నా దారి తీరు -88 గండ్రాయి శిష్యుడు గోపయ్య ఉదంతం

నా దారి తీరు -88

గండ్రాయి శిష్యుడు గోపయ్య ఉదంతం

గోపయ్య ఎనిమిదోక్లాస్ చదివేవాడు .ఎరుకుల కులం కుర్రాడు .ఎర్రగా అందం గా ఉండేవాడు. వెడల్పు నవ్వు ముఖం ..అసలు చదివే వాడుకాదు అల్లరి విపరీతం గా చేసేవాడని మిగిలిన మేస్టార్లు చెప్పేవారు. నేనే ఆ క్లాస్ టీచర్ని .ఇంగ్లీష్ సైన్స్ చెప్పేవాడిని నాక్లాసుల్లో అల్లరి అసలు చేసే వాడుకాదు. చాలా వినయం గా అమాయకం గా ఉండేవాడు .నేను క్లాస్ నుంచి బయటికి వస్తే చాలు మిగిలిన ఏమాస్టారు నైనా ఆటపట్టిన్చేవాడట .ఒకటి రెండుసార్లు క్లాస్ కు వెళ్ళకుండా దూరం గా ఉండి గమనించాను .అప్పుడు తెలిసింది నాకు వాడి విశ్వ రూపం .బాగా పేదవాడు .ఇంటి దగ్గర తీరు బాగా ఉండక పట్టించుకొనే వాళ్ళు లేక అలా తయారయ్యాడనిపించింది .రెండు నెలల తర్వాత ఒక రోజు ఇంటికి వచ్చి ‘’సార్!నాకు ట్యూషన్ చెప్పాలిమీరు మీ దగ్గర చదవాలని ఉంది .యెంత ఫీజు అడిగితె అంతా ఇచ్చి చేరతాను ‘’అన్నాడు చేతులు కట్టుకొని తల వంచుకొని నిలబడి .ఆహా దొరికాడు అనుకొన్నా .వాడిలో మార్పు రావాలి తేవాలి అనే దృఢమైన ఆలోచన వచ్చింది .’’ఒరే !క్లాసులో విపరీతంగా అల్లరి చేస్తావని అసలు చెప్పేదివినవని విననీయవని అందరూ చెబుతున్నారు .నిన్ను ప్రైవేట్ లో చేర్చుకొంటే వీళ్ళను కూడా చెడగోడ తావేమో  వద్దులే . నీ తంటాలేవో నువ్వు పడు ‘’అని బెదిరిస్తూ అన్నాను .వాడు కదలలేదు .అలాగే నిలబడ్డాడు ‘’సార్ !మీరు కొట్టండి చంపండి .ఏమైనా చేయండి మిమ్మల్ని వదలను. మీ దగ్గరే చదవాలినేను .మీరు కాదంటే స్కూల్ కూడా మానేస్తాను ‘’అన్నాడు మహా వినయం గా .దారిలోకి వచ్చాడనుకొని ‘’సరేరా !ఎంతిస్తావు ఫీజు ?’’అన్నా ‘’సార్!మీరెంత అడిగితె అంతా ఎక్కడో అక్కడ తెచ్చి మీకు ఇస్తా .చదువుకొంటా ‘’అన్నాడు నిశ్చయం గా .వీడు పనికోస్తాడనిపించింది .’’సరే ! నీబుద్ధి సరైన దారిలోకి వస్తోందనిపిస్తోంది .నువ్వు బాగుపడటం నాకు కావాలి .మీరు ఎస్ టి విద్యార్ధులు .ఏమాత్రం టెన్త్ పాసైనా మీకు ఉద్యోగాలను ప్రభుత్వం కళ్ళకు అద్దుకొని ఇస్తుంది .అవకాశాన్ని జార విడుచుకొంటే ఏ ఖూనీకోరువో దొంగవో అవుతావు  భవిష్యత్తు బాగా ఉండాలంటే కష్టపడాలి చదవాలి .నాకు ఒక్క రూపాయి కూడా ఫీజు అక్కర్లేదు .నువ్వు బాగు పడటమే నాకు ఫీజు ‘’అన్నాను .అమాంతం కాళ్ళ మీద పడిపోయాడు కళ్ళల్లో ఏడుపు తన్నుకొచ్చింది గోపయ్యకు  .నాకూ అదే పరిస్తితి .అంతే ఆ రోజు నుంచే ప్రైవేట్ కు వచ్చాడు .

