్తు ఆయన మరణించడంతో అవకాశం ఆమెకు లభించలేదు. ఆయన మరణం వల్ల ఆమె చదువు ఉర్దూ చదవటం, రాయటం వరకు పరిమితమైయింది. ఆమె పెద్దన్న మహమ్మద్ అబ్దుర్రషీద్ ఖాన్ జాతి జనుల సేవ చేయాలన్న ఆలోచనలు ఆమెలో కలిగించారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 1920లో సాగిన ఖిలాఫత్ – సహాయం నిరాకరణ ఉద్యమంతో ఆయన పాల్గొన్నారు. త్వరితగతిన ఆమె పెళ్లి చేయాలన్న తల్లి ఆలోచనలను అన్న మాటలతో మార్చుకున్నారు. చిన్నప్పటి నుండి విలాసవంతంగా గడపడం, విలువైన వస్త్రాలు, ఖరీదైన ఆభరణాలు ధరించడం అంటే అయిష్టతతో ఉండేది అమతుల్సలాం.
ఆమె పెద్దన్నయ్య అబ్దుర్రషీద్ ఖాన్ 1922లో జిల్లా కాంగ్రేసు కమిటి అధ్యక్షుడయ్యాడు. ఆయన ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆరు మాసాలు జైలు శిక్షకు గురయ్యాడు. అమతుస్సలాం బుర్ఖా ధరించి అంబాలాలోని వీధుల్లో తిరిగి ఖద్దరు ప్రచారం చేయసాగారు. పలు సమావేశాలకు, సభలకు హాజరయ్యారు.
మహమ్మద్ అలీ జౌహర్, ఆయన తల్లి బీబీ అమ్మల పర్యటనలు తరచుగా పంజాబులో జరిగేవి. ఆ పర్యటన ప్రభావం ఆమె మీద ఉండేది. ప్రజాసేవ చేయాలన్న ఉత్సాంహం ఆమెలో పెరిగింది.
భిలాఫత్ ఉద్యమం సందర్భంగా హిందూ ముస్లీంలో వ్యక్తమైన ఏకతా భావనను మరిచిపోలేనంటారు ఆమె. బాపు 21 రోజులపాటు నిర్వహించిన వ్రతం ఆమె హృదయంలో గాఢమైన ప్రభావం చూపింది. మహాత్ముడు నిర్వహిస్తున్న పలు ఆందోళనా కార్యక్రమాల గురించి ఆమె ఎప్పటికప్పుడు పత్రికల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నారు. బ్రిటీషు వారి బానిసత్వంలో న్యాయవాదవృత్తి చేయకూడదని ఆబ్దుర్రషీద్ నిర్ణయించుకున్నాడు. ఆయన స్నేహితుడు ఆయన్ను ఇండోరు మహా రాజు కార్యదర్శిగా ఇండోరు తీసుకెళ్లారు. జాతీయోద్యమం గురించిన విశేషాలను అన్నద్వారా తెలుసుకునేవారు. అనేక గ్రంథాలను, పత్రికలను చదివేవారు. మహాత్ముని అహింసా సిద్ధాంతంపట్ల అమతుస్సలాం ఆకర్షితులయ్యారు. మహాత్ముని బాటలో నడవాలని నిర్ణయించుకొని సబర్మతీ ఆశ్రమానికి వెళతానని అన్నకు తెలిపారు. ఆయన నవ్వి ఊరుకున్నారు. ఆమె సబర్మతి ఆశ్రమానికి చేరుకున్నారు. కేవలం ఒక అతిథిగా కొన్నాళ్లు ఉండటానికి మాత్రమే గాంధీజీ అంగీకరించించారు.
ఆశ్రమ కఠిన నియమ నిబంధనలను పాటిస్తూ, అంకితభావంతో, నిబద్ధతతో, సేవాతత్పరతతో, చక్కని క్రమశిక్షణతో ఆశ్రమ వాసులలో ఒకరిగా ఇమిడిపోయారు. ఆమె కస్తూర్భా గాంధీజీలకు కన్నబిడ్డ సమానమయ్యారు. ఆశ్రమంలో అతిధిగా ఆహ్వానించబడ్డ ఆమె చివరకు ఆశ్రమ సేవికయ్యారు. ఒక ప్రసిద్ధ ముస్లిం రాజపుఠానా కుటుంబానికి చెందిన అమ్మాయి ఆశ్రమంలో చేరి అవివాహితగా జాతీయోద్యమానికి తనను తాను సమర్పించుకోవడం ఆనాడు ఊహించని సంఘటన.
స్వేచ్ఛా భారతం కోసం కలలు కన్న జాతీయోద్యమకారులు తాముకన్న కలలను భగ్నం చేస్తూ ఇండియా ముక్కలయ్యింది. ఆ విభజన కూడా మతం పేరిట సాగటం అమతుల్సలాం చలించిపోయారు. ఆ విఘాతం నుంచి బయటపడే లోపే గాంధీజీ హత్యకు గురి అవ్వడం ఆమె తట్టుకోలేకపోయారు. ఆ వేదన నుండి కొంత తేరుకున్న తర్వాత ఆమె పూర్తిగా పునరంకింతమయ్యారు.
మృదులా సారాబాయి, సుభద్రాజ్యోషిలతో కలసి అటు పాకిస్తాను ఇటు ఇండియా నుండి వేరు పడిన మహిళలను తమ వారున్న ప్రాంతాలకు చేర్చారు. దీని కోసం ఆమె తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
తరువాత ఆమె పంజాబ్‌లోని రాజపూర్ గ్రామంలో కస్తూర్భా పేరిట ‘కస్తుర్భా మందిరం’ అనే ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆ ఆశ్రమంలో చేతివృత్తులు నేర్పటం, అక్షర జ్ఞానం అందించటం తదితర కార్యక్రమాలు చేపట్టారు. నిస్సాహాయులయిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పలు పథకాలు రూపొందించి అమలు చేశారు. ఆమె దళితలు, మహిళల సేవలకు అంకితమయ్యారు. అనితర సాధ్యమైన రీతిలో సేవ చేసిన గొప్ప మహిళామూర్తి బీబీ అమతుల్సలాం చివరి వరకు గాంధేయమార్గాన్ని వీడలేదు. సమరశీల జీవితాన్ని గడిపిన ఆ మహా మానవి 1985 అక్టోబర్ 29న తుది శ్వాస విడిచారు.

