ఆధునిక ప్రపంచ నిర్మాతలు –జీవితాలలో చీకటి వెలుగులు -73
31-స్పష్టమైన వినిమయం కోసం నినదించిన అమెరికా ఆర్ధిక వేత్త –ధార్ స్టెయిన్ వెబ్లెన్-1
థార్ స్టెయిన్ బుండే వెబ్లెన్ 30-7-1857న అమెరికాలోని విస్కాన్సిన్ ఫారం లో పన్నెండుడుగురు సంతానం లో ఆరవ వాడుగా పుట్టాడు .తలిదంద్రులిద్దరూ నార్వేజియన్ ప్రవాసీయులే .తండ్రి కార్పెంటర్ .వ్యవసాయ దారుడుకూడా .కాని దీనికి ఇస్టపడడు..మిగిలిన రైతుల్లాకాకుండా మగ పిల్లలతో బాటు ఆడపిల్లల్నీ కాలేజి లో చేర్పించాడు .కుటుంబం మిన్నేసోటాకు మారింది .అప్పటికే ఎనిమిదేళ్ళ వెబ్లెన్ ఇంగ్లీష్ లోకాకుండా నార్వేజియన్ భాషలో నే మాట్లాడేవాడు .ఇంగ్లీష్ అతనికి ‘’విదేశీ భాష ‘’అని పించింది .వెబ్లెన్ కుటుంబీకులు వ్యవసాయ క్షేత్రం లోనే పెరిగినా ,పల్లెటూరి రైతులను పీడించే నగర వ్యాపార వేత్తల మధ్య తగాదాలలో భాగ స్వాములయ్యేవారు .పదిహేడవ ఏట వెబ్లెన్ ను తండ్రి నార్త్ ఫీల్డ్ లోని చార్లేటాన్ లో ఉన్న ఒక చిన్న మత శాస్త్రం బోధించే సంస్థ కు పంపాడు .ఇక్కడ మూడేళ్ళు ,కాలేజిలో మూడేళ్ళు చదివాడు.ఫిలాసఫీ లో బాగా రాణించినా అతనికి ఫైలాలజి అంటే భాషా తత్వశాస్త్రం ,బయాలజీ ,ఆర్ధికశాస్త్రం లపై అభిరుచి ఏర్పడింది .ఇరవైమూడేళ్ళ గ్రాడ్యుయేట్ అయ్యాడు .జాన్ హాప్కిన్ కు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం వెళ్ళాడు .అక్కడనుండి ఏల్ యూనివర్సిటికి బదిలీ చేయబడి పిహెచ్ డి ని 27ఏళ్ళకే పొందాడు .
ఏల్ లో ఉండగానే భవిష్యత్తుగురించి ఆలోచించాడు .టీచింగ్ లో చేరాలనుకొన్నాడు .కాని ఇతని నార్వేజియన్ ఇంగ్లీష్ ,దు౦దుడుకు స్వభావం ,లెక్కలేని తనం ,మూర్ఖత్వం అతని ఉద్యోగానికి అడ్డుగోడలైనిలిచాయి .చేసేది లేక మళ్ళీ మిన్నెసోటా చేరి వ్యవసాయం చేస్తూ చార్లేటాన్ కాలేజి ప్రెసిడెంట్ కూతురు ఎల్లెన్ రోల్ఫ్ ను పెళ్లి చేసుకొన్నాడు .ఏడేళ్ళు ఇక్కడే ఆశగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ తండ్రితో దీర్ఘ సంభాషణలు చేస్తూ ,పుస్తకాలు చదువుతూ గడిపాడు .వెబ్లెన్ కంటే అతని కుటుంబమే ఎక్కువ కలత చెందింది .ఎన్నో కౌన్సెలింగ్ లు ఇచ్చారు బాగుపడతాడేమోననే ఆశతో .చివరికి ఆతను ఆర్ధిక రంగం లో విజయ౦ సాధిస్తాడని నమ్మకం కలిగింది .ఫిలాసఫర్ గా కంటే ఎకనామిస్ట్ గా రాణించ గలననే నమ్మకంతో ‘’కార్నెల్ ‘’కు వెళ్ళాడు .
