ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -11
6-అమెరికా ద్రష్ట ,మహోన్నత నవలా సృష్టికర్త –హెర్మన్ మేల్విల్లీ
ఆమెరికా సాహిత్య చరిత్రలో అత్యద్భుత అత్యు న్నత నవలా నిర్మాతగా , ద్రస్టగా ,కవిగా విజయ వంతమైన రచయితగా పేరొందిన వాడు హెర్మన్ మేల్విల్లీ .ఇంత గొప్పవాడు చనిపోయే ముందు ఒక అజ్ఞాత వ్యక్తిగా ఉండిపోవటం దురదృష్టకరం .అయన ఇంటి నుంచి పారిపోయి నరమాంస భక్షకులతోకలిసి జీవించాడని మాత్రమే అమెరికన్ జనాలు గుర్తుపెట్టుకొన్నారు .మిగిలినవన్నీ మర్చే పోయారప్పటికి .అమెరికా గర్వించదగిన ఉన్నత కుటుంబం లో 1-8-1819 లో న్యూయార్క్ సిటి లో జన్మించాడు .తలిదండద్రులిద్దరివైపు వారూ అమెరికన్ రివల్యూషనరీ యుద్ధం లో వీరోచిత పోరాటం చేసిన వారే .పాల్గొన్నవారే .తాత బోస్టన్ టీ పార్టీ నిర్వహణ సమయం లో మేజర్ గా ఉంటె ,మాతామహుడు పీటర్ గేంస్ వర్త్ ఫోర్ట్ స్టాన్విక్స్ ను బ్రిటిష్ మూకల దాడి నుండి కాపాడి రక్షించిన యోధుడు .తల్లివైపు వారిది డచ్ –అమెరికన్ సంప్రదాయం .గాల్వనిస్ట్ విధానాన్ని తూ చా గా పాటించే వారు .ఎనిమిది మంది సంతానం లో మేల్విల్లీ మూడవ వాడు .ఇల్లు మంచి వాతావరణం లో తలిదండ్రులు నడుపుతున్నారు .హంగూ ఆర్భాటాలు లేవు .తండ్రి దిగుమతి వ్యాపారస్తుడు .కమీషన్ వ్యాపారి .ఎప్పుడూ ఇతర దేశాలు తిరిగే వాడు .మంచి స్కూల్ లో చేర్పించి మేల్విల్లీ ని చదివించాడు .తండ్రితో అప్పుడప్పుడు ఇతర ప్రదేశాలు వెళ్లి చూసేవాడు .
కాలం ఎప్పుడూ ఒకే రీతిగా ఉండదు .ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవటం సహజం .1830 లో దేశం లో డిప్రేషన్ వచ్చి వ్యావారాలన్నీ దెబ్బతిన్నాయి .మేల్విల్లీ తండ్రి దివాలా తీశాడు .కుటుంబాన్ని ఆల్బనికి ,తల్లి బంధువుల సమీపానికి మార్చాడు .అక్కడ ఫర్ బిజినెస్ చేసి అప్పుల్లో నిండా మునిగిపోయాడు .శారీరక మానసిక ఆరోగ్యం కోల్పోయాడు .మానసిక వ్యాధి కూడా వచ్చింది .ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చి నలభై ఏళ్ళకే చనిపోయాడు .అన్న గాన్సూవేర్ట్ తండ్రివ్యాపారాన్ని బుజాన వేసుకొని నిర్వహించాడు .అన్న వ్యాపారమూ లాభించలేదు .హెర్మన్ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ పొట్ట పోషించుకొంటూ కుటుంబాన్ని ఆదుకొనేవాడు .పద్దెనిమిదో ఏట టీచర్ గా చేరాడు పిట్స్ ఫీల్డ్ లో .కుటుంబం లాన్సింగ్ బర్గ్ కు చేరింది .ఇంజినీర్ అవ్వాలనే ఉద్దేశ్యం లో మేల్విల్లీ సర్వేయింగ్ లో చేరాడు .స్తానిక పత్రికలలో వ్యాసాలూ రాసేవాడప్పుడప్పుడు.1839లో లివర్ పూల్ వెళ్ళే సెయింట్ లారెన్స్ నౌక లో కేబిన్ బాయ్ గా నమోదయ్యాడు .