గీర్వాణ కవుల కవితా గీర్వాణం -2
207-కోసల భోసలీయం కర్త -శేషాచలపతికవి
తన ఆరుకాడల ‘’కోసల భోసలీయం ‘’కావ్యం లో శేశాచలపతికవి షాహాజీ రాజు చరిత్రను రామ కద తో జోడించి ద్వ్యర్దికావ్యం గా చెప్పాడు .నైద్రువ కాశ్యప గోత్రానికి చెందిన వేంకటేశ కవి ‘’భోసల వంశావళి ‘’చంపు కావ్యం లో శరభోజి రాజు పూర్వీకుల చరిత్ర వర్ణించాడు .శరభోజి పాలనపై మరింత వెలుగులు కుమ్మరి౦చాడు .1722లో కావాల కుటుంబానికి చెందినా శ్రీనివాసుని కొడుకు జగన్నాధకవి ‘’శరభ రాజ విలాసం ‘’,’’అనంగ విజయ భాణం’’,’’శృంగార తరంగిణి ‘’రచించాడు .
208మహిష శతకం రాసిన -వంచేశ్వర కవి
గోవింద దీక్షితుని వారసుడు వంచేశ్వరుడు భోసల కుటుంబానికి చెందినవాడు తుక్కోజి మహారాజుకు 1728-1735 మంత్రిగా ఉండేవాడు .ఇతను రాసిన ‘’మహిష శతకం ‘’హాస్య ప్రాదాన్యమైనది .రాజును పొగుడుతూ తిడుతూ దున్నపోతుగా అభివర్ణిస్తూ నిందా స్తుతిగా దీన్ని రాశాడు .శరభోజి కాలం లో సదాజీ కవి ‘’సాహిత్య మంజూష ‘’ను1825లో రాసి శివాజీ వంశ ఔన్నత్యాన్ని కీర్తించాడు. 1833-1855కాలపు శివాజీ రాజు కాలం లో ఈశ్వరుని కొడుకు వీర రాఘవకవి ‘’వల్లీ పరిణయ ‘’నాటకం రచించాడు .
209-త్రయంబక కుటుంబ కవులు
ఏకోజిమహా రాజ కుటుంబం దక్షిణ భారత దేశం లోనాయక రాజులు ప్రారంభించిన సంస్కృత భాషా వ్యాప్తికి అవిరళ కృషి చేశారు . రాజులు మంత్రులు కూడా కవులే కావటం అదృష్టం .మంత్రులు త్రయంబక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినవారే కావటమూ కలిసొచ్చింది .గంగాధరకవి ‘’భోసల వాంశావలి ‘’లో భోసల రాజుల చరిత్ర వర్ణించాడు .రెండవ త్ర్యంబకుడు ‘’ధర్మ కూట ‘’అనే వ్యాఖ్యానాన్ని రామాయణం పై రాశాడు .భగవంతకవి ‘’ముకుంద వల్లీశ ‘’కావ్యం పదికా౦ డల్లో శ్రీ కృష్ణునిపై రాశాడు ’.ఇతడే ‘’రాఘవాభ్యుదయం ‘’నాటకం కూడా రాశాడు .భగవంతకవి గంగాధరాధ్వరికొడుకు ,త్ర్యంబకునిడికి చివరి తమ్ముడు .ఉత్తర రామాయణం ఆధారంగా’’ ఉత్తర చంపు’’ రాశాడు .ఆనంద లేక ఆనంద రాయ మఖి ‘’విద్యా పరిణయం ‘’జీవానందం ‘’అనే రెండు నాటకాలను ప్రబోధ చంద్రోదయం లాగానర్మగర్భం గా రాశాడు .మొదటి దానిలో జీవాత్మ వివాహం ఉంది .విద్య అంటే ఆధ్యాత్మిక విద్య గా భావించి రాశాడు .నృసిమ్హుని కుమారుడు ఆనందకవి ‘’త్రిపురా విజయ చంపు ‘’రచించాడు .ఈ విధం గా త్ర్యంబకుని కుటుంబం వారు అందరూ గొప్ప కవులై గీర్వాణ రచన చేశారు .
210-ఆర్యకుడనే ఘనశ్యామకవి
కమలా కాశీ మహా దేవుల పుత్రుడు ఘనశ్యామకవిని ఆర్యకుడు అంటారు .ఇతనిది మౌన భార్గవ కుటుంబం .ఇతని సోదరుడు ఈశుడు చిదంబర గురువు వద్ద దీక్ష పొంది దేవి పట్నం లో ఉండిపోయాడు .తాత చౌండ బాలాజీ .తల్లి తండ్రి తిమ్మాజీ బాలాజీ కి ‘’శాకమ్బరీ పరమ హంస ‘’బిరుదు ఉంది .
