ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -14

ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు  -14

7-మహిళా నెపోలియన్ –సుసాన్ బ్రౌనేల్ ఆంథోని

అమెరికా లో  డెబ్భై అయిదేళ్ళ మహిళా పోరాటం వలననే స్త్రీలకూ స్వాతంత్ర్యం ,విద్య ,ఉద్యోగం స్వంత ఆస్తి ,పిల్లలపై అధికారం లభించాయి .వీటిని సాధించటానికి చేసిన ఉద్యమ పోరాటాలలో సింహ భాగం సుసాన్ బ్రౌనేల్ ఆంథోనీ కే దక్కుతుంది .ఆమె జీవితం మహిళా సాదికారతకే అన్కితమైంది  .ఆమె లేని ఉద్యమం లేదు .ఆమె పాల్గొనని సభ కనిపించదు ,చేయని పోరాటం లేదు .నిర్భయం గా మగ దీరులను ఎదిరించి వారు చెప్పే కుంటి సాకులకు దీటుగా సమాధానాలు చెప్పి చట్ట సభలలో తమ హక్కుల బిల్లు రూపొందించటానికి కృషి చేస్తూ త్యాగమయి గా జీవించి మహిళా శక్తిని సమీకరించి  గుండె ధైర్యం తో ముందుకు నడిఛి మహిళా నెపోలియన్ గా పేరు ప్రఖ్యాతులు పొందిన మహిళా మాణిక్యం సుసాన్ .

  అమెరికాలోని మాసా చూసేట్స్ రాష్ట్రం లో 15-2-1820 నఆడమ్స్ లో జన్మించిన సుసాన్ ఆంథోని ఎనిమిది మంది సంతానం లో రెండవ ది.తండ్రి క్వేకర్ ఉద్యమ నాయకుడు అయినా బాప్టిస్ట్ స్త్రీని పెళ్లి చేసుకొన్నాడు .నవ వధువు భర్త క్వేకర్ ఉద్య మానికి పూర్తీ మద్దతు పలికి సహకరించింది .కూతురు సుసాన్ ను క్వేకర్ విధానం లో చదువు చెప్పించింది .పిల్లలు గృహకృత్యాలలో తర్ఫీదు ఇస్తూ ,చదువుకోనేట్లు చేసేది .ఇంటివద్దగవర్నేస్ లను ఏర్పాటు చేసి చదివించారు .సుసాన్ ఫిలడెల్ఫియాలో పెద్దగా డబ్బు ఖర్చు లేని స్కూల్ లో చదివింది .1938 ఆర్ధిక సంక్షోభం లో సుసాన్ తండ్రి దివాలా తీశాడు .కుటుంబాన్ని న్యూయార్క్ లోని బాటెన్ విల్ కు మార్చాడు .ఇక్కడే పదేళ్లున్నారు .తండ్రి న్యూ యార్క్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేశాడు .డిప్రెషన్ ప్రభావం పడిన ఉన్నత కుటుంబాలలోని స్త్రీలు ఇంటి నుంచి బయటికి వచ్చి పురుషులతో సమానం గా గౌర వింప బడాలని  హక్కులు పొందాలని అభిప్రాయ పడ్డారు .వీరిని సక్రమమైన మార్గం లో నడిపించే ఆలోచన లో పడిసుసాన్  టీచర్ గా పని చేయాలను కొన్నది .న్యు రోషేల్లీ లోని బోర్డింగ్ స్కూల్ కు అసిస్టంట్ ప్రిన్సిపాల్ గా పని చేసింది .పది హీను వారాలకు ముప్ఫై డాలర్ల జీతం పొందింది .తర్వాత మగ టీచర్ కు వారానికి పది డాలర్లు ఇచ్చే పల్లెటూరి స్కూల్ లో వారానికి రెండున్నర డాలర్లు మాత్రమే జీతం పొందుతూ పని చేసింది .అదీ వివక్షత ఆడకూ మగకూ .

