చేతులు కాలక ముందే(కవిత) – శీలా సుభద్రాదేవి
అమ్మ బొజ్జలో నుండి బయట పడుతున్నప్పుడే
ఒక పిడికిట్లో జీవితాన్ని
మరో పిడికిట్లో ఆశల్నీ
భద్రంగా బిగించి పట్టుకొంటుంది పసికందు
ఎప్పుడో తనకి తెలీకుండానే
చేతినుండి జారవిడుచుకొన్న జీవితం
క్రమక్రమంగా మరొకరి అధీనంలోకి పోతుంది
ఆశలూ అంతే !
స్వంత జీవితం , స్వంత ఆలోచనలూ లేనిదైపోతూ
తనది కాకుండా మిగిలిపోతుందని తెలిస్తే
పిడికిలి విప్పెదికాదేమో
ఇప్పుడు ఎంత భద్రంగా దోసిట్లో బంధించి
తనదైన జీవితాన్ని గుండెల్లో దాచేసుకుందా మనుకొన్నా
వేళ్ళ సందుల్లోంచి జారిపోతూనే ఉంటుంది
మనిషి సంఘజీవికదా
సాంప్రదాయాలూ సాంఘిక వలయాలతో
మన చుట్టూ కంచెల్ని బిగిస్తూనే ఉంటుంది సంఘం
జీవించాలనుకోవటం వేరు
జీవించటం వేరు
జీవన విధానంలోనే మనసు వికసితం అవుతుంది
సమస్యల ముళ్ళ తీగల మధ్య నుండి
గాయపడకుండా నడవటంలోనే –
ఆర్ధిక సుడిగుండాల మధ్య కూరుకుపోకుండా
ప్రణాళిక బద్ధంగా బతకటంలోనే –
మనసును మండించే మూఢ నమ్మకాల జ్వాలల్లో నడుస్తూ
వ్యక్తిత్వం బయటపడుతుంది
అమూల్యమైన జీవితాన్ని
ఆరుబయట సుడి గాలుల పాల్చేసి
కన్నుమలిగే క్షణం లో ఎంత దుఃఖిస్తే మాత్రం
మిగిలేది శూన్యమే
– శీలా సుభద్రా దేవి
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