ముప్ఫై అయిదేళ్ళ వయసులో వెబ్లెన్ సాధారణ కూలీ కోటు ,ముతకనూలు ట్రౌజర్లు,కూన స్కిన్ కాప్ తో ఎకనామిక్స్ ప్రొఫెసర్ ప్రోఫెసర్ లారెన్స్ లాఫ్లిన్ ఆఫీస్సులో అడుగుపెట్టి ‘’నేను థార్ స్టెయిన్ వెబ్లెన్ ‘’అని పరిచయం చేసుకొన్నాడు .అతని సూటితనం గాంభీర్యం లకు ముచ్చటపడి లాఫ్లిన్ కార్నెల్ లో ఫెలోషిప్ ఇచ్చాడు .చికాగో లో కొత్తగా ప్రారంభించే యూని వర్సిటి లో చేరబోతూ తనతోబాటు వెబ్లెన్ ను కూడా తీసుకొని వెళ్ళాడు .అక్కడ టీచింగ్ ఫెలో గా ఏడాదికి 520డాలర్ల జీతం తో చేరాడు .నలభై ఆరవ ఏట జీతం వెయ్యి డాలర్లు అయింది .చికాగో లో అనేకమంది ప్రముఖులతో పరిచయమేర్పడింది .కాని వారికి దూరం గా ఒంటరిగా ఉండేవాడు .బోధనపై విసుగూకలిగింది .రొటీన్ జీవితం పరమ బోర్ అనిపించింది .మెటీరియల్ లేబర్ లోని నాణ్యతపై పేపర్లు రాశాడు .డ్రెస్ విషయం లో పొదుపు ,క్లాస్ లలో ఎకనామిక్స్ ను బోధించటం లో రావాల్సిన సమూలమైన మార్పులు అన్నిటిపై ఆచరణాత్మకమైన విధానాలు రాసేవాడు .ఇంతగా రాసినా నలభై రెండవ సంవత్సరం వరకు వెబ్లెన్ గురించి పబ్లిక్ కు ఏమీ తెలియదు .1899లో వెబ్లెన్ మొదటి పుస్తకం ‘’ది తీరీ ఆఫ్ ది లీజర్ క్లాస్ ‘’రాసి ప్రచురించాడు .
ఆ తర్వాత ఒక డజన్ దాకా పుస్తకాలు రాసినా ఈ పుస్తకానికొచ్చిన పేరు దేనికీ రాలేదు .ఇందులో ధనాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ,ధనవంతుల వెంట మధ్యతరగతి వాళ్ళు ఎందుకు వ్యామోహం చూపిస్తున్నారో పూర్తిగా వివరించాడు .చాలా స్పష్టమైన సాదారణ భాషలో రాయటం దీనికి ప్లస్ పాయింట్ అయింది .అతని ‘’conspicuous consumption’’అంటే స్పష్టమైన వినిమయ విధానం అందరిని ఆకర్షించింది .డబ్బును కాలాన్ని ,ప్రయత్నాలను దుబారాగా ఖర్చు చేయటం పై తీవ్రంగా విరుచుకు పడ్డాడు .అమెరికా చరిత్రలో ఏ రచయితా అంతకు ముందు ఎప్పుడూ అమెరికా ధనవంతులు తెలివితక్కువగా ప్రిస్టేజ్ ని కొనుక్కోవటానికి డబ్బును ప్రవాహం లా ఖర్చు చేయటం పై రాయలేదు .అలా రాసి మేల్కొలిపిన మొదటి వ్యక్తీ వెబ్లెన్ అయ్యాడు .ఒక ఫ్రాన్స్ రాజు సమావేశాలకు తానూ కూర్చునే సీట్ కోసం ఎంతో డబ్బు వృధా చేయటం ,క్రిస్టియన్ మతగురువుల ఆశీస్సు అభిమానం పొందటం పైనా చెలరేగి రాశాడు .