     ఇలా పని చేస్తూ క్రమంగా ఎదుగుతూ ,గనజాహోరి అకాడేమిలో  బాలికా విభాగం లో పనిచేసి గృహానికి దూరం గా ఒంటరిగా  స్వంత ఆదాయం పై జీవిస్తోంది సుసాన్ .ఇవి క్వేకర్ విధానాలకు వ్యతిరేకమే అయినా సాహసంగా ముందుకు వెళ్ళింది .పొడవుగా  ఉండి ,వెడల్పు బుజాలతో తీక్ష్ణ దృష్టితో యువకులకు అత్యంత ఆకర్షణీయం గా ఉన్నా ఆమె ఎవరి నీ వరించలేదు .’’కనజహారి  లో చురుకైన ధీశక్తి గల మహిళ’’గా గుర్తింపు పొందింది .మద్య పాన నిషేధ ఉద్యమం లో చురుకుగా పాల్గొన్నది .మహిళా ఉద్యోగ ఉద్యమం లోనూ తన వంతు పాత్ర నిర్వహించింది .సమాజం లో మహిళా సాధికారికత కోసం పెద్ద ఉద్యమం చేయాలనే కాంక్ష బలీయంగా మనసులో నాటుకొని అవకాశం కోసం ఎదురు చూస్తోంది .ఎలిజ బెత్ కాండీ స్టాన్టన్ మహిళల కోసం అప్పటికే ఉద్యమం లో ఉంది .సుసాన్ ‘’డాటర్స్ ఆఫ్  టెంపరెంస్ ‘’ఉద్యమం లో చేరింది .స్థానిక నాయకురాలి గా ఉండి క్రమంగా రాష్ట్ర నాయకు రాలైంది .ధారాళం గా మాట్లాడక పోయినా శక్తి వంతమైన పలుకులతో ఉర్రూత లూగించేది .వాదనా సామర్ధ్యం తో అవతలి వారిని ఒప్పించించేది .బ్రహ్మాండమైన రచయిత్రి కాకపోయినా రాసిన దానిలో స్పష్టత ,వాడి వేడి ఉండేవి .ఉద్యమం మందకొడిగా సాగటమే కాదు పురుషాదిక్యం వలనా వారి వ్యతిరేకతవలనా మందగించింది .మగవారు ఆడవారిని తమ తో సమానం గా పని చేయటానికి పూర్తిగా వ్యతిరేకించేవారు .మహిళల ను పబ్లిక్ మీటింగులలో చూడటమే కాని  వారిమాట   వినటానికి ఇష్టపడే వారు కాదు .ఆ నాడు .మహిళల హక్కు అంటే మండి పడేవారు  మగాళ్ళు. ఎలిజబెత్ తో యాభై ఏళ్ళ బంధం నుండి విడిపోయి స్వంతంగా స్త్రీ హక్కులకోసం పోరాడాలని నిర్ణయించింది .మొదటి సరిగా న్యూయార్క్ స్టేట్ టీచర్స్ అసోసియేషన్ లో మాట్లాడి మహిళా టీచర్లకు అన్నిసదుపాయాలూ ,అన్ని విషయాలలో సంప్రదించే హక్కు కలిగేట్లు తీర్మానం చేయించ గలిగింది .దట్ ఈజ్ సుసాన్ .

          1853లో సుసాన్ పూర్తిగా మహిళాహక్కులకోసమే అంకితమై పని చేయటం ప్రారంభించింది .మొదట్లో స్టాన్టన్ కు సహాయకురాలిగా ఉన్నా తర్వాత ఆమెకే  గైడ్ గా మారి మార్గ దర్శనం చేసింది .ఆమెతో లాయరైన ఆమె భర్త తోకలిసి ఉద్యమాలు నిర్వహించింది .కలిసి ఉపన్యాసాలు రాసింది .అప్పటికే ఎలిజ బెత్ ఏడుగురు   పిల్లల తల్లి .స్త్రీల డ్రెస్ విధానం లోను మార్పు రావాలని భావించి జుట్టు కత్తిరించుకొన్నది .సంప్రదాయ డ్రెస్ వదిలి తక్కువ పొడవున్న డ్రెస్ ధరించింది .ఇది కొంత ఇబ్బందికలిగించి స్త్రీ సమస్యలపై కంటే వారి డ్రెస్ పైనే ద్రుష్టి కేంద్రీకృతం అవుతున్నట్లు గ్రహించి మళ్ళీ ‘’రోడ్లను ఊడ్చే పాదాల దాకా పాకే ‘’పాత డ్రెస్ లానే వేసుకోంది.