అతని తోపాటు అందులో పని చేసేవాళ్ళు ‘’రఫ్ అండ్ టఫ్ ‘’టైపు మనుషులు .అల్లకల్లోల సముద్రం భయానక ప్రయాణం అతని మనసుపై ముద్ర వేసింది .హృదయం అల్లకల్లోలమైంది సముద్రం తో పాటు .ఎన్నో కొత్త కొత్త భావాలు ఊపిరి సలపనివ్వకుండా ముసురుతున్నాయి .నౌకలో అతనిపని కోడి పిల్లల్ని మాంసం కోసం శుభ్రం చేయటం పందులకు పడుకొనే సదుపాయం కలిగించటం .’’గాడిద చాకిరి చేయించేవారు నన్ను’’ అని చెప్పుకోన్నాడు..చాలా నీచం గా క్రూరం గా డబ్బున్న మనుషులు హీనం గా’’అలబామాలో ఉన్న ఆఫ్రికన్ ‘’లాగా చూసేవారు .ఇంత హీన నీచ పరిస్తితులలో పని చేస్తున్నా ఏమాత్రం అసహ్యించుకోకుండా గాడిద చాకిరీ చేస్తూనే ఉన్నాడు .దీఇకి ముఖ్య కారణం సముద్ర ప్రయాణం మీద ఉన్న మోజే .ఈ వింత విపరీత విషయాలన్నీ మేల్విల్లీ రాయబోయే బృహత్తర నవలలకు ముడి సరు కైంది.ఈ మొదటి విదేశీ ప్రయాణంలో నాలుగు నెలలు గడిపాడు మేల్విల్లీ .లివర్ పూల్ లో దుర్భర జీవితాన్నే గడిపాడు .మళ్ళీ న్యూయార్క్ చేరాడు కాని జీవితం అనిశ్చితం అనిపించింది . పల్లెటూరి స్కూళ్ళలో టీచర్ గా పని చేశాడు.దీనితో గ్రామీణ వాతావరణానికి బాగా అలవాటు పడ్డాడు .ఈ నేపధ్యం లో కొన్ని రచనలు చేశాడు .దీని అప్రెంటిస్ వర్క్ అన్నారు .
ఎన్నిప్రయత్నాలు చేసినా సరైన ఉద్యోగం రాలేదు అందుకని ‘’ఆషు నెట్ ‘’అనే ‘’వేలింగ్ షిప్’’ లో ప్రయాణించటానికి సభ్యుడైనాడు మేల్విల్లీ .ఇది సుదీర్ఘ ప్రయాణం .తెరచాపలు అల్లాడు .‘’వేల్ వేట’’లో ఆనందం పొందాడు. ప్రతి చిన్న విషయాన్ని గుర్తుంచుకొని పదేపదే మననం చేసుకొనేవాడు .రాయబోయే చారిత్రాత్మక విశేష నవల ‘’మోబీ డిక్ ‘’కు కావలసిన విషయమంతా మనసులో సుళ్ళు తిరిగింది .నౌకలోంచి సముద్రం లోకి దూకే వాడు .నౌక మీద విపరీతం గా శ్రమపడి అసలైన ట్రేయినిం గ్ పొందాడు .దాన్ని గురించి తెలియ జేస్తూ ‘’వేల్ షిప్ అంటే హార్వర్డ్ ,నాఏల్ కాలేజి ‘’అన్నాడు .అంత పరస్పర సంబంధం ఉందని అన్నాడన్నమాట .’’ఆషునేట్ షిప్ ‘’1841జనవరి మూడున మాసచూసేట్స్ లోని న్యు బెడ్ ఫోర్డ్ నుండి బయల్దేరింది .బాగా కిక్కిరిసిన జనం తో బయల్దేరింది .కెప్టెన్ ఒక కిరాతకుడు .మూడీ ఫెలో . ప్రయానణీకులూ మూడీ ఫెలోస్ గానే ఉన్నారు .ఏడాదిన్నర ప్రయాణం చేసి మార్క్వేయాస్ చేరింది. అప్పుడు మేల్విల్లీ ఇంకో తోటి మనిషితోకలిసి నౌకను వదిలేశారు .నూకూ హివా అనే మారుమూల ప్రదేశానికి పారిపోయారు .అక్కడి టైపీస్ జాతి నరమాంస భక్ష కుల మధ్య గడిపారిద్దరూ .వీరిద్దరిని బందీలుగా చేసి గౌరవంగానే చూశారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-2-15-ఉయ్యూరు