శ్యామకవి కి ఇతని ఇద్దరు భార్యలుసుందరి ,కమల,. వీరు గొప్ప విదుషీ మణులై ‘’విద్ధ సాల భంజిక’’ కు వ్యాఖ్యానం రాశారు . దానినే మూడు గంటల్లో రాసేశాడుమనకవి . .సాహిత్యం లోనేకాక రాజకీయం లోను నిష్ణాతుడు .తంజావూర్ రాజు తుక్కోజి దగ్గర మంత్రిగా 1728-35మధ్యకాలం లో ఉన్నాడు .
ఇరవై రెండవ ఏట ‘’నవగ్రహ చరిత్ర ‘ను ప్రాకృతం లో ను ’ ఇరవై ఆరవ ఏట ‘’మదన సంజీవన భాణం’’ రాశాడు ఒక్క రాత్రి లో ఉత్తరరామ చరితం పై ‘’శ్రీరామ నవమి’’ వ్యాఖ్య రాశాడు .’’ప్రచండ రాభ్యుదయం ‘’అనే మార్మిక కావ్యం రచించాడు .మొత్తం మీద 64సంస్కృత రచనలు ,20ప్రాకృత రచనలు చేశాడు .ఇవికాక ఇతరభాషలలో ఇరవై అయిదు గ్రంధాలు రాశాడు .అతని ప్రముఖ కావ్యాలు ‘’భగవత్పాద చరిత్ర ‘’,’’వేంకటేశ చరిత్ర ‘’,ప్రసంగా లీలార్నవం ‘’,సన్మణి మండనం ‘’,అన్యాప దేశ శతకం ‘’.అయిదు స్థల మహాత్మ్యాలు రాశాడు ‘’అబోదాకరణ ‘’అనే త్ర్యర్ది కావ్యం రాశాడు .ఇందులో నల కృష్ణ హరిశ్చంద్ర కధలున్నాయి .సంస్కృత ప్రాక్రుతాలలో ‘’కలిదూషణం ‘’రాశాడు .
బాల్యం లోనే పన్నెండవ ఏట భోజ చంపువు కు ‘’యుద్ధ కాండ ‘’రాశాడు .రాసిన అనేక నాటకాలలో గణేశ చరిత్ర ,మదన సంజీవన ,కుమారవిజయం ,అనుభవ చింతామణి ఆనంద సుందరి ప్రముఖమైనవి .’’రసార్ణవం ‘’అనే అలంకార గ్రంధం రాశాడు .శాకుంతల ఉత్తర రామ చరిత్ర ప్రబోధ చంద్రోదయం ,చండ కౌశిక ,మహా వీర చరిత్ర ,వేణి సంహారం ,హాలసాప్త సహ్తి ,విక్రమోర్వశీయం భోజ చంపు ,నీల కంఠ చంపు భర్త్రు చంపు ,కవి రాక్షసం ,కాదంబరి ,వాసవ దత్త ,దశ కుమార చరిత్ర లకు గొప్ప వ్యాఖ్యానాలు రచించాడు .
ఇతని కుమారుడు చంద్రశేఖరుడుతండ్రి రాసిన ‘’డమరుకం ‘’పై వ్యాఖ్య రాశాడు .ఇది చాలా విలక్షణమైనది పది అలంకారాలలో ,పదిరకాల విషయాలతో,తీర్చి దిద్దాడు .రెండవ కొడుకు గుడ్డివాడైన గోవర్ధనుడు ‘’ఘట కర్పకుని ‘’పై మహా వ్యాఖ్యానం రాస్తూ తన తండ్రి ఘన శ్యాముని కవితా రీతినిశ్లాఘించాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -1-8-15 ఉయ్యూరు
,
ఆర్యకుడనే ఘనశ్యామకవి గురించి మీరు వ్రాశారు. చాలా చక్కగా ఉంది. ఈ కవి గురించి సశేషం అని ఉంది. వీరి గురించి మరిన్ని విషయాలు ఉంటే పంపించగలరు. ఘనశ్యామకవి ప్రచండరాహూదయం అనే నాటకాన్ని వ్రాశారు. దాన్ని నేను చదివాను. దయచేసి మీకు తెలిసిన మరిన్ని వివరాలు పంపగలరు.