అందరిలా కాకుండా కాస్త భిన్నంగా కనిపిస్తే చాలు ఒకటికి నాలుగుసార్లు చూస్తారు. వింతగానూ చూస్తారు. అలాంటిది ప్రపంచంలోనే అతి తక్కువ ఎత్తుతో ఉన్న మనిషి కనిపిస్తే… కళ్లముందు కనిపించేది మనిషా, బొమ్మా అని ఆశ్చర్యంగా చూడడం, వింతగా మాట్లాడడం ఖాయం. కానీ ఆ చూపులు, మాటలు వాళ్లనెంతగా బాధిస్తాయో ఆ మాటలు అనేవాళ్లకి తెలియదు. అలాంటి అనుభవాలు ఇరవైయొక్కేళ్ల జ్యోతి ఆమ్గేకు ఎన్నో ఉన్నాయి. తక్కువ ఎత్తుతో గిన్ని్‌సబుక్ రికార్డుల్లోకిఎక్కడమే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన ఆమె తన రోజూవారీ జీవితంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఓపెన్ పత్రికకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
‘‘నాకు మూడేళ్లు వయసులో నన్ను పరీక్షించిన డాక్టర్లు నాకున్న అరుదైన పరిస్థితి (మరుగుజ్జుతనం) గురించి అమ్మావాళ్లకి చెప్పారు. నా ఆరోగ్య పరిస్థితి గురించి తెలిశాక మూడు తరాలుగా మా కుటుంబ సభ్యులు నివసిస్తున్న ఇంటికి ‘జ్యోతిహౌస్’ అని పేరు పెట్టారు. నాగపూర్‌లో నన్నందరూ ‘లివింగ్ డాల్’, ‘లిటిల్ వండర్’, ‘థంబెలినా’ అని పిలుస్తుంటారు. లేత గులాబీ రంగంటే నాకు చాలా ఇష్టం. అందుకే నా గదికి, మెట్లకి అదే రంగు వేయించారు మావాళ్లు. నా గది చూస్తే మీకు మిర్రర్ ఇమేజ్ ఏమైనా ఉందా అనుకుంటారు. ఎందుకంటే మామూలు సోఫాలు, కుర్చీలు ఒక పక్కన ఉంటాయి. అవే సోఫాలు, కుర్చీలు మరోవైపు మినియేచర్ సైజుల్లో ఉంటాయి. ఒక్కమాటలో చెప్పాలంటే ‘బొమ్మరిల్లు’లా కనిపిస్తుందన్నమాట. నా కోసమే ప్రత్యేకంగా బెడ్, డెస్క్, కుర్చీ తయారు చేయించారు. వంటగదిలో గిన్నెలు, ప్లేట్లు కూడా రెండు సైజుల్లో ఉంటాయి. కుటుంబమంతటికీ ఒక సైజు నాకోసం మరో సైజు. నేను కడుపులో పడిన దగ్గర్నించీ ఇప్పటివరకు మా అమ్మ నన్ను మోస్తూనే ఉంది. అదెలాగంటే నేను ఎక్కువసేపు నడవలేను. అందుకని ఎక్కువ సమయం మా అమ్మ నన్ను ఎత్తుకునే ఉంటుంది.