 ఉద్యమాల నిర్వహణకు డబ్బు అవసరం అది వీరి వద్ద లేదు .దీనికి ముఖ్య  కారణంఏమిటి అని ఆలోచిస్తే స్త్రీలకూ డబ్బు దాచుకొనే హక్కు కూడా లేదని గ్రహించింది .దీనికోసం సభలు సమావేశాలు నిర్వహించి న్యూ యార్క్ స్టేట్ లెజిస్లేచర్ లో మహిళా హోదా కల్పించటానికి ఎన్నో సార్లు ప్రయత్నించి చివరికి ఆ బిల్ పాస్ అయ్యేదాకా పోరాటం సాగించి హక్కు సాధించింది .ఇది పదేళ్ళ పోరాట ఫలితం .దీక్షగా ఆ పదేళ్ళు ఒకే డ్రెస్ ధరించి సుదూర ప్రాంతాలు అన్ని రకాల వాతావరణాలలో ,విపరీత విపత్కర పరిస్తితులలో పర్య టించి మహిలలో చైతన్య దీప్తి రగిలించి సమీకృతం చేసి ఉద్యమాలు నిర్వహించి సాధించిన ఫలితం ఇది .1860లో శాసన సభలో బిల్లు పాసై చట్టం వచ్చి మహిళలకు ఆస్తిహక్కు ,స్వంత సంపాదనహక్కు ,పిల్లలపై భర్తతో సహా హక్కు మొదలైనవన్నీ సుసాన్ కోరినట్లే లభించాయి ఇది చారిత్రాత్మక విజయం .

     ఈ విజయాలతో పాటు కొన్ని అపజయాలు చవి చూసింది సుసాన్ .ఒక మతాధికారి రాసిన ‘’వుమెన్స్ సఫ్రేజ్ –ది రిఫార్మ్ ఎగైనెస్ట్ నేచర్ ‘’అనే పుస్తకం రాసి పుండుమీద కారం చల్లాడు .అందులో సుసాన్ ను చాలా నీచం గా  వర్ణిం చాడు కూడా . అమెరికా సివిల్ యుద్ధం లో ఉడికి పోతోంది .అబ్రహాం లింకన్ ఎన్నిక అబాలిష నిస్ట్ లకు ఊతం ఇచ్చింది .మొదట్లో సుసాన్ లింకన్ కు వ్యతిరేకం గా ప్రచారం చేసినా తర్వాత ఆయన బానిసత్వ నిర్మూలనా సిద్ధాంతం నచ్చి ఆయనకే ప్రచారం చేసింది .సివిల్ యుద్ధ కాలం లో స్త్రీ హక్కు ఉద్యమాన్ని తాత్కాలికం గా నిలిపేశారు .తండ్రి కున్న ఫారం లో కాలక్షేపం చేసింది .బ్రౌనిగ్ రచనలు ,ఇలియట్ సాహిత్యాన్ని చదువుతూ గడిపింది ఆసమయం లో . బానిసత్వ నిర్మూలన ,స్త్రీ విముక్తి కోసం పధకాలు ,అవి అమలవ్వాల్సిన తీరు పై దేర్ఘం గా ఆలోచించింది .నీగ్రోలకు హక్కులు ఇచ్చే చట్టం వచ్చింది కాని అందులో మహిళల గురించి లేదు మళ్ళీ ఉద్యమించి ఎలిజబెత్ తో కలిసి స్త్రీ లను సంఘటిత పరచి పోరాడింది .అల్బనిలో మహిళా వోటుహక్కు కోసం పోరాడింది .న్యూయార్క్ స్టేట్ లెజిస్లేచర్ లో మహిళా వోటుహక్కు బిల్లు పాస్ కాకుండా మగవారందరూ అడ్డుపడ్డారు .దీనితో బాగా కలత చెందింది సుసాన్ .

