మత్స్వప్నః (నా కల )బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రి గారు-14 (చివరిభాగం ).
169-‘’మాత స్మేరే విస్మరా స్మత్స్మి తాంకం-వ్యాస స్వామీ నోచి వానత్ర దోషం
మాతుర్వత్స స్యాపి మధ్యే క్వ దోషః –దోషా దోషా ప్రార్ధయామి ప్రసీద ‘’
తా-ముసి ముసి నవ్వులు నవ్వే తల్లీ !నేను ఇదివరకు నవ్విన నవ్వు అనే కళంకాన్ని వాత్సల్యం తో తొలగించు .మర్చి పో.వ్యాసస్వామి కూడా నా నవ్వు విషయాన్ని పెద్దగా పట్టించు కోలేదు .దోషమనీ అనలేదు .
17౦-‘’నిశ్వాసోచ్హ్వా సస్థ సో హంత యా వా –హంసత్వేనా ప్యాంత రస్థేన హార్దాత్
బాహ్యే హాంసే మండలేవా హ మస్మి –త్యాలంబ్యా బత్వా ముపాసేన యస్వ ‘’
తా-ఉచ్వాస నిశ్వాసాల కు ఆధారమైన’’ హంస’’ భావం తో కాని ,హృదయం మధ్యలో ఉన్న’’ హంస మండలం నేను’’ అనే ‘’ హార్దో పాసన’’ అనుసరించి కాని ,బయట అందరికి ప్రత్యక్షం గా కనిపించే సూర్య మండలం లోని ‘’సోహం ‘’భావం తో కాని ,శ్రుతిని అనుసరించికాని ,ఏదో ఒక మతాన్ని అనుసరించికాని నిన్ను ఉపాసిస్తాను .దేనికి నేను అర్హుడినో ఆ స్థితి ని నాకు కలిగించు
171-‘’హస్తే కృత్వా త్వం చి౦తితం భ్రామ యస్యే-తల్లోకానీక౦ చితంచా చితంచ
త్వం చిద్వా చిద్వేతి జానాతి కోవా –యోజానీయా త్సో పితా దృక్త్వ మేతి’’
తా-అమ్మా !చిద్రూపాన్ని చేతిలో పెట్టుకొని ,జడం ,అజడం అయిన లోక జాలాన్ని అంతా ఆడిస్తున్నావు .ఈ ఆటలో నువ్వు ఏ రూపం లో ఉంటావో తెలుసుకోవటం కష్టం .
172-.’’జాగ్రన్మానేన ప్రమాణ ప్రమేయ-ప్రఖ్యాతే ధ్వన్యాస్థితా దుర్ల భాసి
స్వప్నే దృష్టాం కో వనిర్ణే తు మీశో –యద్వా తద్వా కుర్వనీశం త్వమీశా ‘’
తా-లోక దృష్టిలో మెలకువ స్థితిలో ప్రమాణ ,ప్రమేయ రూపం గా ప్రసిద్ధమార్గం లో ప్రత్యక్షంగా కనిపిస్తూ కూడా ,చేరటానికి శక్యం కాని దానివై ఉంటావు .కలలో కన్పించిన నిన్ను ,నీ స్వరూపాన్ని వర్ణించటం ఎవరి సాధ్యం ?అసమర్ధుడైన నన్ను ,సమర్దురాలవైన నువ్వు అటో ఇటో ఏదో ఒక గమ్య స్థానానికి చేర్చు జగన్మాతా !
173-‘’వేదే శాస్త్రే సత్పురాణేతిహాసే –ప్రఖ్యాతేధ్వన్యార్య జుస్టే వసామి
కాంచీ పీఠ స్వామిభి శ్చంద్రశీర్షై –రాదిస్టే ప్రాప్తే సమాధౌ క్షణేన’’
తా-వేద,శాస్త్ర ,ఇతిహాస ,పురాణాలలో ప్రసిద్ధమైన మార్గం లో ఆర్యజనుల చేత సేవింప బడే ప్రముఖ కాంచీ పీఠంలో నెలకొని ఉన్న శ్రీ శ్రీ శ్రీ చంద్ర శేఖరేంద్ర సరస్వతీ స్వాముల వారిచే ఆదేశింప బడి ,పుణ్య వశం తో క్షణిక సమాధిలో’’ నేను నేనై’’ ఉంటాను .