హారర్ స్టోరీ అభిమానులను ఇచ్చింది
నేషనల్ జియోగ్రఫిక్ వాళ్లు తీసిన డాక్యుమెంటరీతో మొదలైన ప్రయాణం 2012లో బిగ్‌బాస్ షోలో, మైకా సింగ్ మ్యూజిక్ వీడియోలో కనిపించేలా చేసింది. 2014లో ‘అమెరికన్ హార్రర్ స్టోరీ’ అనే టెలివిజన్ షోలో నటించే అవకాశం వచ్చింది. అందులో ‘మా పిటైట్’ పాత్రలో కనిపించాను. ఆ పాత్ర దారుణంగా హత్యగావించబడుతుంది. అది చూసిన అభిమానులు ఇంటర్నెట్‌లో తమ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. విషాదకరమైన సందేశాలు పెట్టారు. పెద్ద మీడియా సంస్థలయిన ‘ప్యూపుల్’, ‘హపింగ్టన్ పోస్టు’, ‘ఎబిసి న్యూస్’, ‘స్లేట్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ టునైట్’లలో నా లైఫ్‌స్టోరీని ప్రచురించాయి. అప్పటివరకు నన్ను నీడలా వెంటాడిన ‘బేబీ’, ‘డాల్’ అనే పదాలు ఒక్కసారిగా మాయమైపోయాయి. అదే విషయాన్ని నా ఫేస్‌బుక్ మెసేజ్‌లో ‘నన్ను బేబీ లేదా డాల్ అని పిలవనందుకు నా అభిమానులందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ అమెరికన్ హారర్ స్టోరీ నచ్చింది అనుకుంటున్నాను. నా ప్రయత్నం నేను చేశాను’ అని పెట్టాను. ఈ షో ప్రీమియర్‌కి గులాబీరంగు గౌను వేసుకుని, జుట్టును రింగులు రింగులు తిప్పుకుని, భారీ మేకప్ వేసుకుని వెళ్లింది. ఆ సందర్భంగా మాట్లాడుతూ ‘‘నేనిదంతా కల అనుకుంటున్నాను. ఇలా హాలీవుడ్‌లో ఉంటానని నేను అనుకోలేద’’ని తన సన్నటి గొంతుతో మాట్లాడింది జ్యోతి. ఎక్కువ సమయాన్ని తన స్మార్ట్‌ఫోన్ మీద వేళ్లు కదిలిస్తూ సోషల్ మీడియాలో ఉన్న అభిమానులతో బిజీగా ఉంటుంది. ఆమె ఉపయోగిస్తున్న ఐఫోన్ 5 ఆమె చేతిలో చాలా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఫోను పొడవు ఆమె ముంజేయి వరకు ఉంటుంది. షూ బాక్స్‌లో తనకి చేతిరాతతో వచ్చిన ఉత్తరాలను, కార్డులను జాగ్రత్తగా పెట్టుకుంటుంది. అందులో ఆమెని పెళ్లాడతామంటూ వచ్చిన ఉత్తరాలు కూడా ఉంటాయి. అమెరికా వీరాభిమాని ఒకరు ఆమెను ఫేస్‌బుక్‌లో విపరీతంగా ఇబ్బందిపెడుతుంటే అతడ్ని బ్లాక్ చేద్దామని కూడా అనుకుందట.
పొడవు జుట్టుతో మరోసారి
ఆమెను తెరమీద, ఫోటోల్లో చూస్తే మరీ అంత తక్కువ ఎత్తు ఉన్నట్టు కనిపించదు. కానీ వాస్తవంగా వాటిలో కనిపించేదానికంటే ఎత్తు చాలా తక్కువగా ఉంటుందామె. ‘‘నా కోసం ప్రత్యేకంగా తయారుచేసిన దుస్తులు కొనుక్కోవడం అంటే ఇష్టం. అలాగే ఎత్తుమడమల చెప్పులు వేసుకోవడమంటే కూడా చాలా చాలా ఇష్టం. కాని నేనెప్పటికీ వాటిని వేసుకోలేను. చిన్నప్పుడు కాళ్లు విరిగిపోయాయి. అవి నన్ను ఇప్పటికీ బాధిస్తుంటాయి. ఎందుకంటే నా వంట్లో క్యాల్షియం తయారవదు. అందుకే ఎత్తుమడమలు వేసుకోవడం అనేది నాకు కలగానే మిగిలిపోతుంది. నా జుట్టు ఎప్పుడూ చక్కగా అల్లి జడవేస్తారు అమ్మావాళ్లు. అలాకాకుండా వదిలేసానంటే నాకంటే జుట్టే పొడవుగా ఉంటుంది. ఈ కారణంతో మరోసారి గిన్నిస్ బుక్ రికార్డు ఎక్కాలనుకుంటున్నాను. కానీ అతి తక్కువ ఎత్తున్న వాళ్లకి పొడవైన జుట్టు ఉండడం అనే విభాగం రికార్డుల్లో లేదు. ఆ విభాగం కూడా పెడతారనేది నా నమ్మకం.
