యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -4

యక్ష ప్రశ్నల సమాదానా లలో యుధిష్టరుడు ప్రదర్శించిన ధీశక్తి ,చతురత ,లోకజ్ఞత ధార్మికత -4

యక్షుడు  గూఢమైనవేకాక గాఢమైన మైన ప్రశ్నలూ వేశాడు. అంతే దీటుగా  ఘాటుగా లోతైన సమాధానాలు చెప్పాడు యుధిష్టిరుడు-ఆ వైనం చూద్దాం –

33-మానవుడికి ఆత్మ ఏది ?ప్రశ్న

‘’కొడుకే ఆత్మ’’ జవాబు

34-‘’మనిషికి దేవుడు అనుగ్రహించిన మిత్రుడెవరు’’ ?

‘’భార్య ‘’

35-‘’మనిషికి జీవనమార్గం ఏది ?’’

‘’మేఘం ‘’

36’’-మానవుడికి పరమాశ్రయం ఏది ‘’?

‘’దానం ‘’

స్మ్రుతి సమ్మతంగా ధర్మ రాజు సమాధానాలున్నాయి .భార్యాభర్తలు మంచి స్నేహితులుగా మెలగాలన్నదే నేటి దాంపత్య  వికాస సూత్రం .ధర్మం సనాతనం ‘అంటే ప్రాచీనమైనది అని అర్ధం కాదు శాశ్వతమైంది అని అర్ధం .గృహస్థ ధర్మం లో భార్య స్థానం అద్వితీయమైనది .దీని మూలం తెలిసినవాడు కనుక ధర్మ రాజు చక్కని సమాధానమే చెప్పాడు .దుష్యంతుడికి శకుంతల మిత్ర స్థానమేమిటో ఆయన కొలువులోనే విస్పష్టంగా చెప్పిన విషయ౦  తెలిసిందే .జీవన మార్గం అంటే ప్రాణాధారం .అందుకే మేఘం అన్నాడు .నీరు లేక ప్రాణం నిలవదు. దానికి మేఘం ఆధారం కదా .మనం ఇచ్చిందే మనల్ని నిలబెడుతు౦ది కనుక దానం పరమ ఆశ్రయం అని గొప్ప జవాబు చెప్పాడు అని విశ్లేషించారు శ్రీ జి వి సుబ్రహ్మణ్యం .

ఇప్పుడు ఉత్తమ విషయ ప్రస్తావన చేస్తున్నాడు యక్షుడు –

37-‘’ధన్యులైనవారిలో ఉత్తమ గుణమేమిటి?’’

‘’దక్షత ‘’అని సూటిగా సమాధానమిచ్చాడు యుధిష్టిరుడు .

38-ధనాలలో ఉత్తమమైనది ?

‘’పాండిత్యం ‘’

 

39-‘’ఉత్తమ లాభం ?’’

‘’ఆరోగ్యం ‘’

40-‘’ఉత్తమ సుఖం ?’’

‘’సంతృప్తి ‘’

ధర్మ రాజు చెప్పిన దానిలో దక్షత అంటే పని చేయటం లో నేర్పు మాత్రమె కాదు ,ధర్మాన్ని ఆచరించటం లో సామర్ధ్యం .అజ్ఞాతవాసం లో పాండవులను  వారి పాండిత్యమే కాపాడింది .రాజ్య లాభం కంటే ఆరోగ్యమే చాలా ఉత్తమం అన్నాడు .స్వకీయానుభావం తోదీనికి సమాధానం చెప్పాడు  హస్తినకు రాజైనా విచిత్ర వీర్యుడు అనారోగ్యం తో చనిపోయాడు .భీష్ముడు,విదురుడి కి  రావాల్సిన వాటాలో ధనం ఇస్తానని చెప్పినా ,వద్దని చెప్పి విదురుడు సంతృప్తిగా జీవించాడు కదా .

41-‘’లోకం లో శ్రేష్ట మైన ధర్మం ఏది ?’’

