నిర్మాతలకు నిఘంటువు
- 20/02/2015
- – రాజేశ్వర ప్రసాద్
ఆయన చరిత్రను ఎటునుంచి ఎటు తిరగేసినా ఘనమైన అడుగులే కనిపిస్తాయి. మొక్కవోని దీక్షాదక్షతలు ప్రతి అడుగులోనూ కళ్లకు కడతాయి. నిర్మాత ఎంత బాధ్యతగా ఉండాలో తెలుసుకోవాలంటే రామానాయుడి జీవితాన్ని అధ్యయనం చేయాలి. కష్టమొచ్చినా నష్టమొచ్చినా కుంగిపోకుండా.. నిరంతరంగా వృత్తి ధర్మాన్ని నెరవేర్చుకుంటూ వెళ్లారు కాబట్టే చీకటిని వెన్నంటే వెలుగుంటుందన్నట్టుగా రామానాయుడి జీవితం వెండి వెలుగులే విరజిమ్మింది. ఆరు దశాబ్దాల పాటు ఎడతెగని రీతిలో సాగినన సినీ సుదీర్ఘ ప్రయాణంలో రామానాయుడు ఎన్నో మైలురాళ్లు అధిగమించారు. సినిమాను కొత్త పుంతలు తొక్కించారు. కథాపరంగా వైవిధ్యమంటే ఏమిటో ప్రేక్షకులకు రుచి చూపించారు. అందుకే.. ఆయన నిర్మాతలకు నిఘంటువు! తెలుగు సినిమాకు సంబంధించినంత వరకూ స్వర్ణయుగంగా పేర్కొనే అరవైయవ దశకంలోనే కారంచేడు కుర్రాడిలో సినీ కలలు మొదలయ్యాయి. అంతకుముందూ సినిమావాళ్లతో పరిచయాలున్నా.. మద్రాసు రావడం అన్నది అరవైయవ దశకం తొలి నాళ్లలోనే జరిగింది. జగ్గయ్య హీరోగా నిర్మితమైన అనురాగంతో నిర్మాతగా అడుగు పెట్టిన రామానాయుడికి ఎదో చేయాలన్న తపన బలంగా ఉండేది. తాను భిన్నంగా ఉండాలని, తను తీసే సినిమాలూ అదే స్థాయిలో ఉండాలన్న భావన మొదలైన ఆయన జీవితం అప్రతిహతంగానే సాగింది. అప్పట్లో పౌరాణికమైనా, జానపదమైనా ఎన్టీఆరే చిరునామాగా ఉన్న సమయంలో -షడ్రసోపేతమైన కథతో రాముడు-్భముడు నిర్మించారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఆ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది. అప్పట్లో అక్కినేని నటించిన డాక్టర్ చవ్రర్తితో పాటు రాముడు-్భముడు సినిమాను విడుదల చేయాలని రామానాయుడు సంకల్పించినా ఎన్టీఆర్ వద్దనడంతో అనంతరమే విడుదలై అఖండ విజయాన్ని సాధించింది. అక్కినేనితో సమానంగా ఎన్టీఆర్‌ను సాంఘిక సినిమా హీరోగా నిలబెట్టిన చిత్రం రాముడు-్భముడు. ఆ సినిమా ఘన విజయంతో రామానాయుడిలో నిర్మాతగా మరింత బాధ్యత పెరిగింది. ఎన్టీఆర్‌తోనే తొలి సినిమా విజయం సాధించడంతో ఆయన స్థాపించిన సురేష్ ప్రొడక్షన్స్‌కు విజయ, జగపతి వంటి బలమైన బ్యానర్ల సరసన స్థానం లభించింది. ఓ పక్క ఉత్తమాభిరుచి కలిగిన నిర్మాతగా ముద్రవేసుకున్న ఆయన తదుపరి తీసిన ప్రతి సినిమా విషయంలోనూ అంతే జాగ్రత్తపడ్డారు. నిర్మాత లేనిదే సినిమా లేదు. ఎంత పెద్ద హీరోకైనా తనను నమ్మే మంచి నిర్మాత దొరికితేనే రాణింపు ఉంటుంది. ఈ వాస్తవాన్ని ముందే గ్రహించిన రామానాయుడు తన సినిమాలకు కథలనే హీరోలుగా చేసుకున్నారు. హీరోలను అందులో పాత్ర దారులుగా మార్చారు. ఆయన ఇప్పటి వరకూ తీసిన 130 సినిమాలను లోతుగా గమనిస్తే నటీనటుల పాత్రోచిత ఎంపిక స్పష్టమవుతుంది. తెలుగైనా, హిందీ అయినా సరే మేలిమి బంగారం లాంటి కథలకే ఆయన ప్రాధాన్యతనిచ్చేవారు. ఇంటిల్లిపాదీ హాయిగా మూడు గంటల పాటు థియేటర్లలో కూర్చోగలిగే సినిమాలనే రామానాయుడు నిర్మించారు. 