ఈ పుస్తకానికి సీక్వెల్ గా అయిదేళ్ళ తర్వాత ‘ది తీరీ ఆఫ్ బిజినెస్ ఎంటర్ ప్రైజెస్ ‘’రాశాడు వెబ్లెన్ .ఇందులో బడా పారిశ్రామిక వేత్తలు డబ్బును కూడబెట్టుకోవాటానికి ,అధికారం పొందటానికి తాపత్రయ పడుతున్నారని ఇదివారి వ్యాపరలక్షణానికి శత్రువు అని నిర్మొహమాటంగా చెప్పాడు .విలువల తో కాక సరుకుల నాణ్యత తోకాక వస్తువుల రేట్ల తో ,ధనసంపాదన చేయటం హేయం అన్నాడు .లాభాపేక్షతో ఉత్పత్తిని ద్వంసం చేస్స్తున్నారని ,సామాన్యునికి అండగా నిలబడకుండా వాళ్ళ అమాయకత్వంతో వ్యాపారం చేసి లాభ పడుతున్నారని ఆక్షేపించాడు .దీనికోసం సమాజం లోని ఇంజినీర్లతో ఒక కొత్త కంట్రోల్ విధానం అమలు చేయాలని కోరాడు .యంత్రానికున్న సాంఘిక ఉపయోగాన్ని అందరి దృష్టికి తెచ్చాడు .
వెబ్లెన్ అభిప్రాయాలకు అవాక్కయ్యారు బడా బిజినెస్ మెన్ లతోబాటు యూని వర్సిటి ట్రస్టీలు కూడా వెబ్లెన్ ఆలోచనలు చాలా ప్రమాదకరం అని ఎలుగెత్తి చాటారు .దీనికి తోడు అతని ప్రైవేట్ జీవితమూ ఒడిదుడుకుల పాలైంది .భార్య అనేకసార్లు వదిలి పెట్టి వెళ్ళింది .కొన్ని అభూతకల్పనలూ వచ్చాయి ఒక పేపరు ఆతను ఒకమ్మాయితో అట్లాంటిక్ లో ఉండటం చూశానని కధనం అల్లింది .తిరిగి వచ్చాక రాజీనామా చేయమనే ఒత్తిడి పెరిగింది .అప్పటికే వయసు నలభై తొమ్మిది .లేలాండ్ స్టాన్ఫోర్డ్ వెళ్లి మూడేళ్ళున్నాడు .అందం ,ఆకర్షణ ఉండటం తో ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలు వెబ్లెన్ అంటే వ్యామోహం తో వెంటపడేవారు .తప్పించు కోలేక పోయేవాడు .అదీ అతని పరిస్తితి .అతనిపై స్కాన్దల్స్ ప్రచారం జోరై పోయింది .
వీటిని తప్పించుకోవటానికి ఒక మౌంటేన్ కాబిన్ లో ఉన్నాడు .కావాల్సిన ఫర్నిచర్ తనకు తోచినట్లుగా ముతకగా తయారు చేసుకొన్నాడు డ్రెస్ విషయం లో లో శ్రద్ధ చూపించలేదు. ఏది దొరికితే దాన్నే ధరించాడు .సూట్ లకు ఇస్త్రీ లేదు ‘’చెంబు ఇస్త్రీ’’ తప్ప’.కోట్ బటన్ ఊడితే సేఫ్టి పిన్ పెట్టు కొనేవాడు .సగం జుట్టుతెల్లబడి రంగులేనిదైనది .గడ్డం గీయటం మీసం దువ్వటం లేనేలేవు .ముఖం పై ముడుతలు మరీ వయసు మీద పడేట్లు చేసింది .56 ఏళ్ళకే ముసలివాడైపోయాడు .స్నేహితుడు హెర్బర్ట్ డావెన్ పోర్ట్ ప్రోద్బలం తో మిస్సోరీ యూని వర్సిటి కి వెళ్ళాడు ఆర్ధిక వేత్త వెబ్లెన్ .