‘’దయ ‘’అన్నాడు ధర్మ రాజు .

42-‘’నిత్యం సత్ఫలితాలిచ్చే ధర్మం ఏది ?’’

‘’వేద ధర్మం ‘’

43-‘’దేన్ని  అదుపులో పెడితే దుఖం ఉండదు ‘’?

‘’మనసును అదుపులో పెడితే దుఖం ఉండదు ‘’

44-‘’ఎవరితో మైత్రి శాశ్వతం ?’’

‘’సజ్జన మైత్రి ‘’సమాధానం .దీనినే బుద్ధుడుకూడా ‘’కళ్యాణ మైత్రి ‘’అన్నాడు అన్నిటినీ నడిపించేది మనసు .మనసుకున్న ప్రాధాన్యాన్ని సనాతన ధర్మం చాలా రకాలుగా చెప్పింది ..అందుకని మనస్సు శ్రేష్టమైనది .తర్వాత త్యాగానికి సంబంధించిన ప్రశ్నలు అడుగుతున్నాడు యక్షుడు –

45-‘’దేన్ని  వదిలితే మానవుడు ఇష్టుడు అవుతాడు ?’’

‘’మానాన్ని (అభి )వదిలేస్తే మనిషి అందరికీ ప్రేమ పాత్రుడౌతాడు ‘’

46-‘’దేనిని త్యాగం చేస్తే ఏ బాధా ఉండదు ?’’

‘’క్రోధాన్ని ‘’

47-‘’దేన్ని త్యాగం చేస్తే అర్ధ వంతుడు అవుతాడు ‘’?

‘’కామాన్ని ‘’

48-‘’దేన్ని విసర్జిస్తే సుఖంగా బతుకుతాడు ?’’

‘’లోభాన్ని ‘’

త్యాగ బుద్ధితో జీవించమని సనాతన ధర్మం బోధించింది .త్యాగం అంటే బంధనం లో చిక్కుకొని విడుపు అని అర్ధం .త్యాగం చేయాల్సిన వాటిలో మొదటిది మానం .అంటే ఆత్మాభిమానం రోషం ,పౌరుషం .ఆత్మ అంటే తాను .ఆత్మీయం అంటే తనకి చెందింది .అభిమానం అంటే ఆత్మ గౌరవం .రూపం దానం ,విద్యా వల్లకలిగే దర్పాన్ని కూడా అభిమానం అనే అంటారు. అహంకారం అనే అర్ధమూ ఉంది .కనుక మానం అంటే స్వీయ గౌరవానికి సంబంధించినది .ఇది స్వీయ కేంద్ర ప్రవృత్తికి సంబంధించింది .దుర్యోధనుడు దీనికి గొప్ప ఉదాహరణ .సుయోధనుడు తన కేంద్రం లోకి కొందర్నే తీసుకొన్నాడు .కొందర్ని దూరంగా ఉంచాడు .తమ్ముడే అయినా వికర్ణుడిని దూరంగా ఉంచాడు .లక్క ఇల్లు కాల్చిన పరమ కిరాతకుడు  పురోచనుడు ఆ లక్క ఇంట్లోనే కాలి బూడిద అయితే దుఖం తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు  దుర్యోధనుడు .అతని కోటరీ లోకి కర్ణుడు, శకుని ,దుశ్శాసనుడు లకు   మాత్రమే ప్రవేశం .వీళ్ళనే దుస్ట చతుస్టయం అన్నారు  .మనదే అయిన వ్యక్తిత్వాన్ని స్వభావం అంటారు .దీన్ని దాటటం కష్టం .స్వభావానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే ఈర్ష్య ద్వేషం వంటివి ప్రకోపించి మనసును మండింప జేస్తాయి..ఇవే రోషం ,పౌరుషం .ఇవి విజ్రు౦భి స్తే వాడు సర్వనాశనమౌతాడు .ఎదుటివాడి నాశనానికి  సర్వ ప్రయత్నాలు చేస్తాడు .