174-‘’యస్యాం కస్యాం వా సృతౌ సంప్రవర్తే-మా మీక్షస్వ స్వాను కంపా ద్రుశాంబ
పాపం పుణ్యం మేస్తు ,వామాస్తువాహం –యావత్సత్యే బ్ధౌ నిమజ్జామి తావత్ ‘’
తా-నీ బిడ్డనైన నన్ను చూసుకొనే భారం నీదే .పుణ్య పాపాల చింత నాకు లేదు .నీ అండ ఉంటె సత్య సముద్రం లో మునిగే సత్య వస్తువుకు పాపపుణ్యాలుండవు .మాయికానికి ఉంటె ఉండనీ నాకేం ?
175-మాతర్దేవి వ్యాస మౌనిన్ క్షమద్వం –ఏతా వంతం కాల మస్మన్నిబంధం
వాచాలత్వం సన్నిధౌ వామ పీదం-వాత్సల్యా ద్వాం స్వ ప్రతిస్టో హ్యసాని ‘’
తా-తల్లీ దేవ దేవీ ! ఓ మహామౌనీ వ్యాసర్షీ ! అల్పుడనైన నేను ఇంత సేపు మిమ్మల్ని నిలబెట్టటం ,మీ సాన్నిద్యం లో నానోటికొచ్చి౦దల్లా వాగటం చెసిన౦దుకు ఇద్దరూ నన్నుముందుగా క్షమించండి .మీకు నేనేం సమర్పించుకో గలను ?మీ వాత్సల్యం తో నాకు’’ స్వస్వరూపావస్తితబాధిత కాలం’’ సంప్రాప్తమైంది .
176-‘’ఇత్ధం యద్వా నిత్య సాన్నిధ్య యోగాత్ –సత్యం ధర్మం వాచయ౦ తౌ శ్రుతీద్యం
వాచం దేవీ౦ వాచిమే సన్నిదాప్య –సంతుస్టౌ స్తస్సోయమర్దో మమార్ధ్యః ‘’
తా-నిత్యం మీ సాన్నిధ్యాన్ని ప్రసాదించి వాగ్దేవిని నా నాలుకపై ఉంచి ,శ్రుతులచేత కొనియాడ బడే సత్య ,ధర్మాలను నాచేత పలికిస్తూ ఇలాంటి వినోదాన్ని చూస్తూ సంతోషిస్తారా ?అది నాకు నిర్బీజ సమాదికంటే ముఖ్యమైనదిగా నేను భావిస్తాను .
177-‘’యద్విద్యా జన్యోర్య ఆసీత్ప్ర మూలం –నౌమి స్తౌమి స్వం గురుం తం మహాంతం
తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రీ-త్యాఖ్యాతం శ్రీరామ గాదా మ్రుతోక్త్యా ‘’
తా-నా విద్యకి ,పుట్టువుకు మూల భూతుడైన శ్రీ రామ కదామృత గ్రంధ కర్త శ్రీ తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రి అని లోక ప్రఖ్యాతుడైన మహా గురువైన నా తండ్రిని మాటి మాటికి నమస్కరిస్తూ స్మరిస్తూ కొనియాడుతాను .
178-‘’మాతా విఖ్యాతా హనుమాంబికేతి-సాధ్వీ తాతో వే౦కటప్పః కవీశః
శ్రీ దేవీ సత్యంబికా రాధ కోహం –ఆత్రేయో నారాయణో రాఘ వాద్యః ‘’
తా-హనుమాయమ్మ అని విఖ్యాతి చెందిన మహా సాధ్వి నా తల్లి .తండ్రి తాడేపల్లి వేంకటప్పయ్య శాస్త్రి .నా పత్ని శ్రీదేవి .మాది ఆత్రేయస గోత్రం .శ్రీమాత ఆరాధకులం మేము .రాఘవ నారాయణ అని నా తండ్రి నాకు పేరు పెట్టారు .నాకు మా తండ్రి ఈ పేరు పెట్టినందుకుమా తండ్రి అంతర్ముఖులని ,మహాత్ముడనీ బెజవాడ సభలో పూరీ స్వాముల వారు కీర్తించారు అందులో భావమేమిటో నాకేం తెలుసు ?