1960 నుంచి ప్రతి దశాబ్దంలోనూ విజయవంతమైన సినిమాలను బేరీజు వేసుకుంటే మొదటి పది సినిమాల్లో రామానాయుడి సురేష్ ప్రొడక్షన్స్ కనిపిస్తుంది. తాను పెద్ద నిర్మాతగా ఎదిగినా.. స్టార్లను ఉత్పత్తి చేసే స్టార్‌గా రాణించినా కూడా చిన్న హీరోలకు ఆయన నిత్యం బాసటగా ఉండేవారు. కొత్త వారితో సినిమాలు తీయాలన్నా, కొత్త తరహాలో ప్రయోగాలు చేయాలన్నా ఎంత మాత్రం వెనుదిరగని రామానాయుడు అనేక మందిని నిజంగా స్టార్లను చేశారు. కొత్త దర్శకులనూ పరిచయం చేశారు. వారందరూ కూడా అనంతర కాలంలో తమదైన ముద్రతో తెలుగు సినీ పరిశ్రమలో రాణించిన వారే కావడం తెలిసిందే. రామానాయుడి బ్యానర్‌లో పని చేయడం అంటే ప్రతి ఒక్కరికీ ఓ కలే కాదు సవాలు కూడా. ఎందుకంటే దర్శకులకు కథాపరంగా ఎంత స్వేచ్ఛనిస్తారో.. అనుకున్న విధంగా సన్నివేశాల చిత్రీకరణకు ఎంతటి వీలునిస్తారో.. వృధా వ్యయాన్ని అంతే సహించరు. నిర్మాత పదికాలాలపాటు ఉంటేనే పరిశ్రమలోని ప్రతి రంగం బతుకుతుందన్న భావనను తొలి నాళ్లలోనే వంటబట్టించుకున్నారు కాబట్టే డజన్ల సంఖ్యలో అన్ని భాషల్లోనూ అగ్ర హీరోలతో సినిమాలు నిర్మించగలిగారు. పెద్ద హీరోతో తీసినా, చిన్న హీరోతో నిర్మించినా రామానాయుడి సినిమాలన్నింటిలో రిచ్‌నెస్ కనిపిస్తుంది. సన్నివేశానికి అవసరమనుకుంటే ఎక్కడికైనా వెళ్లి అంత ఖర్చుతోనూ వాటిని రక్తికట్టించే మనస్తత్వం ఆయనది. ఇందుకు ఎన్నో ఉదంతాలున్నాయి. తన సినిమాల్లో నటించే ప్రతి ఒక్కరినీ కుటుంబ సభ్యుల్లా చూడటమే కాదు, షూటింగ్ పూర్తయ్యే వరకూ వారి అవసరాలన్నీ తీర్చే పెద్ద మనసు ఆయనది. పనివాడిలో పనివాడిగా నిర్మాతా పని చేయడం ఎక్కడా మనం చూడ లేదు. డబ్బు పెట్టేది తానేనైనప్పుడు పారితోషికాలు లేదా జీతాలు తీసుకుంటున్న వారితో కలిసి పని చేయడమేమిటన్న ఆలోచన రామానాయుడికి ఏ కోశానా ఉండేది కాదు. అందుకే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనమాయన. అందరికంటే ముందుగానే స్టూడియోకి వచ్చి షూటింగ్‌కు సంబంధించిన ప్రతి ప్రక్రియలోనూ మమేకం కావడం అన్నది తొలి సినిమా నుంచే రామానాయుడికి అబ్బింది. అదే అలవాటును చివరి వరకూ కొనసాగించి నిర్మాతలందరికీ ఓ పాఠంలా తన జీవితాన్ని మలచుకోగలిగారు. కష్టేఫలి అన్నట్టుగా ఆయన సినిమాలన్నీ కూడా దాదాపుగా ఘన విజయాన్ని సాధించినవే. హీరో ఎవరన్న మాటతో నిమిత్తం లేకుండా సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌కు అంతగా జనంలో గుర్తింపు తీసుకురాగలిగారు. తెలుగు, హిందీ భాషల్లోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడం, ఒరియా, పంజాబీ, బెంగాలీ వంటి ఎన్నో భాషల్లో సినిమాలు నిర్మించిన నిరుపమాన వ్యక్తి రామానాయుడు. భాష ఎదైనా మానవ నైజం ఒక్కటే. మంచి చెడుల సమ్మేళనమేనన్న వౌలిక అవగాహన కలిగిన వ్యక్తి కాబట్టే అన్ని భాషల్లోనూ నాయుడి సినిమాలు విజయఢంకా మోగించాయి. పెద్ద హీరోలుంటేనే సినిమాలు ఆడతాయని, జనం ఆదరిస్తారన్న భావనను రామానాయుడు చరమగీతం పాడారు. కథను బట్టే సినిమా ఉండాలి తప్ప హీరోనుబట్టి కాదని నిరూపించారు. అంతే కాదు సినిమా టైటిల్ కూడా హీరోయిజానికి అద్దం పట్టేదిగా ఉండాలన్న