కాని దీనికి విరుద్ధంగా ప్రేమ అనేది అందరిలోనూ విస్తరిస్తుంది .మానం భయస్తుడి లక్షణం అయితే ప్రేమ ధీర లక్షణం .మనకు భయమే ఎక్కువ కాబట్టి మానవంతులంగా మిగిలి రోష పడుతూ ఉంటాం .సుయోధనుడు అభిమాన ధనుడై ధార్మిక జీవితం లో నిర్ధనుడయ్యాడు .భీమసేనుడికీ ఈ లక్షణం బాగానే ఉంది .కనుకనే యుదిష్టిరుడు  భావావేశాలకు ఉద్వేగాలకు ,ఉద్రేకాలకు మానమే కుదురు కనుక మానాన్ని త్యాగం చేయాలని జవాబు చెప్పాడు .మానానికి దెబ్బ తగలటమే అవమానం .మానావ మానాలను త్యాగం చేస్తే మనస్సు నిర్మల మవుతుంది .ఆకాశమంత విస్తరిస్తుంది అని ధర్మ రాజు భావం .

మానం అంటే స్త్రీ మర్మావయవం అని అనుకోవటం మూర్ఖం .మానభంగం అంటే స్వీయ గౌరవానికి  దెబ్బతగలటం అని అర్ధం .కానిలోకం లో లై౦గి కమైన అర్ధం లోనే దీన్ని వాడుతున్నాం .వెకిలి చేష్టలతో స్త్రీని తాకటం ,అగౌరవ పరచటం మాన భంగమే .వెకిలి మాటలు, వెకిలి చూపులూ కూడా దీనికి చెందినవే. తన అనుమతి ,భాగస్వామ్యం లేకుండా తన శరీరం నుంచి ఆనందం పొందటం స్త్రీ తీవ్ర అగౌరవంగా భావిస్తుంది .మాన భంగం వ్యక్తిత్వ గౌరవానికి ,స్వేచ్చకు సంబంధించిన విషయ౦  .మాన భంగం లో శరీరం కంటే మనసు పొందే వేదన తీవ్ర తరమైనది .సుయోద నుడి కొలువులో జ్యూత  సమయం లో ద్రౌపది దుఖాన్ని చూసి కర్ణుడు ,దుర్యోధనుడు రాక్షసానందం పొందుతారు .ఆమె శరీరం పై కాముక నేత్రాలతో విక్రుతానందం పొందిన వారు సైంధవుడు ,కీచకుడు .ఇతరుల మానానికి బాధ కలిగించి ,వాళ్ళు బాధ, దుఖం లో ఉంటె ఆనందం పొందటం దుర్యోధనుడు వంటి మానవంతుల ఆనందం .మానిని అంటే ఆత్మాభిమానం కలిగిన స్త్రీ అని అర్ధం .దీన్ని అర్ధం చేసుకోకుండా కీచకాదులు మట్టిలో కలిసిపోయారు .సత్యభామలో ఈ అంశం కొంచెం ఎక్కువై ,వివేకం తగ్గి ఇక్కట్లు పడింది .మానిని అంటే దృఢ సంకల్పం ఉన్న స్త్రీ అనే అర్ధం ఉంది .కనుక లోకం లో మానిని అనే పదానికి ఏకైక ఉదాహరణగా ద్రౌపదీ దేవి మాత్రమె నిలిచింది .మానం లోతుపాతులు తరచినవాడుకనుక యుదిష్టిరుడు దాన్ని దూరం చేసుకొని లోకులకు ప్రీతి పాత్రుడయ్యాడు .అని శ్రీ సుబ్రహ్మణ్యంగారి విశేష విశ్లేషణ .ఇదంతా తెలుసుకోక పొతే యక్ష ప్రశ్నలలో ఉన్న మర్మం తెలియదు .

సశేషం

మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-3-16-ఉయ్యూరు

 

Unknown's avatar

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in రచనలు and tagged . Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.