179-‘’దత్త భాగవత నామ కృతిం లిం –గోద్భావాయ విభవే నగరే దాం
చెన్న కేశవ పద ప్రభ వేయా –మా వికాంత దుభకౌ మామ బందూ ‘’
తా-దత్త భాగవతం అనే గ్రంధాన్ని రచించి చందోలు నగరం లో’’ లింగోద్భవ స్వామి’’కి అ౦కితమిచ్చాను .మాయావిక అనే గ్రంధాన్ని రాసి శ్రీ చెన్నకేశవ స్వామికిచ్చాను ‘ఈ రకంగా శివ కేశవులు నాకు అల్లుళ్ళు అయ్యారు .
180-‘’ధర్మ కాండ పిన మిత్ర సుపుత్ర –స్వాగతా వతి భయే జననీహ
ద్వైత వాద సరణీ నభయం మే –ద్వైత పధ్ధతి మిత స్స్వ్యమేకః ‘’
తా- ఆ యమ ధర్మ రాజు మిత్రుని పుత్రుడు కనుక నా వాడే. ప్రవృత్తిలో ఏ భయం వచ్చినా జగజ్జనని నన్ను రక్షిస్తుంది .కనుక ద్వైత వాద మార్గం లో నాకేమీ భయమే లేదు .అద్వైతమార్గాన్ని అనుసరించేవాడిని నేనొక్కడినే కదా .రెండో వాడు ఉంటేనే కదా భయం .కనుక నేను అభయుడను ,ఆనంద స్వరూపుడను .
181-‘’వృద్ధ క్ష్మౌ భ్రున్నాగ లింగః ప్రసిద్దో –విద్వానాసీ న్మే గురుః పాణినీయే
శిష్య ప్రీత్యా బ్రహ్మ సూత్రం చతుర్భి- ర్భాష్యైర్మారర్గైః ప్రాపు యద్యో విమృశ్య ‘’
తా-ముదిగొండ నాగ లింగ శాస్త్రి అనే ప్రసిద్ధ విద్వాంసుడు నాకు వ్యాకరణ గురువు .ఆయన ద్వైత విశిష్టాద్వైత భాష్యాలను విమర్శిస్తూ ప్రతి సూత్రానికి నాలుగుదారుల భేదాలను శిష్య వాత్సల్యం తో బోధించాడు .
182-‘’విద్వాన్ మద్దుల్పల్లి మాణిక్య శాస్త్రీ –మాన్యోయం మే తర్క వేదాంత సమ్రాట్
దాక్షి ణ్యా ద్యోన్మద్గ్రుహం ప్రాప్య భవ్యే-విజ్ఞానే స౦ మర్శ యామాన మానం ‘
తా-మహా తర్క వేదాంత సామ్రాట్ బిరుదాంకితుడైన శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు ,అనుకో కుండా ఒక సారి మా ఇంటికిశిష్యులతో వచ్చినెల రోజులుండి నేను చదివింది చదవనిది నాకున్న జ్ఞాన లేశాన్ని మెరుగు పరచి నన్ను తీర్చి దిద్దారు .
183-‘’తద్వద్యో యోమే లమేకం దదౌతం –చిత్తేనాహం గౌర వేణార్చ యామి
దైవేభ్యో మిత్రేభ్య ఉచ్చైర్గురుభ్యః –పా౦డిత్యౌన్న త్యర్ది వద్భ్యో నమా౦ స్యోం ‘’
తా-ఇలా ఏయే మహాత్ములు నాకు ఒక్కక్షరమైనా ఇచ్చ్చారో వారందరినీ గౌరవ ప్రపత్తులతో పూజిస్తాను .దేవతలకు మిత్రులకు ,సహ పాఠకులకు ,పెద్దలకు గురు వరేణ్యు లకు ,సర్వ సమత్వ భావమున్న ప్రబుద్ధులకు అందరికి నమస్కరిస్తాను .ఇంతకంటే నేను చెప్పేది, చేసేది ఏమీ లేదు .పర బ్రహ్మ రూపమైన ‘’ప్రణవం ‘’ను ఉచ్చరిస్తూ’’ తురీయా తీత దశ’’ను కోరుతున్నాను .
మత్స్వప్నః (నా కల )సమాప్తం .అమ్మవారూ అయ్యవారూ ,కైలసానికి ,వ్యాసులవారు విష్ణు పదానికి చేరుకున్నారు .మనం ఈ కలలోంచి బయటపడి సదసద్వివేకులమవుదాం –స్వస్తి
మీ- గబ్బిట దుర్గా ప్రసాద్ – 25-10-15