వాదననూ ఆయన ఒప్పుకునే వారు కాదు. కథను బట్టే టైటిల్ ఉండి తీరాల్సిందేనని పట్టుబట్టిన రామానాయుడి సినిమా టైటిల్స్‌ను చూస్తే ఈ వాస్తవం స్పష్టమవుతుంది. డాక్టర్ చవ్రర్తితో నవలా నాయకుడిగా తిరుగులేని ముద్ర వేసుకున్న అక్కినేనితో రామానాయుడి నిర్మించినన్ని నవలా సినిమాలు ఎవరూ నిర్మించలేదు. పట్టిందల్లా బంగారం అన్నట్టుగా అక్కినేని- సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలు ప్రేక్షకులకు కన్నుల పండువగానే ఉండేవి. ముఖ్యంగా నవలలను సినిమాలుగా మలచడంతో ఆరితేరిన దర్శకులనే ఎంపిక చేసుకునే రామానాయుడు ఆ నవలకు పూర్తి న్యాయం జరిగేలా నటీనటుల్ని ఎంపిక చేసుకునేవారు. ఈ విషయంలో ఏవిధంగానూ రాజీపడకుండా తాను అనుకున్నట్టుగా సినిమా పూర్తయ్యే వరకూ నిద్ర పోయేవారు కాదు. అందుకే తొలి సినిమా విజయాన్ని ఎన్టీఆర్‌తోనే సాధించినా అనంతరం రెండు మూడు సినిమాలను మాత్రమే ఆయనతో రామానాయుడు నిర్మించారు. శ్రీకృష్ణతులాభారం పౌరాణిక సినిమాల నిర్మాణ తీరుతెన్నుల్నే మార్చేసింది. పౌరాణికం అన్న అద్భుత భావనకు అద్దం పట్టేలా ఆ సినిమాను నిర్మించిన తీరు అద్భుతమే. అప్పట్లో ఎన్టీఆర్‌తో సమానంగా జానపదాల్లో రాణిస్తున్న కాంతారావుతో ప్రతిజ్ఞాపాలన తీశారు. అది కూడా జానపద సినిమా నిర్మాణంలో కొత్త ప్రమాణాలను పాదుగొల్పింది. కృష్ణ, కాంతారావు హీరోలుగా బొమ్మలు చెప్పిన కథ అనే మరో వినూత్మ జానపద సినిమానూ తీశారు. వీటన్నింటికంటే కూడా నవలా కథానాయుడిగా తనకు తానే సాటి అనిపించుకున్న అక్కినేనితో ఎన్నో ఎనె్నన్నో విజయవంతమైన సినిమాలు తీయడం సురేష్ బ్యానర్ ఇమేజ్‌ను పెంచడంతోపాటు నిర్మాతగా రామానాయుడి స్థాయినీ అమాంతం పెంచేసింది. ఈ తరహా సినిమాల్లో ఆణిముత్యం ప్రేమ్‌నగర్.. ఈ సినిమా రిచ్‌నెస్‌కు కొలమానమైతే.. అక్కినేని నట వైభవానికి నిదర్శనం. వాణిశ్రీ నవలా కథానాయికగా సినీ చరిత్రలో నిలిచిపోవడానికి దోహదం చేసింది కూడా ఆ సినిమానే! అనంతర కాలంలో చక్రవాకం, సెక్రటరీ వంటి సినిమాలూ రామానాయుడికి ఎనలేని ఖ్యాతిని తెచ్చాయి. అక్కినేనితోపాటే అప్పటి వర్థమాన హీరో శోభన్‌బాబుకు కూడా స్టార్ ఇమేజ్‌ను తీసుకొచ్చిన ఘనత రామానాయుడిదే. చక్రవాకం విజయంతో శోభన్ ఆగ్రనటుడైపోయారు. అనంతరం సురేష్ బ్యానర్‌పై ఆయన నటించిన సినిమాలన్నీ కూడా ఘన విజయం సాధించినవే. డబ్బు ఖర్చుపెట్టడమే కాదు, సార్థకమయ్యేలా చేయడంలోనే విజయం ఉంటుందని భావించిన నిర్మాత కాబట్టే రామానాయుడి సినీ జీవితం నిర్మాతకు నిత్య సోపానం. జయమైనా, అపజయమైనా కూడా నిలదొక్కుకోగలిగిన వాడే పదికాలాలపాటు రాణిస్తారని చెప్పడానికీ.. హీరోను కాకుండా కథను నమ్ముకున్నవాడే నిలబడతాడనడానికీ ఈ సురేష్ ప్రొడక్షన్స్ అధినేత జీవితంలోని ప్రతి పేజీ అక్షర సత్యం. అందుకే ఆయన నిర్మాతలకు నిఘంటువు. ఆయన జీవితంలోని ప్రతి పేజీలోనూ క్రమశిక్షణకు నిర్వచనం కనిపిస్తుంది. నిబద్ధతకు అర్థం తెలుస్తుంది. అన్నింటి కంటేమించి చిన్ని చిన్ని అడుగులతో ఓ మహా ప్రయాణాన్ని ఆద్యంతం ఎలా ధీమాతో సాగించాలో కళ్లకు కడుతుంది.