కుర్చీ హ్యాండిలే నాకు సీటు
వయసు పెరిగే కొద్దీ మిగతా పిల్లలతో కలిసి ఆడుకునేందుకు బయటికి వెళ్లేందుకు నాకు ఓపిక ఉండేది కాదు. స్కూల్ అయిపోయిన తరువాత ఇంట్లోనే కూర్చొని టీవీ చూస్తూ కూర్చునేదాన్ని. నన్ను నేను స్ర్కీన్ మీద చూసుకున్నట్టు ఊహించుకుంటూ ఉండేదాన్ని. సల్మాన్‌ఖాన్ సినిమా ఒక్కటి కూడా వదలకుండా చూశాను. ఆయనతో కలిసి నటించాలనుకున్నాను కూడా. అయితే ఎత్తు తక్కువగా ఉండే నటులకు హారర్, మూఖాభినయం వంటి వాటిలోకి వెళ్లడం పెద్ద చాలెంజ్. అమెరికన్ హారర్ స్టోరీని విచిత్రమైనదిగా చూస్తారు. అయితే హారర్ షోలో నటించడం వల్ల విచిత్రవ్యక్తులవుతామని నేను అనుకోవడం లేదు. మేము కూడా మిగతా వాళ్లలా మామూలు మనుషులమే. అదే విషయాన్ని ఈ షో ద్వారా చూపించడం మాలాంటి వాళ్లకి ఆనందాన్నిస్తుంది.
మకావు నుంచి మనదేశానికి రాగానే థియేటర్‌కి వెళ్లి ిపీకే సినిమా చూశాను. తెర కనిపించడం కోసమని కుర్చీహ్యాండిల్ మీద కూర్చున్నాను. థియేటర్‌లో ఎప్పుడు సినిమా చూసినా కుర్చీ హ్యాండిలే నా సీటు. గదిలో ఉండే లైట్ స్విచ్‌లు వేయలేను. టేబుల్ మీద రిమోట్ లేదా మొబైల్ ఫోన్ వంటివి పెడితే వాటిని అందుకోలేను. కారు సీటులో కూర్చోలేను. చిన్న పిల్లల మధ్య ఉన్నానంటే చాలా జాగ్రతగా ఉంటాను. ఎందుకంటే వాళ్లు నన్ను నెట్టేస్తారు. నన్ను చూసినప్పుడు ‘ఈమె పెద్దావిడా, చిన్న పిల్లా లేకపోతే బొమ్మా’’ అనే గందరగోళ పరిస్థితిలో ఉంటారా పిల్లలు.
ఆ భయం పోయింది
నాకున్న మరో సమస్య నా అంతట నేనుగా ఎక్కడికీ వెళ్లలేకపోవడం. నేను కాలేజికి వెళ్లాలంటే మా నాన్నో, అక్కల్లో ఎవరో ఒకరు ప్రతిరోజూ నాకు తోడుగా రావాల్సిందే. హోంసైన్సు చదువుతున్నాను. కాఫీ షాపు, మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాలకి స్నేహితులతో వెళ్తే జనాలు చుట్టుముడతారు. నాతో వాళ్లు చాలా వింతగా ప్రవర్తిస్తారు. ఏమేమో మాట్లాడతారు. ‘జ్యోతీ, నీ పేరేంటి’ అని అడుగుతారు. ‘నా పేరు మీకు తెలిసినప్పుడు మళ్లీ నన్నెందుకు అడుగుతార’ని నేనంటే ‘ఓరి దేవుడా, ఈమె మాట్లాడుతుంద’ని ఆశ్చర్యపోతారు. నాకిష్టంలేకపోయినా, నేను వద్దని వారించినా నా ఫోటోలు తీసుకుంటారు. అటువంటివన్నీ చాలా చిరాకుగా అనిపిస్తాయి. నా జీవితంలో ఇప్పటివరకు నా వైపు ఆశ్చర్యంగా, వింతగా చూసేవాళ్లే ఎదురయ్యారు. దానివల్ల చాలాసార్లు ఇబ్బందికర పరిస్థితులను కూడా ఎదుర్కొన్నాను. అందుకే బయటకు వెళ్లాలంటే భయం వేసేది. కాని ఇప్పుడు ఎంతమంది శ్రోతలు ఉన్నా మైకులో భయం లేకుండా మాట్లాడగలను. ఎత్తు తక్కువ ఉన్న వాళ్లు కూడా బయటికి వచ్చి వాళ్ల అనుభవాలను నాలాగానే పంచుకోవాలి.’’