మారిన గోపయ్యనే క్లాస్ లీడర్ చేసి బాధ్యత అప్పగించా .అంటే దొంగకు తాళం చెవి అప్పగించానన్నమాట .అంతే-అల్లరీ గిల్లరీ ఏమైపోయాయో తెలీదు .మహా బుద్ధి మంతుడుగా ఉన్నాడు .ఏ సబ్జెక్ట్ లోను వాడికి ప్రోగ్రెస్ లేదు .వాడికోసం పది లైన్లఇంగ్లీష్  స్టోరీని అయిదు లైన్లకి కుదించి ప్రత్యేకం గా వాడి నోటు పుస్తకం మీద నేనే రాసి చదివిన్చేవాడిని . రెండూ మూడు లైన్ల షార్ట్ ఆన్సర్ ను లైనున్నరకి కుదించి అనిపించి రాయించి అప్పగించుకొని వచ్చేట్లు చేశా .అక్కడ అందరూ బి సి ఎసి ఎస్ టి లే కనుక అసలే తక్కువలోనే నోట్స్ ఇచ్చేవాడిని. వీడికోసం ఇంకొంచెం కుదింపు .నాపద్ధతులన్నీ అలువాటు పడి కస్టపడి చదివి క్రమంగా హాఫ్ యియర్లీ పరీక్షలకు కొద్దిగా ఇంప్రూవ్ మెంట్ చూపించాడు .యాన్న్యువాల్ పరీక్షల్లో బాగా పికప్ అయ్యాడు. నేనంటే వాడికి దేవుడే అయ్యాను .నాకు అన్ని పనులు చేసి పెట్టేవాడు .ఇంత గణనీయ మైన మార్పు గోపయ్యలో రావటం నాకు ఏంతో ఆనందం గా ఉండేది. గర్వం గా ఉండేది .వాడిలో కృతజ్ఞతా భావం అడుగడుగునా కన్పించేది .నాకెందుకో వాడి కళ్ళల్లో వెలుగు ముఖం లో వర్చస్సు కనిపించేవి. అవే నన్ను వాడికి దగ్గరకు చేర్చాయి . స్వభావం వాడికి నచ్చింది .యక్కడ ఉయ్యూరు ఎక్కడ గండ్రాయి ?ఎక్కడిదీ అనుబంధం?తలచుకొంటే ఆశ్చర్యం కలిగిస్తాయి. గోపయ్యలో వచ్చిన మార్పుకు విద్యార్ధులు మేస్టార్లు తలిదండ్రులు చూసి మహదానంద పడ్డారు .

ఎనిమిది పాసై తొమ్మిదికి వచ్చాడు గోపయ్య .మళ్ళీ నాదగ్గరే ట్యూషన్ .ఇంకా జాగ్రత్తగా ఉన్నాడు .అంతేజాగ్రత్త నేనూ వాడివిషయం లో తీసుకొన్నాను .ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్న హెడ్ మాస్టర్ ప్రమోషన్ నాకు వచ్చింది. ఆ వివరాలు తర్వాత రాస్తాను .వత్సవాయి హెడ్ మాస్టర్ గా ఆర్డర్ వచ్చింది .ఇక గోపయ్య ఏడుపుకి అంతు లేదు నన్ను వేల్లద్దంటాడు ఇక్కడే ఉండిపోమ్మంటాడు   ఉండటం కుదరదు అంటే వినడు .నాతొ వత్సవాయి వచ్చి అక్కడే స్కూల్ లో చేరతానంటాడు .నన్ను మాత్రం వదలనన్నాడు .ఆ భక్తీ ఏమిటో ఆ నమ్మకం ఏమిటో నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే ఇంతవరకు అలాంటి శిష్యుడు నాకు తటస్త పడలేదు .వాడికి నచ్చచేబుతూ ‘’ఒరే! నేను ఇక్కడ ఉండి వత్స వాయి రోజూ  వెళ్లి ఉద్యోగం చెయ్యకూడదు అక్కడే ఉండాలి .నేను లేనని నువ్వు చదువుమానేస్తే ణీ జీవితం బాగు పడదు ఎవరు ఉన్నా లేకున్నా నీ చదువు మీద నువ్వు దృష్టిపెట్టి చదువుకోవాలి. ఎవరూ ఎప్పుడూ వెంట ఉండరు .నిన్ను నువ్వే తీర్చిదిద్దుకోవాలి .నువ్వు నాతొ బాటు వస్తానన్నా నేను తీసుకుకు వెళ్ళను నీ భవిష్యత్తు నాకు ముఖ్యం ‘’అని చెప్పి ఒప్పించాను .ఆ తర్వాత అగోపయ్య టెన్త్  పాసవటం  ఇంటర్ డిగ్రీ చదివి డిగ్రీ సాధించటం బెజవాడలో  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించటం వరుసగా జరిగిపోయాయి .ఈ విషయాలన్నీ బాబ్జీ వాళ్ళు మొదటి సారి గండ్రాయి స్కూలు లో స్వాతంత్ర దినోత్సవం చేసినపుడు నేను వెడితే తెలిసింది .అప్పుడే మళ్ళీ నేను గోపయ్యను చూడటం తటస్తించింది .ఇప్పుడు గేజేటేడ్ హోదా కూడా వచ్చిఉంటుంది. బాబ్జీ బృందం తోకలిసి ఉయ్యూరు మా ఇంటికి వచ్చాడు నిజం గా నా ఆనందానికి అంతేలేదు గోపయ్యను చూసి గర్వపడతాను .గోపయ్యానే ముడి సరుకు వజ్రం గా మారింది ఆ గ్ఫ్హంత నాదే అయినా ఆటను ఆ ఒరిపిడికి తట్టుకొని నిలబడి తానేమిటో రుజువు చేసుకొన్నాడు

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -12-2-15-ఉయ్యూరు

 

 

 

 

 

 

 

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in నా దారి తీరు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.