   సుసాన్ -‘’రివల్యూషన్ ‘’అనే వార్తా పత్రికకు సంపాదకత్వం చేసింది .  ఆ పత్రిక ద్వారా ఉద్యమాన్ని ఉత్తేజపరచింది .సహించలేని మగ పురుషులు పత్రికను సస్పెండ్ చేయించారు .అధైర్య పడలేదు సుసాన్ .పత్రిక కు ఉన్న పది వేల డాలర్ల అప్పును తన స్వంత డబ్బుతో తీర్చేసింది .ఈ కాలం లో తండ్రి వదిలిపెట్టిన కొద్ది ఆస్తితో జీవిక సాగించింది .1872ప్రెసిడెంట్ ఎన్నికలో వోటు వేసింది .రాజ్యాంగానికి విరుద్ధం గా వ్యవహరించినందుకు సుసాన్ పై నేరం మోపి వంద డాలర్ల జరిమానా విధించారు .వీలున్నప్పుడల్లా తన ‘’హిస్టరీ ఆఫ్ వుమెన్ సఫ్రేజ్ ‘’పుస్తకం రాసి మహా గ్రంధాన్ని పూర్తీ చేసింది .సుసాన్ ఉద్యమం ‘’నేషనల్ అమెరికన్ వుమన్ సఫ్రేజ్ అసోసియేషన్ ‘’గా రూపు మారింది .ఒక రకం గా సుసాన్ ‘’అమెరికా దేశం మనసును మార్చిన మహిళ’’(the woman who changed the mind of the Nation ‘’అని రేటా చైల్డ్ డోర్ర్ రాశాడు .

      యూరప్ వెళ్లి అక్కడా ప్రసిద్ధి చెందింది .అక్కడ మహిళా ఉద్యమం ప్రారంభ దశలో ఉంటె దాన్ని చైతన్య పరచి ముమేంటంతెచ్చింది సుసాన్ .డెబ్భై ఏళ్ళు మీదపడ్డాయి .సోదరి బలవంతం మీద రోచెస్టర్ లో ఆమెతో కలిసి ఉంది .రోచేస్టర్లోని ‘’పొలిటికల్ ఈక్వాలిటి లీగ్ ‘’ సుసాన్ కు  గృహాన్ని సమకూర్చి  ,ఆమె మహిళా సేవకు సార్ధకత చేకూర్చి గౌరవించారు .కాని నిరంతర ప్రయాణాలు సభలూ చర్చలతో గడిపే ఆమె అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు .ఎనభై వ ఏట వుమెన్ సఫ్రేజ్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా రిటైర్ అయింది .ఆమె జీవిత చరిత్ర పూర్తీ అయి ప్రచురణ పొందింది .అమెరికా మహిళలకు ఫెడరల్ రాజ్యాంగ సవరణ చేసి మాత్రమె వోటు హక్కు కల్పించాలని ,రాష్ట్రాల లెజిస్లేచర్ లలో కాదని స్పష్టం గా చెప్పింది .1904 లో ‘’ఇంటర్నేషనల్ వుమన్ సఫ్రేజ్ అలయన్స్ ‘’అనే సంస్థ ఏర్పడింది .ప్రపంచ మహిళలందరూ సుసాన్ తమ నాయకురాలు అని ఏకగ్రీవం గా తీర్మానించారు .చివరి సమావేశం లో మాట్లాడుతూ ‘’మన పోరాటం ఆగదు..అది ఆగకుండా చేయాల్సిన బాధ్యత మీ అందరిదీ .’’అని సందేశం ఇచ్చింది .86  వ  పుట్టిన రోజున వాషింగ్టన్ లో ఆమెకు సన్మానం చేశారు .పెద్ద డిన్నర్ ఇచ్చారు .అప్పుడు ‘’failure  is impossible ‘’అన్న మహా మంత్రాన్ని ఉపదేశించింది .అయినా విజయం రావటానికి ఇంకా చాలా కాలం నిరీక్షించాల్సి వచ్చింది దేశం .13-3-1906 న మహిళోద్యమ నాయకురాలు ,మహిళా సాధికార ఉద్యమ సారధి మరణించింది .అమెరికా పతాకం అవనత చేసి గౌరవించారు .’’the champion of a lost cause ‘’అని కీర్తించారు .ఆమె కోరిన మహిళా హక్కులన్నీ క్రమంగా తీరాయి .21-5-1919 అమెరికా ఫెడరల్ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం మహిళలకు సర్వ తంత్ర పౌరసత్వహక్కు ,లభించింది .ఈ సవరణకు ‘’సుసాన్ బి ఆంథోని అమెండ్ మెంట్ అని పేరు పెట్టి ప్రభుత్వం గౌరవించింది ఆ పోరాట యోదురాలిని .

మరొక ప్రముఖునితో కలుద్దాం.

Inline image 1  Inline image 2

    సశేషం

 మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -20-2-15- ఉయ్యూరు

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.