ప్రపంచం చుట్టి వస్తుందన్నాడు
నాగపూర్‌లో నివాసులైన రంజన, కిషన్‌జీ ఆమ్గే దంపతుల ఐదో సంతానం జ్యోతి. ఆమె జాతకం చూసిన జ్యోతిష్యుడు ‘ఈ అమ్మాయి వల్ల కుటుంబానికి పేరు ప్రఖ్యాతులు వస్తాయ’ని చెప్పాడు. అంతేకాదు ఆ బిడ్డ ప్రపంచమంతా చుట్టి వస్తుందని, తనతో పాటు కుటుంబం కూడా పర్యటిస్తుందని చెప్పాడు. ఆ మధ్య తరగతి జంటకి అప్పట్లో అదో అందమైన కల. అందుకే ఆ జ్యోతిష్యుడు చెప్పిన విషయాలను అంతగా పట్టించుకోలేదు వాళ్లు. ‘నాగపూర్ నుంచి ముంబయి వెళ్లడానికే మాకు కష్టం. అలాంటిది ప్రపంచం చుట్టి రావడం ఏమిటి అనుకున్నాం’’ అన్నారు కిషన్‌జి. కాని ఇప్పుడు వాళ్లు బ్రెజిల్, అర్జెంటీనా, జపాన్, టర్కీ, ఇటలీ, రొమేనియా,చైనా, కువైట్ దేశాలు చుట్టేసి వచ్చారు. ఇదంతా ఆఖరున పుట్టిన ఆ అమ్మాయి వల్లే సాధ్యమైంది. ఆ జ్యోతిష్యుడి మాటలు నిజమయ్యాయి. జ్యోతికి రాజకీయ కెరీర్‌ను చూపించే పనిలో ఉన్నాడు ఆమె నాన్న. దాంతోపాటు ఆమె కథను పబ్లిషర్లకు అమ్మే ప్రయత్నంలో కూడా ఉన్నాడు.
పేరు: జ్యోతి ఆమ్గే
ఎత్తు: 62.8 సెంటీమీటర్లు (24.7 అంగుళాలు)
బరువు: కేవలం
5 కేజీలు
నేషనల్ జియోగ్రఫిక్ ‘ది వరల్డ్స్ స్మాలెస్ట్ గర్ల్’ డాక్యుమెంటరీ తీసే సమయంలో జ్యోతిని తల్లిదండ్రులు ఒక దేవాలయానికి తీసుకెళ్లారు. అక్కడున్న ప్రజలు ఆమెను దేవిగా పూజించడం మొదలుపెట్టారు. ఇలా ఇబ్బంది పెట్టే విషయం ఆమెకు చాలాసార్లు ఎదురైంది. ‘‘ఒకవేళ నాలో నిజంగా ప్రత్యేక శక్తులు ఉంటే, నేను ఎత్తు పెరిగే దాన్ని కదా. నేను పొడవు అవ్వడం అనేది అసాధ్యం. ఒక రకంగా చెప్పాలంటే నా ఎత్తే నన్ను ప్రముఖురాల్ని చేసింది. ఇంకా ఎత్తు ఎదిగేలా చేస్తోంది కూడా’’ అంటుంది జ్యోతి.