1911లో భార్య పూర్తిగా విడాకు లిచ్చి వదిలేసి వెళ్ళిపోయింది .ఏడేళ్ళు మిస్సోరీ లో ఉన్నాడు .క్లాసులకు క్రమం తప్పకుండా వెళ్ళేవాడుకాని ఇష్టం తో బోధించ లేక పోయేవాడు .స్నేహితుడు డేవేన్ పోర్ట్ సెల్లార్ లో కాలమంతా ఏదో రాస్తూ గడిపేవాడు .ఉద్యోగ జీవితం ఉపయోగపడకపోయినా ఒక కొత్త పుస్తకం ‘’ది హయ్యర్ లెర్నింగ్ ఇన్ అమెరికా ‘’రాశాడు .దీనికి టాగ్ గా’’ఏ స్టడీ ఇన్ టోటల్ డేప్రేవిటి’’(పూర్తీ భ్రస్టత్వ౦లో అధ్యయనం )అని పెడదామనుకొన్నాడుకాని చివరికి తానే వెనకి తగ్గి ఆ టాగ్ తగిలించలేదు .ఇందులో పిరికి కాలేజి ప్రెసి డెంట్ లు ,టీచర్లు ,డబ్బుకోసమే ఉండే ట్రస్టీలు గురించి ఏకేశాడు ., అమెరికా లో ఉన్నధైర్యవంతులైన అన్వేషకులు ,ఇంజినీర్లు గురించి పూర్తిగా చర్చించాడు .అమెరికా యూని వర్సిటి బోర్డ్ ప్రెసిడెంట్ లుపక్కా బిజినెస్ మెన్ అని ,కనసర్వేటివ్ దృక్పధం ఉన్నవాళ్ళని ఎత్తి చూపించాడు .ఇలాంటి వారితో కూరుకుపోయిన యూని వర్సిటీలు సామాన్యులకు ఏమీ చేయలేకపోయాయని ఆవేదన చెందాడు .
మిస్సోరీ లో ఉండగానే వెబ్లెన్ ‘’the instinct of Workmanship ,imperial Germany and the industrial revolution, an enquiry into the nature of peace and the terms of its perpetuation ,the vested interests and the state of the industrial art ‘’మొదలైన గ్రంధాలు రాసిప్రచురించాడు .వీటిలో తీవ్రమైన అధ్యయనం ,వ్యంగ్యం కనిపిస్తాయి .యాభై ఏడేళ్లకు మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు .రెండోభార్య మొదట్లో బాగానే ఉన్నా తర్వాత మతి స్తిమితం కోల్పోయి శరణాలయం లో ఉంచాల్సి వచ్చింది .మళ్ళీ ఎదురు దెబ్బలు ,వెనకడుగులు తప్పలేదు .మొదటి ప్రపంచ యుద్ధకాలం లో ‘’యాన్ ఎంక్వైరీ ఇంటూ ది నేచర్ ఆఫ్ పీస్ ‘’పుస్తకం వెలువడింది .సమయానికి తగిన రచనగా గుర్తింపు పొంది మంచి పేరు తెచ్చింది .ప్రొఫెషనల్ రాజకీయ వేత్తలు ఏ విధంగా నిజమైన దేశ భక్తిని స్వలాభానికి వాడుకొంటారో వివరించాడు .అంతర్జాతీయంగా మంచి గుర్తింపు వచ్చినప్పటికీ ఏ పబ్లిషర్ కూడా ప్రింట్ చేయటానికి ముందుకు రాకపోతె వేబ్లెన్ 700డాలర్లు చేతి చమురు వదిలించుకొని ముద్రించాడు .తర్వాత అయిస్ లాండ్ దేశీయుల ‘’లాక్స్ డేలా సాగా ‘’అనే మధ్యుయుగ ఇతిహాసకావ్యాన్ని (ఎపిక్ )ఆంగ్లం లోకి అనువాదం చేసి ప్రచురించి మళ్ళీ ప్రవాసానికి వెళ్ళిపోయాడు .
సశేషం
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ -7-10-15-ఉయ్యూరు

